Trump Tariffs: తాడిని తన్నేవాడు ఒకడుంటే.. వాడి తలని తన్నేవాడు ఇంకొకడు ఉంటారనే మాట వినే ఉంటారుగా. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విషయంలో ఇప్పుడదే జరిగింది. ఎడాపెడా టారిఫ్‌లతో రెచ్చిపోతున్న ట్రంప్‌కు.. ఓ భారత సంతతి లాయర్ గట్టి షాక్ ఇచ్చారు. ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా వాదించి గెలిచాడు. ట్రంప్ దూకుడుకు యూఎస్ సుప్రీంకోర్టు బ్రేకులు వేసేలా చేశాడు. అంతే.. ఫోకస్ మొత్తం ఇప్పుడు ఆ లాయర్ మీదకు షిఫ్ట్ అయింది. అసలు.. ఎవరీ నీల్ కత్యాల్?
అమెరికా వాణిజ్యం ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయాలన్న ప్రెసిడెంట్ ట్రంప్ ఆశలపై.. భారతీయ సంతతి లాయర్ గట్టి దెబ్బ కొట్టారు. విదేశీ దిగుమతులపై ట్రంప్ ఇష్టారీతిన విధించిన సుంకాలు చెల్లవని.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ న్యాయపోరాటంలో.. చిరు వ్యాపారుల పక్షాన నిలబడి, అగ్రరాజ్యం అధినేత వ్యూహాలను చిత్తు చేసిన ఘనత మన భారత సంతతికి చెందిన లాయర్ నీల్ కత్యాల్‌కే దక్కింది. ఇప్పుడాయన పేరు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అతనే.. అమెరికా మాజీ యాక్టింగ్ సొలిసిటర్ జరల్ నీల్ కత్యాల్.
ప్రెసిడెంట్ ట్రంప్ 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉపయోగించి, వివిధ దేశాల దిగుమతులపై భారీగా సుంకాలను విధిస్తూ పోయారు. దీనిని సవాల్ చేస్తూనే.. భారత సంతతి లాయర్ నీల్ కత్యాల్ చిన్న వ్యాపారుల తరఫున కోర్టులో గట్టిగా వాదించారు. ప్రతి వాణిజ్య భాగస్వామిపైనా సుంకాలు విధించడం అన్యాయమని, అది రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. అమెరికాలో ప్రజలపై పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుంది. అధ్యక్షుడు ఎంతటి శక్తిమంతుడైనా, రాజ్యాంగం కంటే ఎక్కువ కాదని ఆయన వినిపించిన వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. 6-3 మెజారిటీతో సంచలన తీర్పుని వెలువరించింది. దీనిపై స్పందిస్తూ.. సుప్రీంకోర్టు చట్టపరమైన పాలన, అమెరికన్ ప్రజల భద్రత కోసం నిలబడిందని నీల్ అన్నారు. ప్రెసిడెంట్ పవర్‌ఫుల్లే కావొచ్చు.. కానీ రాజ్యాంగం అంతకంటే శక్తిమంతమైనదని న్యాయస్థానం నిరూపించిందన్నారు. ప్రాథమిక విలువలని కాపాడిన ఈ తీర్పు.. ఓ మైల్ స్టోన్‌గా నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు నీల్ కత్యాల్.
నీల్ కత్యాల్ షికాగోలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భారతీయులే. వాళ్లు చాలా ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. తల్లి ప్రతిభ డాక్టర్. తండ్రి సురేందర్ ఇంజినీర్‌గా పనిచేశారు. అమెరికాలోనే పుట్టిన నీల్ కత్యాల్.. అత్యున్నత విద్యాసంస్థలైన డార్ట్‌మౌత్ కాలేజ్, యేల్ లా స్కూల్ నుంచి పట్టా పొందారు. ఆ తర్వాత న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి అనేక కేసులను విజయవంతంగా గెలిపించారు. చట్టంపై తనకున్న పట్టుతో అగ్రరాజ్య న్యాయవ్యవస్థలో కీలక స్థానానికి ఎదిగారు.
యేల్ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నీల్.. కెరీర్ తొలినాళ్లలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్టీఫెన్ బ్రేయర్ దగ్గర క్లర్క్‌గా పనిచేశారు. 2010లో నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా హయాంలో యూఎస్ సొలిసిటర్ జనరల్‌గా వ్యవహరించారు. ముఖ్యంగా అమెరికా సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు 50కి పైగా కేసులను వాదించి, అత్యధిక కేసులు వాదించిన మైనారిటీ న్యాయవాదిగా నీల్ రికార్డు సృష్టించారు. ప్రస్తుతం జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో లా ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
నీల్ కత్యాల్.. గతంలో కొన్నిసార్లు డొనాల్డ్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగానూ కోర్టుల్లో వాదించిన సందర్భాలున్నాయి. 2017లో ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు.. కొన్ని దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలకు వ్యతిరేకంగా నమోదైన కేసులని కూడా నీల్ వాదించారు. ఇంపీచ్: ది కేస్ అగైనెస్ట్ డొనాల్డ్ ట్రంప్ అనే పుస్తకాన్ని కూడా నీల్ కత్యాల్ రచించారు. సంచలనం సృష్టించిన ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో మిన్నెసోటా స్టేట్ తరఫున ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా వాదించారు. లిటిగేటర్ ఆఫ్ ది ఇయర్‌గా.. అమెరికా న్యాయశాఖ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు.. ట్రంప్ టారిఫ్‌లు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో దూసుకుపోవాలని చూస్తుంటే.. అతనికి అడ్డుకట్ట వేస్తూ గట్టి సవాల్ విసిరిన భారత సంతతి లాయర్‌గా.. నీల్ కత్యాల్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో వార్తల్లో నిలిచారు.
నీల్ కత్యాల్‌కు ట్రంప్‌తో పోరాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనే ట్రంప్ తీసుకున్న అనేక చెత్త నిర్ణయాలపై సుప్రీంకోర్టులో సవాల్ విసిరింది ఇతనే. ట్రంప్ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకోవడంలో నీల్ ఎప్పుడూ ముందుంటారు. అందుకే, ఆయన్ని డెమొక్రాట్లు లీగర్ వారియర్ అని పిలుస్తుంటారు. అమెరికాలో భారతీయుల మేధస్సు కేవలం ఐటీలోనే కాదు, రాజ్యాంగాన్ని కాపాడే న్యాయ వ్యవస్థలోనూ అత్యున్నత స్థాయిలో ఉందని నీల్ కత్యాల్ మరోసారి నిరూపించారు.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి వారో ప్రపంచం మొత్తానికి తెలుసు. అతను, రెండోసారి ప్రెసిడెంట్ అయ్యాక ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారో ప్రపంచ దేశాలన్నీ చూస్తూనే ఉన్నాయ్. మరీ ముఖ్యంగా వాణిజ్యపరంగా అతడు తీసుకున్న నిర్ణయాలు.. అమెరికానే కాదు, మిగతా అన్ని దేశాలను ఆందోళనకు గురిచేశాయ్. తనకు నచ్చని దేశాలపై 100 నుంచి 200 శాతం టారిఫ్స్ విధించాడు. ఇలా నియంతలా వ్యవహరిస్తున్న ట్రంప్‌తో పెట్టుకునేందుకు, డీల్ సెట్ చేసుకునేందుకు.. వివిధ దేశాల అధినేతలే జంకుతున్నారు. అలాంటిది, ఓ భారత సంతతి లాయర్ మాత్రం.. ట్రంప్‌కి చుక్కలు చూపిస్తున్నాడు.
అంతర్జాతీయ న్యాయ, రాజకీయ వర్గాల్లో ఇప్పుడు నీల్ కత్యాల్ పేరు మార్మోగుతోంది. ట్రంప్ టారిఫ్‌లపై అమెరికా సుప్రీంకోర్టులో ఆయన సాధించిన విజయం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుంది తప్ప, అధ్యక్షుడు తన ఇష్టానుసారం సుంకాలు విధించలేరని కత్యాల్ నిరూపించారు. ఈ తీర్పు వల్లే.. అమెరికా అధ్యక్షుడికున్న విపరీతమైన అధికారాలకు బ్రేక్ పడింది. ట్రంప్ టారిఫ్ దెబ్బకు.. ప్రపంచ దేశాల వాణిజ్యం మొత్తం కుదుపునకు లోనైంది. ఇష్టానుసారం విధించిన పన్నులతో.. చాలా దేశాలు ఏం చేయాలో అర్థం కాక అమెరికా దారికొచ్చేశారు. ఇలాంటి టైమ్‌లో ఇండియా మాత్రమే తెలివిగా వ్యవహరిస్తూ, అమెరికాకు ఏమాత్రం లొంగకుండా, ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. ఇదే సమయంలో.. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు వెనుక ఓ భారత సంతతి లాయర్ ఉన్నాడనే న్యూస్.. ఇండియాకు మరింత బూస్ట్ ఇచ్చింది.
నీల్ కత్యాల్‍కు.. యూఎస్ సుప్రీంకోర్టులో పదుల సంఖ్యలో కేసులు వాదించిన అనుభవం ఉండటం, మైనారిటీ వర్గానికి చెందిన న్యాయవాదుల్లో అత్యధిక కేసులు వాదించిన రికార్డు నీల్ కత్యాల్ పేరిటే ఉంది. ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ ఆంక్షలను సవాల్ చేశారు. అలాగే, ఓటింగ్ హక్కుల చట్టం, పర్యావరణ వివాదాల్లో అనేక కీలక విజయాలు సాధించారు. తాజా తీర్పుతో.. భవిష్యత్తులో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా కాంగ్రెస్ అనుమతి లేకుండా, అత్యవసర అధికారాలను ఉపయోగించి, ఇష్టానుసారంగా సుంకాలను విధించడం సాధ్యం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి.. ట్రంప్ తన అధికారంతో విదేశీ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తూ, అమెరికా ఆర్థిక వ్యవస్థని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నించారు. అయితే, ఈ నిర్ణయాలు రాజ్యాంగబద్ధం కావని, దీనివల్ల సామాన్య వినియోగదారులపై భారం పడుతుందని నీల్ కత్యాల్ కోర్టులో గట్టిగా వాదించారు. మన వ్యవస్థ తన తప్పులను తనే సరిదిద్దుకోగలదని ఈ తీర్పు నిరూపించిందన్నారు.
ట్రంప్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంటే, నీల్ కత్యాల్ రాజ్యాంగం అనే ఆయుధంతో వాటిని అడ్డుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోర్టు గదిలో నీల్ కత్యాల్‌ను ఢీకొట్టడం ట్రంప్ లీగల్ టీమ్‌కు చాలా కష్టమైన పనే అనే చర్చ జరుగుతోంది. ఈ విజయం తర్వాత కత్యాల్‌ను.. జియంట్ కిల్లర్ అని పిలుస్తున్నారు. కత్యాల్ వాదనల ముందు.. ట్రంప్ నియమించిన న్యాయమూర్తులు కూడా కొన్నిసార్లు రాజ్యాంగానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ట్రంప్ కూడా సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సైతం విమర్శిస్తున్నారు. ఏదేమైనా నీల్ కత్యాల్ వాదనలతో వెలువడిన తీర్పు వల్ల అమెరికా అధ్యక్షుడికున్న విపరీతమైన అధికారాలకు బ్రేక్ పడింది. ఇది రాజ్యాంగ విలువలకు దక్కిన విజయంగా న్యాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు.
Story by: Anup, Big Tv