BigTV English

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఎందుకీ పరిస్థితి

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ఎందుకీ పరిస్థితి

Manipur Violence: మణిపూర్‌ మంటలు ఆరని కాష్టంలా మారాయి. ఏడాదిన్నర తర్వాత కూడా మణిపూర్ ఘర్షణల్లో శాంతి రాలేదు. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. తాజాగా చెలరేగిన హింసతో ఆఫ్సాను రంగంలోకి దింపింది కేంద్రం. దీనితో భద్రతా దళాలు, మిలిటెంట్ల మధ్య కాల్పులు ఆందోళనను మరింత పెంచుతున్నాయి. రెండు తెగల మధ్య అల్లర్లు, ఇప్పుడు మిలిటెంట్లకు, ప్రత్యేక బలగాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీసినట్లు అనిపిస్తోంది. ఏకంగా, ముఖ్యమంత్రి, మంత్రులు ఇళ్లపై ఆందోళనకారులు దాడులు చేస్తున్నారు. అసలు, మణిపూర్‌లో ఏం జరుగుతోంది..? ఎందుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి..?


పలువురు బీజేపీ నేతల ఇళ్లపై ఆందోళనకారులు దాడులు

ఏడాదిన్నర దాటుతున్నా మణిపూర్‌లో(Manipur )మంటలు ఆరలేదు. రోజు రోజుకూ నిరససలు పెరుగుతూనే ఉన్నాయి. ఆందోళనలతో ఇంఫాల్‌ లోయ అట్టుడుకుతోంది. నిరసనకారులు ఇప్పుడు ఏకంగా రాజకీయ నాయకుల నివాసాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఏకంగా సీఎం వ్యక్తిగత నివాసానికి నిప్పంటించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు, పలువురు బీజేపీ నేతల ఇళ్లపై ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు.


వీరిలో మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ అల్లుడు రాజ్‌కుమార్‌ సింగ్‌ నివాసం కూడా ఉంది. నవంబర్ 16 సాయంత్రం బీరేన్ సింగ్ ఇంటిపైనా దాడికి ప్రయత్నించడంతో నిరసనకారులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. అయినా సరే ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. అతికష్టంతో వారిని అక్కడ నుంచి చెదరగొట్టాల్సి వచ్చింది. అయితే, దాడి జరిగిన సమయంలో సీఎం బీరెన్ సింగ్ ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బీరెన్ సీఎం కార్యాలయంలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందట కనిపించకుండా పోయిన మైతీ తెగకు చెందిన ఇద్దరు పిల్లలు, ఒక మహిళ సహా ఆరుగురు జిరి నదిలో శవాలై తేలడం తాజా నిరసనలకు కారణమని తెలుస్తోంది.

హత్యకు సంబంధించిన అంశాలు క్యాబినెట్‌లో చర్చిస్తామన్న మంత్రి

ఇక, నవంబర్ 16 ఉదయం ఇంఫాల్ వెస్ట్‌లో ఉండే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ లాంఫెల్ సనకీతెల్ నివాసంపై నిరసనకారులు దాడికి ప్రయత్నించారు. మంత్రితో వాగ్వాదానికి దిగారు. ఇటీవల జరిగిన ముగ్గురి హత్యకు సంబంధించిన అంశాలు క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని మంత్రి మాటిస్తూ.. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే రాజీనామా చేస్తానని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. అదే సమయంలో.. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖురాయ్ ప్రాంతంలోని ఉన్న మరో మంత్రి ఎల్ సుసీంద్రో సింగ్ నివాసాన్ని కూడా ఆందోళనకారులు ముట్టడించారు. సుసీంద్రో సింగ్ నివాసంపై దాడికి యత్నించారు.

ముందే పసిగట్టిన పోలీసులు వారిపై టియర్ గ్యాస్‌ ప్రయోగించి, చెదరగొట్టారు. ఇక, ఇంఫాల్ వెస్ట్‌లోని సగోల్‌బంద్ ప్రాంతంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఇమో సింగ్ నివాసంపై ఆందోళనకారులు దాడి చేశారు. ఇంటి ఎదుట బైఠాయించి 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన స్పందించకపోవడంతో ఆగ్రహంతో బిజెపి ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేశారు. ఆస్తులకు నిప్పు పెట్టారు. అయితే, మణిపూర్‌లో పలు పోలీస్ స్టేషన్ల పరిథిలో పరిస్థితి చేజారడంతో పశ్చిమ ఇంఫాల్‌లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్‌ లోయతో పాటు ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

మైతీల హత్యలపై న్యాయం చేయాలని డిమాండ్‌

ఇక, జిరిబామ్‌లోని బోకోబెరాలో కుకీ మిలిటెంట్లు కొందరు మహిళలు, పిల్లలను అపహరించడం ఆందోళనను మరింత పెంచుతోంది. ఒకే కుటుంబానికి చెందిన మహిళలు, పిల్లలతో సహా ఆరుగురిని కుకీ మిలిటెంట్లు అపహరించి, దారుణంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే దొరికిన ముగ్గురి మృతదేహాలు నవంబర్ 15 రాత్రి అస్సాం-మణిపూర్ సరిహద్దుల్లోని జిరి, బరాక్ నదుల సంగంమం ప్రదేశంలో కనిపించాయి. మరో ముగ్గురి మృతదేహాలు నవంబర్ 16 ఉదయం దొరికాయి. ఈ నేపథ్యంలో మైతీ వర్గానికి చెందిన ప్రజలు రాజధాని ఇంఫాల్‌లో భారీ నిరసనకు దిగారు. మైతీల హత్యలపై న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Also Read: హైపర్ సోనిక్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించిన ఇండియా.. 

మరోవైపు, చేజారుతున్న పరిస్థితుల దృష్ట్యా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం – ఆఫ్సాను తిరిగి విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఇంఫాల్‌ జిల్లాలోని సెక్మయ్‌, లాంసంగ్‌, లామ్‌లై, జిరిమామ్‌ జిల్లాలోని జిరిబామ్‌, కాంగ్మోక్పి జిల్లాలోని లైమాఖోంగ్‌, బిష్ణుపూర్‌ జిల్లాలోని మాయిరంగ్‌ ప్రాంతాలలో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. దీనితో, భద్రతా దళాలకు, మిలిటెంట్లకు మధ్య ప్రత్యక్ష యుద్ధాన్ని తలపించే వాతావరణం నెలకొంది. తాజాగా దళాలకు, మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మిలిటెంట్లు మరణించారు. ఈ హింసాకాండపై స్పందించిన కేంద్రం.. శాంతిభద్రతల పునరుద్ధరణకు భద్రతా బలగాలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్

కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో, “భద్రతా పరిస్థితి సమీక్షించడానికి, ఆందోళనకర ప్రాంతాల్లో తిరుగుబాటు గ్రూపుల కార్యకలాపాలను నియంత్రించడానికి భద్రతా బలగాలను మొహరించినట్లు” పేర్కొన్నారు. తీవ్రమైన ఆందోళన నేపధ్యంలో మైతీలు అధికంగా ఉన్న లోయ ప్రాంతంలోని మొత్తం ఐదు జిల్లాల్లో ఆఫ్సాను విధించడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో అమలు చేస్తున్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాలు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

భద్రతా దళాలకు విస్తృత అధికారాలను కల్పిస్తున్న ఈ చట్టంపై మణిపూర్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘర్షణను తగ్గించడంలో, ఆఫ్సా తిరిగి విధించడాన్నిఅడ్డుకోవడంలో మంత్రులు, శాసనసభ సభ్యులు విఫలమయ్యారని నిరసనకారులు విమర్శిస్తున్నారు. కాగా, గతంలో తీవ్రమైన వివాదాలకు కారణమైన ఈ చట్టాన్ని సమీక్షించి, ఉపసంహరించుకోవాలని బీరెన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

కేంద్రం కినుకు వహిస్తుందంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం

అయితే, ఇంత జరుగుతున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ(Modi) మణిపూర్‌ను పట్టించుకోవట్లేదనీ.. విదేశీ పర్యటనలపూ చూపిస్తున్న శ్రద్ధ మణిపూర్‌పై ఎందుకు లేదనీ, ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శిస్తోంది. విదేశాలకు వెళుతున్న ప్రధానికి ఒక్కసారి కూడా మణిపూర్‌కు వచ్చే టైం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే, ఏడాదిన్నరగా కొనసాగుతున్న మణిపూర్ అల్లర్ల నేపధ్యంలో ఒక్కసారి మాత్రమే ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు.

కొన్ని రోజుల క్రితం అల్లర్లు కాస్త సద్దుమణిగిన సందర్భంలో.. అక్కడ స్కూళ్లూ, కాలేజీలు తిరిగి తెరుచుకున్నాయనీ.. ప్రజలు సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారంటూ పేర్కొన్నారు. అయితే, కేంద్రం కినుకు వహిస్తుంది కాబట్టే, మణిపూర్‌లో శాంతి రావట్లేదు, మణిపూర్ సురక్షితంగా లేదంటూ కాంగ్రెస్ అగ్రనేతలు మండిపడుతున్నారు.

ఈ చట్టంతో సాయుధ దళాలకు అపారమైన విచక్షణాధికారాలు

ఇక, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్‌ను మళ్లీ విధించిన కేంద్ర ప్రభుత్వ చర్యలు మణిపూర్‌లో మరింత హింసను పెంచుతాయని అటు మణిపూర్ ప్రజలతో పాటు దేశంలో మేథావులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాలకు అపారమైన విచక్షణాధికారాలు వస్తాయి. ఏదైనా ఓ ప్రాంతం ప్రమాదకరమైన స్థితిలో ఉందని అభిప్రాయపడినప్పుడు.. ఆ ప్రాంత పౌరులకు సహాయంగా సాయుధ బలగాలను రంగంలోకి దింపడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేస్తుంది.

ఈ చట్టం సాయుధ బలగాలకు కాల్పులు జరపడానికి, వారెంట్ లేకుండా ప్రవేశించడానికి, సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడానికి, నేరానికి పాల్పడిన ఏ వ్యక్తినైనా అరెస్టు చేయడానికి అధికారం కల్పిస్తుంది. ఈ చర్యలన్నింటినీ చేసే సాయుధ బలగాలకు ప్రాసిక్యూట్ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఆఫ్సా చట్టం అందించే ప్రత్యేకమైన అధికారాలతో దళాలు ఏం చేసినా వారిపై చట్టపరమైన చర్యలు ఉండవు. గతంలో ఈ చట్టాన్ని తొలగించాలని ఈశాన్య రాష్ట్రల్లో తీవ్రమైన నిరసనలు జరిగాయి. ఇరోమ్ షర్మిలా చాను అనే మైతీ తెగకు చెందిన మహిళ 16 సంవత్సరాలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎట్టకేలకు, కేంద్రం దాన్ని సవరించినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ దాన్ని విధిండంపై ఆందోళనలు చెలరేగుతున్నాయి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×