Metro Pillar: సికింద్రాబాద్ ఇస్కాన్ దగ్గర మెట్రో పిల్లర్ల కింద భూమిని తోడేస్తుంటే నిద్రపోయిన అధికారులు బిగ్‌టీవీ కథనాలతో మొద్దు నిద్ర వీడారు. గుంతలను హడావుడిగా మట్టితో పూడ్చేసి కథ ముగిసిపోయిందని అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ గుంతల్లో పూడిపోయింది మట్టి మాత్రమే కాదు. అధికారుల బాధ్యతారాహిత్యం, పూడ్చిపెట్టిన నిజాలు. ఇస్కాన్ టెంపుల్ వద్ద C1192, C1193 పిల్లర్ల దగ్గర నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిగాయని ఒప్పుకున్న HMRL. అసలు తనిఖీలు చేసిందెవరో ఎందుకు బయటపెట్టడం లేదు? ప్రాణాలతో చెలగాటమాడే స్థాయిలో తవ్వకాలు జరుగుతుంటే… HMRL ఇన్స్పెక్టర్లు నిద్రపోతున్నారా.. లేక కళ్లు మూసుకొని సహకరించారా? టెక్నికల్ రిపోర్ట్‌పై సంతకం చేసిన ఆ చిన్న అధికారి ఎవరు? నిపుణుల కమిటీతో తనిఖీలు చేయించకుండా మైనర్ క్రాక్స్ అని ఎలా తేలుస్తారు?
పిల్లర్‌కు 4.5 మీటర్ల దూరంలో ఎలాంటి తవ్వకాలు జరపకూడదనేది నిబంధన. కానీ ఆ రూల్ ఈ పిల్లర్లకు వర్తించదంటూ HMRL చెబుతున్న విడ్డూరపు సమాధానం వెనుక అంతర్యమేంటి? అక్కడ అసలు ఉన్న రూల్ ఏంటి? ఎంత దూరంలో తవ్వకాలు జరపాలో అధికారులకైనా స్పష్టత ఉందా? మెట్రో యాక్ట్ 78, 79 సెక్షన్ల ప్రకారం పిల్లర్ల భద్రతకు విఘాతం కలిగిస్తే అది తీవ్రమైన క్రిమినల్ నేరం. మరి పార్కింగ్ లీజు పొందిన జెన్రీ సంస్థ డైరెక్టర్ రమణారెడ్డిపై ఇప్పటివరకు FIR ఎందుకు నమోదు చేయలేదు? బిగ్‌టీవీ ఇంపాక్ట్ తర్వాత కూడా నోటీసులు ఇవ్వడంలో అంత లేట్ ఎందుకు చేశారు? ఆ నోటీసుల ప్రతిని బయటకు రాకుండా ఎందుకు దాస్తున్నారు?
Also read: వైరల్‌గా మారిన కేరళ ఎమ్మెల్యే స్టోరీ.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!
జెన్రీ సంస్థ వెనుక, దాని డైరెక్టర్ రమణారెడ్డి వెనుక ఉన్న ఆ పెద్ద మనిషి ఎవరు? 2018లో లీజు తీసుకున్న జృతి’ సంస్థకు… ఇప్పుడు లీజు కొనసాగిస్తున్న జెన్రీ కంపెనీకి ఉన్న లింకులేంటి? ఈ సమాధానాలు బయటకు వస్తే తెరవెనుక జరిగిన బడా స్కామ్ కుట్ర కోణం మొత్తం బయటపడుతుంది. తవ్వకాలు జరిగిన రూట్‌లో అసలు మెట్రో స్పీడ్ తగ్గించారా? ప్రయాణికుల ప్రాణాల రక్షణ కోసం JNTU నిపుణులతో స్వతంత్ర ఆడిట్ చేయించే ధైర్యం HMRLకు ఉందా?
అంత వైలేషన్ జరిగింది అని ఒప్పుకున్నా… మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ మాత్రం నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది చిన్న విషయమని లైట్ తీసుకుంటున్నారా? లేక సదరు లీజు సంస్థకు తెరవెనుక ఎవరైనా కొమ్ముకాస్తున్నారా? తప్పు జరిగిందని తేలాక కూడా ఆ జెన్రీ సంస్థ పార్కింగ్ లీజు లైసెన్స్‌ను వెంటనే ఎందుకు రద్దు చేయడం లేదు? మెట్రో భద్రతపై ప్రజానుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మెట్రో ఎండీదే. ఈ దందాను బిగ్‌టీవీ వదిలేదే లేదు… బాధ్యుల ముసుగు తొలగే వరకు ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఖబర్దార్…!
Also read: అభిషేక్ శర్మ తండ్రికి ఘోర అవమానం..షాకింగ్ వీడియో వైరల్