ముద్రగడ పద్మనాభం.. కాపు ఉద్యమ నేతగా తెగ హడావుడి చేశారు. మూడుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ పొలిటీషియన్.. విజయవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా కాపునాడును స్థాపించిన కాపునాడు కార్యకలాపాల్లో చురుగ్గా పొల్గొన్న ముద్రగడ కాపు నేతగా ఫోకస్ అయ్యారు. జనతా పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, టీడీపీలో చేరి, కాంగ్రెస్‌లోకి వెళ్లి.. మళ్లీ టీడీపీలోకి వచ్చి, కాంగ్రెస్‌లోకి వెళ్లి వచ్చిన ట్రాక్ రికార్డ్ ఆయనది. ఆ క్రమంలో 2014 నుంచి ఏ పార్టీలో చేరకుండా కాపు రిజర్వేషన్ల ఉద్యమం అంటూ సొంత అజెండా నడిపించుకున్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఆ రిజర్వేషన్ల ఉద్యమాన్ని పట్టాలెక్కించడానికి ముద్రగడ వరుసగా లేఖలు రాస్తూ చెలరేగిపోయారు. తుని రైలు దహనం కేసుతో పలువురుని కేసుల పాలు చేశారు.
నిలకడ లేని నిర్ణయాలతో అప్పటికే రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ముద్రగడకి అసలు సిసలు బ్యాడ్ టైం 2024 ఎన్నికల ముందు స్టార్ట్ అయింది… అప్పటి దాకా జనసేన తలుపులు తట్టిన ఆయనకు అవి తెరుచుకోకపోవడంతో కుమారుడితో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని ప్రగాఢంగా నమ్మిన ముద్రగడ గత ఎన్నికల ముందు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో జగన్ ఆ ఇద్దరికీ టికెట్లు ఇవ్వకుండా ప్రచారానికి వాడుకుని పక్కన పెట్టేశారు.
ఎన్నికలకు రెండు నెలల ముందు వైసీపీలో జాయిన్ అయిన ముద్రగడ పద్మనాభం.. సీటు దక్కకపోయినా విధిలేని పరిస్థితుల్లో కేవలం జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించారు. అంతటితో ఆగని ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఎన్నికలలో గెలవనివ్వబోనని సినీ స్టైల్లో శపధం చేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధిస్తే ముద్రగడ పద్మనాభ రెడ్డి గా పేరు మార్చుకుంటానని బహిరంగంగానే ప్రకటించారు.
Also Read: టీడీపీలో కోటంరెడ్డికి కొత్త పదవి..
అప్పుడే ముద్రగడ కుటుంబంలో ముసలం మొదలైంది .. ఆయన అలా శపధం చేయగానే ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి బార్లపూడి ఒక వీడియోను రిలీజ్ చేశారు. రాష్ట్రంలోని తమ సామాజిక వర్గ కాపులంతా పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని కోరుకుంటున్న నేపథ్యంలో తన తండ్రి అలాంటి ప్రకటన చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. కేవలం పవన్ కళ్యాణ్ ని దూషించేందుకు మాత్రమే వైసీపీ తన తండ్రిని వాడుకుంటుందని ఆమె అప్పట్లో ఆరోపించారు.
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపుని కోరుకుంటున్నానని ఈ విషయంలో తన తండ్రి ముద్రగడ పద్మనాభం తో పూర్తిగా విభేదిస్తున్నానని క్రాంతి అప్పట్లోనే ప్రకటించారు.. దానిపై ముద్రగడ పద్మనాభం చాలా సీరియస్ అయ్యారు. ఆడపిల్లకు పెళ్లి జరిగిన పుట్టింటితో సంబంధం ఉండదని.. మెట్టినింటికే ఆమెపై రైట్స్ ఉంటాయని .. పెళ్లి అయ్యాక తన ప్రాపర్టీ కాదంటూ చిత్రమైన లాజిక్ వినిపించారు.
జగన్ పార్టీలో చేరాను కడ వరకు ఆయనతో తన పయనమని ముద్రగడ ప్రకటించారు. అప్పటినుండి ముద్రగడ ఆయన కూతురు క్రాంతి మధ్య విభేదాలు తరా స్థాయికి చేరుకున్నాయి.. ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ ఘనవిజయం సాధించి, డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు.. దాంతో ముద్రగడ తాతా.. పేరు ఎప్పుడు మార్చుకుంటావంటూ జనసైనికులు, నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు .. దాంతో కాపునేత ముద్రగడ కాస్తా ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుని సొంతూరు కిర్లంపూడికే పరిమితమైపోయారు.
తర్వాత క్రాంతి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. మరోవైపు వైసీపీ ఆయన్ని వాడుకుని వదిలేస్తుందని ఎన్నికల ముందే క్రాంతి చెప్పారు. నిజంగా అలాగే జరుగుతుంది . పార్టీపరంగా ఆయనకు జగన్ ఎలాంటి ప్రాధాన్యతా ఇవ్వలేదు. ఆ క్రమంలో పద్మనాభరెడ్డి ఇక పాలిటిక్స్‌లో వేలుపెట్టరన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే అలవాటైన ప్రాణం కదా.. ఆయన మళ్లీ లెటర్లు రాయడం మొదలుపెట్టారు. ఎన్నికల సమయంలో కూటమికి ఓట్లు వేయొద్దంటూ రాష్ట్ర ప్రజలకు ముద్రగడ లేఖ రాసిన విషయం తెలిసిందే. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కూడా తాన ఆ పార్టీలో చేరే అంశంపై, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నో లేఖలు రాశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సైలెంట్ అయిన ఆయన మరోసారి లెటర్లు రాయడం షురూ చేశారు. ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ లేఖ రాశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకే సోషల్ మీడియా కేసులు, రెడ్ బుక్ వేధింపులు అంటూ లేఖలో ఆరోపణలు గుప్పించారు. సూపర్ సిక్స్ హామీల అమలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అమాయకులను జైల్లో పెట్టి కొట్టించకూడదంటూ ముద్రగడ పద్మనాభం సూక్తులు చెప్తున్నారు.
సోషల్ మీడియాలో అసభ్యకరపోస్టులు పెట్టారంటూ పలువురు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి పెద్దలపై సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అనేక పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అసభ్యకరపోస్టుల అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కూటమి సర్కారు ఏర్పాటు తర్వాత కూడా వైసీపీ శ్రేణులు ఆ ప్రహసనాన్ని కొనసాగిస్తున్నాయి.
వైసీపీ వారు పెట్టిన అసభ్య పోస్టులు చూసి తన కుమార్తెలు కన్నీరు పెట్టారని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారంటే పరస్థితి అర్థమవుతుంది. అయితే పెద్దాయన ముద్రగడకు మాత్రం తన పార్టీ సోషల్ మీడియా సైకోలు అమాయకుల్లా కనిపిస్తుండటం విమర్శల పాలవుతుంది. పార్టీలు మార్చినంత ఈజీగా కులం మార్చేసిన మీకు జరుగుతున్న వాస్తవాలు కనిపించడం లేదా అని టీడీపీ నేతలతో పాటు నెటిజన్లు పెద్దాయన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.