Komatireddy: ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి మరోసారి పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కెర్లు కోడుతోంది. కేబినెట్ విస్తరణలో అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేయడంతో…ఖాళీగా ఉన్న రెండు బెర్త్‌లపై మరోసారి చర్చ జరుగుతుందట. ఆ ఖాళీ పోస్టుల్లో అయినా చిన్న కోమటిరెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం కల్పిస్తుందా?.. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై ఇచ్చిన హామీని అధిష్టానం నెరవేరుస్తుందా?
ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై మళ్లీ ఆశలు చిగురించాయంటున్నారు. ఆజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం….ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావులకు కేబినెట్ హోదాతో నామినేటెడ్ పదవులు ఇవ్వడంతో ఇప్పుడు అందరి ఫోకస్ రాజగోపాల్ రెడ్డి వైపు మారిందట. కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా మారిన రాజగోపాల్ రెడ్డి సమయం దొరికినప్పుడల్లా మంత్రి పదవి పై బహిరంగంగానే మాట్లాడుతున్నారు.
బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చినపుడు మంత్రి పదవి హామీ ఇచ్చారని, భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రి ఇస్తామని రెండోసారి కూడా హామీ ఇచ్చినట్టు పలుమార్లు మాట్లాడుతూనే ఉన్నారు. అధిష్టానం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సమయం దొరికినప్పుడల్లా ట్వీట్ లు చేస్తూ కార్యకర్తల సమావేశంలోనూ అదే చర్చకు తీసుకొస్తున్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవి కోసం తరుచూ వ్యాఖ్యలు చేస్తూ పోటీ పడుతున్నారు.
ఎట్టకేలకు వారు ఇరువురికి క్యాబినెట్ హోదా దక్కడంతో ఇక కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక్కరే మిగిలిపోయారు. గతంలో రాజగోపాల్‌రెడ్డికి కూడా ఆరు గ్యారంటీ హామీల కమిటీ చైర్మన్‌గా క్యాబినెట్ హోదా ఇస్తామని, డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పిస్తామని పలు మార్లు బుజ్జగించినా మంత్రి పదవి తప్ప మరే పదవి వద్దని ఆయన అధిష్టానానికి ఖరాకండిగా చెప్పారంట. ఆ క్రమంలో ప్రస్తుతం చిన్న కోటమిరెడ్డికి ఏ పదవి లేకుండా పోయింది.
తాజాగా అజారుద్దీన్‌కి మంత్రిపదవి ఇవ్వడంతో క్యాబినెట్లో ఇక మిగిలింది రెండు బెర్తులు మాత్రమే. అందులో ఒకటి బిసి వర్గానికి, మరొకటి ఓసీ వర్గానికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. సుదర్శన్ రెడ్డి క్యాబినెట్ హోదాతో నామినేటెడ్ పోస్టు దక్కించుకోవడంతో.. ఇక ఓసీ వర్గీయుల రేసులో మిగిలింది రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లాకి చెందిన మల్ రెడ్డి రంగారెడ్డి మాత్రమే. ఏదేమైనా రెండు బెర్తుల్లో తనకు తప్పకుండా అవకాశం వస్తుందని రాజగోపాల్‌రెడ్డిలో ఆశలు చిగురిస్తున్నాయంట. ఆయన అనుచరులు కూడా సోషల్ మీడియాలో రాజన్న కు మంత్రిపదవి ఖాయమని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇటీవల రాజగోపాలరెడ్డి మాటలోనూ చాలా వ్యత్యాసం కనపడుతుంది. గతంలో మంత్రి పదవి పై ఘాటుగా స్పందించే రాజగోపాల్ రెడ్డి ఇపుడు సైలెంట్ అయ్యారు. తాజాగా అజారుద్దీన్‌కి మంత్రి పదవి విషయం పై చౌటుప్పల్‌లో మీడియాతో చాలా కూల్ గా మాట్లాడారు. పార్టీ మారుతున్నటు తనపై కొంతమంది గిట్టని వారు దుష్ప్రచారం చేస్తున్నరని, అది అంతా అబద్ధమని ప్రజలెవరూ నమ్మొద్దని, ఏదైనా ఉంటే తానే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతానని, కాంగ్రెస్ పార్టీ సైనికునిగా రాహుల్ గాంధీ నాయకత్వం లో పనిచేస్తానని, మంత్రి పదవి విషయం అధిష్టానం చూసుకుంటుందని చాలా హుందాగా మాట్లాడారు.
మొత్తం మీద సుదర్శన్ రెడ్డి,ప్రేమ్ సాగర్ రావుకు క్యాబినెట్ హోదా నామినేటెడ్ పోస్టులు దక్కడం పై రాజగోపాల్ రెడ్డి చాలా సంతోషంగా ఉన్నారంట. ఇక తన మంత్రి పదవి విషయమై ఢిల్లీలో అధిష్టానం పెద్దలను కలిసే పనిలో పడ్డారంట. చూడాలి మరి మిగిలిన రెండు బెర్తుల్లో రాజగోపాల్ రెడ్డి కి అవకాశం దక్కుతుందో? లేదో?.. లేకపోతే ఎప్పటిలాగే నిరాశే మిగులుతుందో?
Story by Apparao, Big Tv