Kadapa YCP Leaders: ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి వైసీపీ నేతలంతా సైలెంట్ అయిపోయారు. పార్టీ అధ్యక్షుడుపై అధికార పార్టీ మాటల దాడి చేస్తున్నా ఆయన సొంత జిల్లాలో మాత్రం ఆ పార్టీ నేతలు కనీసం మీడియా ముందుకు వచ్చి కౌంటర్ ఇవ్వకపోతుండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. కడప జిల్లా వైసీపీలో ఏంటి పార్టీ పరిస్థితి అని క్యాడర్ అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో.. నాయకులు కొన్ని మాసాల అజ్ఞాతం తర్వాత ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారట. వారు ఇప్పటికైనా యాక్టివ్ అవుతారా? అసలు వైసీపీ అధ్యక్షఉడు జగన్ సొంత జిల్లాలో ఏం జరుగుతోంది?
ఉమ్మడి కడప జిల్లా మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి కంచుకోట. పార్టీ ఏదైనా అంతా వైఎస్ కుటుంబం అనుచరులే ఈ జిల్లాలో శాసనసభ్యులుగా కొనసాగారు. నాటి వైయస్సార్ నుంచి నేటి జగన్ వరకు అదే పరిస్థితి కొనసాగింది. వైసీపీ ఏర్పాటు తర్వాత కూడా 2014 ఎన్నికల్లో 9 స్థానాలు, 2019 ఎన్నికల్లో 10 కి 10 స్థానాలతో క్లిన్ స్వీప్ చేసింది ఆ పార్టీ. అయితే 2024 ఎన్నికల్లో మూడంటే మూడు స్థానాల్లో గెలిచి చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా తయారైంది. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ నేతలు ఎవరు బయట కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.
గత కొన్ని మాసాలుగా కూటమి నేతలు మాటల దాడి చేస్తున్నా కనీసం కౌంటర్ ఇవ్వని పరిస్థితి ఏర్పడడంతో జగన్ జిల్లా పార్టీ అధ్యక్షుడ్ని మార్చారు. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కి పగ్గాలు ఇచ్చాక పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. గత అయిదేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలకు సంబంధించి జగన్‌పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకాలం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిన వారు మళ్ళీ యాక్టివ్ మోడ్ లోకి రావడం తో క్యాడర్లో కొంత ఉత్సాహం కనపడుతుందట.
కడప జిల్లాలో 2024 ఎన్నికల ముందు ఒక్కరంటే ఒక్క శాసనసభ్యుడు లేక దీన పరిస్థితి లో ఉన్న టిడిపికి గత ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహం నింపాయి.10 కి 7 స్థానాల్లో గెలిచిన టీడీపీ సొంత జిల్లాలో చేస్తున్న మాటల దాడిని ఎదుర్కోవడంలో వైసీపీ నేతలు ఫెయిల్యూర్ కావడం జగన్‌కు మింగుడు పడటం లేదంటున్నారు.. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఎదురు దాడి చేస్తున్నా అది ఏమాత్రం ప్రజల్లోకి ప్రభావం చూపించలేకపోతుందని జగన్ భావిస్తున్నారంట. ఆ క్రమంలో జగన్ ఆదేశాలతో మిగిలిన నియోజకవర్గాల్లో ఇప్పుడిప్పుడే నేతలు కూటమి నేతల ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు . అయితే జిల్లాలో అందరూ సీనియర్ నేతలే అయినప్పటికీ ఇప్పటికీ కొంత మంది మాత్రమే బయటకు వస్తుండటం జగన్‌కు మింగుడుపడటం లేదంట.
Also Read: వైసీపీ అడుగుజాడల్లో పోలీసులు.. చిత్తూరులో ఏం జరుగుతోంది?
మరో వైపు పులివెందుల నుంచి సతీష్ రెడ్డి, రాయచోటి నుంచి రమేష్ రెడ్డి కూటమి నేతల విమర్శలపై అంతో ఇంతో స్పందిస్తున్నారు. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు బయటికి రాకపోవడంతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారట. మొత్తమ్మీద కడప జిల్లాలో వైసీపీ పరిస్థితి చూస్తూ ఒకప్పుడు చక్రం తిప్పిన ఆ పార్టీ ఇప్పుడు చతికిల పడిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ మధ్య అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వం ఉద్యోగి పై జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనకు వచ్చి వెళ్లారు. ఆ పర్యటనలో పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.
కుటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులపై వైసీపీ నేతలు దాడి చేస్తే తాటతీస్తా, చర్మం వలుస్తా.. అవసరమైతే తన ఆఫీసు అన్నమయ్య జిల్లాలోని పెడతానని డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యారు. వైసీపీని 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా వారిలో అహంకారం చావలేదని.. ఫ్యాన్ పార్టీ నేతల్లో అది తగ్గే వరకూ వారిని వదలబోమంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఆ వ్యాఖ్యలను వైసీపీ నేతలు అస్త్రాలుగా మార్చుకుని పవన్ కళ్యాణ్ పైన, కూటమి ప్రభుత్వం పైన కడప జిల్లా వైసీపీ నేతలు మాటలతూటాలు పేలుస్తున్నారు. కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను మాత్రమే కూటమి నేతలు టార్గెట్ చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి ఘాటుగానే స్పందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏదేమైనా కొన్ని నెలలుగా సైలెంట్ అయిన అలాంటి వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. మరి జిల్లాలో మిగిలిన నేతలు ఎప్పటికి బయటకు వస్తారో చూడాలి.