పిట్ట కొంచెం.. కూత ఘనం!
ఖతర్నాక్ ఫైటర్ జెట్.. తేజస్
త్వరలోనే ఐఏఎఫ్‌లోని తేజస్ మార్క్-1ఏ
ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసేలా.. స్వదేశీ యుద్ధ విమానాల తయారీలో ఇండియా మరో ముందడుగు వేసింది. తేజస్ యుద్ధ విమానాల తయారీలో.. భారత్ ఇప్పటికే పురోగతి సాధించింది. తేజస్ కోసం డెవలప్ చేసిన టెక్నాలజీ.. లైట్, మీడియం, యూఏవీల వరకు విస్తరించింది. రాబోయే కొన్నేళ్లలో.. మన ఎయిర్‌ఫోర్స్ అవసరాలను తీర్చడమే కాదు.. మిత్ర దేశాలకు కూడా తేజస్ ఫైటర్ జెట్లను ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదగబోతోంది. అంతకంటే ముందు.. ఇదే సంవత్సరం.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత వైమానిక దళానికి.. 12 కొత్త తేజస్-ఎంకె1 యుద్ధ విమానాలను అందజేయనుంది.
ప్రైవేటు సెక్టార్ సాయంతో కీలక భాగాల ఉత్పత్తి
రెండేళ్ల గ్యాప్ తర్వాత.. అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ నుంచి ఇంజిన్ల డెలివరీ మొదలైంది. దాంతో.. రాబోయే రెండు నెలల్లోనే.. తేజస్ ఫైటర్ జెట్లు ఐఏఎఫ్ అమ్ములపొదిలో చేరనున్నాయి. 2028 నాటికి 83 తేజస్ మార్క్-1ఏ విమానాల ఆర్డర్లను పూర్తి చేయాలని.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. బెంగళూరు, నాసిక్‌లోని 3 ఉత్పత్తి లైన్లు.. ఏడాదికి 16 నుంచి 24 యుద్ధ విమానాలను తయారుచేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్ సహాయంతో.. తేజస్ ఎంకే-1ఏ కోసం రియర్ ఫ్యూజ్‌లెజ్ లాంటి కీలక భాగాల ఉత్పత్తి వేగవంతమైంది.
స్వదేశీ టెక్నాలజీతో తయారైన తేజస్ మార్క్-1ఏ
తేజస్ మార్క్-1ఏ.. స్వదేశీ టెక్నాలజీతో తయారైన లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌కి సంబంధించిన అడ్వాన్స్‌డ్ వేరియంట్. ఇది.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ డెవలప్ చేశాయి. ఈ ఫైటర్ జెట్.. అనేక ఫీచర్లు, సరికొత్త టెక్నాలజీతో తయారుచేశారు. ఆధునిక యుద్ధరంగంలో.. ఇదో సూపర్ ఫైటర్‌గా చెబుతున్నారు. ఇది.. సింగిల్ సీట్, సింగిల్ ఇంజిన్ కలిగిన మల్టీ రోల్ ఫైటర్ జెట్. ఇది.. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, ఎయిర్ టు సముద్రంపై ఉన్న టార్గెట్లను కూడా నాశనం చేస్తుంది. డాగ్ ఫైట్‌లు, బాంబు దాడులు, ఇతర కీలక మిషన్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఆత్మనిర్భర్ భారత్‌లో.. తేజస్ ఎంకే-1ఏ.. ఓ మైల్ స్టోన్‌గా చెప్పొచ్చు.
ఆధునిక రాడార్, సెన్సార్‌లు కమ్యూనికేషన్ సిస్టమ్
ఇది.. 60 శాతానికి పెగా స్వదేశీ టెక్నాలజీతో తయారైంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆధునిక అవసరాలను తీర్చేందుకు.. దీనిని డెవలప్ చేశారు. తేజస్.. లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్. దీని బరువు చాలా తక్కువగా ఉంటుంది. పదమూడున్నర టన్నుల టేకాఫ్ వెయిట్‌తో ఉంటుంది. చురుగ్గా, వేగంగా స్పందించడంతో పాటు అద్భుతమైన కెపాసిటీతో.. శత్రువులపై దాడి చేస్తుంది. మార్క్-1ఏలో అధునాతన అవియానిక్స్ సూట్ అమర్చారు. ఇందులో.. ఆధునిక రాడార్, సెన్సార్‌లు, కమ్యూనికేషన్ సిస్టమ్ కలిగి ఉంది. ఇవి.. యుద్ధ రంగంలో పైలట్‌కి అవసరమైన సమాచారాన్ని వేగంగా అందిస్తాయి. ఇది.. పూర్తి స్థాయి స్టెల్త్ ఫైటర్ జెట్ కాకపోయినా.. రాడార్ క్రాస్ సెక్షన్‌ని తగ్గించే టెక్నాలజీ ఇందులో ఉంది. ఇది.. శత్రు రాడార్‌లకు చిక్కకుండా ఉండే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
గంటకు 2200 కి.మీ.ల వేగంతో దూసుకెళ్లేలా ఇంజిన్
తేజస్ మార్క్-1ఏలో.. అమెరికా జనరల్ ఎలక్ట్రిక్ తయారుచేసిన.. టర్బో ఫ్యాన్ ఇంజిన్ ఉంది. ఇది.. అధునాతన ఫ్యాన్ డిజైన్, డిజిటల్ ఇంజన్ కంట్రోల్ సిస్టమ్ కలిగి ఉంది. ఈ ఇంజిన్.. గంటకు 2 వేల 200 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లేందుకు వీలు కల్పిస్తుంది. ఇందులో.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్టా సిస్టమ్స్ తయారుచేసిన రాడార్ ఉంది. ఇది.. మల్టిపుల్ టార్గెట్లను ఒకేసారి గుర్తించి.. ట్రాక్ చేస్తుంది. దీనికి.. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను గుర్తించగల సామర్థ్యం ఉంది. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ మిషన్లలో.. అత్యుత్తమ పనితీరు కనబరుస్తుంది.
డీఆర్డీవో డెవలప్ చేసిన ఇంటిగ్రేటెడ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్
ఈ రాడార్.. ఎలక్ట్రానిక్ జామింగ్‌కు వ్యతిరేకంగా బలమైన నిరోధకత కలిగి ఉంది. తేజస్‌లోని డిజిటల్ ఫ్లై బై వైర్.. విమానం చురుకుదనాన్ని, స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. పైలట్‌కు సులభమైన నియంత్రణ అందిస్తుంది. మల్టీ ఫంక్షన్ డిస్‌ప్లేలు, హెడ్ అప్ డిస్‌ప్లే, హెల్మెట్ మౌంటెడ్ డిస్‌ప్లే సిస్టమ్ అమర్చిన కాక్‌పిట్.. పైలట్‌కి.. రియల్ టైమ్ డేటాని, టార్గెట్ల సమాచారాన్ని అందిస్తుంది. ఇక.. డీఆర్డీవో డెవలప్ చేసిన.. ఇంటిగ్రేటెడ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్.. రియల్ టైమ్ ఆక్సిజన్‌ని ఉత్పత్తి చేస్తుంది. 50 వేల అడుగుల ఎత్తు వరకు వెళ్లినా.. పైలట్ సేఫ్‌గా ఉంటారు.
భూమిపై టార్గెట్ల కోసం గైడెడ్ మిస్సైల్, బ్రహ్మోస్ లైట్ వెర్షన్
తేజస్ మార్క్-1ఏలో.. 23ఎంఎం ట్విన్ బ్యారెల్ కానన్ గన్ ఉంటుంది. ఇది.. క్లోజ్ రేంజ్ యుద్ధాల్లో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో.. ఎయిర్ టు ఎయిర్ టార్గెట్ల కోసం.. వంద కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఆస్ట్రా ఎంకే-1 మిసైల్‌ని వినియోగించొచ్చు. ఎయిర్ టు సర్ఫేస్ కోసం.. గైడెడ్ మిసైల్, బ్రహ్మోస్ లైట్ వెర్షన్ మిసైళ్లని కూడా ఫైర్ చేయొచ్చు. యాంటీ షిప్ మిషన్ల కోసం.. హర్పూన్ గానీ, స్వదేశీ మిసైళ్లని గానీ ప్రయోగించొచ్చు. ఇక.. లేజర్ గైడెడ్ బాంబులు, క్లస్టర్ బాంబులు, స్మార్ట్ బాంబులు దీని ద్వారా ప్రయోగించొచ్చు. 4 వేల కిలోల వరకు ఆయుధాలను మోసుకెళ్లే కెపాసిటీ తేజస్ ఎంకే-1ఏకి ఉంది. శత్రు రాడార్లను జామ్ చేసేందుకు.. ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ సిస్టమ్ ఉన్నాయి.
మిసైల్ లని గుర్తించేందుకు మిసైల్ అప్రోజ్ వార్నింగ్ సిస్టమ్
శత్రు మిసైల్ లాక్‌లని గుర్తించి పైలట్‌ని హెచ్చరించేందుకు.. రాడార్ వార్నింగ్ రిసీవర్ కూడా ఉంటుంది. దాడి చేసే మిసైల్‌లని గుర్తించేందుకు.. మిసైల్ అప్రోజ్ వార్నింగ్ సిస్టమ్ ఉంది. తేజస్ కాంబాట్ రేంజ్.. 550 కిలోమీటర్లు ఉంటుందని చెబుతున్నారు. తేజస్ ఎంకే-1ఏ.. ఐఏఎఫ్ ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచనుంది. మాడ్యులర్ డిజైన్ కారణంగా.. అప్‌గ్రేడ్‌లు, సర్వీసింగ్ ఈజీగా చేయొచ్చు. దీనిని టేకాఫ్ చేసేందుకు పెద్ద రన్ వే కూడా అవసరం లేదు. చిన్న రన్ వేల నుంచి టేకాఫ్, ల్యాండింగ్ చేయగలదు. ఇది.. లద్దాఖ్ లాంటి అధిక ఎత్తుగల ప్రాంతాల్లో ఉపయోగకరంగా ఉంటుంది.
ఆపరేషన్ సిందూర్‌లో.. తేజస్ ఫైటర్ జెట్లు చూపిన మార్క్ ఏంటి?
ఓ వైపు చైనా.. మరోవైపు పాకిస్తాన్. ఈ రెండు శత్రు దేశాల నుంచి భారత్ ముప్పును ఎదుర్కొంటోంది. దాంతో.. ఎయిర్‌ఫోర్స్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు.. తేలికపాటి యుద్ధ విమానాలైన తేజస్‌ని కొనుగోలు చేస్తోంది ఐఏఎఫ్. తేజస్ ఎంకే-1ఏతో.. ఇప్పుడు యుద్ధ విమానాల్లో వేటిని రీప్లేస్ చేయనున్నారు? ఆపరేషన్ సిందూర్‌లో.. తేజస్ ఫైటర్ జెట్లు చూపిన మార్క్ ఏంటి? తేజస్ ఎంట్రీతో.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎలా మారిపోతుంది?
ఆపరేషన్ సిందూర్ లో తేజస్ యుద్ధ విమానాలు
ఆపరేషన్ సిందూర్‌లో.. పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసినప్పుడు.. తేజస్ యుద్ధ విమానాలు ఫ్రంట్ లైనర్లుగా ఉన్నాయ్. వీటిని.. బాంబు దాడుల కోసం తొలిసారి వినియోగించారు. ఈ ఆపరేషన్‌లో.. సుఖోయ్-30, మిగ్-29 లాంటి విమానాలతో పాటు తేజస్ కూడా కీలకపాత్ర పోషించింది. అయితే.. తేజస్ యుద్ధ విమానాలకు అప్‌గ్రేడెడ్ వెర్షనే.. తేజస్ మార్క్-1ఏ. వీటి డెలివరీలపై ఆమధ్య ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్.. ఏపీ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2009లో ఆర్డర్ చేసిన 40 తేజస్ మార్క్ 1 విమానాల్లో.. 38 మాత్రమే డెలివరీ అయ్యాయ్. 2021లో ఆర్డర్ చేసిన 83 తేజస్ ఎంకే-1ఏ విమానాల డెలివరీ.. ఈ ఏడాది చివరి నుంచి మొదలుకానుంది.
కొన్నేళ్లలో ఐఏఎఫ్ లోక్ 300 తేజస్ మార్క్ 1ఏ జెట్స్
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.. 2031 నాటికి.. 180 తేజస్ మార్క్ 1ఏ విమానాలను డెలివరీ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. తేజస్ మార్క్-2 మరింత అడ్వాన్స్‌డ్ వేరియంట్. 2026లో.. తేజస్ మార్క్-2 తొలి విమానం డెలవరీ కానుంది. వీటితో పాటు అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్‌ల ఉత్పత్తి.. 2030లో ప్రారంభం కానుంది. అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ సంస్థతో.. జీఈ-414 ఇంజిన్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ కోసం చర్చ కొనసాగుతున్నాయి. ఇది.. భవిష్యత్ తేజస్ వేరియంట్ల ఉత్పత్తిలో కీలకం కానుంది. రాబోయే కొన్నేళ్లలో 300 తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో చేరనున్నాయి.
రక్షణ బడ్జెట్ మరో రూ.50 వేల కోట్లు పెంచే అవకాశం
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నందువల్ల.. రక్షణ బడ్జెట్ మరో 50 వేల కోట్లు పెంచే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశ సరిహద్దులను మరింత శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు.. భారత్ తేజస్ యుద్ధ విమానాల ఉత్పత్తిపై ఫోకస్ పెంచింది. ఇప్పటికే.. కాలం చెల్లిన మిగ్-21 యుద్ధ విమానాల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. స్వదేశీ ఏరోస్పేస్ పరిశ్రమకు ఊతమిచ్చేలా.. మిగ్ 21 ఫైటర్ జెట్ల ఫ్లీట్ స్థానంలో.. తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని ఐఏఎఫ్ నిర్ణయం తీసుకుంది.
తేజస్ మార్క్ 1ఏ డెలవరీల తర్వాత మిగ్-21 కు వీడ్కోలు
తేజస్ మార్క్-1ఏ.. ఆధునిక ఫోర్త్ జనరేషన్ ఫైటర్ జెట్. ఇందులో.. స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ రాడార్, బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్, ఆధునిక ఎలక్ట్రాన్ వార్‌ఫేర్ సూట్, ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. తగ్గిపోతున్న ఫైటర్ ఎయిర్‌జెట్ల స్క్వాడ్రన్ల సంఖ్యను.. భారీగా పెంచేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రయత్నిస్తోంది. ఇప్పుడున్న వాటిలో పాత మిగ్-21 బైసన్ స్క్వాడ్రన్‌లు ఉన్నాయి. తేజస్ మార్క్-1ఏ డెలివరీల తర్వాత.. వాటికి వీడ్కోలు పలకనున్నారు.
హెచ్ఏఎల్ దగ్గర రూ.1.89 లక్షల కోట్ల ఆర్డర్లు బుక్
ఈ ఏప్రిల్ నాటికే.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దగ్గర.. లక్షా 89 వేల కోట్ల ఆర్డర్లు బుక్ అయి ఉన్నాయి. గత సంవత్సరం 94 వేల కోట్లుగా ఉంది. ఆర్డర్ ఇన్‌ఫ్లో పైప్‌లైన్‌లో.. 97 తేజస్ ఎంకే-1ఏ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కోసం 143 ALH, ఇండియన్ నేవీ కోసం 10 డోర్నియర్‌లు ఉన్నాయి. తేజస్ మార్క్ 1ఏ కోసం.. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.. బెంగళూరు, నాసిక్‌లో ఒక్కొక్కటి చొప్పున రెండింటి తయారీకి ప్రణాళికలు సిద్ధం చేశారు. మార్క్-2, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ కింద జనరల్ ఎలక్ట్రిక్.. ఎఫ్414 ఇంజిన్ తయారీ, ఐఎంఆర్‌హెచ్ ప్రోగ్రామ్ లాంటి కొత్త ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి.. పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. విమానాలు, హెలికాప్టర్ల తయారీ సామర్థ్యాలను పెంచే పనిలో.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఉంది. నాసిక్ కర్మాగారంలో సామర్థ్యాన్ని పెంచడం వల్ల.. తేజస్, హెచ్‌టీటీ-40, హెలికాప్టర్ల వంటి స్వదేశీ ప్లాట్ ఫారమ్‌ల డెలివరీలకు సహాయపడుతుంది.
బ్రెజిల్, అర్జెంటీనా, ఆగ్నేయాసియా దేశాలకు విక్రయించే ప్లాన్
భారత్ తేజస్ యుద్ధ విమానాలను.. బ్రెజిల్, అర్జెంటీనా, ఆగ్నేయాసియా దేశాలకు విక్రయించే ఆలోచనలో ఉంది. ఒక్కో యూనిట్‌కు 40 నుంచి 50 మిలియన్ డాలర్ల వరకు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. తేజస్ ఫైటర్ జెట్.. ఎక్కువ దూరం ప్రయాణించడమే కాదు. ఎక్కువ ఆయుధాలను కూడా మోసుగెళ్లగలదు. ఈ ఫీచర్లు.. మార్కెట్‌లో తేజస్‌పైకి అటెన్షన్ మళ్లేలా చేశాయ్. ఇందులోని.. ఓపెన్ ఆర్కిటెక్చర్ సాఫ్ట్ వేర్.. భవిష్యత్ ఆయుధాలు, సెన్సార్‌ల ఇంటిగ్రేషన్‌ని సులభతరం చేస్తుంది.
తేజస్ నిర్వహణ, ఆపరేషనల్ ఖర్చులు చాలా తక్కువ
మిగ్ 29, సుఖోయ్-30 లాంటి భారీ యుద్ధ విమానాలతో పోలిస్తే.. తేజస్ నిర్వహణ, ఆపరేషనల్ ఖర్చులు చాలా తక్కువ. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్‌లో.. తేజస్ ఫైటర్ జెట్ తన సామర్థ్యం ఏమిటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. అయితే.. వీటి ఉత్పత్తిలో ఆలస్యం సవాల్‌గా మారినప్పటికీ.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డీఆర్డీవో టెక్నాలజీ, ఇంజిన్ డెలివరీలు, ప్రైవేట్ సెక్టార్ సహకారం, అధునాతన సిస్టమ్‌ల ఇంటిగ్రేషన్‌తో.. ఉత్పత్తి వేగవంతం కానుంది.