India To Occupy POK: సమయం లేదు.. సంధీ లేదూ..! ఉన్నది ఒక్కటే మార్గం.. యుద్ధం! ఇక ఇంతకుమించి మరో ఆలోచన చేస్తే.. ఇంకెన్ని ప్రాణాలు పోతాయో లెక్కపెట్టుకుంటూ ఉండాల్సిందే! కశ్మీర్ కోసం మొదటి యుద్ధం జరిగి 75 సంవత్సరాలు దాటింది.. మధ్యలో పాకిస్తాన్ ఎన్నోసార్లు నియంత్రణ రేఖ దాటింది. రెండు సార్లు యుద్ధం కూడా జరిగింది.. ఇన్ని జరిగినా.. LoC గురించి ఆలోచిస్తూ కూర్చోవాల్సిందేనా..? POKని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందే..! ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు..? తమ దేశంలోకి వచ్చి దాడి చేసినందుకు గాజాలోకి వెళ్లి మరీ ఉగ్రవాదులను ఏరేస్తోంది ఇజ్రాయెల్. మరి, పాకిస్తాన్ ఆక్రమించుకున్న POKలోకి ఇండియా వెళ్లలేదా..? విరిగిన కశ్మీర్ కోసం ‘ఆపరేషన్ విజయ కశ్మీర్’ చేపట్టలేదా..?
భారతదేశ సార్వభౌత్వానికి పదే పదే ప్రమాదం
కశ్మీర్ వ్యవహారం ఫైనల్ స్టేజ్‌కు చేరుకోబోతుందా…? పరిస్థితులు చూస్తుంటే.. అలాగే కనిపిస్తోంది. త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో సహా కశ్మీర్ అంశంలో పాకిస్తాన్‌కు భారత్ బుద్ది చెప్పే తరుణం ఆసన్నమయ్యింది. ఎందుకంటే, ఎంతో కాలంగా భారతీయులు గుండెల్లో రగులుతున్న మంట ఇది. మన భూభాగాన్ని మనం స్వాధీనం చేసుకోలేని పరిస్థితి ఎందుకొచ్చిందో తెలియని ప్రశ్న ఇది. ప్రపంచంలో రెండు యుద్ధాలు సరిగ్గా ఇదే కారణం కోసం జరుగుతున్నాయి.
పాక్ ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్
హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి వచ్చి దాడి చేసినందుకు గాజాలోకి వెళ్లి మరీ ఉగ్రవాదులను ఏరేస్తోంది ఇజ్రాయెల్. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ చేస్తున్న వ్యూహాలను తిప్పికొట్టడానికి రష్యా యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధాలకు అగ్ర రాజ్యం అమెరికా సైతం ఏదో ఒక సైడ్ తీసుకోవాల్సి వచ్చింది. చివరికి యుద్ధం ఎవరు మొదలుపెట్టారో వారికే సపోర్ట్ చేస్తోంది కూడా. ఈ రెండు యుద్ధాల్లోనూ స్పష్టంగా కనిపిస్తున్న అంశం.. తమ సార్వభౌమత్వానికి ప్రమాదం వస్తుందనే భావనే.
కశ్మీర్‌ను భారత్ చట్టవిరుద్ధంగా ఆక్రమిస్తుందన్న పాక్
ఇక, ఇప్పుడు భారత్ పరిస్థితి కూడా అంతే ఉంది. భారతదేశ సార్వభౌత్వానికి పదే పదే ప్రమాదం ఏర్పడుతోంది. కశ్మీర్ కేంద్రంగా రెచ్చిపోతున్న ఉగ్రవాదం భారతదేశ సామర్థ్యానికి సవాలుగా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ ఉగ్రవాదం కొత్త ఊపిరి పోసుకుంటోంది. అందులో భాగమే తాజాగా పహల్గామ్‌లో TRF ఉగ్రవాదులు చేసిన దాడి. 28 మంది పర్యాటకుల ప్రాణాలు బలిగొన్న అత్యంత పాశవికమైన ఉగ్రవాద చర్య. దీన్ని రూపుమాపడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం యుద్ధం. స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు నిండినా.. ఇంకా, భారత్ నుండి వేరుపడిన భూభాగాన్ని తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఇండియా తత్సారం చేస్తోంది. పాక్ ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోడానికి మీనమేషాలు లెక్కిస్తోంది. అయితే, ఇప్పుడు చూస్తూ కూర్చేనే టైమ్ ముగిసిపోయింది. లైన్ ఆఫ్ కంట్రోల్ లెక్కలు పక్కన పెట్టి.. పీఓకేని స్వాధీనం చేసుకునే సమయం వచ్చింది.
కశ్మీర్ విషయంలో భారత్ మంచి చేసిందన్న జైశంకర్
ఉగ్రవాదానికి మతం లేదు! ఇది తరచుగా వినిపించే మాట! మరి.. కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దాడి ఏమిటి? హిందువులని లక్ష్యంగా చేసుకొని.. వందలాది మంది టూరిస్టుల్లో హిందువులను మాత్రమే సెలక్ట్ చేసుకొని మరీ కాల్పులు జరపడాన్ని ఎలా చూడాలి? మతాన్ని నిర్ధారించి చంపేవాడి మనస్తత్వం ఏమిటో ఇప్పటికైనా అర్థమవుతోందా? పహల్గాంలో టెర్రరిస్ట్ అటాక్ తర్వాత తలెత్తుతున్న ప్రశ్నలివే. ఉగ్రవాదానికి మతం లేదని వాదించే వాళ్లందరికీ.. మంచుకొండల్లో జరిగిన ఈ మారణహోమమే బిగ్ ఎగ్జాంపుల్.
పీఓకేని భారత్‌కు తిరిగిస్తే కాశ్మీర్ సమస్య తీరినట్లేనని వెల్లడి
అయితే, ఈ ప్రశ్నలో పాక్ జర్నలిస్ట్ విచిత్రమైన వాదన చేశారు. కశ్మీర్‌ను భారత్ చట్టవిరుద్ధంగా ఆక్రమిస్తుందని అన్నారు. అందుకే, కశ్మీరీలు భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక, “కశ్మీర్‌పై శాంతి ఒప్పందం కోసం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సహాయం తీసుకుంటారా..? ప్రధాని మోడీ.. ట్రంప్‌కు మంచి స్నేహితుడే కాబట్టి, ఆ దిశాగా ఏదైనా ప్రయత్నాలు జరగొచ్చా..?” అంటూ పాకిస్తాన్ టోన్‌లో సదరు జర్నలిస్ట్ ఆసక్తికర ప్రశ్నను లేవనెత్తారు. అయితే, జర్నలిస్ట్ ఉద్దేశం అర్థమైన మంత్రి జైశంకర్ అంతే స్పష్టంగా ఆన్సర్ ఇచ్చారు.
మొదటి అడుగు ఆర్టికల్ 370ని తొలగించడం
లండన్‌కు చెందిన థింక్ ట్యాంక్ ‘చాథమ్ హౌస్’లో జరిగిన ఈ కార్యక్రమంలో.. కశ్మీర్ సమస్యకు పరిష్కారం ఏంటనే అంశంలో మంత్రి జైశంకర్ ‘టిట్ ఫర్ ట్యాట్’లా సమాధానం ఇచ్చారు. భారత ప్రభుత్వం ఇప్పటి వరకూ కాశ్మీర్ విషయంలో చాలా మంచి పనులే చేసిందని అన్నారు. అలాగే, కశ్మీర్‌లో ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కరించామని తెలిపారు. అందులో మొదటి అడుగు ఆర్టికల్ 370ని తొలగించడమనీ.. కాశ్మీర్‌లో వృద్ధి, ఆర్థిక కార్యకలాపాలు, సామాజిక న్యాయాన్ని పునరుద్ధరించడం రెండవ అడుగనీ.. భారీగా పెరిగిన ఓటింగ్‌తో ఇటీవల ఎన్నికలు నిర్వహించడం మూడవ అడుగని అన్నారు. ఇక, చట్టవిరుద్ధంగా పాకిస్తాన్ ఆక్రమించిన ‘కాశ్మీర్‌లోని దొంగిలించిన భాగాన్ని’ భారతదేశానికి తిరిగి ఇచ్చిన తర్వాత కాశ్మీర్ సమస్య “పరిష్కరించబడినట్లే” అని జైశంకర్ స్పష్టం చేశారు. ” దీని కోసమే అంతా ఎదురుచూస్తున్నారనీ.. పీఓకే భారత్ ఆధీనంలోకి వచ్చేస్తే.. కశ్మీర్ సమస్య పరిష్కరం అయినట్లేనని..” అన్నారు.
“పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ భారతదేశంలో భాగం..
అయితే, పీఓకే భారత్ ఆధీనంలోకి ఎప్పుడొస్తుందనేదే ఇప్పుడు బిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి గతంలో భారత్ కూడా పలుమార్లు స్పందించింది. ప్రధాని మోడీతో సహా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు బడా నేతలు.. “PoK భారతదేశంలో భాగమనీ.. భారత్ దానిని తీసుకొని తీరుతుందని” అన్నారు. జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన భారత భూభాగాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకోవడం మాత్రమే కశ్మీర్ అంశంలో పరిష్కరించాల్సిన ఏకైక సమస్య అని భారత్ పలు సందర్భాల్లో చెప్పింది.
జమ్మూ కశ్మీర్, లడఖ్ మొత్తం భూభాగం భారత్‌లో అంతర్భాగం
జమ్మూ కాశ్మీర్‌లోని దాదాపు 78 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుందన్న మాటను పదే పదే చెబుతోంది. 1994 పార్లమెంటు తీర్మానం కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇందులో భారత్ వైఖరి స్పష్టంగా తెలియజేశారు. “జమ్మూ కశ్మీర్, లడఖ్‌కు సంబంధించినంత వరకూ మొత్తం భూభాగం భారతదేశంలో అంతర్భాగంగా ఉండేవి, ఉన్నాయి, ఉంటాయి అని” పేర్కొన్నారు. అలాగే “పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించుకున్న అన్ని ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని” ఈ తీర్మానం పిలుపునిచ్చింది.
1999 మే-జూలై మధ్య కార్గిల్ యుద్ధం
1994 తీర్మానం తర్వాత కూడా పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్‌ను అతిక్రమించింది. ఇది, 1999లో కార్గిల్ యుద్ధానికి దారి తీసింది. కార్గిల్ యుద్ధం 1999 మే-జూలై మధ్య జమ్మూ కశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో, నియంత్రణ రేఖ వెంబడి భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక సంఘర్షణ. 1998లో భారత్, పాకిస్తాన్ అణు పరీక్షల తర్వాత.. 1999 ఫిబ్రవరిలో ఇరు దేశాల ప్రధానులైన వాజ్‌పేయి, షరీఫ్‌లు శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, పాకిస్తాన్ సైన్యం, ముజాహిదీన్ ఉగ్రవాద సమూహాలు 1998-99 శీతాకాలంలో కార్గిల్ నేషనల్ హైవే NH-1 వెంబడి ఉన్న భారత భూభాగంలోకి చొరబడ్డాయి.
టైగర్ హిల్, తోలోలింగ్, పాయింట్ 4875 ఆక్రమణ
ఇందులో భాగంగా.. శ్రీనగర్-లేహ్ రహదారిని నియంత్రించడం, భారత సైనిక సరఫరా మార్గాలను నాశనం చేయడం, కశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయంగా లేవనెత్తడమే లక్ష్యంగా పాక్ కుట్రలు కొనసాగాయి. ఈ నేపధ్యంలో.. 1999 మే నెలలో.. అంటే, ఇప్పటికి సరిగ్గా.. పాతికేళ్ల క్రితం.. స్థానిక గొర్రెల కాపరులు భారత సైన్యానికి చొరబాటు గురించి సమాచారం ఇచ్చారు. పాక్ సైనికులు, ఉగ్రవాదులు ఎత్తైన కొండల్లో స్థావరాలు ఏర్పాటు చేసినట్లు భారత సైన్యం గస్తీ సమయంలో గుర్తించింది. సుమారు 5 వేల మంది పాక్ సైనికులు, ఉగ్రవాదులు 200 చ.కి.మీ. భారత భూభాగంలోకి చొచ్చుకొని, టైగర్ హిల్, తోలోలింగ్, పాయింట్ 4875 వంటి కీలక స్థానాలను ఆక్రమించారు.
30 వేల మంది భారత సైనికులతో యుద్ధం ఆరంభం
ఇక, పాక్ చొరబాటుకు స్పందనగా భారత్ ‘ఆపరేషన్ విజయ్’ను ప్రారంభించింది. 30 వేల మంది భారత సైనికులతో చొరబాటుదారులను తరిమికొట్టేందుకు భారీ ఆపరేషన్ చేపట్టింది. శీతాకాలంలో పాక్ సైనికులు బాగా బలపడ్డారు. భారత సైన్యానికి ఆకస్మిక దాడి, సరఫరా సమస్యలు ఎదురయ్యాయి. అయినప్పటికీ.. భారత వైమానిక దళం “ఆపరేషన్ సఫెద్ సాగర్”లో భాగంగా మిగ్-27, మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో బాంబు దాడులు చేసింది. అయితే, అప్పుడు భారత్ చేసిన తప్పు.. LoC దాటకుండా దాడులు నిర్వహించడమే. అదే టైమ్‌లో మొత్తం PoKని స్వాధీనం చేసుకోవాల్సింది. కానీ అలా జరగలేదు. 1999 జూన్‌లో భారత సైన్యం తోలోలింగ్ వద్ద తొలి విజయం సాధించింది.
జులైలో టైగర్ హిల్ వద్ద జరిగిన భీకర యుద్ధం
ఇక, జులైలో.. టైగర్ హిల్ వద్ద జరిగిన భీకర యుద్ధం తర్వాత కార్గిల్ స్వాధీనం అయ్యింది. అయితే, అప్పుడు, పాశ్చాత్య దేశాలైన అమెరికా, బ్రిటన్, ఇతర దేశాలు పాకిస్తాన్‌ను చొరబాటుదారులను వెనక్కి పంపాలని ఒత్తిడి చేశాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో భేటీ తర్వాత, దళాలను ఉపసంహరించుకోవాలని ప్రకటించారు. ఈ క్రమంలో.. భారత సైన్యం చివరి చొరబాటుదారులను తరిమికొట్టి, అన్ని స్థానాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ రోజును భారత్‌లో “కార్గిల్ విజయ్ దివస్”గా జరుపుకుంటారు.
భారత సైన్యం ధైర్యానికి, త్యాగానికి ప్రసంశలు
కశ్మీర్ వివాదంలో కార్గిల్ యుద్ధం ఒక ముఖ్య ఘట్టంగా నిలవగా.. అది భారత్-పాక్ సంబంధాలను మరింత దిగజార్చింది. కార్గిల్ యుద్ధం తర్వాత భారత్ సరిహద్దు రక్షణ, గస్తీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను బలోపేతం చేసింది. భారత సైన్యం ధైర్యానికి, త్యాగానికి దేశవ్యాప్తంగా ప్రసంశలు అందాయి. ఈ యుద్ధం ఆధునిక యుద్ధ చరిత్రలో ఎత్తైన ప్రాంతంలో జరిగిన అరుదైన సంఘర్షణలలో ఒకటిగా నిలిచింది. అయితే, ఇప్పుడు కూడా ఆ సమయం వచ్చింది. కార్గిల్ యుద్ధం తర్వాత పాక్ తన కుట్రల రూపం మార్చింది. LoC దగ్గర ప్రత్యక్ష చర్యలకు దిగకుండా.. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతోంది.
పహల్గామ్ దాడి చేసిన TRF వంటి కొత్త సంస్థల సృష్టి
లష్కర్-ఎ-తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో చేయి కలిపి.. తాజాగా పహల్గామ్‌లో దాడికి దిగిన TRF వంటి కొత్త సంస్థలను సృష్టిస్తూ.. భారత్‌ను అస్థిర పరచడానికి ప్లాన్లు గీస్తుంది. ఇప్పుడు, వీటిన్నింటినీ అడ్డుకోవాలంటే కనిపిస్తున్న మార్గం ఒక్కటే.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి భారత్ స్వాధీనం చేసుకోవడం. లేకపోతే.. కార్గిల్ యుద్ధం తర్వాత ఉగ్రవాద దాడుల్లో ఇప్పటి వరకూ 25 వేల మంది పౌరులు, భద్రతా సిబ్బందీ ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇలాగే కొనసాగితే ఇంకెన్ని వేలమంది ఉగ్రదాడులు బలికావాల్సి వస్తుందో..?
పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడానికి క్లైమాక్స్ వచ్చేసినట్లే
POKలో ఊపిరి పోసుకుంటున్న పాక్ ఉగ్రవాదులే లక్ష్యంగా చర్యలు తీసుకున్నప్పుడే.. కశ్మీర్‌లో శాంతి నెలకొంటుందని చాలామంది భావిస్తున్నారు. కశ్మీర్ అంశంలో ఇటీవల పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు, గతంలో జరిగిన యుద్ధాలు… సర్జికల్ స్ట్రైక్స్ అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. ఉగ్రవాద వ్యతిరేక దాడులు పూర్తి స్థాయిలో ఉండాలని అంటున్నారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఈ పరిస్థితి రావడానికి ఎంతో సమయం లేదని అనిపిస్తోంది. కశ్మీర్ చరిత్రను తవ్వి చూస్తుంటే.. పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడానికి క్లైమాక్స్ వచ్చేసినట్లే కనిపిస్తోంది.
ఆగస్టు 2019లో కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో భాగమని.. POK భారతదేశానికి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోడానికి ప్రతి భారతీయ రాజకీయ పార్టీ కట్టుబడి ఉంది. POK గురించి భారత పార్లమెంటు తీర్మానమే దీనికి నిదర్శనం. ఇక, ఆగస్టు 2019లో కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ సమస్య గురించి యావత్ భారతదేశం చర్చింది. POK భారతదేశంలో భాగమనే విషయాన్ని ప్రజలు “మరచిపోయేలా” చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ.. దాన్ని భారత్ ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంది.
POKని ఖాళీ చేయమని పాక్‌కి చెప్పకపోవడం వల్లే ఈ పరిస్థితి
POK తిరిగి స్వాధీనం చేసుకునే ముందు భారత ప్రజలకు దాన్ని మళ్లీ మళ్లీ గుర్తుచేస్తూనే ఉంటామని భారతదేశ నేతలు చెప్పారు. అయితే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో… అంటే, కశ్మీర్ గురించి 1947-48లో భారత్-పాక్ మొదటి యుద్ధం సమయంలోనే.. POKని ఖాళీ చేయమని పాకిస్తాన్‌కు చెప్పలేకపోవడమే పరిస్థితిని ఇక్కడి వరకూ తెచ్చిందన్నది స్పష్టం. అయితే, ఈ పొరపాటును ఇప్పుడు సరిదిద్దు కోవాల్సిన సమయం వచ్చిందన్నది దేశమంతా చెబుతున్న మాట.
1947 భారత విభజన తర్వాత కశ్మీర్ రాజు అయోమయం
స్వతంత్ర భారతదేశం నుండి విడిపోయి, స్వతంత్ర దేశంగా ఏర్పడిందే పాకిస్తాన్. 1947 భారత విభజన తర్వాత, కశ్మీర్ లాంటి మిగిలిన రాజ్యాలకు భారత్‌లో ఉండాలా పాకిస్తాన్‌లో చేరాలే అనే ఎంపిక ఎదురయ్యింది. అయితే, జమ్మూ కశ్మీర్ రాజ్యం.. నాడు, హిందూ రాజైన మహారాజా హరి సింగ్ నేతృత్వంలో… ముస్లిం బహుళ జనాభాతో ఉంది. హరి సింగ్ మొదట స్వాతంత్ర్యం కోరుకున్నారు. కానీ, చివరికి రెండు దేశాలతో స్టాండ్‌స్టిల్ ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్‌పై కశ్మీర్ రాజు సంతకం
అయితే, 1947 అక్టోబర్‌లో పాకిస్తాన్ మద్దతు గల లష్కర్ అనే పష్టూన్ గిరిజన దళాలు.. కశ్మీర్‌లోకి చొరబడ్డాయి. శ్రీనగర్ వైపు ముందుకు సాగాయి. ఇది పాకిస్తాన్ “ఆపరేషన్ గుల్మార్గ్”లో భాగంగా ఉంది. గిరిజన దాడులతో ఒత్తిడికి గురై, మహారాజా హరి సింగ్ అక్టోబర్ 26, 1947న భారత్‌లో చేరడానికి ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్‌పై సంతకం చేశారు. భారత సైన్యం శ్రీనగర్‌లో దిగిన తర్వాత.. మారువేషంలో మొదట గిరిజన దళాలుగా, తర్వాత బహిరంగంగానే పాకిస్తాన్ సైన్యం యుద్ధం ప్రారంభించింది.
శ్రీనగర్, బారాముల్లా, ఉరిలను భారత సైన్యం స్వాధీనం
అయితే, ఈ యుద్ధంలో.. భారత సైన్యం శ్రీనగర్, బారాముల్లా, ఉరి ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. కానీ పాక్-మద్దతు దళాలు పశ్చిమ కశ్మీర్‌లో బలం చూపించాయి. 1948 మధ్యలో యుద్ధం తీవ్రతరం అయింది. ముజఫరాబాద్, మీర్‌పూర్, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతాలను పాకిస్తాన్ నియంత్రించింది. లడఖ్, కార్గిల్, జోజిలా పాస్‌ను భారత్ సురక్షితంగా కాపాడింది. అయితే, శీతాకాలం కారణంగా కొన్ని ప్రాంతాల్లో భారత్ పురోగతి నిలిచిపోయింది. చివరిగా.. జనవరి 1, 1949న ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ప్రకటించారు.
మొత్తం కశ్మీర్‌లో మూడులో ఒక వంతు భాగం పాక్ ఆక్రమణ
ఇక్కడ, నియంత్రణ రేఖ-LoC ఏర్పడి, కశ్మీర్ విభజనకు కారణం అయ్యింది. ఇక, జమ్మూ, కశ్మీర్ లోయ, లడఖ్‌లతో సుమారు మూడులో రెండొంతుల భూభాగం భారత నియంత్రణలోకి రాగా.. పాకిస్తాన్ నియంత్రణలోకి పాక్ పిలుస్తున్న ‘ఆజాద్ కశ్మీర్’, గిల్గిట్-బాల్టిస్తాన్‌లు చేరాయి. అంటే, మొత్తం కశ్మీర్‌లో మూడులో ఒక వంతు భాగం పాకిస్తాన్ ఆక్రమించుకుంది. ఇక, 1948లో ఐరాస ఓటు ద్వారా రూపొందించిన రెజ్యూషన్‌లో.. డీ-మిలిటరైజేషన్, ప్లెబిసైట్‌ను సూచించింది. అయితే, కశ్మీర్ భూభాగంలో ఇది ఎప్పుడూ అమలు కాలేదు. ఎందుకంటే, రెండు దేశాలు ఈ షరతులపై ఏకీభవించలేదు.
కశ్మీర్ వ్యవహారంలో భారత్-పాక్ యుద్ధం మరోసారి అనివార్యం
అయితే, ఇప్పుడు భారతదేశం ముందున్న కశ్మీర్ సవాలులో పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడం మొదటి దశ కాగా… ప్రస్తుతం చైనా నియంత్రణలో ఉన్న లడఖ్ భూభాగాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, కశ్మీర్ వ్యవహారంలో భారత్-పాక్ యుద్ధం మరోసారి అనివార్యమవుతుందని మోడీ ప్రభుత్వానికి ముందుగానే తెలుసు. అందుకే, జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి.. పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశం పాక్‌తో డీల్ చేస్తే.. లడఖ్ కేంద్రపాలిత ప్రాంత అంశం చైనాతో తర్వాత డీల్ చేయొచ్చన్నట్లు వ్యూహం పన్నారు. అయితే, ఇప్పుడు అత్యంత ఆవశ్యకంగా తీసుకోవాల్సిన నిర్ణయం POKను ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారనేదానిపై ఆధారపడి ఉంది.
పుల్వామా దాడికి ప్రతిస్పందనగా బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్
2016 జరిగిన ఉరి దాడులుకు.. 2019లో జరిగిన పుల్వామా దాడులకు కూడా POK కేంద్రంగా మారింది. రెండు దాడులూ జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చేసిందే. అయితే, ఇక్కడ ఉగ్రవాదులు వాడిన ఆయుధాలపై పాకిస్తాన్ గుర్తులు ఉండటమే ఈ కుట్రల వెనుక పాక్ హస్తం ఉందనడానికి నిదర్శనంగా నిలిచింది. అయితే, ఉరి దాడులకు ప్రతిస్పందనగా భారత్.. PoKలోని ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లపై సర్జికల్ స్ట్రైక్‌లు నిర్వహించింది. అలాగే, పుల్వామా దాడికి ప్రతిస్పందనగా బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్ నిర్వహించింది. ఇలా, ఏదో ఒక పెద్ద సంఘటనా.. భారీ ప్రాణనష్టాల తర్వాత తక్షణ ప్రతిస్పందనలు తప్ప.. పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరించకపోవడమే ఇప్పుడు పహల్గామ్ లాంటి దాడులకు మళ్లీ మళ్లీ కారణం అవుతూనే ఉంది.
కొత్త మార్గాల్లో కశ్మీర్‌లోకి చొరబడుతున్న ఉగ్రవాదం
ఇటీవల కాలంలో.. జమ్మూ కశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్రవాదులు ఉనికిపై భారత్ ఆర్మీ, కశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. అయితే, భద్రతా బలగాలు ఎంతగా కష్టపడుతున్నా… ఉగ్రవాదులు తమ ప్లాన్లు మారుస్తూ.. కొత్త మార్గాల్లో కశ్మీర్‌లోకి చొరబడటం నేర్చుకున్నారు. తాజా పహల్గామ్ దాడిలో కూడా స్థానిక ప్రజల వేషంలో ఉండి పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఇందులో హిందువులనే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి, జమ్మూ కశ్మీర్‌లో మతపరమైన విధ్వంసాలను ప్రేరేపించడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, అందుకే ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారన్నది ఎప్పటి నుండో చర్చల్లో ఉంది.
POKని స్వాధీనం చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు
ఈ ప్రాంతంలో పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొనకుండా పాకిస్తాన్ తరచుగా ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోంది. కశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాద రిక్రూట్‌మెంట్‌లు తగ్గడం వల్ల, POK నుండి ఉగ్రవాదులను తయారుచేస్తోంది. అందుకే, పాక్‌ను నియంత్రించాలంటే.. POKని స్వాధీనం చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ మాదిరి చర్యలు తీసుకొని… ఉద్రిక్తతలు యుద్ధంగా మారకుండా చూస్తామంటే సరిపోదు. మరోసారి పాకిస్తాన్‌కు ఇలాంటి అవకాశం ఇవ్వకుండా.. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గకుండా.. భారతదేశ సార్వభౌమత్వానికి ప్రమాదం ఏర్పడితే… భారత్ ఎలా స్పందిస్తుందో ప్రత్యక్షంగా చూపించాలి. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇకపై భారత్ భూభాగంలో శాశ్వత రాష్ట్రంగా నిలవాలి.