TTD Vedic University: కూటమి అధికారంలోకి వచ్చిన 16 నెలల తర్వాత గత ప్రభుత్వ తప్పిదాల ప్రక్షాళన పర్వానికి తెరలేపింది. ఇంతకాలం అనర్హులు యూనివర్సిటీ వీసీలుగా కొనసాగుతున్నారని కూటమి నేతలకు వరుసగా ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. అయితే తాజాగా జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో శ్రీవెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తిని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది .. అయితే అప్పడే వీసీ పీఠం కోసం గత పాలకుల అస్థాన జ్యోతిషులు కొంతమంది తమిళనాడు, కర్నాటకలోని పీఠాలను అడ్డం పెట్టుకుని రావడానికి ప్రయత్నిస్తుండటం చర్చనీయాంశంగా మారింది..
2006 సంవత్సరంలో టీటీడీ నిధులతో అలిపిరి సమీపంలో ఎస్వీ యూనివర్సిటి సమీపంలో 300 ఎకరాలలో శ్రీవెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటిని ప్రారంభించారు.19 కోర్సులతో 81 మంది అధ్యాపక బృందంతో మొదట్లో ప్రారంభించారు. అయితే వేదిక్ యూనివర్సిటి విషయంలో అప్పట్లో పెద్దగా ఎవ్వరు జోక్యం చేసుకోలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులోకి కూడా ప్రవేశించారు. అర్హత లేని వ్యక్తులకు అందలం ఎక్కించారనే విమర్శలు వచ్చాయి. నాటి టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి తమ అనుచరవర్గానికి చెందిన రాణీ సదాశివమూర్తిని అర్హతలు లేకపోయినా వీసీగా నియమించారనే విమర్శలు వెల్లువెత్తాయి.
యుజీసీ, టీటీడీ, దేవాదాయ శాఖ నిబంధనలు పక్కనపెట్టి మరీ రాణీ సదాశివమూర్తిని సంస్కృత యూనివర్సిటి నుంచి తీసుకొచ్చి వేదిక్ యూనివర్సిటీలో నియమించారు.. వేదిక్ యూనివర్సిటీ నిబంధనల ప్రకారం 62 ఏళ్లకు ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. అయితే 64 ఏళ్ల వయసులో ఉన్న రాణి సదాశివమూర్తిని 2022వ సంవత్సరం జూలైలో వేదిక్ యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ విభాగానికి డైరెక్టర్‌గా డెప్యుటేషన్ పై తీసుకురావడమే ధర్మారెడ్డి చేసిన అతి పెద్ద అక్రమం అంటున్నారు.
యూజీసీ నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయానికి ఇన్చార్జ్ వీసీగా నియమించాలంటే సంబంధిత వర్శిటీలో సీనియర్ ప్రొఫెసర్ అయి ఉండాలి. అలాకాకుండా వేరే సంస్థ నుంచి డిప్యూటేషన్ పై టీటీడీకి వచ్చిన రాణి సదాశివమూర్తికి 29-11-2022న వేదిక్ వర్శిటీ ఇన్చార్జి వీసీగా బాధ్యతలను ధర్మారెడ్డి కట్టిపెట్టడం రెండో అతిపెద్ద అక్రమమన్న విమర్శలు వెల్లువెత్తాయి.
యూజీసీ రెగ్యులేషన్స్-2018, పాయింట్ నెంబర్ 7.3లో వీసీ నియామకానికి స్పష్టమైన విధానాలను కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది. వీసీ నియామకానికి ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి.. కానీ ఇవ్వలేదు. సెర్చ్ కమిటీ నియామకం జరగాల్సి ఉన్నా జరగలేదు. వీసీ నియామకం సెర్చ్ కమిటీ సిఫార్సు మేరకు జరగాల్సి ఉన్నా నిబంధనలు పట్టించుకోలేదు. ఇక వీసీగా నియమితులయ్యే వారికి ప్రొఫెసర్‌గా 10 సంవత్సరాల అనుభవం ఉండాల్సి ఉన్నా అయిదేళ్ల అనుభవం కూడా లేని వ్యక్తికి వీసీ పదవి కట్టబెట్టారు.
రాణీ సదాశివమూర్తిని 10-10-2023న ధర్మారెడ్డి తన సొంత రాజ్యాంగం ప్రకారం వేదిక్ యూనివర్సిటీ ఫుల్ టైం వీసీగా నియమించుకున్నారు. నాటి అదనపు ఈఓ ధర్మారెడ్డి సిఫార్సు, ఒత్తిడి మేరకు గవర్నర్ వెలువరించిన ఉత్తర్వుల్లో రాణి సదాశివమూర్తి.. వైస్ ఛాన్సలర్‌గా ఎప్పటి వరకు కొనసాగుతారో కూడా స్పష్టంగా చెప్పలేదు. ఇలాంటి ఉత్తర్వులు భారతదేశంలో ఏ వీసీ నియామకంలో కూడా జరగలేదంటున్నారు..
వేదిక్ యూనివర్సిటీ వీసీగా నియమితులు కావాలంటే తప్పనిసరిగా వేదంలో డిగ్రీ, పీజీ పూర్తిచేసి ఉండాలి. ఆ అర్హత కూడా సదాశివమూర్తికి లేదు. అయినా నాటి ఈఓ ధర్మారెడ్డి, విశాఖ శారదా పీఠం స్వరూపానందగిరి తదితరుల పథకం మేరకు ఈ అక్రమ నియామకం జరిగిందంట. వేదిక్ యూనివర్సిటీ యాక్ట్, యూజీసీ యాక్ట్, రాష్ట్ర దేవాదాయ శాఖ యాక్ట్… ఏ రకంగా చూసిన రాణి సదాశివమూర్తి నియామకం పూర్తిస్థాయిలో చట్ట విరుద్ధం అంటున్నారు. నోటిఫికేషన్, సెర్చ్ కమిటీ, యూజీసీ అర్హతలు ఇవేవీ లేకుండా వీసీ నియామకం చేపట్టవద్దంటూ 09-09-2022న రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈవో ధర్మారెడ్డికి స్పష్టమైన లేఖ రాశారు. ఆ లేఖను సైతం ధర్మారెడ్డి తుంగలో తొక్కారు. మన రాష్ట్రంలో, దేశంలో ఎంతోమంది వేదిక్ స్కాలర్స్ ఉన్నప్పటికీ వీసీ నియామకం కోసం నోటిఫికేషన్ ఇవ్వకుండా.. నాటి ఈఓ ధర్మారెడ్డి ఈ అక్రమ నియామకాన్ని చేపట్టారు.
వేదిక్ యూనివర్సిటి వీసీ నియామకం వెనుక ఉన్న అక్రమాలన్నీ నాటి తిరుపతి జేఈఓలుకా కొనసాగిన ముగ్గురు అధికారులకు తెలిసినప్పటికి వారు అడ్డుకోలేక పోయారు..అయితే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాణీ సదాశివామూర్తి నియామకం అక్రమమని పలుమార్లు ఇవో చైర్మన్ కు ఫిర్యాదు చేసారు..అయితే ఎవ్వరూ పట్టించుకోలేదు..చివరకు ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాల సమర్పణకు వచ్చిన చంద్రబాబు నాయుడు, లోకేష్ దృష్టికి ఆ అంశాన్ని వేదిక్ యూనివర్సిటి సిబ్బంది తీసుకుపోయారు. వారు స్పందించిన వెంటనే తాజాగా జరిగిన పాలక మండలి సమావేశంలో రాణీ సదాశివమూర్తిని వేదిక్ నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకున్నారు. మొత్తం మీదా అర్హత లేక పోయిన రాణి సదా శివామూర్తి నాలుగు సంవత్సరాలపాటు విసిగా కొనసాగారు..
అయితే అప్పుడే కొత్త వీసీ నియామకానికి గత పాలకులు తెరచాటు ప్రయత్నాలు ప్రారంభించారంట. గత పాలకులకు, మఠాధిపతుల మధ్య వారథిగా పనిచేస్తున్న ఓ ప్రొఫెసర్ ను తెర మీదకు తీసుకు వచ్చారంట . అయన టిడిపిలోని కొంతమంది నాయకులకు అస్థాన జ్యోతిష్కుడు. కర్నాటకలోని పలు పీఠాలకు అనధికార పీఆర్ఓగా పనిచేస్తుంటారు. దాంతో పాటు పెద్ద వాళ్ల బ్లాక్ మనీని అయా పీఠాలలో జాగ్రతగా పెట్టిస్తాడనే ప్రచారం ఉంది. ఇలాంటి వ్యక్తిని వీసీగా చేయడానికి లాబీయింగ్ మొదలు పెట్టారంట. ఏదేమైనా వేదిక్ యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది మాత్రం తమకు నిబంధనల ప్రకారం సమర్థమైన వీసీ కావాలని కోరుతున్నారు.
Story by Apparao, Big Tv