BigTV English

New Trend Grok Ghibli: కొత్త ట్రెండ్ జిబ్లీ.. డార్క్ వెబ్‌లో ఫోటోలు..? పర్శనల్ డేటా సేఫేనా..?

New Trend Grok Ghibli: కొత్త ట్రెండ్ జిబ్లీ.. డార్క్ వెబ్‌లో ఫోటోలు..? పర్శనల్ డేటా సేఫేనా..?

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఘిబ్లీ స్టైల్

ఘిబ్లీ ట్రెండ్ బెండుతీస్తున్న యూజర్లు


సోషల్ మీడియా గురించి తెలిసిందేగా! ఏదీ.. ఓ పట్టాన ఒప్పుకోదు. ఒకవేళ ఒప్పుకుందా.. దాన్ని వైరల్ చేసేదాకా వదలరు యూజర్లు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా అలాంటిదే. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్.. ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా.. ఘిబ్లీ ఫీడే కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ.. ఘిబ్లీ స్టైల్ ఫోటోలు అప్‌లోడ్ చేసేస్తున్నారు. ఎప్పుడైతే చాట్ జీపీటీ.. ఈ ఘిబ్లీ స్టూడియో ఫీచర్‌ని తీసుకొచ్చిందో.. అప్పటి నుంచి నెటిజన్లు తెగ వాడేస్తున్నారు. ఓపెన్ ఏఐ సాయంతో.. కార్టూన్ తరహా ఫోటోలని క్రియేట్ చేస్తున్నారు.

ఒరిజినల్ ఫోటో, జిబ్లీ స్టైల్ ఇమేజ్ షేరింగ్

ఒరిజినల్ ఫోటోని, ఘిబ్లీ స్టైల్ ఇమేజ్‌ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తున్నారు. ఈ ట్రెండ్.. సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తోంది. ఈ ఘిబ్లీ స్టైల్ ట్రెండ్‌ని కొన్ని సంస్థలు కూడా గట్టిగానే వాడేస్తున్నాయి. తమ బిజినెస్ బ్రాండింగ్ కోసం.. కొత్త స్టైల్‌లో ప్రమోషన్లు చేస్తున్నాయి. ఈ ట్రెండ్‌లోకి ఇప్పుడు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, దేశాధినేతలు, క్రికెటర్లు, ప్రముఖులు అంతా చేరారు. తమ ఘిబ్లీ స్టైల్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఈ లిస్టులో ప్రధాని మోడీ, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సహా.. చాలా మంది ఉన్నారు.

జిబ్లీ ట్రెండ్‌తో చాట్ జీపీటీపై పెరిగిన ప్రెజర్

ఘిబ్లీ ట్రెండ్ ఎప్పుడైతే వైరల్ అయ్యిందో.. అప్పట్నుంచి చాట్ జీపీటీపై ప్రెజర్ పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లంతా.. ఘిబ్లీ ఇమేజేస్ కోసం చాట్‌ జీపీటీపై ఒక్కసారిగా పడటంతో.. సర్వర్ డౌన్ అయింది. అయినా ఎవ్వరూ తగ్గట్లేదు. ఘిబ్లీ స్టైల్ యానిమేటెడ్ అవతార్స్ కోసం యూజర్లు పోటీపడుతున్నారు. ఇప్పుడు గనక ఘిబ్లీ స్టైల్ ఇమేజ్ అప్‌లోడ్ చేయకపోతే.. అదేదో పెద్ద నేరమైపోయినట్లు భావిస్తున్నారు కొందరు. మొదట్లో చాట్ జీపీటీ ఈ ఘిబ్లీ ఫీచర్‌ని ఉచితంగానే ప్రవేశపెట్టింది. ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ రావడంతో.. రోజుకు 3 ఫోటోలే క్రియేట్ చేసుకునేలా లిమిట్ పెట్టింది.

ఫ్రీ యూజర్లకు ఉన్న లిమిట్‌ని ఎత్తేసిన ఓపెన్ ఏఐ

చాట్ జీపీటీ ప్లస్, టీమ్, ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికే ఘిబ్లీ ఫీచర్ ఫ్రీగా అందుబాటులో ఉంచింది. ఇదే సమయంలో చాట్ జీపీటీకి యూజర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. గంటలోనే 10 లక్షల యూజర్లు యాడ్ అయ్యారని.. ఓపెన్ ఏఐ తెలిపింది. అయితే.. ఘిబ్లీ స్టైల్‌లో తమని చూసుకునేందుకు యూజర్లకు బాగానే ఇంట్రస్ట్ ఉన్నా.. చాట్ జీపీటీపై మాత్రం ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. తమ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు కరిగిపోతున్నాయని చెబుతున్నారు. అయితే.. ఘిబ్లీ ట్రెండ్‌కి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న రెస్పాన్స్ చూశాక.. మళ్లీ ఫ్రీ యూజర్లకు ఉన్న లిమిట్‌ని ఎత్తేసింది ఓపెన్ ఏఐ.

జపాన్ కి చెందిన పాపులర్ జిబ్లీ యానిమేషన్ స్టూడియో

ఘిబ్లీ.. ఓ స్పెషల్ ఆర్ట్ స్టైల్. ఈ ట్రెండ్ మూలాలు.. జపాన్‌కి చెందిన పాపులర్ స్టూడియో ఘిబ్లీ అనే యానిమేషన్ స్టూడియో నుంచి వచ్చాయి. దీని సినిమాలు.. ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాయి. యానిమేషన్ చిత్రాలతో.. ఘిబ్లీ తన మార్క్ వేసింది. అందువల్లే.. ఈ ట్రెండ్‌లో తమ ఫోటోలని చాట్ జీపీటీ ఏఐ టూల్ ద్వారా యానిమేటేడ్ ఇమేజ్‌లు‌గా మార్చి.. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఘిబ్లీ స్టైల్‌లో మంచి బ్యాక్ గ్రౌండ్‌లతో పాటు చూసేందుకు అట్రాక్టివ్‌గా, కళాత్మకంగా కనిపిస్తున్నాయి. అందుకే.. యూజర్లలో ఇంత క్రేజ్ వచ్చింది. పైగా.. చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ ఈ ట్రెండ్‌ని చాలా ఈజీగా మార్చేశాయి. ఎవరైనా సరే.. తమ ఫోటోను అప్ లోడ్ చేస్తే చాలు.. కొన్ని సెకన్లలోనే ఘిబ్లీ స్టైల్ ఇమేజ్ వచ్చేస్తోంది. వీటిని క్రియేట్ చేయడం సులభతరం కావడంతో.. అంతా దీనిని తెగ వాడేస్తున్నారు.

హ్యాష్ ట్యాగ్స్‌తో మరింత వైరల్ అయిన జిబ్లీ ట్రెండ్

బేసిగ్గా సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండ్ వైరల్ అయితే.. మిగతా వాళ్లంతా దానిని గుడ్డిగా ఫాలో అవుతుంటారు. ఒకరిని చూసి మరొకరు.. ఓ చైన్‌లా ఇది ట్రెండ్ అవుతుంది. హ్యాష్ ట్యాగ్స్‌తో ఈ ఘిబ్లీ ట్రెండ్ మరింత వైరల్ అయింది. ఈ ట్రెండ్ సోషల్ మీడియా యూజర్లకు.. తమ పర్సనల్ ఫోటోలని కొత్త రూపంలో, సరికొత్త స్టైల్‌లో చూసే అవకాశం కల్పించింది. పైగా.. ఇది వారి క్రియేటివిటీని ప్రదర్శించేందుకు వీలవుతోంది. దాంతో.. జనంలో ఇంట్రస్ట్ బాగా పెరిగిపోయింది. ఈ ఘిబ్లీ స్టైల్ చిత్రాలు.. చాలా మందికి నోస్టాలిజియా కనెక్షన్‌కి తీసుకెళ్తున్నాయి.

ఇతర ఏఐ ప్లాట్ ఫామ్స్ లోనూ అందుబాటులో జిబ్లీ స్టైల్

ఈ ట్రెండ్.. బాల్య జ్ఞాపకాలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడిది.. ఒక్క చాట్ జీపీటీకి మాత్రమే కాదు ఇతర ఏఐ ప్లాట్ ఫామ్స్‌లోనూ అందుబాటులో ఉంది. గూగుల్ జెమినీ, గ్రాక్ ఏఐ ద్వారానూ ఘిబ్లీ స్టైల్ ఇమేజెస్ క్రియేట్ చేసుకునేందుకు వీలుంది. దాంతో.. యూజర్లంతా ఇప్పుడు ఏఐ చాట్‌బాట్‌లపై పడ్డారు. ఘిబ్లీ ఇమేజ్‌లతో.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌ని నింపేస్తున్నారు.

జిబ్లీ ఫోటోస్ క్రియేట్ చేసుకుంటే.. డేటా ప్రైవసీకి ముప్పు తప్పదా?

జిబ్లీ ట్రెండ్ ఏ రేంజ్‌లో హిట్ అయిందో అంతా చూస్తున్నాం. కానీ.. ఇదే సమయంలో మరో డౌట్ తలెత్తుతోంది. జిబ్లీ స్టైల్ ఇమేజ్‌ల కోసం పర్సనల్ ఫోటోలని.. ఏఐ టూల్స్‌లో అప్‌లోడ్ చేయడం సేఫేనా? అని! దీనిపై.. సైబర్ నిపుణులు ఏం చెబుతున్నారు? జిబ్లీ ఫోటోస్ క్రియేట్ చేసుకుంటే.. డేటా ప్రైవసీకి ముప్పు తప్పదా? అసలు.. చాట్ జీపీటీ దీనిపై ఏమంటోంది?

సోషల్ మీడియాలో జిబ్లీ తుఫాను

చాట్ జీపీటీ జిబ్లీ స్టైల్ ఇమేజ్ జనరేటర్‌ని ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే.. అది సోషల్ మీడియాలో ఓ తుపానుని క్రియేట్ చేసింది. జిబ్లీ స్టైల్ ఫోటోల కోసం.. సోషల్ మీడియా యూజర్లంతా తమ ఫోటోలను అప్‌లోడ్ చేసేస్తున్నారు. కానీ.. మీకు తెలియకుండానే ఓపెన్ ఏఐకి ఫేస్ డేటాని అందజేస్తున్నారని.. డిజిటల్ ప్రైవసీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్క్రాప్ డేటాకు వర్తించే చట్టపరమైన పరిమితుల్ని దాటవేస్తూ.. స్వచ్ఛందంగా సమర్పించిన చిత్రాలను పొందేందుకు ఓపెన్ ఏఐని అనుమతిస్తున్నారు. దానివల్ల మీ ఫేస్ ఐడెంటిటీని.. మీకు మీరే ఇతరులకు అప్పగిస్తున్నారని చెబుతున్నారు.

అనుమతి లేకుండానే భద్రపరిచే చాట్ బాట్

దీని ద్వారా భవిష్యత్‌లో ఆ ఫోటోలను దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయని టెక్ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. పర్సనల్ ఫోటోలను ఏఐ చాట్ బాట్స్‌లో అప్‌లోడ్ చేయడం.. డేటా ప్రైవసీకి ప్రమాదకరమని చెబుతున్నారు. స్వచ్ఛందంగా మన ముఖ కవళికల డేటాని మనమే అందిస్తున్నామని.. ఈ డేటా భవిష్యత్తులో ఎలా వినియోగిస్తారనేది ఇప్పుడే చెప్పలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా చాట్ బాట్స్.. వినియోగదారుల అనుమతి లేకుండానే ఈ ఫోటోలను భద్రపరుచుకొని, వాటిని వ్యాపార ప్రయోజనాలకు కూడా వాడే అవకాశం ఉందంటున్నారు.

అభివృద్ధి చెందుతున్న ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ

ఒక్కసారి మన వ్యక్తిగత ఫోటోలను.. ఏఐ యాప్స్‌కు అప్పజెబితే.. ఇక వాటి కంట్రోల్ మన చేతుల్లో ఉండదు. రోజురోజుకు ఫేక్ రికగ్నిషన్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న వేళ.. వ్యక్తిగత భద్రతపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్ని కంపెనీలు, హ్యాకర్లు ఈ డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి రిస్క్‌ల నుంచి తప్పించుకోవాలంటే.. యూజర్లు తమ పర్సనల్ ఫోటోలను ఎక్కడైనా అప్‌లోడ్ చేసే ముందే ఆలోచించాలి.

అవసరమైన పర్మిషన్స్ ఇవ్వకుండా జాగ్రత్తపడాలి!

ప్రైవేసీ పాలసీ నిబంధనల్ని స్పష్టంగా చదివి.. అనవసరమైన పర్మిషన్స్ ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా.. ఉచిత సేవల్ని వాడుకోవడానికి ముందు.. దాని వెనకున్న గోప్యతా ప్రమాదాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. సోషల్ మీడియా ట్రెండ్స్‌లో పార్టిసిపేట్ చేయడం సంతోషాన్నిచ్చినా.. డేటా ప్రైవసీ విషయంలో జాగ్రత్తగా ఉండటం కూడా ముఖ్యమేనని సూచిస్తున్నారు.

ఏఐ యాప్స్‌కి మీ పర్శనల్ డేటా, ఫోటోలు

ఫ్రీగా అని చెప్పి.. చాలా మంది జిబ్లీ ఇమేజ్‌లు క్రియేట్ చేసుకుంటున్నారు. కానీ.. మీ అంతట మీరే.. మీ పర్సనల్ డేటాని, ఫోటోలను వాళ్ల చేతుల్లో పెట్టేస్తున్నారు. ఓపెన్ ఏఐ, మెటా, గూగుల్ లాంటి కంపెనీలు యూజర్ల ఫోటోలను ఉపయోగించి.. వాటి ఏఐ మోడళ్లకు ట్రైనింగ్ ఇస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దాంతో.. మీ డేటా ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదముంది. భవిష్యత్తులో మీ ఫోటోని వాడి మీ వివరాలన్నీ సేకరించొచ్చు. అంతేకాదు జిబ్లీ ఇమేజ్ జనరేట్ చేయడం కోసం మీరు అప్‌లోడ్ చేసిన ఫోటోస్‌తో.. డీఫ్‌ఫేక్ వీడియోలు చేసిన మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో క్లియర్ వ్యూ ఏఐ.. సోషల్ మీడియా, వార్తల సైట్‌లు, పబ్లిక్ రికార్డుల నుంచి పర్మిషన్ లేకుండా 3 బిలియన్ల ఫోటోలను దొంగిలించింది.

తీవ్రమైన డేటా ప్రైవసీ సమస్యల్ని లేవనెత్తుతున్న చాట్ జీపీటీ

వాటిని పోలీసులు, ప్రైవేట్ కంపెనీలకు విక్రయించడం ద్వారా డేటాబేస్‌ని సృష్టించిందనే ఆరోపణలు ఎదుర్కొంది. అందువల్ల.. ఏఐ చాట్ బాట్ ట్రైనింగ్ కోసం.. వేలాది ఫోటోలను సేకరించేందుకు.. ఓపెన్ ఏఐ ఈ ట్రెండ్‌ని ఓ మార్గంగా వినియోగించుకుంటుందనే అనుమానాలున్నాయి. యూజర్లంతా.. ఈ ఫీచర్‌తో ఫుల్ ఖుషీ అవుతుండగా.. చాలా మంది టెక్ నిపుణులు మాత్రం.. కొత్త ఫేస్ డేటాని అందజేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడిది.. తీవ్రమైన డేటా ప్రైవసీ సమస్యల్ని లేవనెత్తుతోంది. ఓపెన్ ఏఐ డేటా సేకరణ వ్యూహం.. కేవలం ఏఐ కాపీరైట్ సమస్య కంటే ఎక్కువ అంటున్నారు.

పర్శనల్ ఫోటోలను అప్‌లోడ్ చేయడం సేఫేనా?

జిబ్లీ ఫోటోల విషయంలో.. వ్యక్తిగత డేటా భద్రతపై ఓపెన్ ఏఐ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన లేదు. అయితే.. ఇలా జిబ్లీ కోసం పర్సనల్ ఫోటోలను అప్‌లోడ్ చేయడం సేఫేనా అని చాట్ జీపీటీని అడిగితే.. అది కూడా సురక్షితం కాదని తెలిపింది. అందువల్ల.. ఏఐ చాట్ బాట్‌లతో వ్యక్తిగత ఫోటోలు షేర్ చేసుకోకపోవడం బెటర్ అంటున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ చిత్రాలు అప్‌లోడ్ చేసినప్పుడు.. వాటిని ప్రాసెస్ చేసేందుకు ఓపెన్ ఏఐకి పర్మిషన్ ఇస్తారు.

ప్రైవేట్ ఫోటోలను సులభంగా యాక్సెస్ చేసే ఓపెన్ ఏఐ

ఇది.. ఆ సంస్థకు ఎక్కువ స్వేచ్ఛను ఇచ్చే భిన్నమైన, చట్టపరమైన ఆధారం. ఓపెన్ ఏఐ పర్సనల్, ప్రైవేట్ ఫోటోలను ఫ్రీగా, సులభంగా యాక్సెస్ చేస్తుందని చెబుతున్నారు. అందువల్ల జిబ్లీ ఇమేజ్ క్రియేట్ చేసుకునే ముందు ఇవన్నీ ఆలోచించండి. మనకు.. జస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసుకునేందుకు పనికొస్తుంది. కానీ.. ఏఐ చాట్ బాట్ కి అలా కాదు. మనం ఊహించనంతగా వాడేస్తుంది. అందుకోసమే.. సైబర్ స్మార్ట్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×