Andhra King Taluka: ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ సోదరుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రామ్ పోతినేని (Ram Pothineni). ‘దేవదాస్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రెడీ, మస్కా, గణేష్, జగడం, రామ రామ కృష్ణ కృష్ణ, కందిరీగ, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, మసాలా, పండగ చేస్కో , నేను శైలజ, హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ ఇలా వరుసగా లవ్ స్టోరీ సినిమాలు చేస్తూ అమ్మాయిలు కలల రాకుమారుడిగా , చాక్లెట్ బాయ్ గా పేరు సొంతం చేసుకున్నారు రామ్.
అయితే ఆ తర్వాత వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అద్భుతమైన మాస్ పెర్ఫార్మెన్స్ కనబరిచి.. ఇటు అబ్బాయిల ఫేవరెట్ హీరో అయిపోయారు. అలా ఈ హీరోకి రెండు వర్గాల అభిమానులు ఉన్నారనడంలో సందేహం లేదు. అమ్మాయిలకు చాక్లెట్ బాయ్ గా.. అబ్బాయిలకు మాస్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా రెడ్, రొమాంటిక్, ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ అంటూ వరుస సినిమాలు చేశారు. కానీ ఏ ఒక్కటి కూడా ఈయనకు సక్సెస్ అందించలేదు. దాంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్న రామ్.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
పి.మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ హీరోగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా వస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా నవంబర్ 28వ తేదీన సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగా.. తాజాగా చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఈ సినిమా నుంచి విడుదల చేసిన మూడు పాటల ప్రత్యేకతలను రామ్ చెప్పడమే కాకుండా తన టాలెంట్ ను కూడా బయటపెట్టేసాడు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ALSO READ:Mass jathara: మాస్ జాతర క్లోజింగ్ కలెక్షన్స్.. బుట్ట సర్దే టైం వచ్చిందా?
రామ్ మాట్లాడుతూ.. ” సెప్టెంబర్ నెలలో ఈ సినిమా నుంచి “పప్పీ సేమ్” అనే పాటను రిలీజ్ చేశాము.. ఈ పాటకి అనూహ్య స్పందన లభించింది. అయితే ఈ పాటను నేనే స్వయంగా ఆలపించాను” అంటూ రామ్ తెలిపారు. భాస్కర భట్ల లిరిక్స్ అందించగా.. వివేక్, మెర్విన్ కంపోజ్ చేశారు.
ఇక రెండవ పాట “నువ్వుంటే చాలే” అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకి లిరిక్స్ స్వయంగా రామ్ రాసారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ పాటను ఆలపించగా.. వివేక్, మెర్విన్ సంగీతం అందించారు.
మూడవ పాటగా.. “చిన్ని గుండెలో” అంటూ పాటను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పాటను కేవలం ఒక్క రోజులోనే కంప్లీట్ చేశామని రామ్ తెలిపారు. రామ్ మాట్లాడుతూ.. “చిన్ని గుండెలో పాటను కేవలం ఒక్క రోజులోనే పూర్తి చేసాము. మ్యూజిక్ డైరెక్టర్స్ తో సెట్ కి వెళ్ళాక అక్కడ మాకు చాలా క్లారిటీ ఉంది.. ఏం చేయాలి ఎలా చేయాలి అని సో అందరం అక్కడికక్కడే కంపోజ్ చేసేసి.. లిరిసిస్ట్ ను పిలిపించి, ఇది అయిపోతున్న వెంటనే సింగర్ని కూడా పిలిపించి.. నైట్ లోపే మొత్తం పాట షూటింగ్ కంప్లీట్ చేసేసాము. థియేటర్లలో ఈ పాట చూసేటప్పుడు ఒక ఫాంటసీ వైబ్ తెలుస్తుంది” అంటూ రామ్ తెలిపారు. అలా మొత్తానికైతే మూడు పాటలకు సంబంధించిన మూడు ప్రత్యేకతలు చెప్పి తనలోని టాలెంటును కూడా బయటపెట్టారు రామ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూ వీడియో వైరల్ గా మారింది.