India China Border: చైనా సరిహద్దుల్లో భారత్‍కు పొంచి ఉన్న ముప్పుతో.. వాస్తవాధీన రేఖ వెంట ప్రతి నిర్ణయం కీలకంగా మారుతోంది. ఇందులో భాగంగా.. అత్యవసర పరిస్థఇతుల్లో చైనా నుంచి ఎదురయ్యే ముప్పుని, దాడులను ఎదుర్కొనేందుకు.. భారత దళాలు కీలక అడుగులు వేస్తున్నాయ్. ఈశాన్య భారతం పరిధిలో ఇలాంటి ప్రయత్నాలు ఇప్పుడే తొలిసారి. ఇటీవలే.. అస్సాంలో ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ.. హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై.. సీ130జే సూపర్ హెర్క్యులస్ యుద్ధ విమానంలో దిగి, ప్రధాని మోడీ అందరినీ ఆశ్చర్యపరిచారు. దిబ్రూగఢ్-మోరాన్ నేషనల్ హైవేపై ఉన్న రన్‌వే.. భారత్-చైనా సరిహద్దుకు దగ్గరగా ఉండటంతో కీలకమైన, వ్యూహాత్మకమైన ప్రదేశంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో పౌర, సైనిక విమానాల రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ రన్‌వేను నిర్మించారు. 40 టన్నుల బరువున్న ఫైటర్ జెట్స్, 74 టన్నుల బరువున్న భారీ రవాణా విమానాలు ఇక్కడ సేఫ్‌గా ల్యాండ్ అవుతాయ్. అత్యవసర పరిస్థితుల్లో డిబ్రూగఢ్ ఎయిర్‌పోర్ట్, చబువా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో ఆపరేషన్లు నిర్వహించలేని పరిస్థితి ఉంటే.. ఆల్టర్నేట్‌గా ఈ రన్‌వేని వాడతారు. టేకాఫ్, ల్యాండింగ్‌కు అనుకూలంగా దీనిని డిజైన్ చేశారు.
అస్సాంలోని చబువా ఎయిర్‌బేస్‌కు సమీపంలో ఉన్న ఈ రన్‌వే.. చైనా సరిహద్దుకు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. మయన్మార్‌కు 200 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అందుకే.. ఇది వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా మారింది. 4.2 కిలోమీటర్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నిర్మాణానికి దాదాపు వంద కోట్లు ఖర్చు చేశారు. సైనిక సంసిద్ధత, విపత్తు సమయాల్లో రెస్క్యూ ఆపరేషన్లతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా బలగాలను మోహరించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో ఇప్పటికే ఇలాంటి ఎమర్జెన్సీ రన్‌వేలు పశ్చిమ, ఉత్తర, మధ్య ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే, ఈశాన్యంలోని అస్సాంలో దీన్ని తొలిసారి అందుబాటులోకి తెచ్చారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, రవాణాశాఖ ఇలాంటి ఈఎల్ఎఫ్‌ల నిర్మాణం కోసం దాదాపు 30 ప్రాంతాలను గుర్తించగా.. వాటిలో 15 అందుబాటులోకి వచ్చాయి. తూర్పు లద్దాఖ్‌లో.. చైనాతో ఉద్రిక్తతల తర్వాత.. భారత్ ఈశాన్య భారత్‌లో సరిహద్దు మౌలిక సదుపాయాలపై ఫోకస్ పెట్టింది. అందుకనుగుణంగానే అన్నింటినీ సిద్ధం చేస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పుడు ఇండియన్ ఎయిర్ఫోర్స్వేగంగా స్పందించేందుకు వీలవుతుంది. చైనాతో వివాదాల వేళ, ఈశాన్య భారతంలో వీటిని ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈశాన్య భారతాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాదు.. రక్షణపరంగా మరో గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసింది కేంద్రం. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద దేశంలోనే తొలిసారి, ప్రపంచంలోనే రెండోదైన రోడ్డు, రైలు అండర్ వాటర్ ట్విన్ టన్నెల్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గోహ్‌పూర్-నుమాలిగఢ్ మధ్య నిర్మించనున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ కోసం 18 వేల కోట్లకు పైగా కేటాయించారు. ప్రస్తుతం.. ఈ రెండు పట్టణాల మధ్య ప్రయాణానికి 6 గంటల సమయం పడుతోంది. ఈ సొరంగ మార్గం గనక అందుబాటులోకి వస్తే.. ప్రయాణదూరం తగ్గడమే కాదు.. జర్నీ కూడా జస్ట్ 20 నిమిషాల్లోనే పూర్తయిపోతుంది. ఇది.. అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లాంటి రాష్ట్రాల రవాణా ముఖ చిత్రాన్ని మార్చేయనుంది. ఈ ప్రాజెక్ట్ రక్షణపరంగానూ భారత్‌కు అత్యంత కీలకంగా మారబోతోంది. ముఖ్యంగా.. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల క్రమంలో.. సరిహద్దు ప్రాంతాలకు సరకు రవాణా, సైనిక కదలికలను వేగవంతం చేసేందుకు.. ఈ సొరంగ మార్గం ఉపయోగపడుతుంది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని సెలా టన్నెల్ కూడా.. భారత రక్షణ రంగానికి మైల్ స్టోన్ లాంటిది. సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ టన్నెల్.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన డబుల్ లేన్ టన్నెల్‌గా రికార్డు సృష్టించింది. ఈ టన్నెల్ తవాంగ్ రక్షణకు చాలా కీలకంగా ఉంది. సరిహద్దుల్లో మోహరించిన భారత సైన్యానికి ఆయుధాలు, ఆహారం, ఇతర సామాగ్రిని వేగంగా చేరవేసేందుకు.. ఇది సాయపడుతుంది. శీతాకాలంలో భారీగా మంచు కురిసినప్పుడల్లా.. సెలా పాస్ మూసుకుపోయేది. కానీ.. ఈ టన్నెల్ వల్ల ఏడాది పొడవును ప్రయాణం సాఫీగా సాగనుంది.
సరిహద్దుకు అవతలి వైపు చైనా అనేక నిర్మాణాలు చేపడుతోందనే వార్తలు, నివేదికలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. టిబెట్‌లో సరిహద్దుకు సమీపంలో అనేక కట్టడాలు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంటోందని తెలుస్తోంది. దాంతో.. అవసరమైన సమయాల్లో చైనా తమ సైన్యాన్ని వేగంగా సరిహద్దులకు తరలించే అవకాశం ఉంది. ఈ పరిణామం భారత్‌కు ఓ సవాల్ అనే చెప్పాలి. అందువల్ల.. ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి పెట్టిన భారత ప్రభుత్వం.. అక్కడ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది.
ఆయుధ సంపత్తి, అణ్వస్త్రాల విషయంలో కొంతకాలంగా దూకుడు మీదున్న చైనా, మన సరిహద్దులకు సమీపంలోనే వాటిని బారీ సంఖ్యలో తయారుచేస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌కు 800 కిలోమీటర్ల దూరంలో.. సిచువాన్ ప్రావిన్స్‌లో అత్యంత రహస్యంగా నిర్మించిన జిటాంగ్, పింగ్‌టాంగ్ ప్లాంట్లలో అణ్వాయుధాల తయారీని వేగవంతం చేస్తోంది. అందువల్ల.. సరిహద్దుల్లో చైనా ఏమాత్రం తోక జాడించినా.. అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఒకప్పటితో పోలిస్తే.. భారత్ ఇప్పుడు చైనాతో వ్యవహరించే తీరులో పెను మార్పులు వచ్చాయి. కొన్నేళ్ల కిందటి వరకు డిఫెన్స్ మోడ్‌లో ఉన్న ఇండియా.. ఇప్పుడు సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. చైనా నుంచి ఎదురయ్యే.. ఎలాంటి సవాల్‌నైనా దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ చేస్తున్న ఏర్పాట్లు చూస్తుంటే.. చైనా ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా.. క్విక్ కౌంటర్ రియాక్షన్ ఉంటుందనేది స్పష్టమవుతోంది.
గతంలో సరిహద్దుల వరకు రోడ్లు వేస్తే.. చైనా సైన్యం మన భూభాగంలోకి సులభంగా లోపలికి వస్తుందనే ఆలోచన ఉండేది. కానీ.. ఇప్పుడు లెక్క మారింది. లద్దాఖ్ నుంచి అరుణాచల్ వరకు.. వేల కిలోమీటర్ల మేర వ్యూహాత్మక రోడ్లు, బ్రిడ్జ్‌లను.. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్.. వేగంగా నిర్మిస్తోంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో.. సైన్యం వేగంగా సరిహద్దుకు చేరుకునేందుకు రూట్ క్లియర్ చేస్తోంది. ఒకప్పుడు.. భారత్.. తన సైన్యంలో ఎక్కువ భాగాన్ని పాకిస్థాన్ సరిహద్దుల్లోనే ఉంచేది. ఇప్పుడు స్ట్రైక్ కోర్ విభాగాలను చైనా బోర్డర్ వైపు మళ్లించింది. యుద్ధ విమానాలు, కార్గో విమానాలు తక్కువ సమయంలో ల్యాండ్ అయ్యేలా.. ఈశాన్య రాష్ట్రాల్లో రన్ వేలని ఆధునీకరించారు. చైనాని కట్టడి చేసేందుకు భారత్ కేవలం సంఖ్యా బలంపైనే కాకుండా, టెక్నాలజీపై ఫోకస్ పెట్టింది. చైనా భూభాగంలోని టార్గెట్లని.. ఇప్పుడు భారత్ నిమిషాల్లోనే ఛేదించగలదు. నిఘా కోసం అమెరికన్ ప్రిడేటర్ డ్రోన్లు, ఆకాశంలో ఆధిపత్యం కోసం రాఫెల్ ఫైటర్ జెట్లు సిద్ధంగా ఉన్నాయ్.
వాస్తవాధీన రేఖ వెంట భారత వాయుసేనకు అనేక ఎయిర్‌బేస్‌లు ఉన్నప్పటికీ.. ఇతర బేస్‌లను సిద్ధం చేసుకుంటోంది. యుద్ధం వంటి సందర్భాల్లో వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరగవచ్చు. లేదంటే అక్కడ రద్దీ వాతావరణం ఏర్పడవచ్చు. అటువంటి క్లిష్ట సందర్భాల్లో ప్రత్యామ్నాయంగా జాతీయ రహదారులపై ఏర్పాటు చేసే రన్‌వేలను ఉపయోగించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తద్వారా సైన్యంతోపాటు యుద్ధ సామగ్రిని వేగంగా తరలించడానికి వీలు కలుగుతుంది. అన్ని రకాల యుద్ధ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లకు అనుగుణంగా నిర్మించిన అస్సాం రన్‌వేపై.. రఫేల్, సుఖోయ్, సీ-17 గ్లోబ్‌మాస్టర్ వంటి యుద్ధ విమానాలు ట్రయల్‌రన్స్ నిర్వహించాయి.
అరుణాచల్ సమీపంలో.. చైనా కొన్నేళ్లుగా సైనిక మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ, జనావాసాలని ఏర్పాటు చేస్తూ భారత్‌ను కవ్విస్తోంది. వాస్తవానికి.. వాయవ్య చైనాలోని సిచువాన్ పర్వత ప్రాంతాల్లో.. చైనా అణు ప్లాంట్లు ఎప్పటి నుంచో ఉన్నాయ్. అమెరికా, నాటి సోవియట్ యూనియన్లకు దీటుగా ఎదిగే ఉద్దేశంతో.. 60 ఏళ్ల కిందట నిర్మించింది. గత 20 ఏళ్లుగా ఈ రెండు ప్లాంట్లపై చైనా బాగా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. అక్కడ అణు వార్‌హెడ్ల తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్. దీంతో పాటు సరిహద్దులకు దగ్గరలో చైనా సైనిక సదుపాయాలను మెరుగుపరుస్తోంది. ఇది.. ఎప్పటికైనా భారత్‌కు ముప్పే. చైనాకు ఉన్న భౌగోళిక ప్రయోజనం టిబెట్ పీఠభూమి కంటే.. భారత సైన్యం ఇప్పుడు మౌంటైన్ వార్‌ఫేర్‌లో ఆరితేరింది. కాబట్టి, రాబోయే రోజుల్లో చైనా ఏదైనా దుస్సాహసం చేస్తే.. భారత్ నుంచి వచ్చే ప్రతిస్పందన వేగంగా, అంతకుమించి కఠినంగా ఉంటుంది. గల్వాన్ ఉదంతం తర్వాత భారత్ వైఖరిలో స్పష్టత వచ్చింది. ఒక అడుగు వెనక్కి వేసే ప్రసక్తే లేదని భారత్ గట్టిగా చెబుతోంది. క్వాడ్ లాంటి అంతర్జాతీయ వేదికల ద్వారానూ.. చైనాపై ఒత్తిడి పెంచుతోంది.
Story by: Anup, Big Tv