Jallikattu: జల్లికట్టు.. అంటే తమిళనాడు ప్రజలు ప్రాణం పెట్టేస్తారు. ఆ ఎద్దులతో జరిగిన యుద్ధంలో.. ప్రాణాలు పోతున్నా లెక్క చేయరు. తెలుగు నాట కోళ్ల పందేల కారణంగా నష్టపోయేవారుంటారు. సరిగ్గా అలాగే.. తమిళనాడులో జల్లికట్టు ద్వారా ప్రాణాలు కోల్పోయేవారుంటారు. అలాగని ఈ ప్రాణాంతక క్రీడను ఎంత మాత్రం కాదనే సాహసం చేయరిక్కడి వారు. గెలిస్తే వీరుడనీ.. ప్రాణం పోతే.. మహావీరుడని భావిస్తారు తప్పించి.. జల్లికట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదనే మాట అననే అనరు తమిళ ప్రజలు.
తెలుగునాట గోదావరి జిల్లాల్లోని కోడి పందేలు ఎంతటి ఫేమస్సో.. తమిళనాట జల్లికట్టు జరిగే ప్రాంతాలు ఎన్నో ఉన్నా.. మధురై జిల్లాలోని అంగనల్లూరు, పాలమేడు, అవనియ పురం జల్లి కట్టు పొంగల్ కే ప్రత్యేక ఆకర్షణగా.. మరెంతో ఉత్సాహభరితంగా.. ఇంకెంతో రోమాంచితంగా జరుగుతాయి. అత్యంత ఘనంగా ఇక్కడి పోటీలను నిర్వహిస్తారు నిర్వాహకులు.
భోగి- పొంగల్- కనుమ మూడు రోజుల పాటు ఇక్కడ జల్లికట్టు గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో బ్రాండెడ్ పోటీలు ఎలాగో.. తమిళనాడులో అందరి చూపు జల్లికట్టు వైపునకు మళ్లుతుంది. జల్లికట్టు ఎలా జరిగింది? గెలిచిన వారెవరు? వారికి ఎలాంటి బహుమతులు ఇస్తున్నారు అన్న వార్తలతో తమిళ మీడియా సైతం భారీగా ప్రచారం చేయడంతో.. తమిళనాడు మొత్తం ఫోకస్ చేస్తుంది. ఈ పోటీల ద్వారా తమ సంప్రదాయాన్ని నిలబెడుతున్నంత గర్వంగా ప్రతి ఒక్కరి గుండెలు ఉప్పొంగుతాయి. ఆంధ్రలో జరిగే కోడి పందేలు సంప్రదాయం ఎలాగో ఇక్కడి జల్లికట్టు సైతం అంతే సంప్రదాయం. ఇక్కడ గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయమేంటంటే.. ఇక్కడ కోడి పందేలు చట్ట విరుద్ధమైతే.. అక్కడి జల్లికట్టు ఎంత ప్రాణ నష్టం జరిగినా సరే ఆర్డినెన్స్ ద్వారా ఒక చట్టంగా మారడంతో.. అధికారులే దగ్గరుండి మరీ.. ఈ సంప్రదాయ క్రీడకు ఏర్పాట్లు చేస్తారు.
ఇక పోటీల్లో గెలిచేవారికి భారీ ఎత్తున నజరానాలు ప్రకటిస్తుంటారు. మధురై జిల్లాలో నడుస్తోన్న జల్లికట్టు లో గెలిచిన ఎద్దుకు 11 లక్షల విలువైన ట్రాక్టర్ ని ఇస్తున్నారు నిర్వాహకులు. అంతే కాదు.. ఈ పోటీల్లో పాల్గొన్న యువకులకు 8 లక్షల విలువైన కారుతో పాటు ఇతర బహుమతులను సైతం అందజేస్తారు. తొలిరోజైన మంగళవారం అవనియ పురం జల్లికట్టులో ఒకరు మరణించినట్టు ప్రకటించారు జిల్లా కలెక్టర్. అంతే కాదు 75 మంది గాయపడ్డారు కూడా. అయినా సరే ఇక్కడి జల్లికట్టు యధేచ్చగా సాగిపోతుంది.
Also Read: Daaku Maharaj Collections : బాక్సాఫీస్ వద్ద బాలయ్య తాండవం.. ఎన్ని కోట్లంటే..?
స్పెయిన్ లోని బుల్ ఫైట్ కి మల్లే.. తమిళనాడులో జరిగే జల్లికట్టుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎద్దులను మచ్చిక చేసుకుని లొంగదీసే ఆటగా ఇక్కడి వారు భావిస్తారు. జల్లికట్టులో ఎద్ధును కట్టడి చేయడం అంటూ ఉండదు. వాటికి హాని జరగాలని కూడా కోరుకోరు. పైపెచ్చు తమ ప్రాణాలు పోతున్నా.. వాటిపై ఎలాంటి ఆయుధాలను వాడ్డానికి వీల్లేదు. మరీ ముఖ్యంగా తమిళనాట పొంగల్ తర్వాతి రోజు కనుమ పండుగ నాడు ఎంతో ప్రత్యేకంగా ఈ జల్లికట్టు నిర్వహిస్తారు. మధురై కి దగ్గర్లోని అంగనల్లూరు పోటీలకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. ఈ ఆటను మంజు విరాట్టు అని కూడా అంటారు. మంజు విరాట్టు అంటే ఎద్దులను మచ్చిక చేసుకోవడం అనే అర్ధం.