మంచు ఫ్యామిలి(Manchu Family)లో మళ్లీ మంటలు చెలరేగాయి. డిసిప్లిన్ కు బ్రాండ్ అంబాసిడర్స్ అంటూ చెప్పుకునే మంచు ఫ్యామిలీ మెంబర్స్.. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.. అది కూడా పరస్పర దాడుల పేరుతో. దీంతో మంచు ఫ్యామిలీలో అసలేం జరుగుతుందన్న చర్చ మొదలైంది. ఇంతకీ అసలు మంచు ఫ్యామిలీని షేక్ చేస్తున్న ముసలమేంటి? తండ్రిపై కొడుకు.. కొడుకుపై తండ్రి ఫిర్యాదు చేసుకునే వరకు ఎందుకు వెళ్లారు?
మంచు ఫ్యామిలీ అంటేనే కాస్త కాంట్రవర్సీకి కేరాఫ్‌గా ఉంటుందన్న ప్రచారం ఉంది. మోహన్ బాబు (Mohan Babu) కావొచ్చు.. మంచు విష్ణు (Manchu Vishnu) కావొచ్చు.. ఇలా ప్రతిసారి ఏదో ఒక వివాదంలో ఉంటుంది ఈ కుటుంబం. అయితే ఎప్పుడూ బయటి అంశాల్లో ఉండే ఈ వివాదాలు.. అంతర్గతంగా ఉన్నట్టు బయటపడింది మాత్రం విష్ణు వర్సెస్ మనోజ్ గొడవతోనే. నిజానికి అప్పటికే ఈ ఇద్దరి అన్నదమ్ముల మధ్య వివాదం కొనసాగుతోందన్న ప్రచారం జోరుగా ఉండేది. వీటిని నిజం చేస్తూ మంచు విష్ణు.. ఏకంగా మంచు మనోజ్ (Manchu Manoj) మేనేజర్ సారధిపై దాడి చేయడం అప్పట్లో కలకలం రేపింది. విష్ణు దాడి చేస్తున్న ఘటనను వీడియో తీసి మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపింది. విష్ణు తన మనుషులని కొట్టడానికి వచ్చాడని, తరచుగా ఇంటికి వచ్చి కొడుతూ ఉంటాడని… విష్ణు దాడి చేస్తున్న వీడియోని… మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇరువురి మధ్య వివాదం నిజమే అని కన్ఫామ్ అయ్యింది.
ఆ వీడియోతో అంతా షాక్
ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మోహన్‌బాబు రంగంలోకి దిగి మనోజ్‌తో ఆ వీడియో డిలీట్ చేయించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వీడియో వైరల్ అయింది. అన్నదమ్ముల మధ్య గొడవకి సరైన కారణాలేంటన్న క్లారిటీ తెలియలేదు కానీ.. మంచు ఫ్యామిలీలో మంటలు కొనసాగుతున్నాయని మాత్రం అర్థమైంది. ఈ ఇష్యూపై మాట్లాడిన మంచు విష్ణు… తామిద్దరి మధ్య గొడవలు కామన్ అని… అది చిన్న గొడవ అన్నారు. సారథితో వాగ్వాదాన్ని మనోజ్ ఆపలేకపోయాడు. అందుకే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని చెప్పాడు. మనోజ్ చిన్నవాడు, వీడియో గురించి స్పందించాల్సినంత పెద్ద విషయం కాదు అంటూ విష్ణు వివరణ ఇచ్చారు. వీరి గొడవపై మోహన్ బాబు కూడా సీరియస్ అయినట్లు తెలిసింది. అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని, ఆవేశం అన్నింటికీ అనర్థమని తాను ఎన్నోసార్లు చెప్పానని మోహన్ బాబు వివరించారు.
ట్వీట్లతో ముదిరిన వార్
ఇదిలా ఉంటే ఈ గొడవ జరిగిన తర్వాత మంచు మనోజ్ సోషల్ మీడియాలో మోటివేషన్ కొటేషన్స్‌ని పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఏది కరెక్ట్ అయితే దాని కోసమే పోరాడుతున్నాను, నెగిటివిటి క్రియేటివిటీకి బిగ్గెస్ట్ ఎనిమీ అంటూ పోస్ట్ చేశాడు. అది అంతటితో ఆగలేదు. బతుకు, బతకనివ్వు… మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా .. అంటూ మరోసారి పోస్ట్ పెట్టాడు.. ఈ ట్వీట్ తన అన్న మంచు విష్ణును ఉద్దేశించేనా? అనే చర్చ మొదలైంది. అన్ని తప్పులను చూస్తూ పట్టించుకోకుండా జీవించడం కంటే.. సరైన దాని కోసం పోరాడుతూ చనిపోతాను అని అమెరికన్ రచయిత సుజీ కాసెమ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అన్నదమ్ముల మధ్య గొడవ తర్వాతి రోజే మనోజ్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
ముక్కలైన ‘మంచు’ ఫ్యామిలీ
ఒకప్పుడు మంచు ఫ్యామిలీ అంతా ఒకే భవనంలో ఉండేది. కొంతకాలంగా విష్ణు, మనోజ్ వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు. వివాదానికి కారణాలేంటి..? విభేదాలు ఎందుకొచ్చాయి..? అన్న విషయంపై మాత్రం అన్నదమ్ములు నోరు మెదపలేదు. కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్ భూమా మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లి వేడుక జరిగింది. మంచు విష్ణు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. కానీ..అంటీ ముట్టనట్టు వ్యవహరించారు. అయితే ఈ పెళ్లికి మంచు లక్ష్మీ (Manch Lakshmi) పెళ్లి పెద్దగా వ్యవహరించారు. మంచు లక్ష్మినే… తమ్ముడి పెళ్లి వేడుకను దగ్గరుండి జరిపించారు. ఈ వివాహ వేడుకకు విష్ణు తన ఫ్యామిలీతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో అన్నదమ్ముల మధ్య ఏదో వివాదం నడుస్తోందన్నది తేలిపోయింది.
ఇంటి గుట్టు.. వీధుల్లోకి..
మోహన్‌బాబు అంటే డిసిప్లిన్.. డిసిప్లిన్ అంటే మోహన్ బాబు అంటూ… ఏ ప్రోగ్రామ్‌కు వెళ్లినా.. ఏ వేదికపై మాట్లాడినా చెబుతుంటారు మోహన్ బాబు. తన పిల్లలను కూడా అలాగే పెంచానని చెబుతూ ఉంటారు. అలాంటి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఏ కుటుంబంలోనైనా అన్నదమ్ముల మధ్య ఇలాంటివి సాధారణం అంటూ గతంలో కవర్ చేసుకున్న మోహన్‌బాబు… ఇప్పుడు ఏకంగా కొడుకు తనపై దాడి చేశాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో మరో హైలెట్ ఏంటంటే.. మోహన్‌బాబు తనపై, తన భార్యపై దాడి చేశాడని పోలీసులకు మంచు మనోజ్ కంప్లైంట్ ఇవ్వడం. అంతే కాదు తన భార్య, అసిస్టెంట్ సాయంతో బంజారాహిల్స్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు మంచు మనోజ్.
దాడి చేసింది ఎవరు.. మోహన్ బాబా? వినయా?
నా తండ్రి నాపై, నా భార్యపై దాడి చేశాడు.. వెంటనే చర్యలు తీసుకోండి అంటూ డయల్ 100కు ఫోన్ చేశాడు మంచు మనోజ్. దీంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ తర్వాత తన కొడుకు కూడా తనపై దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు మోహన్ బాబు. దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్టు తేలింది. మనోజ్‌పై మోహన్‌బాబు అనుచరుడు వినయ్ దాడి చేశాడని.. దాడి చేసిన వినయ్ విద్యానికేతన్ సంస్థలో కీలక పదవిలో ఉన్నట్టు తెలుస్తోంది. మనోజ్ ఫిర్యాదుతో పోలీసులు మోహన్ బాబు ఇంటికి కూడా వెళ్లినట్టు తెలుస్తోంది.
మోహన్ బాబు చేసిన తప్పు ఇదేనా?
నిజానికి లోపల ఎన్ని కుమ్ములాటలు ఉన్నా.. బయటికి మాత్రం కాస్త హుందాగా ఉండేది మంచు కుటుంబం. కానీ గత కొన్నాళ్లుగా ఈ సీన్ మారిపోయినట్టు కనిపిస్తోంది. అయితే ఈ గొడవలు ఆస్తుల విషయంలోనే జరుగుతున్నట్టు తెలుస్తోంది. మంచు మనోజ్‌ను మోహన్‌బాబు చాలా కాలంగా దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మనోజ్ రెండో పెళ్లి తర్వాత ఈ దూరం మరింత పెరిగినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచే ఆస్తుల పంపకంపై చర్చలు నడుస్తున్నట్లు సమాచారం. అయితే, మోహన్ బాబు పెద్ద మనసుతో చిన్నోడిని అక్కున చేర్చుకుని ఉంటే ఈ సమస్యలే వచ్చి ఉండేవి కావని సన్నిహితులు అంటున్నారు. ఆయన ఎక్కువగా విష్ణు మాటలనే వింటున్నారని, మనోజ్ చెప్పేది కూడా విని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదని తెలుపుతున్నారు. మోహన్‌బాబ్‌కు చెందిన విద్యానికేతన్ విద్యాసంస్థలతో పాటు.. ఇతర ఆస్తుల పంపకాలు విషయంలో వివాదం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
Also Read: అక్క రాకతో.. మంచు మనోజ్ వెనక్కి తగ్గుతారా..?
మనోజ్‌కు అన్యాయం?
ఆస్తుల విషయంలో తనకు అన్యాయం జరుగుతుందన్న ఫీల్‌లో మనోజ్ ఉన్నారని.. అందుకే తనకు సరైన న్యాయం చేయాలని పోరాడుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ విషయాలను బయటికి రాకుండా మంచు ఫ్యామిలీ జాగ్రత్త పడుతుంది కానీ వారికి జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు కూడా పోలీసు కేసుల విషయంలో మంచు కుటుంబం స్పందించింది. తండ్రి, కొడుకులు పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే ప్రచారంలో నిజం లేదని తెలిపింది. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కథలు అల్లుతున్నారని.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ప్రకటించింది.