Blade Batch: జగ్గయ్యపేటలో దారుణ హత్య.. అయితే విజయవాడకు చెందిన రౌడీషీటర్, నవీన్‌రెడ్డి అనే యువకుడు కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట ప్రాంతంలో దారుణంగా హత్యకు గురయ్యాడు.. వివరాల్లోకి వెళ్తే, తీవ్రమైన గాయాలతో ఉన్న నవీన్‌రెడ్డిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు జగ్గయ్యపేటలోని ఒక ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రికి చేరుకునే సమయానికి నవీన్ అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. వైద్యుల ద్వారా విషయం తెలియగానే, నవీన్‌ను ఆసుపత్రికి తీసుకొచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు.
బ్లేడ్ బ్యాచ్ రౌడీషీటర్ నవీన్‌రెడ్డి దారుణ హత్య
పోలీసులకు సమాచారం అందగానే, వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గురైన వ్యక్తి బ్లేడ్ బ్యాచ్ రౌడీషీటర్ నవీన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. నవీన్ రెడ్డి గత కొంతకాలంగా సాయి అనే వ్యక్తితో కలిసి చిల్లకల్లులో నివాసం ఉంటున్నట్లు సమాచారం. రెండు రోజులుగా అక్కడి మరికొందరితో కలిసి బర్త్‌డే పార్టీలు చేసుకోన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య చిలకల్లు ప్రాంతంలో జరిగి ఉండే అవకాశం ఉందని పోలీసులుఅంచనాకు వచ్చారు. ఆ తర్వాతే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
Also Read: తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. తొలి విడత ఏకగ్రీవాలో ఎన్నో తెలుసా?
పరారైన ఇద్దరి కోసం గాలిస్తున్న పోలీసులు
నవీన్‌రెడ్డి హత్య వెనుక పాత కక్షలు లేదా రౌడీ గ్యాంగ్‌ల మధ్య జరిగిన ఘర్షణలే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య కేసులో కీలకంగా భావిస్తున్న, మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకొచ్చి పరారైన ఆ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వారిని పట్టుకుంటేనే ఈ హత్యకు గల ఖచ్చితమైన కారణాలు, అలాగే ఈ ఘటనలో పాల్గొన్న వ్యక్తుల పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానిక రౌడీషీటర్ల కదలికలు, నవీన్‌రెడ్డికి ఉన్న పాత వైషమ్యాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. నవీన్‌రెడ్డి చివరిసారిగా ఎవరితో మాట్లాడాడు, చివరిగా ఎక్కడ కనిపించాడు అనే వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.