Iran–Israel War: ఖమేనీని ఖతం చేసినా ఇరాన్ తగ్గట్లేదు.. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులు ఆపట్లేదు.. అమెరికా, ఇజ్రాయెల్.. ఇరాన్ పవర్‌ని తక్కువ అంచనా వేశాయా? అనే డౌట్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది. ఇరాన్‌పై.. ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడులతో.. పశ్చిమాసియా అంతా అల్లకల్లోలంగా మారింది. తమ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా.. ఇరాన్ కూడా భీకర దాడులు చేస్తోంది. దాంతో.. పరిస్థితులు మరింత దిగజారాయ్. గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎంబసీలతో పాటు వివిధ ప్రాంతాలపై డ్రోన్, మిసైల్ దాడులకు పాల్పడుతోంది ఇరాన్. బహ్రెయిన్ రాజధాని మనామాతో పాటు దుబాయ్, దోహా, అబుదాబిలోని అనేక ప్రాంతాలు బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయ్. ఇజ్రాయెల్‌లో సైరన్ల మోత మోగుతోంది.
ఇరాన్ మిసైళ్లని తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటోందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపాయ్. యుద్ధం ఆపేందుకు.. మధ్యవర్తులతో ఇరాన్ సంప్రదింపులు జరుపుతోందంటూ వస్తున్న వార్తలను.. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి ఖండించారు. యుద్ధం విషయంలో అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని చెబుతున్నారు. యుద్ధం మొదలుపెట్టింది తాము కాదని.. ఈ సంక్షోభానికి అమెరికా, ఇజ్రాయెలే కారణమని ఇరాన్ చెబుతోంది. ఖమేనీ మరణానికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే.. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయాన్ని టార్గెట్ చేశామని.. నెతన్యాహు ఆఫీస్‌పై దాడి చేశామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ చెబుతోంది.
మిడిల్‌ఈస్ట్‌లో దశాబ్దాలుగా రగులుతున్న జ్వాల కాస్తా.. ఇప్పుడు కార్చిచ్చులా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో పశ్చిమాసియాలో సమీకరణాలన్నీ వేగంగా మారిపోతున్నాయ్. అమెరికా టెక్నాలజీకి, ఇజ్రాయెల్ స్ట్రాటజీ తోడవడంతో.. ఇరాన్ రాజధాని టెహ్రాన్.. అంధకారంలో మునిగిపోయింది. ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? ఈ యుద్ధం.. ప్రపంచ దేశాలపై చూపే ప్రభావంపై.. అంతర్జాతీయ రక్షణ, దౌత్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇరాన్ దగ్గరున్న అణు సామర్థ్యం తమ మనుగడకే ముప్పు అని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇరాన్‌లోని ప్రస్తుత పాలనని మార్చి, తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తీసుకురావడమే అమెరికా వ్యూహం. ఇప్పటికే.. ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్‌కి చెందిన కీలక అధికారులు, సైనిక నాయకులను హతమార్చారు. ఇప్పుడొచ్చే కొత్త నాయకత్వం, అమెరికాకు తలొగ్గి పనిచేస్తుందనే అంచనాలున్నాయ్. ఇరాన్ దగ్గర వేల సంఖ్యలో మిసైళ్లు, సూసైడ్ డ్రోన్లు ఉన్నప్పటికీ.. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న దాడులను అడ్డుకునే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేకపోవడమే.. పెద్ద బలహీనత. ఈ యుద్ధం వల్ల.. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతోంది.
ఇరాన్ విషయంలో అమెరికా డీకాపిటేషన్ స్ట్రాటజీతో దాడులు చేస్తోంది. ఒక వ్యవస్థలోని అగ్ర నాయకత్వాన్ని తుడిచిపెట్టి, మిగతా యంత్రాంగాన్ని మానసికంగా, వ్యూహాత్మకంగా దెబ్బతీస్తోంది. బంకర్లలో దాక్కున్న నేతలను సైతం అత్యంత కచ్చితత్వంతో మట్టుపెట్టడానికి ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ నెట్‌వర్క్, అమెరికా అత్యాధునిక ఆయుధాల కలయికే కారణం. ఖమేనీని అంతం చేసేందుకు అమెరికా-ఇజ్రాయెల్ దళాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. భూగర్భంలోని అత్యంత లోతైన బంకర్లను కూడా ఛేదించే బంకర్ పెనెట్రేటింగ్ మిసైల్స్ ద్వారా దాడులు నిర్వహించాయి. ఖమేనీ మరణంతో.. ఇరాన్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడింది. రాబోయే రోజుల్లో యుద్ధం తుపాకులు, బాంబులతోనే కాకుండా సైబర్ దాడులు, డ్రోన్ల ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు.. మధ్యప్రాచ్యంలో ఇరాన్ అత్యంత శక్తిమంతమైన సైనిక సామర్థ్యం కలిగిన దేశాల్లో ఒకటిగా ఉంది. ఇరాన్ ఆయుధ సంపత్తి అంతా.. ప్రధానంగా మిసైళ్లు, డ్రోన్లు, అసిమెట్రిక్ వార్‌ఫేర్‌పైనే ఆధారపడి ఉంది. ఇరాన్ దగ్గర అతిపెద్ద క్షిపణి నిల్వలు ఉన్నాయ్. 3 వేల కంటే ఎక్కువ బాలిస్టిక్ మిసైళ్లున్నాయ్. వీటిలో 2 వేల కిలోమీటర్ల దూరాల టార్గెట్‌లని ఛేదించగల ఖోరమ్‌షహర్-4, సెజ్జిల్, షాహాబ్-3 లాంటి ముఖ్యమైన మిసైళ్లు ఉన్నాయ్. ఇక.. తక్కువ ఎత్తులో రాడార్లకు చిక్కని క్రూయిజ్ మిసైళ్లు ఉన్నాయ్. ఫతా లాంటి హైపర్ సోనిక్ మిసైళ్లని కూడా ఇరాన్ ప్రదర్శించింది. ఇవి.. శబ్దం కంటే 15 రెట్లు వేగంతో ప్రయాణించగలవు. ఇరాన్ తన డ్రోన్ టెక్నాలజీతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తక్కువ ఖర్చుతో ఎక్కవ నష్టం కలిగించి కమికాజ్ డ్రోన్లు వేలల్లో ఉన్నాయ్.
ఇరాన్ దగ్గర 6 లక్షలకు పైనే యాక్టివ్ మిలటరీ ఆర్మీ, సుమారు మూడున్నర లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు. 2600 కంటే ఎక్కువ యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం సోవియట్ ఎరాకు చెందిన మోడల్స్. ఇరాన్ దగ్గర సుమారు వందకు పైగా నౌకలు ఉన్నాయ్. పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధిలో గెరిల్లా తరహా దాడులు చేయడానికి చిన్నపాటి స్పీడ్ బోట్లు, సబ్‌మెరైన్లని ఎక్కువగా వాడుతోంది. ఇరాన్ బలమంతా.. ఆ దేశం దగ్గరున్న మిసైళ్లు, డ్రోన్లే. వాటితోనే.. ఇప్పుడు భీకరంగా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్-అమెరికా కూడా కౌంటర్ ఎటాక్స్ చేస్తున్నాయ్. ఈ యుద్ధం గనక త్వరగా ముగియకపోతే.. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోనవసరం లేదనే చర్చ జరుగుతోంది.
యుద్ధం అంటే.. రక్తం ఏరులై పారేది. యుద్ధ భూమిలో కళ్లముందే పేలుళ్లు, సైనికుల హాహాకారాలు వినిపించేవి. కానీ.. ఇప్పుడు యుద్ధ రంగం ఆకాశంలోకి, అంతరిక్షంలోకి, చివరకు కంప్యూటర్ చిప్స్‌లోకి మారిపోయింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న తాజా పరిణామాలు ప్రపంచానికి ఓ కొత్త పాఠాన్ని నేర్పుతున్నాయ్. శక్తి, ఆయుధ సంపత్తితో పాటు టెక్నాలజీ కూడా ముఖ్యమేనని అర్థమవుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల్లో కనిపిస్తున్న అతిపెద్ద మార్పు డ్రోన్ టెక్నాలజీ. వేల సంఖ్యలో సైనికులను పంపే బదులు, తక్కువ ఖర్చుతో కూడిన సూసైడ్ డ్రోన్లను శత్రు దేశాలపైకి వదులుతున్నారు. ఒక యుద్ధ విమానాన్ని తయారు చేసేందుకు కోట్లు ఖర్చవుతాయ్. కానీ.. డ్రోన్లు తక్కువ ధరకే తయారవుతాయ్. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లపై కూర్చున్న చోటు నుంచే దాడి చేయొచ్చు. ఇంకా ఎక్కువ నష్టం కలిగించాలనుకుంటే.. మిసైళ్లని ఫైర్ చేస్తున్నారు. బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైళ్లు, గైడెడ్ మిసైళ్లు ఇలా రకరకాల మిసైళ్లతో విరుచుకుపడుతున్నారు.
వందల సంఖ్యలో డ్రోన్లని ఒకేసారి ప్రయోగించడం వల్ల.. శత్రు దేశపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని గందరగోళానికి గురిచేయొచ్చు. పైలట్ అవసరం లేదు కాబట్టి.. ప్రాణ నష్టం జరిగే ఛాన్సే లేదు. ఇక.. మిసైల్స్ అనేవి దశాబ్దాలుగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు వాటిలో కచ్చితత్వం పెరిగింది. ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించే.. హైపర్ సోనిక్ మిసైళ్లని అడ్డుకోవడం.. ఇప్పుడున్న టెక్నాలజీకి కూడా సవాలుగ్ మారింది. ఇరాన్ వాడిన బాలిస్టిక్ మిసైళ్లు అంతెత్తున అకాశంలోకి వెళ్లి.. మళ్లీ భూమిపైకి దూసుకొస్తాయ్. వీటిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ఆరో లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని వాడాల్సి వస్తోంది. రాబోయే రోజుల్లో యుద్ధం కేవలం.. నేల, నీరు, అకాశానికే పరిమితం కాదు.
సైబర్ వార్ ఫేర్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, స్పేస్ వార్‌కు కూడా దారితీస్తుంది. ఒక దేశపు విద్యుత్ వ్యవస్థ, బ్యాంకింగ్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను హ్యాక్ చేసి డౌన్ చేయడం ద్వారా మొత్తం దేశాన్ని స్తంభింపచేయొచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్ ఇప్పటికే అనేకసార్లు పరస్పరం సైబర్ దాడులు చేసుకున్నాయ్. శత్రువు పవర్ గ్రిడ్లని ఆపేయడం, అణు రియాక్టర్ సాఫ్ట్‌వేర్ హ్యాక్ చేయడం లాంటివి.. ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా కుప్పకూల్చడమే సైబర్ వార్‌ఫేర్ టార్గెట్. ఇక.. రాబోయే రోజుల్లో యుద్ధాలకు సంబంధించిన నిర్ణయాలు ఏఐ తీసుకునే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. శత్రువులను గుర్తించడం, మిసైల్ ఏ మార్గంలో వెళ్తే.. టార్గెట్‌ని కచ్చితంగా కొడుతుందోనని సెకన్లలోనే లెక్కేయడం లాంటివన్నీ ఏఐ చేసే అవకాశం ఉంది. భవిష్యత్ యుద్ధాలు కేవలం సరిహద్దులకే పరిమితం కావు. హైబ్రిడ్ వార్‌ఫేర్‌లో.. ప్రత్యక్ష దాడులతో పాటు పరోక్ష దాడులు కూడా ఉంటాయ్. శత్రుదేశాల శాటిలైట్లని కూల్చేయడం, వారి జీపీఎస్, కమ్యూనికేషన్ వ్యవస్థను నాశనం చేయడం కూడా యుద్ధంలో భాగం కాబోతోంది.
భవిష్యత్తులో యుద్ధం గెలవాలంటే శత్రువుపై దాడి చేయడం ఎంత ముఖ్యమో, శత్రువు దాడులను సమర్థవంతంగా అడ్డుకోవడం అంతకంటే ముఖ్యం. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ హాట్ టాపిక్‌గా మారింది. వాళ్ల దగ్గరున్న ఐరన్ డోమ్, ఆరో సిస్టమ్స్.. యుద్ధ పరిణామాన్ని మార్చేశాయ్. ఇరాన్ వందలాది మిసైళ్లు, డ్రోన్లను ప్రయోగించినా, వాటిని గాలిలోనే పేల్చే టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఇక.. సైబర్ వార్‌ఫేర్ లాంటి అదృశ్య యుద్ధం కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పుడు.. టెక్నాలజీనే కొత్త సైన్యం. టెక్నాలజీ వాడే నైపుణ్యం ఉన్న టెక్ సోల్జర్స్ అవసరం పెరుగుతుంది. ఎవరి దగ్గరైతే అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, డ్రోన్, మిసైల్ టెక్నాలజీ ఉంటుందో.. వారే శక్తిమంతంగా కనిపిస్తారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని పరిశీలిస్తే అర్థమవుతున్నది ఒక్కటే. ఇకపై యుద్ధాల్లో గెలవడానికి లక్షలాది మంది సైనికులు అవసరం లేదు. తెలివైన సాఫ్ట్‌వేర్, కచ్చితమైన మిసైళ్లు, అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్స్ ఉంటే చాలు. యుద్ధ భూమి ఇప్పుడు మట్టి నుంచి మ్యాపులకి, మనుషుల నుంచి మెషీన్లకి మారిపోయింది. టెక్నాలజీ ఎంత పెరిగితే.. విధ్వంసం అంత భయంకరంగా ఉంటుంది. బటన్ నొక్కితే బాంబు పేలుతుంది. అది మిగిల్చే విషాదం, గాయాలు మాత్రం తరాల పాటు మిగిలిపోతాయ్.
Story by: Anup, Big Tv