BigTV English

Pakistan Turkey Relation: ఛీ ఛీ ద్రోహి.. చేసిన సాయం మరిచి.. పాక్‌కు తోడుగా టర్కీ..

Pakistan Turkey Relation: ఛీ ఛీ ద్రోహి.. చేసిన సాయం మరిచి.. పాక్‌కు తోడుగా టర్కీ..

భారత్ చేసిన సాయానికి కృతజ్ఞత లేదు!

ఆపదలో ఆదుకున్నారనే ఆలోచన లేదు!


నీచబుద్ధిని బయటపెట్టుకున్న టర్కీ

టర్కీ.. తన నీచబుద్ధిని బయటపెట్టుకుంది. ఆపదలో ఎంతో సాయం చేసిన ఇండియాని పూర్తిగా మర్చిపోయింది. భారత్ శత్రుదేశమైన పాకిస్తాన్‌తో చెట్టపట్టాలేసుకొని షో చేయడమే కాదు.. పాక్‌కు సైనిక సాయం కూడా చేస్తోంది టర్కీ. విమానాల్లో డ్రోన్లు, మిసైళ్లతో పాటు ఇతర ఆయుధ సామాగ్రిని పాక్‌కు సరఫరా చేసింది. టర్కీ ఇచ్చిన డ్రోన్లనే పాక్ భారత్‌పై ప్రయోగిస్తున్నా.. ఇండియన్ ఆర్మీ వాటిని బూడిద చేస్తోంది. మన దగ్గరున్న బలమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్.. పాక్ డ్రోన్లను గాల్లోనే పేల్చేస్తున్నాయి. గురువారం పాకిస్తాన్ భారీ స్థాయిలో భారత్‌పై డ్రోన్ దాడులు చేసింది. దాదాపు 400 డ్రోన్లను ప్రయోగించింది. వాటన్నింటిని.. భారత్ కూల్చేసింది. ఆ శకలాలను పరిశీలించగా.. అవన్నీ టర్కీ మేడ్ డ్రోన్లని తేలింది. అయితే.. 2023లో టర్కీలో భూకంపం వచ్చి ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది.

భారత్‌పై దాడికి పాకిస్తాన్‌కు డ్రోన్లు పంపిన టర్కీ

ఆ సమయంలో.. ఆపరేషన్ దోస్త్ పేరిట భారత్ ఆర్మీని పంపి.. 8 లక్షల 45 వేల డాలర్ల విలువైన సామాగ్రిని అందచేసి.. రక్షణ చర్యలతో ఆదుకుంది. భారత్ చేసిన సాయాన్ని మరిచి.. టర్కీ పాకిస్తాన్‌కు సాయం చేయడంపై విమర్శలు వస్తున్నాయ్. చేసిన సాయానికి కృతజ్ఞత చూపకపోయినా పర్వాలేదు. కానీ.. ద్రోహం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు టర్కీ చేస్తోంది అదే. ఆ దేశంలో భారీ భూకంపం సంభవించినప్పుడు.. సాయం ప్రకటించిన తొలి దేశం భారత్. ఆపరేషన్ దోస్త్ పేరిట భారీగా మానవతా సాయాన్ని అందించింది. బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను పంపింది ఇండియన్ గవర్నమెంట్. అప్పుడు మనం మానవత్వాన్ని చూపితే.. దానిని మరిచి.. భారత్‌పై దాడికి పాకిస్తాన్‌కు డ్రోన్లను పంపింది టర్కీ.

టర్కీ అధ్యక్షడు ఎర్డోగాన్‌కు భారత్ ద్వేషం

టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు.. ముందు నుంచీ భారత్ అంటే విపరీతమైన ద్వేషం ఉంది. కశ్మీర్ అంశంలోనూ ఎర్డోగాన్ అనేకసార్లు అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై విమర్శలు గుప్పించారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత.. ప్రపంచ దేశాలన్నీ టెర్రరిస్ట్ ఎటాక్‌ని ఖండించాయి. ఇదే సమయంలో.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ని కలిశారు ఎర్డోగాన్. పాకిస్తాన్‌కు వత్తాసు పలికారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించలేదు సరికదా.. టెర్రరిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక టూరిస్టుల కుటుంబాలకు సానుభూతి కూడా వ్యక్తం చేయలేదు. పైగా.. పహల్గాం ఉగ్రదాడి జరగగానే పాకిస్తాన్‌పై భారత్ దాడి చేస్తుందని.. టర్కీ ముందే ఊహించింది.

పాక్‌లో ఒట్టోమన్ శైలిలో మసీదుని నిర్మించిన టర్కీ

ప్రపంచమంతా భారత్‌కు సంఘీభావం తెలుపుతున్న టైమ్‌లో.. ఆరు సైనిక విమానాల్లో పాక్‌కు ఆయుధాలను పంపింది ఎర్డోగాన్ ప్రభుత్వం. టర్కీకి చెందిన సీ-130ఈ హెర్క్యూలస్ విమానం.. ఏప్రిల్ 28న పాకిస్తాన్‌లో దిగిన విషయాన్ని.. అంతర్జాతీయ ఎయిర్ ఇంటలిజెన్స్ సంస్థలు గుర్తించాయి. అయితే.. ఇంధనం నింపుకునేందుకే.. తమ యుద్ధ విమానం అక్కడ దిగిందని ప్రకటించి.. తప్పించుకునే ప్రయత్నం చేసింది టర్కీ. తర్వాత.. ఓ యుద్ధ నౌకను కూడా కరాచీ పోర్టుకు పంపింది. ఇప్పుడు.. టర్కీ పంపిన డ్రోన్లనే.. భారత్‌పై ప్రయోగిస్తోంది పాకిస్తాన్. పహల్గాం దాడి జరిగిన తర్వాత.. ముస్లిం దేశాల్లో టర్కీ, అజర్ బైజాన్ మాత్రమే పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచాయి.

టర్కీ రాజధాని అంకారాలో జిన్నా పేరిట ఓ ప్రధాన రోడ్డు

పాకిస్తాన్-టర్కీ మధ్య మధ్య దశాబ్దాల క్రితం నుంచే సంబంధాలున్నాయ్. టర్కీ స్వాతంత్య్ర యుద్ధం సమయంలో.. ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతంలోని వారు.. ఒట్టోమన్ సామ్రాజ్యానికి ఆర్థికసాయం అందించారు. ఈ సాయమే.. టర్కీలో పాకిస్తానీయులపై సానుకూల దృక్పథాన్ని సృష్టించిందంటారు. పైగా.. రెండు దేశాలు ముస్లిం బహుళ జనాభా కలిగి ఉన్నాయి. బ్రిటీష్ రాజ్‌లోని ముస్లింలు.. ఒట్టోమన్ సుల్తాన్‌ను ఇస్లాం ఖలీఫాగా గౌరవించారు. ఇది.. రెండు దేశాల మధ్య మతపరమైన సంబంధాలను బలపర్చింది. పాకిస్తాన్ స్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా, టర్కీ స్థాపకుడు ముస్తఫా కెమాల్ అటాటర్క్‌ని ఆదర్శంగా భావించి.. పాకిస్తాన్‌ని ఆధునిక రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. టర్కీ రాజధాని అంకారాలోనూ.. జిన్నా పేరిట ఓ ప్రధాన రోడ్డు ఉంది. అలాగే.. పాకిస్తాన్‌లోనూ అటాటర్క్ పేరిట రోడ్లు ఉన్నాయ్. పాక్‌లో.. ఒట్టోమన్ శైలిలో టర్కీ ఓ మసీదుని కూడా నిర్మించింది.

1951లో పాక్-టర్కీ మధ్య శాశ్వత స్నేహ ఒప్పందం

1950లలో పాక్, టర్కీ.. అమెరికా బ్లాక్‌లో భాగంగా ఉండి.. కమ్యూనిజానికి వ్యతిరేకంగా సహకరించాయ్. 1951లో ఈ రెండు దేశాల మధ్య శాశ్వత స్నేహ ఒప్పందం కుదిరింది. 1954లో టర్కీ-పాకిస్తాన్ స్నేహం, సహకార ఒప్పందంతో రక్షణ సంబంధాలు బలపడ్డాయ్. ఈ మధ్యకాలంలో రెండు దేశాలు రక్షణ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేశాయి. టర్కీ.. డ్రోన్లు, మిసైళ్లు, యుద్ధ నౌకలు సరఫరా చేసింది. అదేవిధంగా.. ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ అభివృద్ధిలోనూ రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఉమ్మడి సైనిక విన్యాసాలు కూడా నిర్వహించాయి. టర్కీ పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేయడమే కాదు.. పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాల అప్‌గ్రేడేషన్‌లో టర్కీకి సహకరిస్తోంది. అంతేకాదు.. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్.. టర్కీ పైలట్లకు ట్రైనింగ్‌తో పాటు సాంకేతిక సహకారం అందిస్తోంది.

టర్కీ డ్రోన్లతో సరిహద్దు పాకిస్తాన్ ఓవరాక్షన్

పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. కశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఈ సమయంలో పాకిస్తాన్ సైనిక సామర్థ్యాలు బలహీనంగా ఉన్నాయని రిపోర్టులు సూచించాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. టర్కీ పాక్‌కు సైనికసాయం చేసింది. అయితే.. రక్షణ రంగంలో టర్కీ, పాకిస్తాన్ దీర్ఘకాల భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. అందువల్లే.. పాక్‌కు ఆయుధాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, డిఫెన్స్ టెక్నాలజీని సప్లై చేస్తోంది టర్కీ. చైనా తర్వాత టర్కీనే.. పాక్‌కు ముఖ్యమైన ఆయుధ సప్లయర్‌గా మారింది. గత ఐదేళ్లలో.. టర్కీ ఆయుధ ఎగుమతుల్లో 10 శాతం పాకిస్తాన్‌కే వెళ్లాయ్. ఇప్పుడు కూడా టర్కీ డ్రోన్లతోనే.. భారత్‌పై దాడులు చేస్తోంది పాకిస్తాన్.

200 రౌండ్ల వరకు బుల్లెట్స్‌ని పేల్చేందుకు వీలుగా గన్

టర్కీ ఇచ్చిన డ్రోన్లతో కవ్వింపు చర్యలకు దిగుతూ.. పాకిస్తాన్ ఓవరాక్షన్ చేస్తోంది. అయితే.. టర్కీ డ్రోన్లని, పాక్ మిసైళ్లని.. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్.. చాలా సులభంగా దెబ్బతీస్తున్నాయి. ఇప్పటివరకు పాక్ వాడిన డ్రోన్లలో టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న అసిస్‌గార్డ్ సొంగర్ డ్రోన్లే ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు అనేక మిసైళ్లని, ఎగిరే బాంబుల్ని భారత్‌పైకి గురిపెట్టింది పాకిస్తాన్. అయితే.. భారత ఎయిర్ డిఫెన్స్‌ని దెబ్బతీసేందుకు పాక్ మరో ఎత్తుగడ వేసింది. పెద్ద సంఖ్యలో పనికిరాని చౌకబారు మిసైళ్లని, ఆయుధాల్లేని డ్రోన్లని కూడా భారత్‌పైకి ప్రయోగించింది.

పాక్ ఎత్తుగడల్ని తిప్పికొట్టిన భారత సైన్యం

మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వీటిని కూల్చే పనిలో ఉన్నప్పుడు.. ఇతర డ్రోన్లు, మిసైళ్లు దాడులు చేస్తాయి. ఇలాంటి ఎత్తుగడల్ని కూడా భారత సైన్యం తిప్పికొట్టింది. ఇటీవలికాలంలో యుద్ధాల్లో డ్రోన్లను భారీ సంఖ్యలో ఉపయోగించే పరిస్థితులు పెరిగాయి. మూడేళ్లకు పైగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో.. డ్రోన్లదే కీలకపాత్ర. ఆ యుద్ధం నుంచి పాఠాలు నేర్చుకొని.. అతి త్వరగా, సమర్థంగా ఆచరణలో పెట్టడం వల్లే.. ఇండియా.. పాకిస్తాన్ దాడుల్ని అద్భుతంగా తిప్పికొడుతోందని రక్షణ నిపుణులు చెబుతున్నారు.

సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఇండియన్ ఎయిర్ డిఫెన్స్

టర్కీ మేడ్ అసిస్‌గార్డ్ సొంగర్ డ్రోన్లు ఎంతో ప్రమాదకరమైనవిగా చెబుతున్నారు. దీని ఆపరేషనల్ రేడియస్ 3 కిలోమీటర్లు. ఇందులో.. ఆటోమేటిక్ మెషీన్ గన్ ఉంటుంది. దానితో.. 200 రౌండ్ల వరకు బుల్లెట్స్‌ని పేల్చేందుకు వీలుంది. అంటే.. ఒక్కో డ్రోన్‌ అనేకమందిని చంపగలుగుతుంది. 2024లో దీనిని అప్‌గ్రేడ్‌ చేసి గ్రెనేడ్‌ను కూడా ఫైర్‌ చేసే సామర్థ్యం కల్పించారు. 5 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఈ డ్రోన్లు.. గ్రౌండ్ టార్గెట్లని అత్యంత కచ్చితత్వంతో పేల్చేయగలిగే కెపాసిటీ దీనికి ఉంది. డొమెస్టిక్ సెక్యూరిటీ, యుద్ధ సమయాల్లో వాడేందుకు దీనిని తయారుచేశారు. ఈ సొంగర్ డ్రోన్లు టర్కీ ఆర్మీలో 2020 నుంచి సర్వీస్‌లో ఉన్నాయి. కమ్యూనికేషన్ లాస్ అయినా, బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోయినా.. దానంతట అదే వెనక్కి వచ్చేసే టెక్నాలజీ కూడా ఉంది. ఇంతటి ప్రమాదకరమైన డ్రోన్లని కూడా ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా ఎదుర్కొంది. వాటిని.. గాల్లోనే పేల్చేసింది.

ద్వైపాక్షిక వాణిజ్యం 5బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యం

పశ్చిమ దేశాల నుంచి సైనిక వాణిజ్యం పరిమితం కావడంతో.. టర్కీతో రక్షణ రంగ సంబంధాలను మెరుగుపరుచుకుంది పాకిస్తాన్. అంతేకాదు రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని.. 5 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో.. వాణిజ్యం, ఇంధనం, బ్యాంకింగ్ సహా ఇతర రంగాల్లో సహకారం ఉంది. టర్కీ అభివృద్ధి సంస్థ కూడా .. పాకిస్తాన్‌లో సామాజిక అభివృద్ధి ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెడుతోంది. కశ్మీర్ సమస్యపైనా టర్కీ పాక్‌కు మద్దతిస్తోంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో.. జనాభిప్రాయ సేకరణతో సమస్యను పరిష్కరించాలని వాదిస్తోంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ సైతం.. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలోనూ, పాకిస్తాన్ పార్లమెంట్‌లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు.

ఇస్లామోఫోబియా ముస్లింల రక్షణపై బలపడ్డ బంధాలు

మరోవైపు.. పాకిస్తాన్.. టర్కీకి సైప్రస్ సమస్యపై మద్దతు ఇస్తోంది. ఆర్మేనియన్ జెనోసైడ్‌ని గుర్తించడానికి నిరాకరిస్తుంది. 2023 టర్కీ భూకంపం సమయంలో పాకిస్తాన్ సాయం చేసింది. పాక్ నేవీ.. టన్నులకొద్దీ సహాయ సామాగ్రిని సరఫరా చేసింది. వాస్తవానికి.. టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్.. ఇస్లామిక్ ప్రపంచంలో నాయకత్వ పాత్రను కోరుకుంటన్నారు. అందుకోసమే.. పాకిస్తాన్‌తో ఇంత సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ రెండు దేశాలు.. గాజా, పాలస్తీనా లాంటి అంతర్జాతీయ సమస్యలపైనా.. ఉమ్మడి దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. టర్కీ, పాక్.. ఇస్లామోఫోబియా, ముస్లిం, మైనారిటీల రక్షణపై ఉమ్మడిగా పనిచేయడం కూడా.. రెండు దేశాల సంబంధాలు బలపడ్డాయి.

భారత్ ‌లో విమర్శలకు దారితీసిన టర్కీ సైనిక సాయం

టర్కీకి భారత్‌తోనూ స్నేహపూర్వక సంబంధాలున్నప్పటికీ.. పాకిస్తాన్‌తో ఉన్న రక్షణ సహకారం.. ఇస్లామిక్ ప్రపంచంలో ప్రభావాన్ని పెంచేందుకు, ప్రాంతీయ సమతుల్యతను కాపాడేందుకు ఓ వ్యూహంగా భావిస్తున్నారు. అందుకోసమే.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సైనిక చర్యలకు సిద్ధమవుతున్న సమయంలో.. పాకిస్తాన్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు.. టర్కీ సాయం కోరినట్లు సమాచారం ఉంది. అయితే.. టర్కీ సైనిక సాయం భారత్‌లో విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా.. టర్కీ భూకంపం సమయంలో అందించిన సాయాన్ని మరిచి.. పాక్‌కు మద్దతుగా నిలిచిన టర్కీని బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×