2024 జనవరి 1వ తేదిన విజయవంతంగా శాటిలైట్ ప్రయోగం
ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం. ఇస్రో సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. కొత్త సంవత్సరానికి సక్సెస్‌తో ఆహ్వానం పలకడం అన్ని దేశాలకూ సాధ్యం కాలేదు. కానీ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రోకు మాత్రం 2024 పాత్ బ్రేకింగ్ విజయాలను అందించింది. 2024 జనవరి 1వ తేదిన విజయవంతంగా ఓ శాటిలైట్‌ను పంపి, ఏడాదికి స్వాగతం పలికిన ఇస్రో.. 2024 చివర్లో.. డిసెంబర్ 30న డాకింగ్ మిషన్‌తో సక్సెస్‌ఫుల్‌గా ఏడాదిని కంప్లీట్ చేసింది.
అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రోను పాపులర్ స్టాప్
కీలకమైన మైళు రాళ్లు దాటి, ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో అగ్రదేశాలకు పోటీగా నిలబడింది. చంద్రుని దక్షిణ ధృవాన్ని తాకిన మొట్టమొదటి దేశంగా చరిత్ర సృష్టించింది కూడా ఇదే సంవత్సరంలో. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన ఒక్కో ప్రాజెక్ట్ ప్రపంచ దేశాలను విస్తుపోయాలా చేశాయి. అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రోను పాపులర్ స్టాప్‌గా నిలిపాయి. నాసా లాంటి అగ్ర పరిశోధనా సంస్థలు కూడా ఇస్రోతో ఒప్పందాలు చేసుకునే విధంగా ఇస్రో సత్తాను చాటింది.
అగ్ర విజయాలను సాధించిన మొదటి ఐదు దేశాలలో భారత్
ఈ ఏడాది ఇస్రో.. కీలకమైన అంతరిక్ష అన్వేషణ సాంకేతికతల అభివృద్ధి, విస్తరణలో అనితరసాధ్యమైన ట్రాక్ రికార్డ్‌ను రూపొందించింది. దీని ద్వారా, 2024 సంవత్సరంలో ఇస్రో దాటిన కొన్ని ప్రధాన మైలురాళ్లు భారత్‌ను శక్తివంతమైన దేశంగా ఎదగడానికి సహాయపడింది. అంతరిక్షంలో అగ్ర విజయాలను సాధించిన మొదటి ఐదు దేశాలలో ఒకటిగా నిలబెట్టింది. శక్తివంతమైన రీ-యూజబుల్ రాకెట్లు, నెక్స్ట్ జనరేషన్ ప్రయోగ వాహనం-NGLV అభివృద్ధితో భారత అంతరిక్ష కార్యక్రమం రాబోయే రెండు దశాబ్దాలలో కీలకమైన లక్ష్యాలను నిర్దేశించింది.
అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి గగన్‌యాన్ మిషన్
ఇస్రో తలపెట్టిన అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి గగన్‌యాన్ మిషన్. ఇందులో భాగంగా.. మొదటిసారి భారతీయ వ్యామోగాములు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అందుకే, 2024 సంవత్సరంలో మానవ అంతరిక్ష యాత్ర ప్రాజెక్ట్ కోసం గట్టి పునాది పడింది. ఇది అంతరిక్షంలోనే కాక, మరో గ్రహంపై మానవుల్ని నిలబెట్టడానికి భారత సామర్థ్యాన్ని నిరూపిస్తుంది. ఈ క్రమంలోనే.. 2024వ సంవత్సరం అంతరిక్ష పరిశోధన, సాంకేతిక అభివృద్ధిలో ఇస్రో సాధించింన ముఖ్యమైన మైలురాళ్లను ఒకసారి గుర్తు చేసుకుందాం!
2024 జనవరి 1న PSLV-C58 X-ray ఎక్స్‌పోశాట్ ప్రయోగం
సరిగ్గా ఏడాది క్రితం.. 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. 2024 జనవరి 1న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేష్ సెంటర్ నుండి PSLV-C58 X-ray పోలారిమీటర్ ఉపగ్రహం-ఎక్స్‌పోశాట్‌ని ప్రయోగించింది ఇస్రో. ఖగోళ మూలాల నుండి ఎక్స్-రే ఉద్గారాలకు సంబంధించిన స్పేస్-ఆధారిత ధ్రువణ కొలతలను అధ్యయనం చేసిన మొట్టమొదటి ఉపగ్రహం ఇది. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి ఖగోళ మూలాలను అధ్యయనం చేయడానికి అబ్జర్వేటరీని పంపిన రెండవ దేశంగా ఈ ప్రాజెక్ట్ భారత్‌ను అగ్రదేశాల సరసన నిలిపింది.
భారతదేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 సక్సెస్
దీనికి ముందు, నాసా చేపట్టిన ఇమేజింగ్ ఎక్స్-రే పొలారిమెట్రీ ఎక్స్‌ప్లోరర్ తర్వాత.. ఇది ప్రపంచంలో రెండవ ఎక్స్-రే పోలారిమెట్రీ మిషన్‌గా చరిత్ర సృష్టించింది. దీని తర్వాత, భారతదేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 సక్సెస్ చూసింది. 2023 సెప్టెంబర్ 2న ప్రయోగించిన ఈ స్పేస్ షిప్.. 2024 జనవరి 6న ఎల్1 పాయింట్‌కి చేరుకొని, మరో సక్సెస్‌ను నమోదు చేసింది. ఆదిత్య-L1తో సూర్యుణ్ని ఎలాంటి అవరోధం లేకుండా వీక్షించడం సాధ్యమయ్యింది. ఈ మిషన్‌తో సవివరంగా సూర్యుణ్ని అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలకు మరింత సులువయ్యింది.
2024 ఫిబ్రవరి 17న, ఇస్రో హెవీ-లిఫ్ట్ GSLV-Mk II
ఇక 2024 ఫిబ్రవరి 17న, ఇస్రో హెవీ-లిఫ్ట్ GSLV-Mk II ద్వారా INSAT-3DS వెదర్ శాటిలైట్‌ని అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించింది. దీన్ని 10 సంవత్సరాల పాటు అంతరిక్షంలో పనిచేసేలా రూపొందించారు. ఇది భారతదేశ పర్యావరణ పర్యవేక్షణ, సముద్ర పరిశీలనలు, వాతావరణ అంచనా, విపత్తు సహాయ కార్యకలాపాలను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది. INSAT-3DS, అత్యాధునిక వెదర్ శాటిలైట్. భూస్థిర కక్ష్యలో ఉన్న భారత 3rd జనరేషన్ ఉపగ్రహాల సరసన నిలబడింది. ఈ విజయం తర్వాత.. 2024 మార్చి 22న, సిరీస్‌లో రెండోదైన RLV LEX-02 ల్యాండింగ్ ప్రయోగంతో రీయూజబుల్ లాంచ్ వెహికల్-RLV టెక్నాలజీలో ఇస్రో ఒక ప్రధాన మైలురాయిని సాధించింది.
డెసిలరేషన్ వ్యవస్థలను స్వదేశీయంగా అభివృద్ధి
మరింత క్లిష్టమైన విన్యాసాలను చేపట్టడానికి.. క్రాస్-రేంజ్, డౌన్‌రేంజ్ రెండింటినీ సరిచేయడానికి.. పూర్తి స్వయంప్రతిపత్తి మోడ్‌లో రన్‌వేపై ల్యాండ్ చేయడానికి RLVని తయారు చేశారు. పుష్పక్ అనే పేరుతో పిలిచే ఈ రెక్కల వాహనాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చినూక్ హెలికాప్టర్‌తో పైకి ఎత్తారు. ఈ మిషన్‌తో, స్పేస్-రిటర్నింగ్ వాహనం, హై-స్పీడ్ అటానమస్ ల్యాండింగ్‌ను నిర్వహించడానికి అవసరమైన నావిగేషన్, కంట్రోల్ సిస్టమ్‌లు, ల్యాండింగ్ గేర్, డెసిలరేషన్ వ్యవస్థలను స్వదేశీంగా అభివృద్ధి చేసి, ఇస్రో తన సామర్థ్యాన్ని నిరూపించింది.
జూన్ 23న RLV ల్యాండింగ్ ఎక్స్‌పెరిమెంట్‌లో 3వ వరుస విజయం
2024లో ఆరు నెలల్లోనే మంచి విజయాలను నమోదు చేసిన ఇస్రో.. జూన్ 23న RLV ల్యాండింగ్ ఎక్స్‌పెరిమెంట్‌లో మూడవ వరుస విజయాన్ని సాధించింది. ఇది LEX సిరీస్‌లో చివరి పరీక్ష. ఈ ప్రయోగం సమయంలో, పుష్పక్ స్వయంప్రతిపత్తితో ఖచ్చితమైన ల్యాండింగ్‌ను ప్రదర్శించింది. ఈ మిషన్ అంతరిక్షం నుండి తిరిగి వచ్చే వాహనం కోసం అప్రోచ్, ల్యాండింగ్ ఇంటర్‌ఫేస్.. హై-స్పీడ్ ల్యాండింగ్ పద్ధతిని అనుకరించింది. ఈ ప్రాజెక్ట్‌తో RLV అభివృద్ధికి అవసరమైన అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడంలో ఇస్రో నైపుణ్యాన్ని నిరూపించింది.
ఆగస్ట్ 16న, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్-D3 ప్రయోగం
దీని తర్వాత, జూలై 22న, ఇస్రో ఆర్‌హెచ్-560 సౌండింగ్ రాకెట్‌కు ఇరువైపులా ప్రొపల్షన్ సిస్టమ్‌లను అమర్చి, ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ టెక్నాలజీని ప్రదర్శించే రెండవ ప్రయోగాత్మక విమానాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఆ తర్వాత నెల.. ఆగస్ట్ 16న, శ్రీహరికోటలోని SDSC నుండి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్-D3ని ప్రయోగించింది ఇస్రో. దీనితో, EOS-08 భూ పరిశీలన ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. SSLVకి ఇది మూడవ, చివరి డెవలప్‌మెంటల్ ఫ్లైట్. ఈ ప్రయోగం, తక్కువ-ధరతో కూడుకున్న మల్టీ శాటిలైట్ ప్రయోగాల కోసం అభివృద్ధి చేశారు.
నవంబర్ 1న, ఇస్రో మొట్టమొదటి అనలాగ్ స్పేస్ మిషన్-హబ్-1
ఇక, నవంబర్ 1న, ఇస్రో భారతదేశపు మొట్టమొదటి అనలాగ్ స్పేస్ మిషన్-హబ్-1ని లేహ్ నుండి ప్రారంభించింది. ఇది అంతరిక్షంలో ఉన్న సవాళ్లను వ్యోమగాములకు పరిచయం చేయడానికి ఉద్దేశించింది. వారికి శిక్షణనిచ్చేందుకు భూమిపై అంతరిక్షం లాంటి వాతావరణాన్ని సృష్టించింది. ఇక, డిసెంబర్ 5న, ఇస్రో తన విశ్వసనీయతను మరోసారి రుజువు చేసింది. ఇస్రో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను విజయవంతంగా వాటి నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
డిసెంబర్ 30న స్పేడెక్స్ మిషన్ ప్రారంభం
ఇది, అంతరిక్ష అన్వేషణలో సాంకేతికంగా మొదటిదిగా గుర్తించబడింది. ఇక తాజాగా డిసెంబర్ 30న స్పేడెక్స్ మిషన్‌ను ప్రారంభించడంతో.. భవిష్యత్తులో భారత సొంత స్పేస్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన పునాది పడింది. ఇంటర్‌ప్లానెటరీ మిషన్‌లను ప్రారంభించే దిశగా ఇది మొదటి అడుగుగా నిలిచింది. ఈ మిషన్‌లో ఇస్రో PSLV-C 60ని ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్, అన్‌డాకింగ్‌కి అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ మిషన్ విజయవంతమైతే స్పేస్ డాకింగ్ టెక్నాలజీని కలిగి ఉన్న ప్రపంచంలోనే నాల్గవ దేశంగా భారత్ అవతరిస్తుంది.
డిసెంబర్ 18న గగన్‌యాన్ మిషన్ మొదటి అన్‌క్రూడ్ ఫ్లైట్ కోసం…
2024 ఫిబ్రవరి 27న, భారత్ తన మొట్టమొదటి మానవ సహిత మిషన్ గగన్‌యాన్‌పై కీలక ప్రకటన చేసింది. చంద్రుణ్ని తాకబోయే భారతీయ వ్యోమగాముల పేర్లను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఆ సందర్భం.. భారతదేశం తన మానవ అంతరిక్ష ప్రయాణ ఆశయాలను సాకారం చేసుకునే దిశగా తన మొదటి అడుగులు వేసిందనడానికి సాక్ష్యంగా నిలించింది. ఇందులో భాగంగానే.. డిసెంబర్ 18న, గగన్‌యాన్ మిషన్ మొదటి అన్‌క్రూడ్ ఫ్లైట్ కోసం, ఇస్రో, హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్-3ని అసెంబుల్ చేయడం ప్రారంభించింది.
2025వ సంవత్సరంలో గగన్‌యాన్ 1, 2, 3 మిషన్లు
ఇక 2025 ఏడాది ప్రారంభంలోనే… స్పేస్ పోర్ట్ నుండి సిబ్బంది లేని విమానం ప్రయోగించడానికి ఇస్రో అన్ని విధాలుగా రెడీ అవుతోంది. 2026 చివరి నాటికి దీన్ని ప్రయోగించాలని అనుకుంటున్నారు. ఈ గగన్‌యాన్ మూడు రోజుల మిషన్‌లో భాగంగా.. ముగ్గురు సభ్యుల సిబ్బందిని 400 కిలో మీటర్ల కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అలాగే, వారిని సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావడం కూడా అవసరమైన ప్రయోగాన్ని కూడా చేపడుతున్నారు. గగన్‌యాన్ 1, 2, 3 మిషన్లతో 2025వ సంవత్సరంలో ఇస్రో అసమాన సామర్థ్యం ప్రపంచానికి తెలియనుంది.
వీనస్ ఆర్బిట్ మిషన్, చంద్రయాన్-4 మిషన్‌లు
ఇక, భారతదేశ అంతరిక్ష ఆశయాల్లో మరో కీలకమైన మైలురాయి వీనస్ ఆర్బిట్ మిషన్, చంద్రయాన్-4 మిషన్‌లకు 2024 సెప్టెంబర్ 18న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీనస్ అన్వేషణ కోసం రూ.12 వందల 36 కోట్ల రూపాయలను ఆమోదించారు. వీటిలో వ్యోమనౌక కోసం రూ.1.21 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మిషన్‌లో శుక్రగ్రహ ఉపరితలం, ఉప ఉపరితలంతో పాటు, దాని వాతావరణ ప్రక్రియలు, గ్రహ వాతావరణంపై సూర్యుని ప్రభావం గురించి అధ్యయనం చేయనున్నారు. అలాగే, చంద్రయాన్-4 మిషన్ కోసం కూడా ప్రభుత్వం రూ.2 వేల 104 కోట్లను ఆమోదించింది.
భారత సొంత అంతరిక్ష కేంద్రం మొదటి యూనిట్ నిర్మాణం
ఈ మిషన్‌లో.. చంద్రుని ఉపరితలం, నేల నమూనాలను సేకరించి, వాటిపై పరిశోధన కోసం తిరిగి భూమికి తీసుకురానున్నారు. ఇక, ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం.. గగన్‌యాన్ కార్యక్రమ పరిధిని విస్తరిస్తూ.. భారత సొంత అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన మొదటి యూనిట్‌ను నిర్మించడానికి కూడా ఆమోదం తెలిపింది. భారతీయ అంతరిక్ష్ స్టేషన్-BAS-1 మొదటి మాడ్యూల్ అభివృద్ధికి… BASని నిర్మించడానికి, నిర్వహించడానికి అవసరమైన టెక్నాలజీ ప్రదర్శన, ధృవీకరణ కోసం సంబంధిత మిషన్‌లకు కూడా ఆమోదం లభించింది.
2025 జనవరిలో ఇస్రో 100వ రాకెట్ ప్రయోగం
ఇస్రో, జనవరి 2025లో తన 100వ రాకెట్ ప్రయోగంతో మరో అద్భుతమైన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి సిద్ధంగా ఉంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 2025 జనవరిలోనే జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌లో NVS-02 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మిషన్ 2025 సంవత్సరానికి ప్రణాళిక చేసిన అనేక మిషన్లలో ఒకటి మాత్రమే అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. అయితే, 2023 మే 29న GSLV-F12 రాకెట్‌లో.. 2 వేల 232 కిలోల బరువున్న NVS-01 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో.
2025లో నాసా-ఇస్రో కలిసి సింథటిక్ ఎపర్చర్ రాడార్-NISAR మిషన్
ఇప్పుడు, ఇస్రో ప్రకటన ప్రకారం, NVS-01 ఉపగ్రహం స్వదేశీ అటామిక్ క్లాక్‌ను కలిగి ఉంది. అలాగే, మరింత సర్వీస్ కవరేజ్ కోసం L1 బ్యాండ్ సిగ్నళ్లతో పాటు భారత నావిగేషన్, ఇండియన్ కాన్స్టిలేషన్ సామర్థ్యాలను కూడా మెరుగుపరచడానికి రూపొందించబడింది. అయితే, 2025లో భారతదేశం చాలా మిషన్లు ప్లాన్ చేసింది. జనవరిలో GSLV NVS-02ని ప్రయోగంతో పాటు 2025లోనే నాసా-ఇస్రో భాగస్వామ్యంలో సింథటిక్ ఎపర్చర్ రాడార్-NISAR మిషన్ చేపట్టనున్నారు. భూమి పర్యావరణ వ్యవస్థలు, డ్యూయల్-ఫ్రీక్వెన్సీ రాడార్ ఇమేజింగ్‌ను ఉపయోగించి ప్రమాదాలను అధ్యయనం చేయడానికి దీన్ని పంపిస్తున్నారు.
అంతరిక్ష పరిశోధనలు వేగవంతం చేయడానికి ప్రధాని మోడీ ప్రయత్నం
ప్రస్తుతం, అంతరిక్ష శాఖ, అణు ఇంధన శాఖను తన ఆధ్వర్యంలోనే ఉంచుకున్నారు ప్రధాని మోడీ. సంప్రదాయం ప్రకారం, ప్రధాన మంత్రి ఈ శాఖల పనితీరును పర్యవేక్షిస్తారు. ఈ విభాగం కిందే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ఇస్రో కూడా పనిచేస్తుంది. అయితే, ఇస్రోకు సంబంధించిన రోజువారీ కార్యకలాపాలను మంత్రిగా డాక్టర్ జిత్నేద్ర సింగ్ నిర్వహిస్తారు. ఇక, మోడీ నేతృత్వంలోని గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పర్యవేక్షణ ఉండేదో అంతకుమించి.. ఈసారి మోడీ అంతరిక్ష పరిశోధనల ను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రైవేట్ రంగంతో దేశంలో కొత్త అంతరిక్ష పరికరాల అభివృద్ధి
ఇందులో భాగంగానే.. 2025వ సంవత్సరంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరిన్ని విజయాలను తన ఖాతాలో వేసుకోనుంది. దీని కోసం, ఏరోస్పేస్ రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు అందుబాటులోకి తీసుకురావడానికి కూడా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు అద్భుతమైన స్పందన వచ్చింది. స్కైరూట్ ఏరోస్పేస్ వంటి సంస్థల నేతృత్వంలోని ప్రైవేట్ రంగంతో భారతదేశం కొత్త అంతరిక్ష పరికరాలను అభివృద్ధి చేయడంలో ఈ కంపెనీలకు ఇస్రో మద్దతు ఇస్తోంది. చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి భారతదేశాన్ని ఒక కేంద్రంగా మార్చగల కొత్త రాకెట్‌లను పరీక్షిస్తోంది. ఈ ఏడాది ప్రైవేట్ రంగ సమన్వయంతో ఇస్రో సరికొత్త రికార్డులను నమోదు చేసుకోనుంది.
క్వాంటం కమ్యూనికేషన్స్, కంప్యూటింగ్ రంగం
ఇక, ఇప్పుడు, ఇస్రో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో… క్వాంటం కమ్యూనికేషన్స్, కంప్యూటింగ్ రంగంలో మెరుగైన అభివృద్ధితో పాటు రాబోయే ఐదేళ్లలో ఇస్రో మరింత ముందుకు కొనసాగుతుందని అంతరిక్ష రంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వంటి కార్యక్రమాల ద్వారా శాస్త్రీయ పరిశోధన, అభివృద్ధికి ప్రభుత్వం బలమైన మద్దతును కొనసాగిస్తుందని అంతరిక్ష పరిశోధకులు ఆశిస్తున్నారు.
క్వాంటం టెక్నాలజీలు, గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్
ఇందులో కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీలు, గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్‌లో పరిశోధనలకు మెరుగైన ఆర్థిక మద్దతు ఉంటుందని అనుకుంటున్నారు. ఇక, వనరులు, విజ్ఞానం, సాంకేతికతను పంచుకోవడం వల్ల భారతీయ అంతరిక్ష సంస్థలు… ఇతర గ్లోబల్ స్పేస్ ఏజెన్సీల మధ్య సంబంధాలు బలపడతాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదనంగా, కొత్త FDI విధానాల ద్వారా ప్రారంభించిన అంతర్జాతీయ కంపెనీలతో భాగస్వామ్యాన్ని అన్వేషించడం ద్వారా భారతదేశానికి అధునాతన టెక్నాలజీలతో పాటు, అమలు పద్ధతులను తీసుకురావచ్చని అనుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే… 2025వ సంవత్సరమంతా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రోకు సూపర్ బిజీ ఇయర్ అనే అనుకోవాలి. అందుకే, ఇది హ్యాపీ ఇస్రో ఇయర్.