Mahesh Kumar Goud: తెలంగాణ ప్రభుత్వం ఓబీసీలకు 42% రిజర్వేషన్ల కోసం తీసుకొచ్చిన జీవో చారిత్రక ఘట్టమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. 42% రిజర్వేషన్‌కు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసిందని.. ఈ జీవోను అడుగడుగునా బీజేపి, బీఆర్‌ఎస్ పార్టీలు వ్యతిరేకించినప్పటికీ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లిందని చెప్పారు.
ఎన్నికలకు ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చామని అన్నారు. జీవో ఇచ్చి దానికి సంబంధించిన పూర్తి వివరాలతో హైకోర్టులో వాదనలు జరిపించామని అన్నారు.. అయితే, దురదృష్టవశాత్తు హైకోర్టు జీవో 9 పై స్టే విధించిందని వ్యాఖ్యానించారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరమని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పూర్తి వివరాలతో ప్రభుత్వ తరఫున న్యాయవాదులు, అడ్వకేట్ జనరల్ వాదించినా హైకోర్టు స్టే ఇవ్వడంపై కొంత విచారం వ్యక్తం చేశారు.
దీంతో, హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో దాదాపు గంట పాటు కూలంకుషంగా చర్చించినట్లు వెల్లడించారు. ఈ కేసు విచారణ గురువారం నాటికి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో.. న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వచ్చామని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలుపుకునే విధంగా అసెంబ్లీలో బిల్లు పెడతామని అన్నారు. అప్పుడు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని.. కానీ ఇప్పుడు మాట మార్చి బీజేపి, బీఆర్‌ఎస్‌లు వ్యతిరేకిస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ ఫైరయ్యారు.
ALSO READ: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం పడిగాపులు కాస్తున్న మరో డిజాస్టర్ డైరెక్టర్… అదే జరిగితే..
42% రిజర్వేషన్లు ఎక్కడా తగ్గకుండా ముందుకు వెళ్తున్నామని, ఇది తమ న్యాయబద్ధమైన కోరిక అని వివరించారు. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.