Adilabad BJP: ఆదిలాబాద్ లోక్ సభ స్థానం బీజేపీ కైవసం చేసుకుంది. అక్కడ వరుసగా రెండుసార్లు గెలుస్తూ వస్తోంది. కానీ అక్కడ గెలిచిన ఎంపీల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటుదనేది ప్రస్తుతం నడుస్తున్న చర్చ… ఆదిలాబాద్ పార్లమెంట్ సిగ్మెంట్ నుంచి గెలిచిన ఎంపీకి పార్టీలో ప్రయార్టీ దక్కడం లేదా? …గత ఎన్నికల్లో అక్కడ నుంచి గెలిచిన గోడం నగేష్ కావాలనే పార్టీకి దూరంగా ఉంటున్నారా?.. అసలు ఆయన ఎందుకు పార్టీతో టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు?
ఎన్నికల ముందు బీజేపీలో చేరి ఎంపీగా గెలిచిన గోడం నగేష్
గోడం నగేష్ అదిలాబాద్ బీజేపీ ఎంపీ.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు అనూహ్యంగా బీజేపీలో చేరి టికెట్ దక్కించుకొని విజయం సాధించారు. అంతవరకు ఒకే.. కానీ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆయన ఎక్కడా కూడా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదంట. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదనేది పార్టీ నేతలు అంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో, సమావేశాల్లో యాక్టివ్‌గా లేరనే చర్చ సొంత జిల్లా నేతలతో పాటు, రాష్ట్ర నాయకత్వంలో కూడా జోరుగా సాగుతోందట. ఆయన పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు.. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను కూడా ఎందుకు చేయడం లేదన్నది చర్చనీయాంశంగా మారింది.
నగేష్‌కి ముందు బీజేపీ నుంచి గెలిచిన సోయం బాపురావు
గోడం నగేష్ కంటే ముందు ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన సోయం బాపురావు కూడా పార్టీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు. ప్రస్తుతం ఎంపీ గా కొనసాగుతున్న గోడం నగేష్ సైతం అదే ధోరణి కొనసాగిస్తున్నారట. గత పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావును కాదని, పార్టీ చివరి క్షణంలో గూడెం నగేష్‌కి టికెట్ ఇచ్చారు. గతంలో టీఆర్ఎస్ ఎంపీగా పనిచేసిన గోడం నగేష్ కు పార్టీలోకి తీసుకొని బీజేపీ టికెట్ ఇవ్వడంతో పెద్ద రచ్చే జరిగింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం టికెట్లు అమ్ముకుంటుందన్న ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ సోయo బాపురావు యాక్టివ్‌గా పార్టీలో పనిచేయడం లేదని, పార్టీ మారుతున్నారన్న నెపంతో ఆయనను తప్పించి బీఆర్ఎస్ నేత గోడం నగేష్‌కు టికెట్ ఇవ్వడంతో సోయం బాపురావ్ బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశాలకు అనుమతి ఇవ్వడం లేదనా?
అదలా ఉంటే గోడం నగేష్ కూడా పార్టీతో టచ్ మీ నాట్ ఆన్నట్లుగానే ఉంటున్నారట. తెలంగాణలో బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు గెలిస్తే… 7 మంది ఎంపీలు ఏదో సందర్భంలో పార్టీ కార్యక్రమంలో కనిపిస్తుంటారు. అధిష్టానం దృష్టిలో పడేందుకు హడావుడి చేస్తుంటారు . కానీ గోడం నగేష్ అందుకు భిన్నంగా ముందుకు అడుగులు వేస్తున్నారట. అందుకు కారణం ఆయనకు రాష్ట్ర నాయకత్వ తీరు నచ్చడం లేదట. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశాలకు అనుమతి ఇవ్వడం లేదనే ఆయన దూరంగా ఉంటున్నారంట. కనీసం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గోడం నగేష్ మాత్రం ఇప్పటి వరకు సొంతంగా ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవని నాయకులు అంటున్నారు.
నియోజకవర్గంలో సమస్యలపై స్పందించని గోడం నగేష్
నేతల మధ్య జరుగుతున్న అంతర్గత కలహాలు..కొత్త, పాత పంచాయతీలు … కేవలం ఒకే వర్గానికి వత్తాసు పలికే రాజకీయాలతో నగేష్ ఇబ్బందులు పడుతున్నారా? అనే చర్చ సాగుతుందట. ఏదో అడపా దడపా, తూతూ మంత్రంగా తప్పితే ఆయన పెద్దగా యాక్టివ్‌గా లేరనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది. పార్టీ కార్యక్రమాలు అటుంచితే కనీసం తన సొంత నియోజకవర్గంలో సమస్యలపై ఏనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాలు లేవని నేతలు అంటున్నారు. అటు పార్టీకి, ఇటు స్థానిక ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటున్న గోడం నగేష్ తీరుపై సొంత పార్టీ నాయకత్వంతో పాటు.. స్ధానిక ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
Also Read: ప్రకాశంలో వైసీపీకి దిక్కెవరు?
అదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలు
అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా గోడెం నగేష్ అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయట. సొంత పార్టీ నేతలకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గొడం నగేష్ పార్టీలో ఉన్నారా…లేరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ అసలు సైలెంట్ మోడ్ లో ఉండాల్సిన అవసరం ఎందుకొచ్చిందనేది సస్పెన్స్‌గా మారింది. మరి గోడం నాగేష్ యాక్టివ్ అయి ఆ సస్పెన్స్‌కు పార్టీ ఫుల్ స్టాప్ పెడుతారా? లేక పార్టీనే ఆయన్ని దూరం పెడుతుందో చూడాలి