BigTV English

Ind Pak War History: 14 సార్లు యుద్దం.. పాక్ ఎంత చిత్తుగా ఓడిందంటే..

Ind Pak War History: 14 సార్లు యుద్దం.. పాక్ ఎంత చిత్తుగా ఓడిందంటే..

Ind Pak War History: భారత్ వర్సెస్ పాక్.. యుద్దాలు కావచ్చు వివాదాలు కావచ్చూ.. ఇప్పటి వరకూ 13 సార్లు సంభవించగా.. ఇది 14వ సారి అవుతుంది. ఇంతకీ భారత్ పాక్ మధ్య ఇప్పటి వరకూ జరిగిన సంఘర్షణలేవి? వాటి వివరాలు ఎలాంటివి? భారత్ పాక్ మధ్య వార్ కండీషన్ ఒక డీఫాల్ట్ ప్రోగ్రాంగా మారిన పరిస్థితులు ఏంటి వాటి డీటైల్స్ ఏవి?
భారత్ వర్సెస్ పాక్
1947 నుంచి 2025 వరకూ
ఎన్నో సంఘర్షణలు, యుద్ధాలు
విపరీతమైన రక్త స్రావం, ప్రాణనష్టం
ఈ దాయాది పోరు ఆగే దారేది?


1947లో బ్రిటీష్ ఇండియా విభజన తర్వాత భారత్ పాక్ వేరుపడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ రెండు దేశాల మధ్య జరిగిన సంఘర్షణలు, యుద్ధాలు, సైనిక ఉద్రిక్తతలు ఎన్నో జరిగాయి. నాటి నుంచి నేటి వరకూ ఈ ఘర్షణాత్మక వాతావరణం.. ఇరు దేశాల ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. 1971లో జరిగిన ఇండో- పాక్ వార్ మినహా, కాశ్మీర్ సీమాంతర ఉగ్రవాదంపై ఈ రెండు దేశాల మధ్య సుదీర్ఘ వివాదం నడుస్తూనే ఉంది. ఇదే అతి పెద్ద సమస్యగా కనిపిస్తోంది.

1947- 48 ఇండో పాక్ వార్..


1947- 48 మధ్య కాలంలో స్వాతంత్రం పొందిన దేశాలేంటని చూస్తే అవి భారత్, పాక్, శ్రీలంక, బర్మా. 1947 లో ప్రకటించిన స్వాతంత్రం విభజనతో మొదలైంది. పాకిస్థాన్, హిందుస్థాన్ అంటూ రెండుగా విడిపోయింది భారత్. భారత్ లో హిందువులు, పాకిస్థాన్ లో ముస్లిములు ఉండాలని కోరుకున్న వారున్నారు కానీ.. మూడింట ఒక వంతు ముస్లిములు ఇక్కడే ఉండి పోయారు. హిందూ- ముస్లిం- సిక్కుల మధ్య జరిగిన మత ఘర్షణల కారణంగా లక్షలాది మంది ప్రాణ నష్టం సంభవించింది. మిలియన్ల కొద్దీ.. నిరాశ్రయులయ్యారు. సంస్థానాలకు భారత్ లేదా పాకిస్థాన్ లో విలీనమయ్యేలా విలీన ఒప్పందం తెచ్చారు.

జమ్మూకాశ్మీర్ ని పాలించిన రాజా హరిసింగ్

1947- 48 ఇండో పాక్ యుద్ధం.. దీన్నే మొదటి కాశ్మీర్ యుద్ధమని కూడా పిలుస్తారు. ఇది 1947 అక్టోబర్‌లో ప్రారంభమైంది. జమ్మూ- కాశ్మీర్ రాజు భారత్ లో విలీనమవుతారనే ఆలోచన కొద్దీ.. పాక్ లో ఆందోళన మొదలైంది. అయితే భారత్- పాక్ ఏ దేశాల్లో చేరాలన్న విషయంలో ఆయా సంస్థానాలకు ఒక స్వేచ్ఛనిచ్చారు. రాచరిక రాజ్యాల్లో అతి పెద్దదైన జమ్మూ- కాశ్మీర్ ని రాజా హరిసింగ్ పాలించారు. అయితే పాక్ సైన్యం ఇచ్చే మద్ధతుతో గిరిజన ఇస్లామిక్ దళాలు.. కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేసి ఆక్రమించాయి. సైనిక సాయం పొందడానికి రాజా హరిసింగ్ భారత ఆధిపత్యంలోకి వచ్చే ఒప్పందంపై సంతకాలు చేశారు. 1948 ఏప్రిల్ 22న ఐక్యరాజ్య సమితి.. తీర్మానాన్ని ఆమోదించింది. అందుకే ఏప్రిల్ 22లోనే ఉగ్రవాదులు పహెల్గాం దాడులు చేయడానికి ఒక కారణంగా మనం భావించవచ్చు.

1949 జనవరి 1, 11. 59గం. కు కాల్పుల విరమణ

అయితే నియంత్రణ రేఖగా పిలిచే.. LOC వెంట సరిహద్దులు క్రమంగా బలపడ్డాయి. 1949 జనవరి 1 అర్ధరాత్రి 11 గంటల 59 సెకన్ల సమయానికి.. అధికారికంగా కాల్పుల విరమణ ప్రకటించారు. కాశ్మీర్ లో మూడింట రెండు వంతుల మేర అంటే కాశ్మీర్ లోయ, జమ్మూ, లడఖ్ భారత నియంత్రణలోకి వచ్చాయి. మిగిలిన ఒక వంతు అంటే, ఆజాదీ కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్థాన్ ను పాకిస్థాన్ పొందింది. పాకిస్థాన్ లో ఉన్న ప్రాంతాలను సమిష్టి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత పాకిస్థాన్ అని రెండు రకాలుగా పిలుస్తారు.

1965లో భారత్- పాక్ మధ్య మరో యుద్ధం

ఇదిలా ఉంటే 1965లో మరో యుద్ధం వచ్చిందీ రెండు దేశాల మధ్య. జమ్మూ కాశ్మీర్ లోకి సైన్యాన్ని చొక్చుకు వెళ్లేలా చేసి.. తిరుగుబాటును ప్రేరేపించింది పాకిస్థాన్. ఆపరేషన్ జిబ్రాల్టర్ తర్వాత ఈ యుద్ధం ప్రారంభమైంది. పశ్చిమ పాకిస్థాన్ పై పూర్తి స్థాయి సైనిక దాడి ప్రారంభించింది భారత్. పాక్ పై తన ప్రతీకారం తీర్చుకుంది. పదిహేడు రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో రెండు వైపులా ప్రాణనష్టం సంభవించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ఈ యుద్ధం.. అతి పెద్ద సాయుధ యుద్ధంగా ఈ ప్రపంచమంతా చూసింది. సోవియట్ యూనియన్, యూఎస్ దౌత్య జోక్యం తర్వాత కాల్పుల విరమణ ప్రకటించారు. తాష్కెంట్ డిక్లరేషన్ తర్వాత.. రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడింది. ఈ యుద్ధంలోనూ భారత్ పాక్ పై పై చేయి సాధించింది.

కాశ్మీర్ తో సంబంధం లేని 1971 వార్

ఇక 1971 నాటి ఇండో- పాక్ యుద్ధ విషయానికి వస్తే.. ఇది కాశ్మీర్ తో సంబంధం లేని యుద్ధంగా చెప్పాలి. బంగ్లాదేశ లీడర్ ముజిబుర్ రెహమాన్, పాకిస్థాన్ లీడర్లు యాహ్యాఖాన్, భుట్టోల మధ్య ఏర్పడ్డ రాజకీయ యుద్ధం కారణంగా ఈ సంక్షోభం తలెత్తింది. ఇది పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర ప్రకటనతో ముగిసింది. ఆపరేషన్ సెర్చ్ లైట్ గా పిలిచే ఈ ఘర్షణ కారణంగా బంగ్లాలోని కోటి మంది బెంగాలీలు భారత్ కి రావల్సి వచ్చింది. ఈ యుద్ధంలోనే విశాఖ తీరంలో అనుమానాస్పద పరిస్థితుల్లో పాకిస్తాన్ జలాంతర్గామి ఘాజీ.. మునిగింది.

1972 సిమ్లా ఒప్పందంతో తిరిగి పాక్ కి అప్పగింత

అలాగని ఈ వివాదాలు ఇక్కడితో ఆగలేదు. పశ్చిమాన ఉన్న పాకిస్థాన్ లోని అనేక ప్రాంతాలపై దాడి చేసింది భారత్. కాశ్మీర్, పంజాబ్, సింధ్ వంటి ప్రాంతాల్లో భారత్ సుమారు ఆరు వేల చదరపు మైళ్లను స్వాధీనం చేసుకుంది. అయితే 1972 నాటి సిమ్లా ఒప్పందంలో భాగంగా తిరిగి పాకిస్థాన్ కి ఇచ్చేసింది భారత్. రెండు వారాల పోరాటంలో.. బంగ్లాదేశ్ లోని పాక్ దళాలు.. భారత్- బంగ్లా ఉమ్మడి కమాండ్ కి లొంగిపోయాయి. దీతో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఒక పాక్ రచయిత మాటలను బట్టీ చూస్తే ఈ యుద్ధం కారణంగా పాక్ తన నావికా దళంలోని సగం, వైమానిక దళంలోని పావు వంతు తన సైన్యంలోని మూడో వంతు కోల్పోయింది.

1999లో భారత్ భూభాగం కార్గిల్లోకి పాక్ సేనలు

ఇక కార్గిల్ యుద్ధ విషయానికి వస్తే.. 1999 తొలి నాళ్లలో పాకిస్థాన్ సేనలు.. LOC దాటి భారత భూభాగాన్ని ఆక్రమించాయి. కార్గిల్ జిల్లాలోకి చొరబడ్డాయి. పాకిస్థాన్ చొరబాటు దారులను తిప్పి కొట్టడానికి భారత దేశం సైనిక దౌత్య దాడిని ప్రారంభించింది. ఈ సంఘర్షణ జరిగిన రెండు నెలల తర్వాత భారత్ కార్గిల్ ని దాదాపు స్వాధీనం చేసుకుంది. సుమారు 80 శాతం పర్వత ప్రాంతాలు భారత్ ఆధీనంలోకి తిరిగి వచ్చాయి.

4 వేల మంది సైనికులను పోగొట్టుకున్న పాక్

ఈ యుద్ధం ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో అన్న ఆందోళన కొద్దీ అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ సమాజం.. మిగిలిన భారత భూభాగాల నుంచి పాక్ తన సేనలను ఉపసంహరించుకోవాలని.. ఒత్తిడి పెంచింది. అప్పటికే బాగా చితికిపోయిన పాక్ ఈ యుద్ధం ద్వారా మరింతగా దిగజారింది. సుమారు 4 వేల మంది సైనికులను కోల్పోయింది. 1999 జూలై చివరి నాటికి కార్గిల్ ఉద్రిక్తతలు తగ్గిపోయాయి. ఈ యుద్ధం పాకిస్థాన్ కి అతి పెద్ద సైనిక ఓటమిలో ఒకటిగా నిలిచింది.

దీనంతటికీ కారణం పాక్ లో కలవాల్సిన కాశ్మీర్ భారత్ లో కలిసిందనే కసి క్రోధం

భారత్- పాక్ ఇదొక నిరంతర యుద్ధ వాతావరణం. ఏ క్షణాన ఈ రెండు దేశాలు విడివడ్డాయో.. ఏ ముహుర్తాన రాజా హరిసింగ్ భారత్ లో తమ సంస్థానాన్ని కలిపేలా ఒప్పందం కుదుర్చుకున్నారో.. ఆ నాటి నుంచి ఇరు దేశాల మధ్య వివాదం రాజుకుంటూనే ఉంది. కేవలం యుద్ధాలు మాత్రమే కాదు.. ఎన్నో సంఘర్షణలు సైతం చోటు చేసుకున్నాయి. దీనంతటికీ కారణం పాక్ లో కలవాల్సిన కాశ్మీర్ భారత్ లో కలిసిందనే కసి క్రోధం. కడుపుమంటలే. భారత్ పాక్ మధ్య చిన్న చిన్న విషయాలు కూడా పెను సంఘర్షణలకు దారి తీసేవి. గుండు సూది నుంచి అణుబాంబు వరకూ భారత్ పాక్ మధ్య చెలరేగిన వివాదాలు, సంఘర్షణలు ఎన్నో.

1965లో కచ్ సంఘర్షణ

పోఖ్రాన్ వంటి అణుపరీక్షల విషయంలోనూ వాదోపవాదాలు 1965లో కచ్ సంఘర్షణ. భారత్ పాక్ మధ్య జరిగిన మరో వివాదం. రాన్ ఆఫ్ కచ్ చుట్టూ ఇది కొనసాగింది. ఈ ప్రాంతంలో పాక్ సైన్యం ప్రారంభించిన సైనిక చర్యకు ఆపరేషన్ డెజర్ట్ హాక్ అనే కోడ్ నేమ్ పెట్టారు. ఈ సమయంలో రాన్ ఆఫ్ కచ్ దీర్ఘ కాలంగా భారత నియంత్రణలో ఉంది. సరిహద్దు విభజన కాలం నుంచి ఇది అపరిష్కృతంగానే ఉంది.

1984- 2003 సియాచిన్ ఘర్షణ

1984- 2003 మధ్య కాలం వరకూ సాగిన సియాచిన్ సంఘర్షణ మరొక రకమైనది. దీన్నే సియాచిన్ హిమానీనదం వివాదం లేదా, సియాచిన్ యుద్ధమని పిలుస్తారు. ఇది కాశ్మీర్ లోని వెయ్యి చదరపు మైళ్ల మేర ఉంటుంది. సియాచిన్ ప్రాంతం విషయంలో భారత్ పాక్ మధ్య సైనిక వివాదం చెలరేగింది. ఈ వివాదానికి ఆపరేషన్ మేఘ్ దూత్ గా నామకరణం చేశారు. భారత్ సియాచిన్ హిమానీ నదాలను విజయవంతంగా స్వాధీనం చేసుకోవడంతో ప్రారంభమైంది. 1987లో ఆపరేషన్ రాజీవ్ పేరుతోనూ కొనసాగింది. 2003లో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. కానీ రెండు వైపుల నుంచి ఈ ప్రాంతంలో భారీ సైనిక స్థావరాలు ఇప్పటికీ ఇక్కడున్నాయి.

కాశ్మీర్ ని భారత్ లో ఎక్కడ కలిపేస్తారో..

పాక్ అత్యుత్సాహం, విపరీతమైన ఆతృత కారణంగానే భారత్ పాక్ మధ్య వివాదం.. విభజన కాలం నుంచి నేటి వరకూ కొనసాగుతూనే ఉంది. హరిసింగ్ ని పాక్ ఆర్మీ సాయంతో ఇస్లామిక్ గిరిజన దళాలు.. గానీ ఇబ్బంది పెట్టకుండా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. హరిసింగ్ కాశ్మీర్ ని ఎక్కడ భారత్ లో కలిపేస్తారో అన్న ఆందోళన కొద్దీ పాక్.. తన సైన్యాన్ని కాశ్మీర్ వైపు మొహరించడం మొదలు పెట్టింది. ఆనాడు ఈ మంచుకొండల్లో రాజుకున్న అగ్గి.. నేటి వరకూ రగులుతూనే వస్తోంది.

1986-87 మధ్య కూడా.. యుద్ధ వాతావరణం

1986-87 మధ్య కూడా.. రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇరు పక్షాల మధ్య యుద్ధ భయాలను పెంచింది. 1999 లో కార్గిల్ యుద్ధం జరిగిన నెల తర్వాత అట్లాంటిక్ కాల్పులు జరిగాయి. కచ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో 16 మంది పాక్ సైనికులు చనిపోగా.. ఇది అంతర్జాతీయ న్యాయ స్థానం మెట్లు ఎక్కింది. అయితే ఈ వ్యవహారం తమ అధికార పరిధిలోనిది కాదంటూ ఈ కేసు కొట్టివేసింది ఐసీజే.

2001- 2002 మధ్య కాలంలోనూ వార్ అట్మాస్ఫియర్

2001- 2002 మధ్య కాలంలోనూ భారత్ పాక్ మధ్య వార్ అట్మాస్ఫియర్ ఏర్పడింది. డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడి.. పాకిస్థాన్ కేంద్రంగా నడిచే ఉగ్ర సంస్థలు లష్కరే, జైషే కారణమని ఆరోపించింది భారత్. ఈ వివాదం కూడా ఒకరకమైన ఉద్రిక్త వాతావరణాన్ని ఏర్పరిచింది.

2008 ముంబై దాడుల తర్వాత కూడా సేమ్ సీన్

2008 ముంబై దాడుల తర్వాత కూడా రెండు దేశాల మధ్య మరోమారు ప్రతిష్టంభన మొదలైంది. ఈ కాల్పుల మోత రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్తలను పెంచాయి. అప్పుడు కూడా ఇరు పక్షాలు వాదోపవాదాలు సాగించాయి. సరిహద్దుల వెంబడి సేనలను మొహరించాయి.

2011లోనూ భారత్ పాక్ మధ్య సంఘర్షణ

2011లోనూ భారత్ పాక్ మధ్య సంఘర్షణ చెలరేగింది. ఆగస్టు 30, సెప్టంబర్ 1 మధ్య కుప్వారా జిల్లా, నీలం లోయలో నియంత్రణ రేఖ వెంబడి ఇది జరిగింది. ఈ సైనిక సంఘర్షణలో ఐదుగురు భారతీయ సైనికుల, ముగ్గురు పాక్ సోల్జర్స్ మరణించారు.

2013లో మెంథార్ సెక్టార్లో మరో సంఘర్షణ

2013లో జమ్మూ కాశ్మీర్ మెంథార్ సెక్టార్లో మరో సంఘర్షణ సంభవించింది. ఈ ఘటనలో ఒక భారతీయ సైనికుడి తల నరికేసింది పాక్ సైనిక కాఠిన్యం. ఈ ఘటనలో భారత సైనికులు 12 మంది, పాక్ సేనలు 10 మంది చనిపోయారు.

2014- 15 ఆర్నియా సెక్టార్ లో.. ఘర్షణ

2014- 15 మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్ లోని ఆర్నియా సెక్టార్ లో.. పాక్ రేంజర్లు మన సైనికుడ్ని హతమార్చారు. అంతే కాదు ముగ్గురు ఇండియన్ ఆర్మీ సోల్జర్స్, నలుగురు కాశ్మీరీలను గాయపరిచారు.

2016- 18 లోనూ ఇరు దేశాల మధ్య సంఘర్షణలు

2016- 18 మధ్య కాలంలోనూ సరిహద్దు వెంబడి సంఘర్షణలు చెలరేగాయి. 2016 సెప్టెంబర్ 29న.. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ లపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతం కాగా.. పాక్ ఈ వాదాన్ని తిప్పి కొట్టింది. తరువాతి కాలంలోనూ భారత్- పాక్ మధ్య కాల్పులు కొనసాగాయి. దీని ఫలితంగా.. ఇరు వైపులా డజన్ల కొద్దీ సైనికులు, పౌరులు మరణించారు.

2019 ఫిబ్రవరి 14న జైషే ఆత్మాహుతి దాడి

2019లో భారత్ పాక్ మధ్య మరోమారు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 2019 ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషే మొహమ్మద్ ఆత్మాహుతి దాడి చేసింది. 12 రోజుల తర్వాత పాకిస్థాన్ లోని ఖైబర్ పంక్తుక్వాలోని జేషే శిబిరంపై వైమానిక దాడులు జరిగాయి. జైషేకి సంబంధించి ఎందరో టెర్రరిస్టులను తాము చంపామని భారత్ ప్రకటించగా.. అలాంటి నష్టమేదీ జరగలేదని వాదించింది పాక్.

1948, 1978, 1989, 2001.. భారత్ పాక్ మధ్య రకరకాల గొడవలు

ఇవే కావు.. 1948 కాలం నాటి నుంచి నేటి వరకూ బలూచిస్తాన్ తిరుగుబాటు, 1978 కాలం నాటి నుంచి ఆఫ్ఘన్ వివాదం, 1989 నుంచీ జమ్మూ కాశ్మీర్ తిరుగుబాట్లలోనూ భారత్- పాక్ మధ్య వివాదం చెలరేగింది. రష్యా ఆఫ్గన్ మధ్య జరిగిన యుద్ధాలు, 1989 నుంచి 2001 వరకూ సాగిన అంతర్యుద్ధాలతో సహా.. ఆఫ్గనిస్థాన్ యుద్ధాల సమయంలో.. భారత్- పాక్ చెరొక వైపున నిలిచి.. సంఘర్షించుకుంటూనే వచ్చాయి.

ఇరు దేశాల మధ్య అణు ఘర్షణలు

ఇలా ఇదొక నాన్ స్టాప్ సంఘర్షణల సమాహారం. 2006లో ఆఫ్గన్ ఉగ్రవాదంలో పాక్ పాత్ర ఉందని భారత్ ఆరోపిస్తే.. 2020లో ఆఫ్గన్ యుద్ధాన్ని ముగించడానికి జరిపే శాంతి చర్చలను భారత్ ఆపుతోందన్న విమర్శలు. 75 ఏళ్లుగా బలూచిస్తాన్ తన స్వేచ్ఛా పోరాటం చేస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్గన్ లో శిక్షణ పొందుతోంది. ఈ నిఘా ఆపరేషన్లో భారత గూఢాచారి కులభూషణ్ జాదవ్ ని అరెస్టు చేసింది పాకిస్థాన్.

2 బిలియన్ల మంది మరణించే ఛాన్స్- నేచర్ ఫుడ్ జర్నల్ అధ్యయనం

ఇరు దేశాల మధ్య అణు ఘర్షణలు సైతం జరిగాయి. 2022 ఆగస్ట్- నేచర్ ఫుడ్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. భారత్ పాక్ మధ్య అణుయుద్ధం అంటూ వస్తే.. 200 కోట్ల మంది వరకూ మరణించే అవకాశముంది. దీంతో పోఖ్రాన్ వంటి అణుపరీక్షల సమయంలో ఇరు దేశాల మధ్య వాదోప వాదాలు నడుస్తూనే వచ్చాయ్.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×