ఇప్పటి వరకన్ని ఆరోపణలే.. కానీ ఇవి ఆరోపణలు కాదు ఇవిగో ఆధారాలు అంటోంది బీజేపీ. మన హిమాలయాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయని.. ఈ పాపమంతా నెహ్రూ, ఇందిరా గాంధీలదే అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇంతకీ హిమాలయాల్లోని నందాదేవి పర్వతాల్లో ఓ అణుబాంబు మంచును కప్పుకొని ఉందా? ఇప్పటికే అది తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించిందా? అసలు బీజేపీ ఆరోపణలేంటి? దానికి గల ఆధారాలేంటి?
మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీపై ఇప్పటికే కుప్పలు తెప్పలుగా ఆరోపణలు చేస్తోంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు సరికొత్త ఆరోపణను తెరపైకి తీసుకొచ్చింది బీజేపీ. ఆ పార్టీ నేత నిషికాంత్ దూబే ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ప్రకారం.. మన దేశంలోని ఒక పర్వతంపై అణు ఆధారిత ఎక్విప్‌మెంట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అమెరికాకు ఈ ఇద్దరు ప్రధానులు అనుమతి ఇచ్చారని.. ఇప్పుడు ఇదే మనకు పాపమైంది అంటున్నారు దూబే.
చైనా కార్యకలాపాలపై నిఘా కోసం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఓ కోవర్ట్ ఆపరేషన్ చేపట్టిందని.. దీని కోసం హిమాలయాల్లో ఓ అణు పరికరాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరిందని.. ఇందుకు నెహ్రూ హయాంలో తొలిసా అనుమతి ఇచ్చారంటోంది బీజేపీ. ఉత్తరాఖండ్‌లోని నందాదేవి పర్వత శిఖరంపై అమర్చేందుకు అనుమతించారంటోంది. ఆ తర్వాత ఇందిరాగాంధీ హయాంలో కూడా అనుమతి లభించిందని చెబుతోంది. అయితే అమెరికా ఆ తర్వాత ఈ విషయంలో వెనకుడుగు వేసిందని చెబుతోంది. అయితే అత్యంత ప్రమాదకరమైన న్యూక్లియర్ డివైజ్‌ను మాత్రం హిమాలయాల్లోనే ఉండిపోయిందని చెబుతోంది.
అంతేకాదు ఈ న్యూక్లియర్ డివైజ్ కారణంగానే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతోంది బీజేపీ. ఇప్పుడు ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు గంగానది ఒడ్డున నివసిస్తోన్న ప్రజల్లో క్యాన్సర్ కేసులు పెరగడానికి ఇది కారణం కాదా? హిమానీనదాలు కరగడానికి, క్లౌడ్‌బరస్ట్, ఇళ్లల్లో పగుళ్లకు ఇదే కారణమా? అని ప్రశ్నిస్తోంది.
లెటెస్ట్‌గా దీనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ పార్లమెంట్‌లో అంగీకరించారు కూడా. బీజేపీ నేత దూబే దీనికి సంబంధించిన ఆధారాలను షేర్ చేశారు. 1978లో అమెరికా కాంగ్రెస్ సభ్యులు తమ ప్రభుత్వానికి రాసిన లేఖను షేర్ చేశారు. సో.. ప్లుటోనియంతో నడిచే ఈ నిఘా పరికరం మిస్ అయిందని దూబే పోస్ట్‌ను బట్టి తెలుస్తోంది. అంతేకాదు ఈ లెటర్‌లను చూస్తే ఆ పరికరం నుంచి రిలీజ్ అయ్యే రేడియేషన్‌పై వారు ఆందోళన చేస్తున్నట్టు అర్థమవుతోంది.
నిజానికి దూబే ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. కొన్ని నెలల క్రితం కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. నందాదేవీ పర్వతంపై కనిపించకుండా పోయిన అమెరికా న్యూక్లియర్ డివైజ్‌కు, నార్త్ ఇండియాలో ఇటీవల జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలకు లింక్ చేస్తూ ఆరోపణలు చేశారు.
నిజానికి ఈ పంచాయితీ ఇప్పటిది కాదు. 1970ల నుంచి నడుస్తోంది. అప్పటి నుంచి భారత్‌లో ఉన్న నేతలు ఆరోపణలు చేయడం జరుగుతోంది.. దానిపై కేంద్రం మౌనం వహించడం.. అమెరికా ప్రభుత్వం తిరస్కరించడం జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ పంచాయతీ అయితే తేలలేదు. కానీ ఇప్పుడు బయటికొచ్చిన డాక్యుమెంట్స్‌ను బట్టి చూస్తే ఈ వ్యవహారం నిజమే అనిపిస్తోంది.
ఈ మంచు పర్వతం కింద నిజంగానే న్యూక్లియర్ డివైస్ ఉందని.. మంచు ప్రవాహంలో ఆ రేడియోధార్మికత ఉన్న వస్తులు కొట్టుకు వచ్చి గంగా నదిలో కలిస్తే కోట్లాది మందికి క్యాన్సర్ ముప్పు తప్పదంటున్నారు పర్యావరణవేత్తలు. హిమాలయాల సమీపంలోని గ్రామస్థులు, పర్యావరణవేత్తలు, రాజకీయ నాయకులు గతంలో కూడా ఆందోళనలు వ్యక్తం చేశారు. ఇప్పుడు చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర పెద్దలు మరోసారి నెహ్రూ, గాంధీలను టార్గెట్ చేయడం.. అదే సమయంలో ఈ విషయంపై బీజేపీ నేతలు స్పందించడం చూస్తుంటే.. ఈ వ్యవహారంపై మరింత రాజకీయ రచ్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.
అసలింతకి అమెరికా ఏర్పాటు చేయాలనుకున్న న్యూక్లియర్ డివైజ్ ఎంత ప్రమాదకరం? అసలు 1960ల సమయంలో ఏం జరిగింది? CIA ఈ కోవర్ట్ ఆపరేషన్‌లో ఎందుకు విఫలమైంది?
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించిన CIA.. అసలు హిమాలయాలను ఎందుకు చూస్ చేసుకుంది. రెండు సార్లు ట్రై చేసినా తన టార్గెట్‌ను ఎందుకు రీచ్ కాలేకపోయింది…? ఆ న్యూక్లియర్ డివైజ్ ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు మోడీ సర్కార్ ఈ విషయంపై ఏం చేయబోతుంది?
1960.. భారత్, రష్యాల మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్న టైమ్. అలాంటి టైమ్‌లో ఇండియన్ నేవీలో కెప్టెన్ హోదాలో ఉన్న మన్‌మోహన్ సింగ్ కోహ్లీ హిమాలయాల్లో ఓ ట్రెక్కింగ్ టీమ్‌ను లీడ్ చేశారు. ఆ టీమ్‌లో ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు, అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారు. వీరంతా చైనాపై నిఘా ఉంచేందుకు హిమాలయాల్లోని ఓ పర్వతంపై ఓ న్యూక్లియర్ డివైజ్‌ను ఉంచేందుకు వెళ్తున్నారు. అంతకుముందే చైనా న్యూక్లియర్ టెస్ట్‌లు ప్రారంభించడంతో CIA ఈ కోవర్ట్ ఆపరేషన్‌కు రంగం సిద్ధం చేసింది.
చైనా ఎలాంటి మిసైల్ లాంచ్ చేసినా.. సిగ్నల్‌ను క్యాచ్ చేసేలా నందాదేవి పర్వతంపై ఓ ఆరడుగుల యాంటెనాను ఉంచాలి. ఇందులో చైనా మిసైల్స్‌తో పాటు.. ఎలాంటి న్యూక్లియర్ టెస్ట్‌లు జరిపినా పట్టేసే సెన్సార్లు ఉంటాయి. అయితే ఈ యాంటెనా నిరంతరం పనిచేయాలంటే నిరంతరం ఫ్యూయల్‌ను మార్చాలి. కానీ అది దాదాపుగా అసాధ్యం కాబట్టి.. ఓ అణుఆధారిత జనరేటర్‌ను ఏర్పాటు చేయాలనుకున్నారు. దీనికోసం రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. అయితే దీనికి కిలోలక కొద్దీ ప్లూటోనియం అవసరం.
రేడియోఐసోటోప్ థర్మోఎలక్ట్రిక్ జనరేటర్ అనేది రేడియోధార్మిక పదార్థం నుంచి వెలువడే వేడిని ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని సాధారణంగా అంతరిక్ష ప్రయోగాలు లేదా సోలార్ పవర్ పనిచేయని మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తారు. ఇది చాలా శక్తివంతమైంది. దశాబ్దాల పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని సొంతం. అయితే ఇది అణు బాంబు తరహాలో పేలేదు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ పరికరం దెబ్బతింటే మాత్రం దాని నుంచి వెలువడే రేడియేషన్ మాత్రం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.
ఇలాంటి డివైజ్‌ను తీసుకొని నందాదేవి పర్వతంపైకి ప్రయాణం ప్రారంభించింది టీమ్. మరో విషయం ఏంటంటే.. భారత్‌లోనే రెండో అత్యంత ఎత్తైన పర్వతం. అక్కడికి ప్రయాణం ప్రాణాలతో చెలగాటమనే చెప్పాలి. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జనరేటర్, క్యాప్సూల్స్‌ను అక్కడే వదిలేసి వచ్చారు.
వాతావరణం అంతా సెట్ అయ్యాక తిరిగి వెళ్లి చూస్తే అవి అక్కడ కనిపించలేదు. ఎక్కడో మంచులో కూరుకుపోయాయి. వాటికోసం తీవ్రంగా గాలించినా ఫలితం లేకుండా పోయింది. అలాగే వదిలేస్తే ప్రమాదమని భావించి.. 1966, 67లలో కూడా హిమాలయాలకు వెళ్లి వాటి కోసం విస్తృతంగా గాలించారు. కానీ లాభం లేకుండా పోయింది. అయితే అక్కడ ఎలాంటి రేడియేషన్ లీక్ కాలేదని మాత్రం క్లారిటీ ఇచ్చారు.
ఇది కోవర్ట్ ఆపరేషన్ కావడంతో అటు అమెరికా నోరు మెదపలేదు.. విషయం బయటపడితే పరిస్థితులు అల్లకల్లోలంగా మారుతాయి కాబట్టి.. భారత్ కూడా మౌనంగా ఉండిపోయింది. అయితే అప్పట్లో భారత్ బృందానికి నేతృత్వం వహించిన కెప్టెన్ మన్మోహన్‌సింగ్ కోహ్లి మాత్రం భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే భయాన్ని మాత్రం అనేకసార్లు వ్యక్తం చేశారు.
అప్పటి నుంచి ఈ వ్యవహారం నెవర్ ఎండింగ్ సీరియల్‌లా కొనసాగుతోంది. అయితే ఉత్తరాఖండ్‌లో ఒక్కసారిగా మెరుపు వరదలు రావడానికి ఇదే కారణమనే వాదనలు వినిపించాయి. అప్పట్లో ఆ రాష్ట్ర మంత్రి సత్పల్ మహరాజ్ మోడీని కలిసి ఈ విషయంపై చర్చించారు కూడా. ఆ అణు పరికరాన్ని వెలికితీయాలని కోరారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మాత్రం బయటికి రాలేదు.
ఇప్పుడు మళ్లీ ఈ వ్యవహారం వెలుగులోకి తీసుకొచ్చింది బీజేపీ. మరి ఈసారైనా కేంద్ర ప్రభుత్వం ఇలా కాసేపు వివాదం చేసి వదిలేస్తుందా? లేక పూర్తి క్లారిటీ ఇస్తుందా? అనేది చూడాలి.
Story Vamshi, Big Tv