Lokesh Vision: పార్టీలో సమూల మార్పులు తీసుకువచ్చి మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే వారిని నేరుగా గుర్తించి, వారికి సముచిత ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. పార్టీ శ్రేణులకు తరచు శిక్షణా తరగతులు నిర్వహిస్తూ.. టీడీపీని ఎదురులేని శక్తిగా తయారు చేయడానికి.. నారా లోకేశ్ దిశానిర్ధేశం చేస్తూ.. వారికి భరోసా కల్పించడానికి కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పడ్డాక, పొత్తుల లెక్కలు, వలస నేతల ప్రభావంతో పార్టీ కార్యకర్తల్లో తమకు న్యాయం జరగడం లేదన్న అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆ అసంతృప్తి తొలగించి, అందర్నీ యాక్టివ్ చేయడానికి లోకేశ్ చేస్తున్న ప్రయత్నాలు సీనియర్ల ప్రశంసలు అందుకుంటున్నాయంట. ఇది లోకేశ్ మార్క్ 3.0 వెర్షన్ అని అభినందిస్తున్నారంట.
పలువురు టీడీపీ నేతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారంట. మంగళగిరిలోని టీడీపీ కార్యక్రమంలో జరిగిన పార్టీ నేతల సమీక్షలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారంట. టీడీపీ శ్రేణులతో కేడర్ సమావేశాలు నిర్వహించకపోవటంతో పాటుగా.. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహించకపోవటమే దీనికి కారణంగా తెలుస్తోంది. కేడర్‌తో మీటింగ్‌లు, గ్రీవెన్స్ కార్యక్రమాలు వరుసగా నాలుగు వారాలు నిర్వహించని నేతలను నారా లోకేష్ మందలించినట్లు సమాచారం.
ఆ క్రమంలో టీడీపీ శిక్షణ తరగతుల్లో ఆయన క్యాడర్‌కు భరోసా ఇచ్చేలా చేసిన ప్రసంగంపై పార్టీ సీనియర్లు అభినందనలు కురిపిస్తున్నారు. తెలుగుదేశం కేడర్ బేస్డ్ పార్టీ. పార్టీలో నేనే రాజు, నేనే మంత్రిని అనే అభిప్రాయాన్ని నాయకులు సరిచేసుకోవాలని నారా లోకేశ్ సున్నితంగా హెచ్చరించారు. టిడిపిలో లోకేష్ లేదా మరో నాయకుడు శాశ్వతం కాదని, పార్టీనే శాశ్వతమని పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకుడు తమ తర్వాత నాయకత్వాన్ని తయారుచేస్తారని, గతంలో వ్యక్తులను నమ్మి పార్టీ నష్టపోయిందని, ఇప్పుడు వ్యక్తులపై కాకుండా వ్యవస్థపైనే ఆధారపడుతున్నామని లోకేశ్ టీడపీ శిక్షణా తరగతుల్లో కేడర్‌కు స్పష్టం చేశారు.
2014-19 నడుమ పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసి కూడా ఓటమి పాలయ్యాం, పార్టీ దీర్ఘకాలం అధికారంలో ఉండాలంటే బిజెపిని మనం ఆదర్శంగా తీసుకోవాలని లోకేశ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ సిద్ధాంతాలను కమిట్ మెంట్ తో అమలుచేసే క్రమశిక్షణగల కేడర్ ఉండటమే బీజేపీ విజయరహస్యమని, మై టిడిపి యాప్ మాదిరిగానే బీజేపీకి సరళ్ యాప్ ఉందని, గ్రామస్థాయి కార్యకర్త నుంచి కేంద్రమంత్రి వరకు ఎవరికి అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించడమే వారి విజయ రహస్యమని కొనియాడారు.
1985 తర్వాత ఎన్నడూ గెలవని మంగళగిరిని ఎంచుకొని తాను తొలి ప్రయత్నంలో ఓడిపోయానని, ఐదేళ్లపాటు పట్టుదలతో పనిచేసి గత ఎన్నికల్లో 91వేలపై చిలుకు మెజారిటీతో గెలుపొందానని లోకేశ్ గుర్తుచేశారు.. భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ… నియోజకవర్గ పరిధిలోని 20బూత్ ల పరిధిలో మైనస్ వచ్చిందని, దానిని కూడా అధిగమించేందుకు హోంవర్క్ చేస్తున్నానని, కాన్ఫిడెన్స్ ఉంటేనే ఏదైనా సాధించగలమని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గత వేదికలపై చర్చించి పరిష్కరించుకోవాలని, అలిగి ఇంట్లో పడుకోవడం అంటే పార్టీకి అన్యాయం చేయడమే అని చురకలు అంటించారు. పార్టీలో సంస్కరణల కోసం తాను అధినేతతో ఒక యుద్ధమే చేశానన్నారు. పార్టీ పెద్దపండుగ మహానాడు ప్రిపరేషన్ వర్క్ ప్రారంభమైందని, దాని విజయవంతం కోసం ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
వైసీపీ అయిదేళ్ల అరాచక పాలనలో ఐదేళ్లు ఇబ్బందులు పడ్డామని, దాదాపు 35వేల తప్పుడు కేసులు బనాయించారని లోకేశ్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ అధ్యయనం చేసి, 60శాతం అక్రమకేసులను తొలగించామన్నారు. మంచిరోజులు వచ్చాయి కదా అని కష్టకాలంలో పడిన ఇబ్బందులను మర్చిపోవద్దని, అధికారం ఉందని అహంకారం ప్రదర్శించకుండా. ఓర్పు, సహనంతో ముందుకు సాగుదామని సూచించారు. చంద్రబాబు అనే మహావృక్షం నీడే మనకు శ్రీరామరక్షని, ఒంటెద్దు పోకడలతో వెళ్లే నాయకులకు పద్దతి మార్చుకోవాల్సిందిగా ఒకటికి మూడు సార్లు చెప్తామని, వినకపోతే 4వసారి దండం పెట్టి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. పార్టీలో ఎవరి పోస్టులు శాశ్వతం కాదన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించుకొని మసలుకోవాలన్నారు.
వైసిపి అధ్యక్షుడు జగన్ మాటలను ఎవరూ సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదని, నిన్న మావిగన్ అన్న నోటితోనే మళ్లీ ఈరోజు మూడు రాజధానులు అంటున్నాడని సెటైర్లు విసిరారు. అధికారంలో ఉన్నప్పుడే కాకుండా ఇప్పుడు కూడా ఆయన ప్రజలకు దగ్గరగా ఉండటం లేదని, ఇంటివద్ద 30అడుగుల ఇనుప కంచె ఏర్పాటుచేసుకున్నాడని యద్దేవా చేశారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయ్యాక చంద్రబాబునాయుడు అనునిత్యం జనంలోనే ఉంటూ, కార్యకర్తల ఆవేదనను విన్నారని, వాటన్నింటినీ గుర్తుపెట్టుకొని కేడర్ కు దగ్గరగా ఉంటూ ఆయన ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. కేడర్ ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారని వెల్లడించి కేడర్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు.
గత మహానాడులో ఇచ్చిన ఆరు శాసనాలను అమలు అవుతాయని, కార్యకర్తే అధినేత అనే శాసనం ఇప్పటికే కార్యరూపం దాల్చిందన్నారు. మొత్తమ్మీద అటు నేతలకు చురకులు అంటిస్తూ, ఇటు కేడర్లో భరోసా ఇచ్చేలా వ్యవహరిస్తున్న తీరుతో.. లోకేశ్‌లో 3.0 విజన్ ప్రస్తుటమవుతోందని తెలుగు తమ్ముళ్లు హ్యాపీ అయిపోతున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలనా పరంగా బిజీబిజీగా ఉండటంతో నారా లోకేశ్ మాత్రం పార్టీ బలోపేతంపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. కార్యకర్తే అధినేత అని పిలుపునిచ్చిన మంత్రి నారా లోకేశ్ ఏ జిల్లాలో పర్యటించినా కార్యకర్తలతో ప్రత్యేకంగా మమేకం అవుతున్నారు.
ఆయా నియోజకవర్గంలో సమస్యలతోపాటు కో ఆర్డినేషన్ ఇతర అంశాలపై దిశానిర్దేశం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవలే ప్రతీ జిల్లా నుంచి ప్రజాప్రతినిధులను తన ఇంటికి ఆహ్వానించి ఆత్మీయ విందు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంతో అంతా ఏకతాటిపైకి తీసుకురావడంతోపాటు అధిష్టానానికి నేతల మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా చూడటమే ప్రధాన అజెండగా తెలుస్తోంది. తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేశ్. ఫీడ్ బ్యాక్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఫీడ్ బ్యాక్ కమిటీ ద్వారా కార్యకర్తల నుంచే నేరుగా సూచనలు తీసుకునేలా ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఈ తరహలో ఫీడ్ బ్యాక్ కమిటీ ఏర్పాటు చేయడం మంచి పరిణామమని పార్టీ వర్గాలు అంటున్నాయి.
Also Read: చికెన్ ప్రియులకు హెచ్చరిక.. కుళ్లిన మాంసాన్ని మార్కెట్లోకి వదులుతున్న కేటుగాళ్లు.. ఇదిగో వీడియో!
Story by: Apparao, Big Tv