IPL Foreign Players| ఇండియా, పాకస్తాన్ యుద్ధం కారణంగా క్రికెట్ అభిమానులకు గట్టి షాక్ తగిలింది. యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ప్లేయర్ల భద్రత కారణంగా ఇండియా క్రికెట్ బోర్డ్ అయిన బిసిసిఐ ఐపిఎల్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. గత గురువారం.. చివరగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా భద్రతా కారణాల దృష్ట్యా అర్ధంతరంగా ఫ్లడ్ లైట్లు ఆపేసి మ్యాచ్ రద్దు చేశారు. మ్యాచ్ జరుగుతున్న ధర్మశాల నుంచి కేవలం 200 కిలోమీటర్ల దూరంలోని జమ్మూలో పాకిస్తాన్ మిసైల్స్ దాడులు చేయడం కారణంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే మ్యాచ్ నిలిపివేయాలని నిర్ణయించింది. స్టేడియంలో జనం, ప్లేయర్లను సురక్షితంగా బయటకు పంపేశారు. ఆ తరువాత ఈ అంశంపై బిసిసిఐ ఒక ప్రకటన చేసింది.
దేశం యుద్ధ పరిస్థితుల్లో ఉంటే ఐపిల్ టోర్నమెంట్ నిర్వహించడం సమంజసం కాదని తెలుపుతూ సిరీస్ నిరవధికంగా వాయిదా వేసింది. ఆ తరువాత శుక్రవారం మరో ప్రకటనలో ఐపిల్ 2025 సిరీస్ కేవలం వారం రోజుల పాటు నిలిపివేశామని తెలిపింది. యుద్ధ పరిస్థితులు సామాన్యం కాగానే తిరిగి టోర్నమెంట్ నిర్వహిస్తామని బిసిసిఐ తెలిపింది. అయితే భారత్ పాక్ యుద్దం ఈ నిర్ణీత వ్యవధిలో ఆగిపోయే సూచనలు కనిపించకపోవడంతో విదేశీ ప్లేయర్లు ఇక వారి స్వదేశాలకు పయనించేందుకు సిద్ధమయ్యారు. దీంతో టోర్నమెంట్ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.
గుడ్ న్యూస్ చెప్పిన బిసిసిఐ
విదేశీ ప్లేయర్లు తమ ఇళ్లకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో బిసిసిఐ అనూహ్యంగా వారికి శుభవార్త తెలిపింది. ఐపిఎల్ లోని అన్ని 10 టీమ్లకు నిర్దేశాలు జారీ చేసింది. టీమ్లలోని ప్లేయర్లందరూ , వారి సపోర్ట్ స్టాఫ్ సహా తిరిగి మ్యాచ్ లు ఆడేందుకు సిద్ధంగా ఉండాలని.. ఐపిఎల్ 2025 ఒక వారం రోజుల్లో తిరిగి ప్రారంభం కాబోతోందని తెలిపింది. అయితే ఏ తేదీన ఐపిఎల్ పున:ప్రారంభం జరుగుతుందో స్పష్టం చేయలేదు. భారత్ పాక్ ఉద్రిక్త పరిస్థితులు సద్దమణిగే పరిస్థితులు చూశాక బిసిసిఐ తగగిన సమయం నిర్ధారిస్తుందని జాతీయ మీడియా రిపోర్ట్.
Also Read: పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ.. PSL 2025 కు దుబాయ్ నో పర్మిషన్
ఐపిఎల్ ఇలా ఒక సీజన్ లో మధ్యలోనే నిలిచిపోవడం ఇదే తొలిసారి కాదు. 2021లో కూడా కరోనా లాక్ డౌన్ సమయంలో ఐపిఎల్ టోర్నమెంట్‌ని మధ్యలోనే ఆపేశారు. ఆ సమయంలో ప్లేయర్లందరూ బయో బబుల్స్, కోవిడ్ కేసులతో సతమతమయ్యారు. కానీ నాలుగు నెలల తరువాత దుబాయ్ లో తిరిగి ఐపిఎల్ 2021 ప్రారంభమైంది….
మరోవైపు ఐపిఎల్ లాగే పాకిస్తాన్ లో కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 నిరవధికంగా వాయిదా పడింది. ఆ తరువాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పిఎస్ఎల్ ని దుబాయ్ కు షిఫ్ట్ చేశారు. కానీ అక్కడ కూడా పిఎస్ఎల్ నిర్వహణకు స్టేడియం, తేదీలతో షెడ్యూల్ సమస్యలు తలెత్తాయి.