ఇరాన్‌పైన ఇజ్రాయెల్ చేసిన ఈ తాజా దాడి గురించి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ నాలుగు రోజుల కిందే హింట్ ఇచ్చారు. హట్జెరిమ్ ఎయిర్‌బేస్‌లోని వైమానికి బృందాలను సందర్శించిన సందర్భంగా.. ఇరాన్‌ను ఎదురుదెబ్బ కొట్టాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌పై ప్రణాళికాబద్ధమైన వైమానిక దాడులు ఇజ్రాయెల్ సైనిక శక్తిని ప్రపంచానికి తెలియజేస్తాయని గాలంట్ అన్నారు. అక్కడ వైమానిక దళ సిబ్బందితో యుద్ధ వ్యూహాలపై చర్చించిన సందర్భంలో. ఇరాన్‌పై దాడి చేసిన తర్వాత, ప్రతి ఒక్కరూ ఇజ్రాయెల్ శక్తిని, సైనిక సంసిద్ధతను, సైనిక శిక్షణ ప్రక్రియను అర్థం చేసుకుంటారని తెలిపారు. ఇజ్రాయెల్‌కి హాని కలిగించడానికి ప్రయత్నించే శత్రువులు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని కూడా రక్షణ మంత్రి గాలంట్ హెచ్చరించారు.
ఇరాన్ చమురు, అణు స్థావరాలపై దాడులు చేయొద్దనే డిమాండ్
అయితే, ఇరాన్‌పై దాడి ప్లాన్ ఆకస్మాత్తుగా జరిగింది కాదు. కొన్ని వారాలుగా.. ఆ మాట కొస్తే.. కొన్ని నెలలుగా మల్లగుల్లాలు పడి నిర్ణయించుకున్న దాడి. ఇరాన్‌లో ఏయే లక్ష్యాలపై దాడి చేయాలనే ప్లాన్ ఇజ్రాయెల్ అగ్ర నాయకులు, అమెరికా అధ్యక్షుడు బైడెన్ మధ్య సుదీర్ఘ సంభాషణల తర్వాత జరిగింది. ఇందులో భాగంగా, ఇరాన్ చమురు పరిశ్రమల పైన, ఆ దేశ అణు స్థావరాలపైన దాడులు చేయొద్దనే డిమాండ్‌కు కట్టుబడి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు, ఈ చివరి రెండు వారాల్లో, యుద్ధాన్ని తీవ్రతరం చేయొద్దని అమెరికా కోరింది. అందుకే, ఇరాన్‌పై దాడికి సమయం తీసుకుంది ఇజ్రాయెల్. అలాగే, కేవలం సైనిక స్థావరాలు మాత్రమే లక్ష్యంగా తాజా దాడులకు దిగింది.
అయితే, దీనికి ముందే.. అక్టోబర్ 12న ఇరాన్‌పై సైబర్ దాడులకు దిగింది ఇజ్రాయెల్. దీనితో ఇరాన్ ప్రభుత్వంలోని దాదాపు మూడు కీలకమైన శాఖలకు అంతరాయం కలిగించింది. ఇరాన్ న్యాయ వ్యవస్థ, శాసన, కార్యనిర్వాహక శాఖలపైన మాత్రమే కాకుండా ఇరాన్ ప్రభుత్వంలోని దాదాపు ప్రతి శాఖపైన ఈ సైబర్ అటాక్స్ ప్రభావం పడింది. దాదాపు అన్ని శాఖల సమాచారం చోరీ జరిగిందని ఇరాన్ అధికారులు కూడా వెల్లడించారు. ఇంధన పంపిణీ, మున్సిపల్ సేవలు, రవాణ, ఓడరేవుల వంటి కీలకమైన నెట్‌వర్క్‌లపైన కూడా సైబర్ దాడులు జరిగినట్లు తెలిపారు.
Also Read: తెగించిన ఇజ్రాయేల్.. రక్తంతో ఇరాన్
అమెరికా ఎన్నికల ముందు యుద్ధాన్ని తీవ్రతరం చేయొద్దని వినతి
అయితే, ఇరాన్ కీలక శాఖలపై భారీ స్థాయిలో జరిగిన సైబర్ దాడులను ఇరాన్ సీరియస్‌గా తీసుకున్నప్పటికీ ఇజ్రాయెల్‌పై తక్షణ దాడులకు ప్రయత్నించలేదు. సైబర్ దాడులపై విచారణ చేపట్టినట్లు తెలిపింది. ఈ పరిణామం తర్వాత, ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన ఈ తాజా దాడిని ఇరాన్ చాలా తక్కువ చేసింది. ఇరాన్ రాజకీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇజ్రాయెల్‌పై అమెరికా నియంత్రణను కనిపించకుండా చేయడానికి, ఇజ్రాయెల్ అహంకారాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక వ్యూహాత్మక చర్య అని తెలుస్తోంది. అందుకే, ఇరాన్ అధికారిక మీడియా తాజా దాడిని తక్కువ చేసి చూపించడమే కాకుండా, నష్టంపై స్పష్టమైన నివేదికను అందించలేదు. అయితే, ఈ దాడిలో ఇరాన్‌కు చెందిన ఇద్దరు సైనికులు చనిపోయినట్లు ఇరానియన్ ఆర్మీ ప్రకటించింది. అలాగని, ఇరాన్ మౌనంగా ఉంటుందని అనుకోలేని పరిస్థితి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఈ దాడుల పర్వం ఇంతటితో ఆగదని నిపుణులు చెబుతున్న మాట. ప్రస్తుతం అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఇజ్రాయెల్ కాస్త నెమ్మదిస్తున్నట్లు ఉన్నా… ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ తక్కువ చేసి చూపించినా.. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య ఘర్షణలు పెరుగుతాయనే సూచనలు ఉన్నాయ్.
ఇరాన్, శాసన కార్యనిర్వాహక శాఖలపై సైబర్ దాడులు
ఇజ్రాయెల్ దాడుల్ని ముందుగానే ఊహించిన ఇరాన్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. అక్టోబర్ 1న ఇరాన్ దాడులు చేసిన తర్వాత.. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధంచడంతో ఇరాన్ మరింత అప్రమత్తం అయ్యింది. ఈ క్రమంలోనే, ఇరాన్ తన అరబ్ పొరుగు దేశాలకు, గల్ఫ్‌లోని యుఎస్ మిత్రదేశాలకు కూడా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌పై దాడులు చేయడంలో ఇజ్రాయెల్‌కు సహాయం చేయడానికి గల్ఫ్ దేశాల్లో భూభాగాలు గానీ, గగనతలాన్ని గానీ ఉపయోగిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించింది.
నష్టంపై స్పష్టమైన నివేదికను అందించిన ఇరాన్
ఆయా గల్ఫ్ దేశాల్లో అమెరికా రక్షణలో ఉన్న చమురు స్థావరాలను ఇరాన్ పేల్చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఖతార్ వంటి చమురు సంపన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని రహస్య దౌత్య మార్గాల ద్వారా ఈ హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది. అయితే, అమెరికా నేతృత్వంలోని అరబ్ దేశాలు ఈ యుద్ధంలో పాలు పంచుకోడానికి ఇప్పటికైతే సిద్ధంగా లేవు. ఇటీవల ఆ దేశాలు సంయుక్తంగా దీనిపై ప్రకటన కూడా చేశారు. తమ భూభాగాలను విదేశీ యుద్ధ లక్ష్యాల కోసం అనుమతించమని వెల్లడించాయి.
గల్ఫ్ లోని యూఎస్ మిత్రదేశాలకు ఇరాన్ గట్టి హెచ్చరిక
అయితే, అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఒకవేళ గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ కోసం తమ భూభాగాన్ని కానీ, గగనతలాన్ని కానీ అనుమతిస్తే.. వారు కూడా యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇప్పటికే అమెరికాకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఈ శక్తి-సంపన్న గల్ఫ్ దేశాలు యుద్ధంలోకి దిగితే తమ చమురు కేంద్రాలు ప్రధాన లక్ష్యాలుగా మారవచ్చనడంలో సందేహం లేదు. అయితే, ప్రపంచంలో అత్యధికంగా ఉన్న అమెరికన్ దళాలలో ఒక భాగం గల్ఫ్ దేశాల్లోనే ఉంది. కాబట్టి, వీటిపైన ఏదైనా సైనిక చర్య జరిగితే అది అమెరికా దళాలకు భారీ ప్రమాదం జరుగుతుంది. ఇదే జరిగితే అమెరికా కూడా ప్రత్యక్షంగా యుద్ధ రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది. ఇది ఇరాన్‌కు సహాయంగా ఇతర ఇస్లామిక్ దేశాలను పురిగొల్పుతుంది. తర్వాత జరిగేది మధ్య ప్రాచ్యం మసి కావడమే. ఈ పరిణామాలు ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణ ప్రపంచదేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.