విజయవాడ పశ్చిమ వైసీపీలో నాయకత్వ లేమి.. ఆ పార్టీ శ్రేణుల్ని ఆందోళనకు గురిచేస్తుందట. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ పశ్చిమలో రెండుసార్లు వైసీపీ జెండా ఎగరవేసినా.. ప్రస్తుతానికి నడిపించే నాయకుడు లేక…ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొందట. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవడం.. రెండు పర్యాయాలుగా జరిగిన ఎన్నికలో వచ్చిన ఫలితాలకు భిన్నంగా బెజవాడ పశ్చిమ నియోజకవర్గంలో రిజల్ట్ రావంటో ఆ పార్టీ భవితవ్యంపై చర్చ జోరుగా సాగుతోందట.
నియోజకవర్గానికి వైసీపీకి కంచుకోటగా భావిస్తున్న వేళ.. నియోజకవర్గంలో అతి సామాన్యుడిని నిలబెట్టినా సీటు కైవసం చేసుకుంటామని భావించిన వైసీపీకి.. చివరకు నిరాశే మిగిలింది. దీంతో ఎన్నికల తర్వాత అయినా పార్టీకి పునర్వైభవం వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్న వేళ.. నడిపించే నాయకుడు లేక.. నువు లేక అనాథలం అన్నట్లుగా పరిస్థితి మారిందనే టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో వైసీపీ నేతలను ఏకధాటిపైకి తెచ్చే నాయకుడు ఎవరూ లేరని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయట.
విజయవాడ పశ్చిమ వైసీపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శరవేగంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. పార్టీని భుజాన వేసుకుని నడిపించే నాయకుడు లేకపోవడంతో.. నియోజకవర్గంలోని కీలక నేతలు కూటమి పంచన చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఇప్పటికే వైసీపీకి చెందిన ఎనిమిది మంది కార్పొరేటర్లు స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరితో భేటీ కావడం పశ్చిమ వైసీపీను.. ఓ కుదుపు కుదిపింది. దీంతో ఆ ఎనిమిదిమందిని బుజ్జగించి.. పార్టీని భుజాన వేసుకునే స్థాయి నేత లేరంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా వ్యవహారం మారిందని.. ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో తెలియటం లేదని శ్రేణుల్లో చర్చ సాగుతోందట. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గాలి బలంగా వీచినా.. పశ్చిమ నియోజకవర్గ నుంచి అప్పటి వైసీపీ అభ్యర్థికి బరిలోకి దిగిన జలీల్ ఖాన్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో బరిలో దిగిన వెల్లంపల్లి శ్రీనివాస్ విన్ అయ్యారు. 2024లో మాత్రం.. రెండు పర్యాయాలుగా జరిగిన ఎన్నికలకు భిన్నంగా.. 47 వేల మెజారిటీతో కూటమి అభ్యర్థి సుజనా చౌదరి విజయం సాధించారు. దీంతో ఎన్నడూ లేని విధంగా.. ఎప్పుడూ చూడని విధంగా బెజవాడ పశ్చిమాన ఫలితాలు తారుమారవడంతో.. ఫ్యాన్ పార్టీ భవిష్యత్.. ఆ పార్టీ నేతల్లో ఆందోళనకు గురి చేస్తోందట.
Also Read: జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ
ఇదంతా ఒక ఎత్తు అయితే.. పశ్చిమ వైసీపీకి నాయకుడు ఎవరనేది పార్టీ నేతలను వేధిస్తున్న ప్రశ్నగా మారింది. ఒకవైపు పార్టీ ఫిరాయింపులు.. మరోవైపు కేసుల భయంతో వైసీపీ నేతలంతా.. అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొందట. ప్రస్తుతం నియోజవర్గంలో అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆసిఫ్, మేయర్ రాయన బాగ్యలక్ష్మి, ఎన్నికల ముందు జనసేన నుంచి వైసీపీలోకి వచ్చిన పోతిన మహేష్.. కీలకంగా ఉన్నారు.
ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి ఇక్కడకు వస్తారా లేదా అనే చర్చ జోరుగా సాగుతోందట. నియోజకవర్గంలో అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఇద్దరూ సౌమ్యులుగా పేరు తెచ్చుకున్నారట. పశ్చిమలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరూ పార్టీ బాధ్యతను భుజాన వేసుకొని నడిపించే అవకాశం లేదని సొంతపార్టీలోనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయట.
ఎన్నికల ముందు వైసీపీ గూటికి చేరిన పోతిన మహేశ్.. తనకు పార్టీలో ఏ బాధ్యతలు లేవు కాబట్టి పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే.. స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని అధిష్టానానికి సంకేతాలు పంపించారు. రాష్ట్ర నడిబొడ్డున.. అందునా రాజధానికి కేంద్రంగా వైసీపీకి కంచుకోటగా ఉన్న నేపథ్యంలో ఆ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే ఉత్కంఠ నెలకొంది. 19 కార్పొరేటర్లు గెలిచిన చోట.. వైసిపీని గాడిలో పెట్టాలంటే కూటమిలో ఉన్న మూడు పార్టీలను ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడు కావాలని శ్రేణులు కోరుకుంటున్నారట. నియోజకవర్గంలోని అటు మైనారిటీలు.. ఇటు బీసీలను కలుపుకుని వెళ్లడం సహా కూటమి పార్టీ వ్యూహాలకు చెక్ పెట్టే వారిని నియమించాలనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పార్టీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే చర్చ జోరుగా సాగుతోంది.
ఏదేమైనా.. బెజవాడ పశ్చిమ వైసీపీలో ప్రస్తుతం నిస్తేజం నెలకొందనే టాక్ నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో బీజేపీ.. పాగా వేయడం.. వైసీపీకీ తలనొప్పిగా మారిందట. మూడు పార్టీల వ్యూహాలను ఎదుర్కోవాలన్నా.. క్యాడర్‌ను సరైన రీతిలో నడిపించాలన్నా.. గట్స్ ఉన్న నేతకే అవకాశం ఇవ్వాలని వైసీపీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. నాడు పార్టీకి కంచుకోటగా ఉన్న చోట.. పునర్ వైభవం తెచ్చేందుకు జగన్ అండ్ కో.. ఏ రకంగా అడుగులు వేస్తుందో వేచి చూడాలి.