MP Dharmapuri Arvind: బిజెపి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని ఆశించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు నిరాశే మిగిలింది. పసుపు బోర్డు సాధించిన ఘనతతో పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్న ఆ ఫైర్‌బ్రాండ్ ఈ సారి కూడా పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ హవా నడుస్తున్న టైమ్‌లో కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి, వరుసగా రెండో సారి కూడా ఎంపీ అయిన ధర్మపురి ఎప్పటినుంచి రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆశిస్తున్నారంట. అయినా పార్టీ ఎప్పటికప్పుడు తనను పక్కన పెడుతుండటంతో నైరశ్యానికి గురైన ఆయన దాన్ని సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేసశారంటున్నారు. ఇంతకీ ఆ ఎంపీ సోషల్ మీడియాలో పెట్టిన మేసేజ్ ఏంటి? దానిపై జరుగుతున్న చర్చేంటి?
హాట్ టాపిక్‌గా మారిన ధర్మపురి అరవింద్ పోస్టు
వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేను అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పెట్టిన పోస్టు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన అరవింద్ తనదైన దూకుడుతో ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో మొదటి సారి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితపై విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అప్పుడే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుపై హామీ ఇచ్చిన ఆయన రెండో సారి విజయం సాధించినప్పుడు దాన్ని సాధించి జల్లా పసుపు రైతుల్లో ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నారు.
రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఆశించిన అరవింద్
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయించి, కేంద్ర హోంశాఖ మంత్రి ఆమిత్‌షాతో ప్రారంభింపచేసిన అరవింద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుగోలిగారు. ముందు నుంచి దూకుడుగా ఉండే అరవింద్ ప్రత్యర్ధులను, ముఖ్యంగా బీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడంలో ముందుండే వారు. ఆ ఫైర్‌బ్రాండ్ ఈ సారి ఖచ్చితంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షపదవి దక్కుతుందని ఆశించారు. అయితే అది దక్కకపోడంతో సైలెంట్ అయిన ఆయన నిర్వేదంతో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
అలిగారా లేదా నిజంగానే పర్సనల్ రీజన్స్ ఉన్నాయా?
ఆ పోస్టుతో అరవింద్ అలిగారా లేదా నిజంగానే పర్సనల్ రీజన్స్ ఉన్నాయా అన్న చర్చ మొదలైంది. ఒకవేళ ఆ మెసేజ్ ను తెలియచేయాలని అనుకుంటే అధిష్టానానికి తాను మెసేజ్ చేయవచ్చు లేదా కాల్ చేసి చెప్పవచ్చు. అంతే కానీ సోషల్ మీడియాలో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. నూతన అధ్యక్షుడి ఎంపికపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డైరక్ట్‌గానే తన అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీకి రాజీనామా చేశారు. ఎంపీ అరవింద్ మాత్రం ఇలా సోషల్ మీడియా మేసేజ్ రూపంలో నిరసన తెలిపారు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఫోకస్ అయిన అరవింద్, ఈటల పేర్లు
చివరి దాక బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడి రేసులో ఉన్న ఎంపీ అరవింద్‌కు ఈసారి కూడా అవకాశం దక్కకపోవడం నిరాశకు గురి చేసిందంటున్నారు. ఈ సారి కూడా సీనియర్ నేత రామచంద్రరావుకు పగ్గాలు అప్పగించారు. పాత, కొత్త నేతల పంచాయతీలో పాత కాపుల వైపే అధిష్టానం మొగ్గు చూపింది. బీసీ వర్గాలకే పగ్గాలు అప్పగించబోతున్నారంటూ జరిగిన ప్రచారం నేపథ్యంలో ఎంపీ లు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్‌ల పేర్లు చివరి వరకు ఫోకస్ అయ్యాయి. అమిత్ షా నిజామాబాద్ పర్యటన సూపర్ సక్సెస్ అయినా సంబరాల్లో ఉన్న కాషాయం శ్రేణులు అరవింద్‌కు అధ్యక్ష పదవిపై గంపెడు ఆశలతో ఉన్నాయి. పార్టీ వర్గాలతో సప్రదింపులు జరిపిన అధిష్టానానికి కూడా అరవింద్‌పై సానుకూలతే వచ్చిందంట.
అరవింద్‌కు వ్యతిరేకంగా బీజేపీ సీనియర్లు చక్రం తిప్పారా?
వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ బీసీ ఫార్ములా తెరమీదికి తెచ్చింది. బిసి వర్గాలకే అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని భావించింది. దాంతో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పేరు అనూహ్యంగా తెరమీదికి వచ్చింది. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న అరవింద్‌కు ఆర్ఎస్ఎస్ అండ కూడా ఉందంటున్నారు. మరో వైపు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు సైతం బీసీ కోటాలో ఫోకస్ అయింది. అయితే అరవింద్‌కు వ్యతిరేకంగా బీజేపీ సీనియర్లు చక్రం తిప్పారంటున్నారు. అరవింద్ వచ్చాక నిజామాబాద్ జిల్లాలో సీనియర్లను పట్టించుకోవడం లేదని, మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన ఆయన తన తండ్రి డీఎస్ సన్నిహితులను ప్రోత్సహిస్తూ తనకంటూ సొంత క్యాడర్‌ని ఏర్పాటు చేసుకుంటున్నారని సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారంట. అదే అధ్యక్ష పదవి రేసులో ఎంపీ అరవింద్‌కు మైనస్ అయిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈటల, అరవింద్‌లకు వ్యతిరేకంగా ఏకమైన సీనియర్లు
ఈటలకు పగ్గాలు అప్పగించడానికి ఆర్ఎస్ఎస్ నుంచి వ్యతిరేకత ఎదురైంది. అరవింద్, ఈటల అధ్యక్ష పదవి రేసులోకి రావడంతో తెలంగాణ బీజేపీ సీనియర్లు ఏకం అయ్యారు అంత కలసి కట్టుగా సంఘ్ పెద్దలతో పాటు ఢిల్లీ పెద్దలను ఆశ్రయించి సీనియర్ లలో ఒకరి పేరును పరిశీలించాలని ఒత్తిడి తెచ్చారంట. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు తెరమీదికి వచ్చిందంట. ఇందలో మాజీ ఎమ్మెల్యే, జిల్లా బీజేపీ సీనియర్ నేత యెండల లక్ష్మీనారాయణ పాత్ర కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈసారి కూడా అధ్యక్ష పదవి అరవింద్‌కు దక్కకపోవడంతో అమిత్ షా టూర్‌తో జోష్ మీద ఉన్న ఆయన వర్గీయులు ఒక్కసారిగా ఢీలా పడ్డారంట. మరి చూడాలి అధిష్టానం ఎంపీ అరవింద్‌ని బుజ్జగించి యాక్టివ్ చేస్తుందో? లేకపోతే కొత్తగా ఏదైనా బాధ్యతలు అప్పగిస్తుందో.