Indigo Flights: వంద.. రెండొందలు కాదు.. ఏకంగా 1600లకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయ్. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు కాచి..కాచి.. ఫ్లైట్ టేకాఫ్ అవుతుందేమోనని చూసి.. చూసి.. తీరా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యాక.. తిట్టుకుంటూ ఇంటిబాట పట్టేశారు. ఇదంతా.. ఇండియాలోనే ది బెస్ట్ అనుకున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో తలెత్తిన సమస్య. అసలు.. ఇండిగోకు ఏమైంది? ఒక్కసారిగా ఇంత సంక్షోభం ఎందుకొచ్చింది? ఇన్ని సర్వీసులు ఎందుకు రద్దయ్యాయ్?
ఇండియా వైడ్ ఇండిగో కౌంటర్లలో గందరగోళం
దేశవ్యాప్తంగా.. అన్ని ఎయిర్‌పోర్టుల్లోని ఇండిగో కౌంటర్ల దగ్గర కోపతాపాలు కనిపిస్తున్నాయ్. ఇండిగో సంస్థపై.. విమాన ప్రయాణికులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఫ్లైట్ ఎప్పుడొస్తుంది.. ఇప్పుడెందుకు క్యాన్సిల్ చేశారు? మరో ఫ్లైట్ ఏమైనా ఏర్పాటు చేస్తారా? లాంటి ప్రశ్నలతో పాటు మరెన్నో అభ్యర్థనలు వినిపిస్తున్నాయ్. మొత్తంగా.. ఇండియా వైడ్ ఇండిగో కౌంటర్లలో.. గందరగోళం నెలకొంది. ఫ్లైట్ ప్యాసింజర్లంతా.. సోషల్ మీడియా ద్వారా తమ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. అయితే.. ఇదేదో సాధారణ ఎయిర్‌లైన్స్ సంస్థలో తలెత్తిన సంక్షోభమైతే.. ఇంత చర్చ అవసరం లేదు. కానీ.. ఇండియాలో విమాన ప్రయాణాలకు పర్యాయపదంగా మారి.. ఇండిగో స్టాండర్డ్ టైమ్ అంటూ సగర్వంగా చెప్పుకునే ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఇప్పుడు సమస్య తలెత్తింది. కొన్ని వారాలుగా.. ఇండిగో తీవ్రమైన ఆపరేషనల్ సంక్షోభంలో చిక్కుకుంది. వందలు, వేల సంఖ్యలో విమానాలు రద్దవడం, ఆలస్యమవడం.. దేశంలోని అన్ని ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. ఎంతోమంది టైమ్ వేస్ట్ చేస్తోంది.
దేశంలోనే అతిపెద్ద బడ్జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో
నిజానికి.. దేశంలో అప్పుడప్పుడు రకరకాల కారణాలతో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతుంటాయ్. ఇదేమంత పెద్ద విషయం కాదు. ఆ ఫ్లైట్ సర్వీస్ కాకపోతే.. మరో ఫ్లైట్‌ని రెడీ చేసి పంపడమో.. టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేయడమో జరుగుతుంది. అయితే.. దేశంలోనే అతిపెద్ద బడ్జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగోలో వచ్చినపడిన అంతరాయం కొద్దిరోజులుగా విమాన సర్వీసులు, అందులో ప్రయాణించే వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశవ్యాప్తంగా.. భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేయడంతో.. వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టుల్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో.. ఇండిగో సర్వీసులు స్తంభించిపోయాయ్. దాంతో.. ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
4 రోజుల్లో వందలాది విమాన సర్వీసులు రద్దు..
గడిచిన 4 రోజుల్లో వందలాది విమాన సర్వీసులు రద్దయ్యాయ్. గత 48 గంటల్లో, 300కి పైగా విమానాలు రద్దు చేశారు. ఈ క్రైసిస్ మొదలయ్యాక.. ఒక్క నవంబర్‌లోనే 1232 విమాన సర్వీసులను రద్దు చేశారు. వీటిలో 755 ఫ్లైట్స్.. సిబ్బంది కొరత, ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ వల్ల రద్దయ్యాయి. 258 సర్వీసులు ఎయిర్‌స్పేస్ పరిమితులతో క్యాన్సిల్ చేశారు. 92 విమానాలు.. ఏటీసీ వ్యవస్థ వైఫల్యంతో రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా ఇండిగో సర్వీసులు 35 శాతానికి పడిపోయాయి. అక్టోబర్‌లో 84 శాతంగా ఉన్న ఇండిగో ఆన్ టైమ్ పనితీరు.. ఇప్పుడు 68 శాతానికి పడిపోయింది.
48 గంటల్లో పరిస్థితి సాధారణ స్థితికి తెస్తామన్న ఇండిగో
తమ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు దారుణంగా దెబ్బతిన్నాయని ఇండిగో కూడా అంగీకరించింది. వింటర్ సీజన్ షెడ్యూల్ మార్పులు, వాతావరణం, టెక్నికల్ లోపాలే.. దీనికి కారణమని ప్రకటించింది. కొత్త FDTL నిబంధనలతో.. పైలట్ల కొరత తీవ్రమైందని, షెడ్యూల్ సర్దుబాట్లు చేస్తూ.. ఫ్లైట్ సర్వీసెస్‌ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. 48 గంటల్లో పరిస్థితి సాధారణ స్థితికి తేవడమే లక్ష్యమని ఇండిగో ప్రకటించింది. పైలట్లకు వీక్లీ రెస్ట్ అవర్స్ పెంచడం, రాత్రిపూట ల్యాండింగ్స్‌ని పరిమితం చేయడం లాంటి కొత్త రూల్స్.. ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరోవైపు.. ఫ్లైట్ల రాకపోకల్లో అంతరాయంపై.. ఇండిగోని డీజీసీఏ వివరణ కోరింది. విమాన సర్వీసుల్లో అంతరాయానికి కారణమేంటో తెలపాలని ఆదేశించింది. ఫ్లైట్ సర్వీస్‌లను యధాతథంగా కొనసాగించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని తెలిపింది. ఇక.. విమాన సర్వీసుల్లో తలెత్తిన సమస్యలతో.. ఇండిగో షేర్లు భారీగా పతనమయ్యాయ్. ఇండిగో మాతృసంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్ ధర వరుసగా రెండో రోజు భారీగా పతనమైంది. వరుసగా విమానాలు రద్దు చేస్తుండటంతో.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఇండిగో షేర్లు 3 శాతానికి పైగా పడిపోయాయి. గత ఐదు రోజుల్లో ఇండిగో స్టాక్ వ్యాల్యూ.. దాదాపు 6 శాతం పతనమైనట్లు రిపోర్టులు చెబుతున్నాయ్.
రోజూ 2300 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు..
ఇండిగో ప్రతిరోజూ.. 2300 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడుపుతోంది. ఇండిగో అంటే.. ఇండియాలోనే బెస్ట్ ఎయిర్‌లైన్స్ సర్వీస్ అనే పేరుంది. కానీ.. ఇప్పుడు ఊహించని సవాళ్లు.. ఇండిగో నెట్‌వర్క్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయ్. ఈ గందరగోళానికి.. అసాధారణమైన లీన్ స్టాఫ్ స్ట్రాటజీ, ఎయిర్‌లైన్స్ రిక్రూట్‌మెంట్ ఆగిపోవడమే కారణమని.. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పైలట్స్ చెబుతోంది. 2024 జనవరిలోనే.. డీజీసీఏ సవరించిన FDTL నిబంధనలను జారీ చేసింది. ఈ విషయం.. ఇండిగోతో సహా అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలకు తెలుసు. వాటిని.. దశలవారీగా అమలు చేసే ప్రక్రియ.. ఈ సంవత్సరం చివర్లో మొదలైంది. దాంతో.. చాలా ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆలస్యంగా సన్నాహాలు ప్రారంభించాయ్. అవసరమైన విధంగా.. కనీసం 15 రోజుల ముందుగానే సిబ్బంది షెడ్యూల్ ఫిక్స్ చేయడంలో విఫలమయ్యాయ్. ఈ కొత్త రూల్స్.. పైలట్ల అలసటని పరిష్కరించేందుకు, విశ్రాంతి సమయాన్ని పెంచాలని సూచిస్తున్నాయ్. అయినప్పటికీ.. ఫ్లైట్ సర్వీసెస్‌ని తగిన విధంగా షెడ్యూల్ చేయడంలో ఇండిగో ఫెయిలైంది.
ఇండిగో స్టాండర్డ్ టైమ్ అని చెప్పుకునే సంస్థ.. ఇంత దారుణంగా ఎలా దెబ్బతింది? ప్రయాణికులు, ఫ్లైట్ సిబ్బందికి సంబంధించిన కొత్త రూల్స్.. అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఒకేసారి అమల్లోకి వచ్చాయి. అయినా.. ఇండిగో మాత్రమే ఇంత తీవ్రంగా ఎందుకు దెబ్బతింది? ఎక్కడ ఫెయిలైంది? విమాన సర్వీసుల విషయంలో ఇంత గందరగోళానికి కారణమేంటి? ఇండిగోపై పడిన ఎఫెక్ట్‌తో.. డీజీసీఏ మళ్లీ రూల్స్ మార్చాలా?
దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్టులో గందరగోళం
భారత విమానయాన రంగంలో.. అత్యంత విశ్వసనీయమైన ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా పేరున్న ఇండిగోలో తలెత్తిన సంక్షోభం.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. వందల సంఖ్యలో విమానాలు రద్దవడం.. ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం సృష్టించిన ఈ పరిస్థితికి అనేక కారణాలున్నాయ్. ఇందులో.. ఇండిగో వైఫల్యమే ప్రధానంగా కనిపిస్తంది. ఈ భారీ అంతరాయానికి ముఖ్యమైన కారణం.. ఇండిగోలో ఉన్న సిబ్బంది కొరత, కొత్త ఫ్లైట్ డ్యూటీ లిమిటేషన్ రూల్స్ అమల్లోకి రావడమేననే చర్చ గట్టిగా వినిపిస్తోంది. 2024 జనవరిలోనే.. డీజీసీఏ.. ప్యాసింజర్ విమానాల నిబంధనల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. ప్రయాణికుల భద్రతని పెంచేందుకు, పైలట్లు, విమానాల్లో పనిచేసే సిబ్బందికి తగినంత విశ్రాంతిని అందించేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. సరికొత్త FDTL నిబంధనలు.. ఈ ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుంచే పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయ్. దాంతో.. చాలా మంది సిబ్బంది ఎయిర్‌లైన్స్ సంస్థ ఫిక్స్ చేసిన మునుపటి షెడ్యూల్స్ ప్రకారం విధుల్లో ఉండలేకపోయారు. ఫలితంగా.. రోస్టర్ గందరగోళం, విమానాల రద్దు, ఆలస్యం లాంటివి తలెత్తాయ్.
పైలట్‌లు, క్యాబిన్ సిబ్బందికి పెరిగిన విశ్రాంతి సమయం
కొత్త FDTL రూల్స్ ప్రకారం.. పైలట్‌లు, క్యాబిన్ సిబ్బందికి వారంలో అందించే విశ్రాంతి సమయం పెరిగింది. గతంలో వారానికి 36 గంటలు విశ్రాంతి ఉంటే.. ఇప్పుడది వారానికి 48 గంటలు చేశారు. నైట్ డ్యూటీ విండోని గంట పొడిగించారు. గతంలో అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఉంటే.. దానిని 6 గంటలకు పెంచారు. అంతేకాదు.. రాత్రివేళల్లో అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు పైలట్‌లు చేసే ల్యాండింగ్‌ల సంఖ్యపై పరిమితి విధించారు. అంతకుముందు 6 సార్లు నైట్ ల్యాండింగ్స్ చేసేవారు. ఇప్పుడు దానిని రెండుకు తగ్గించారు. ఇక.. ఒక రోజులో ఫ్లైట్ డ్యూటీ అవర్స్‌ని 10 గంటలకు పరిమితం చేశారు. గతంలో.. నైట్ డ్యూటీ తర్వాత విశ్రాంతి కనీసం 10 గంటలుంటే.. ఇప్పుడది 12 గంటలకు పెంచారు. ఇలాంటి కఠినమైన నిబంధనలకు అనుగుణంగా.. తమ భారీ నెట్‌వర్క్ షెడ్యూల్‌ని, సిబ్బంది రోస్టర్‌ని.. సకాలంలో మార్చుకోవడంలో ఇండిగో విఫలమైంది.
రోజుకు 2 వేలకు పైగా ఇండిగో విమాన సర్వీసులు
ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇంత తీవ్రంగా దెబ్బతినడానికి మరో కారణం.. అది ఆపరేట్ చేసే భారీ సర్వీసులే. ఇండిగో రోజుకు 2 వేలకు పైగా విమాన సర్వీసులను నడుపుతోంది. కొత్త రూల్స్ ప్రకారం.. ఇంత భారీ స్థాయిలో విమాన సర్వీసులను నడిపేందుకు తగినంత మంది పైలట్లు గానీ, సిబ్బంది గానీ అందుబాటులో లేక.. విమానాలను రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరో అంశం ఏమిటంటే.. ఇండిగో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎయిర్‌లైన్స్‌గా మార్కెట్‌లో తనని తాను నిలబెట్టుకుంది. అందువల్ల.. ఎక్కువ ఫ్రీక్వెన్సీ.. రాత్రిపూట కార్యకలాపాల మీదే ఆధారపడింది. ఇప్పుడు అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్.. ఇండిగో షెడ్యూల్స్‌కి విరుద్ధంగా ఉండటంతో.. గందరగోళం తలెత్తుతోంది.
తక్కువ సిబ్బంది విధానం మరో కారణమనే ఆరోపణ..
మరోవైపు.. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పైలట్స్ సంస్థ కూడా.. ఈ సంక్షోభానికి ఇండిగో దీర్ఘకాలంగా అనుసరిస్తున్న తక్కువ సిబ్బంది విధానమే కారణమని ఆరోపిస్తున్నాయి. కొత్త FDTL నిబంధనలు అమల్లోకి వస్తాయని.. రెండేళ్ల ముందే తెలిసినా, ఇండిగో అదనపు పైలట్లను నియమించుకోలేదు. సిబ్బంది కొరతని సరిచేయడానికి సరైన ప్రణాళికను సిద్ధం చేసుకోలేదని.. పైలట్ల సంఘాలు చెబుతున్నాయ్. సంస్థ ఓ వైపు భారీ లాభాలు ఆర్జిస్తున్నా.. సిబ్బంది వేతనాలు పెంచకపోవడం, సెలవులు రద్దు చేసుకోమని కోరడం లాంటి చర్యలన్నీ.. ఇండిగోలో పనిచేసే వారిలో నైరాశ్యాన్ని పెంచాయ్. ఇండిగో అనుసరించిన లీన్ మ్యాన్ పవర్ స్ట్రాటజీ.. సమస్యని మరింత పెంచింది. మరోవైపు.. ప్రధాన ఎయిర్‌పోర్టుల్లోని చెక్-ఇన్ వ్యవస్థల్లో తలెత్తిన టెక్నికల్ లోపాలు, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ సమస్యలు విమానాలు ఆలస్యమవడానికి, రద్దవడానికి కారణమయ్యాయ్.
ప్రతికూల వాతావరణం, పొగమంచుతో షెడ్యూల్‌పై ప్రభావం
శీతాకాలం కావడంతో.. కొన్ని ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం, తీవ్రమైన పొగమంచు లాంటివి షెడ్యూల్‌ని ప్రభావితం చేశాయ్. కొన్నిసార్లు.. ఏటీసీ వ్యవస్థలో లోపాలు కూడా విమానాలు రద్దవడానికి కారణమైంది. ఫలితంగా.. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు తలెత్తాయ్. చాలా మంది ప్యాసింజర్లు.. తమ విమానం రద్దయిన విషయం తెలియకపోవడంతో.. విమానాశ్రయాల్లో గందరగోళం, సిబ్బందితో వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. అయితే.. ఫ్లైట్ క్యాన్సిల్ అయిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాల్లో ఏర్పాట్లు, రీఫండ్‌లు అందిస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది.
Also Read: బర్త్‌డే పార్టీలో బ్లేడ్ బ్యాచ్ రౌడీషీటర్ దారుణ హత్య.. పరారైన వ్యక్తుల కోసం పోలీసుల వేట!
ఇండిగో సర్వీసుల్లో తలెత్తిన అంతరాయంతో.. ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ అనే విశ్వసనీయతపై తీవ్ర ప్రభావం పడింది. ఇండిగో క్రైసిస్ కేవలం టెక్నికల్, వాతావరణ సమస్యలు మాత్రమే కాదు. డీజీసీఏ కొత్తగా తీసుకొచ్చిన భద్రతా నిబంధనలకు అనుగుణంగా.. తమ ఆపరేషన్స్‌ని సరిచేసుకోవడంలో తలెత్తిన లోపాల కారణంగానే ఇదంతా జరిగింది. ఈ సంక్షోభం ఇండిగోకు మాత్రమే కాదు.. భారతీయ విమానయాన రంగానికి కూడా ఓ పెద్ద సవాల్‌గా మారింది.
Story By Anup, Bigtv