Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ సీటుని కాపాడుకుని గ్రేటర్ హైదరాబాద్‌లో పట్టు నిలుపుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ క్రమంలో ప్రచారంలోకి పార్టీ ముఖ్యనేతలందర్నీ రంగంలోకి దింపింది కారు పార్టీ. అయితే ప్రచారబరిలో ఉన్న నేతలు క్షేత్రస్ధాయిలో పని చేస్తున్నారా…లేదా అనే దానిపై సొంత నేతలపై నిఘా పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయట.
జూబ్లీహిల్స్ లో గెలుపుకోసం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది. ఈ తరుణంలోనే పార్టీ నాయకులు క్షేత్రస్ధాయిలో పనిచేస్తున్నారా…లేదా అని తెలుసుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందట. డివిజన్లలో ఎంతమంది నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.. వారు ఎవరెవరిని కలుస్తున్నారు.. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారా.. ప్రభుత్వ వైఫల్యాలను ఏమేరకు వివరిస్తున్నారు.. కాంగ్రెస్ గ్యారెంటీ హామీల వైఫల్యాల కార్డులను సైతం ప్రజలకు అందజేసి బీఆర్ఎస్ వైపునకు ఆకర్షించేలా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. సొంతపార్టీ నేతల కదలికలపై పార్టీ అధిష్టానం నిఘా పెట్టిందనే టాక్ పార్టీ నేతల మధ్య పెద్ద చర్చకు దారి తీస్తోంది.
జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఎట్టి పరిస్ధితుల్లో గెలవాలనే తలంపుతో బీఆర్ఎస్ అధినాయకత్వం ఉంది. ఇప్పటికే డివిజన్‌ల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించింది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి నాయకులను రంగంలోకి దింపింది కారు పార్టీ. డివిజన్‌ల్లో బాధ్యతలు అప్పగించిన ప్రతి నాయకుడు ఎన్నికల ప్రచారంలో ఏం చేస్తున్నారు.. ఏయే కాలనీలో ఎవరెవరిని కలుస్తున్నారు.. ఏ రోజు ఏ కాలనీలో ప్రచారం చేస్తున్నాడనే వివరాలు తమకు తెలుసని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ ప్రకటనతో నేతలంతా టెన్షన్ పడుతున్నారట.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గులాబీకి డూర్ ఆర్ డై కావడంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. రాబోయే ఎన్నికలకు ఇది నాంది అని నేతలు ఇప్పటికే బహిరంగంగానే పేర్కొంటున్నారు. జూబ్లీహిల్స్ లో పార్టీ గెలిస్తే, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుస్తామని, మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది తొలిమెట్టు అని అభిప్రాయపడుతుంది. దీంతో ఉప ఎన్నికలను సీరియస్ గా తీసుకొని ముందుకు సాగుతుందట.
మరోవైపు సొంతపార్టీ నేతలపై నిఘా పెట్టడానికి సంబంధించి విస్తృత చర్చజరుగుతుందట. బాధ్యతలు అప్పగించినప్పటికీ ప్రచార సరళిపై ఆరా తీస్తుందా…ఎందుకు ఇలా చేస్తుందనేది కూడా చర్చనీయాంశమైందట. పార్టీకోసం పనిచేస్తున్నామని నేతలు బహిరంగంగా పేర్కొంటున్నప్పటికీ పార్టీ మాత్రం తమ కదలికలను గమనిస్తుందనే ప్రచారంతో నేతలు అసంతృప్తి గురవుతున్నారట. ఉప ఎన్నికల్లో నేతల పనితనం బట్టి రాబోయే కాలంలో పదవులు అప్పగించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా 40 మంది, డివిజన్ ఇన్ చార్జులు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు.
అయినప్పటికీ ఇంకా నియోజకవర్గ ఓటర్లను కలవాలని, వారికి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని, వారిని ఎలా ఆకట్టుకోవాలనే అంశాలపై మార్గనిర్దేశం చేస్తున్నారట. ఎన్నికల బాధ్యతలు అప్పగించిన నేతల పనితీరును బట్టే భవిష్యత్‌తో ప్రియార్టీ ఉంటుందనే విషయాన్ని నేతలకు డైరెక్షన్ ఇస్తున్నారట. దీంతో నేతల ప్రచార సరళిపై గులాబీ నాయకత్వం నిత్యం ఆరా తీసుందనే చర్చతో నేతలందరూ అలర్ట్ అవుతారా…లేదా లైట్ తీసుకుంటారా అన్నది తెలాల్సి ఉంది.
Story by Apparao, Big Tv