BigTV English

Pakistan Crisis: సంక్షోభంలో పాక్.. తారాస్థాయికి చేరిన అల్లర్లు

Pakistan Crisis: సంక్షోభంలో పాక్.. తారాస్థాయికి చేరిన అల్లర్లు

Pakistan Crisis: ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ భగభగమండిపోతోందా? దేశంలో ఎటు చూసినా నిరసన జ్వాలలు అంటుకుంటున్నాయా? ఏకంగా మంత్రుల ఇళ్లకే అగ్గి పెడుతున్నారా? పోలీసులు ఎక్కడ కనిపిస్తే అక్కడ దాడులు చేస్తున్నారా? ఆస్పత్రుల్లో చేరినా వదలకుండా తుక్కు రేగ్గొడుతున్నారా? ఇంతకీ ఎక్కడ జరిగిందీ ఘటన. ఎందుకిలాంటి పరిస్థితి దాపురించింది దాయాది దేశానికి?


సింధ్ హోం మంత్రి ఇంటిపై మూక దాడి

సింధ్ హోంమంత్రి జియావుల్ హసన్ ఇంట్లోకి.. ఒక గుంపు చొరబడి దాడి చేయడం మాత్రమే కాదు.. తర్వాత నిప్పు అంటించారు కూడా. కారణం. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత సింధూ జలాలపై భారత్ తీసుకున్న కఠిన నిర్ణయం. దీంతో పాకిస్థాన్ సింధ్ లో నిరసనలు మిన్నంటాయి. నీళ్లు లేక పోవడంతో పాక్ ప్రజలు తిరగబడ్డారు. హోం మంత్రి జియా ఉల్ హసన్ ఇంటిని తగలబెట్టారు.


ఏకే 47 కాల్పుల వీడియోల కలకలం

ప్రస్తుతం పాక్ ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉందో చెప్పే ఘటనలో ఇదొకటి. నీటి కటకటకొద్దీ.. నిరసన కారులు హోం మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏకే 47 తో గాల్లోకి కాల్పులు జరుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయ్.

ఇదే సింధ్ లో లష్కరే లీడర్ ఖలీద్ హతం

ఇప్పటికే సింద్ లోని మట్లీలో లష్కరే ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ ని హతం చేశారు. ఆ ఘటన మరవక ముందే ఏకంగా సింధ్ హోం మంత్రి ఇంటినే స్థానికులు తగలబెట్టడం చూస్తుంటే.. పాకిస్థాన్ లో అగ్గిరాజుకుందనడనికి ఇంతకన్నా మించిన సాక్ష్యం లేదు.

పోలీసులు కనిపిస్తే అక్కడ తరిమి కొడుతోన్న జనం

మరో భయంకరమైన నిజమేంటంటే.. పోలీసులు ఎక్కడ కనిపిస్తే అక్కడ తరిమి తరిమి కొడుతున్నారు ప్రజలు. దీని ఉద్దేశమేంటంటే.. నేరుగా ప్రభుత్వాన్ని ఏమీ అనలేక ప్రభుత్వ ప్రతినిథులుగా పోలీసులను భావించి పాకిస్థానీయులు ఈ విధంగా రియాక్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. దీనంతటికీ కారణం ఏంటనిచూస్తే.. ఒక చావు దెబ్బ పది పరాజయాలకు దారి తీస్తుందని అంటారు. సరిగ్గా అలాగే.. భారత్ చేతిలో పాకిస్తాన్ ఘోరంగా దెబ్బ తిన్న విషయం ప్రపంచమంతా చూసింది. అప్పటికీ పాకిస్థాన్ పీఎం నుంచి అఫ్రిదీ లాంటి క్రికెటర్ల వరకూ మేమే గెలిచాం మేమే గెలిచాం అంటే అప్పుడందరూ చూసి గేలి చేశారు. కానీ, అసలు విషయం ఇదీ.

దేశ ప్రధాని ఓ పిరికి పంద- పాక్ ఎంపీ

పాకిస్థాన్ భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోతే ప్రజల్లోనూ ఒక రకమైన తిరుగుబాటు వస్తుంది. ఇప్పటికే పాకిస్థాన్ పార్లమెంట్లో ప్రభుత్వానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ దేశ ఎంపీ ఒకరు.. ఈ ప్రధాని ఒక పిరికిపంద అంటూ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ దేశ రక్షణ మంత్రి సైతం తలతిక్క సమాధానాలు చెప్పి ప్రభత్వ పరువు తీశారు. కట్ చేస్తే ప్రతిపక్ష కార్యకర్తలంతా రోడ్లపైకి వచ్చి చేతగాని ప్రభుత్వంగా స్లోగన్లు కొట్టారు. స్టాక్ మార్కెట్ నిలువునా కుప్పకూలి.. వేల కోట్ల నష్టం తీసుకొచ్చింది. దీంతో ఐఎంఎఫ్ నుంచి అప్పు తీస్కోవడం. అది చెప్పినట్టల్లా ఆడాల్సి రావడంతో.. దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది.

25 సార్లు IMF నుంచి అప్పు తీస్కున్న పాక్

ఇపుడీ హోం మంత్రి ఇంటికి అగ్గి పెట్టడానికీ ఐఎంఎఫ్ కీ ఉన్న లింకేంటంటే.. పాకిస్థాన్ ఇప్పటి వరకూ 25 సార్లు అప్పు తీస్కుంది. 2026 నాటికి పాక్ ఐఎంఎఫ్ కి చెల్లించాల్సిన మొత్తం 77 బిలియన్ డాలర్లు. దీన్ని పాకిస్థాన్ కరెన్సీలోకి లెక్క వేసుకుని ఎంత కట్టాలో చూసుకోడానికి కూడా ఆ ప్రభుత్వానికి ధైర్యం సరిపోవడం లేదు. దీంతో ఐఎంఎఫ్ ఏం చెబితే అది చేయాల్సిన దుస్థితి.

ప్రభుత్వ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు

ఒకపక్క సింధూ నీటిని మళ్లించి పంజాబ్ కు సరఫరా పెంచేందుకు పాక్ ప్రభుత్వం కాలువ నిర్మించాలని చూస్తోంది. దీంతో ప్రభుత్వ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. తమ భూములకు సాగు నీరు, తమకు తాగునీటికి కటకట ఏర్పడుతుందని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

IMF ఒత్తిడితో పంటలకు కనీస మద్ధతు ధర నిలిపివేత

ఇదిలా ఉంటే ఐఎంఎఫ్ ఒత్తిడితో పంటలకు కనీస మద్ధతు ధర నిలిపేశారు. దానికి తోడు కార్పొరేట్ వ్యవసాయం కోసం వారసత్వ భూములను బలవంతంగా లాక్కోవడంతో ఇక్కడి ప్రజలు రగిలిపోతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా.. నేషనల్ హైవేను దిగ్బంధించారు. ఒక్కసారిగా ఈ ప్రాంత వాతావరణం భగ్గుమంది. ఎప్పుడైతే పోలీసులు ఎంట్రీ ఇచ్చారో ఆందోళన మరింత తీవ్రతరమైంది. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారు. పోలీసులు కనిపిస్తే చాలు దాడులు చేస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయాలకు మద్ధతిస్తోన్న మంత్రి ఇంటికి నిప్పు

ఈ ఘర్షణ కాస్తా హోం మంత్రి ఇంటికి పాకింది. మూకదాడులు చేసి మంత్రి ఇంటినే తగలబెట్టి తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు నిరసన కారులు. కారణం.. ఈ మొత్తం పోలీసు చర్యకు మంత్రే కారణమని ప్రజలు భావించడం. అంతే కాదు.. హోం మంత్రి, సింధ్ విద్వంసానికి దారి తీసే విధానాలకు మద్ధతిస్తున్నారన్న కసీ క్రోధందో ఆయనింటిని తగలబెట్టేశారు. తమకు అడ్డొస్తున్న పోలీసులు ఆస్పత్రుల్లో చేరినా వదలకుండా.. దాడులకు తెగబడుతున్నారు ప్రజలు.

ఈ ఆందోళనలపై పాక్ ప్రభుత్వం స్పందించింది

ఈ ఆందోళనలపై పాక్ ప్రభుత్వం స్పందించింది. సింధ్ లో భద్రతను పెంచే దిశగా పారామిలటరీ దళాలను మొహరించింది. దాడుల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కానీ ఈ ప్రకటనలేవీ పని చేస్తున్నట్టే కనిపించడం లేదు. ఎక్కడ పోలీసులు కనిపిస్తే అక్కడ తుక్కు కింద కొడుతున్నారు. ఇక పారా మిలటరీ దళాలకు సైతం ఇదే మర్యాద చేయాలని గట్టిగా ఫిక్సయ్యారు.

టాప్ మోస్ట్ డేంజరస్ కమ్ డిస్ట్రబ్డ్ కంట్రీగా ముద్ర పడే ఛాన్స్

ఏం చేయాలో అర్ధం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటోంది పాక్ ప్రభుత్వం. ఇప్పటికే అప్పులు పుట్టక- పుట్టిన అప్పులను తీర్చలేక.. నానా తంటాలు. ఉన్న గొడవలు చాలవన్నట్టు ఈ నిరసన సెగలు. దేశం ఇలా అన్ని రకాలుగా దివాళా తీస్తుంటే ఉన్న పరువు తో పాటు వచ్చే రోజుల్లో టాప్ మోస్ట్ డేంజరస్ కమ్ డిస్ట్రబ్డ్ కంట్రీస్ లో ఒకటిగా ముద్ర వేసుకునే ప్రమాదం కనిపిస్తోంది.

ఇంత అలజడులు చెలరేగడానికి కారణాలు చాలానే ఉన్నాయి

దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందన్న సినిమా డైలాగ్ కి అక్షరాలా సరిపోయే దేశం ఈ భూ ప్రపంచం మీద ఏదైనా ఉందంటే అది పాకిస్థాన్ అని టక్కున చెప్పొచ్చు. సోమాలియా వంటి దేశాలున్నా.. అవి ఇంత సంక్షోభంలోనూ.. ఆ దేశ ప్రజలు బతకాల్సిన రీతిలో బతికేస్తున్నారు. కానీ పాకిస్థాన్ పరిస్థితి అలాక్కాదు. అదొక భయానక పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపిస్తోంది.. పాకిస్థాన్ ఈ సమస్యలో ఉంది. ఆ సమస్యలో లేదని చెప్పడానికి వీల్లేదు. ఇంత అలజడులు చెలరేగడానికి కారణాలు చాలానే.

ఏప్రిల్ 28న వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ తో పాక్ ఒప్పందం

ఏప్రిల్ 28న అంటే పహెల్గాం దాడి జరిగిన ఆరు రోజుల తర్వాత.. పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్ అసీం మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో కలసి.. అమెరికాకు చెందిన ఒక క్రిష్టో ఫండ్.. వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ ఆస్తులను టోకనైజ్ చేసి.. క్రిష్టో ప్లాట్ ఫామ్ పై అమ్మకానికి ఉంచారు. ఒక రకంగాచెబితే ఒక దేశం మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లో పెట్టినట్టన్నమాట. ఈ సంస్థకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబాలకు సంబంధాలున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఒక్కసారిగా చైనా, భారత్ లో ఆందోళనవ్యక్తమైంది. దీని వల్ల పాక్ ఆర్ధిక వ్యవస్థ పతనమవుతుందని అంతర్గత అశాంతి చెలరేగుతుందని విశ్లేషిస్తున్నారు అంతర్జాతీయ నిపుణులు.

బలూచిస్తాన్ లో పాక్ ఆనవాళ్లు లేకుండా చేస్తోన్న BLA

ఇక బలూచిస్తాన్ సంగతి సరే సరి. ఇక్కడైతే.. పాకిస్థాన్ కి సంబంధించిన ఏ ఒక్క ఆనవాళ్లూ మిగలకుండా ధ్వంసరచన సాగిస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బలూచిస్తాన్ ఈజ్ నాట్ పాకిస్తాన్ అంటూ వీరు పాకిస్థాన్ సైనికులను తరిమి తరిమి కొడుతున్నారు. వారి కార్యాలయాలను తమ కంట్రోల్లోకి తీసుకుని.. ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే బలూచిస్తాన్.. స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని.. భారత్ తో సహా వివిధ దేశాలు తమ దేశంలో ఏంబసీలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చింది. దీంతో పాటు ఐక్యరాజ్య సమితికి కూడా తమను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని విన్నవించుకుంది.

ఖైబర్ పంఖ్తుంఖ్వా మిత్రదేశాలతో సాయుధ పోరు

ఖైబర్ పంఖ్తుంఖ్వా గొడవేంటో చూస్తే.. ఇది మధ్య ఆసియా మిత్రదేశాలతో కూడిన సాయుధ పోరాటం. గతంలో యుద్ధంగా ఉన్న ఇది.. 2017 నాటికి తిరుగుబాటుగా రూపాంతరం చెందింది. జనరల్ బజ్వా నాయకత్వంలోని సైన్యం.. అదే ఏడాది.. 2600 కిలోమీటర్ల మేర పొడవైన పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు కంచె వేసింది. వెయ్యి మిలటరీ పోస్టులను ఏర్పాటు చేసింది పాకిస్థాన్. దానికి తోడు ఆఫ్గన్ శరణార్దులపై పాక్ ఉక్కుపాదం వంటి అంశాలతో ఇక్కడో నిరసనజ్వాల దారుణంగా రాజుకుంటోంది. ఈ మంట కొద్దీ ఆఫ్గినిస్తాన్ పాకిస్తాన్ అంటేనే భగ్గుమంటోంది. ఇటు భారత్ తో పాటు అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సైతం తమ వంతు సాయం అందిస్తోంది. దీంతో పాకిస్థాన్ ఇటు సింధ్, అటు బలూచిస్తాన్, ఖైబర్ పంఖ్తుంఖ్వా వంటి ప్రాంతాలతో పీకలోతు పోరాటంకొనసాగిస్తోంది.

చైనాకు ఖనిజాలు తవ్వుకునే అవకాశం

ఒక పక్క అమెరికా సంస్థతో చేసుకున్న ఒప్పందంతో పాటు. చైనాకు కూడా ఇక్కడి ఖనిజ నిల్వలు తవ్వుకునే అవకాశం కలిపించింది పాకిస్థాన్ ప్రభుత్వం. ఈ విషయం గుర్తించిన బలూచీలు.. చైనా వారిపై కూడా దాడులకు తెగబడుతున్నారు. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వానికి ఏం చేయాలో అర్ధంకాని గజిబిజి గందరగోళంగా తయారైంది. ఉన్న సమస్యలు చాలవన్నట్టు.. ఉగ్రవాదులతో సమస్య. పాక్ సైన్యం పోలీసులు చేయలేని పని వీరి చేత చేయిస్తూ.. అవసరం ఉన్నా లేకున్నా సరే ఉగ్రవాదం ద్వారా ఒక రకమైన భారత వ్యతిరేకత నూరిపోస్తూ.. ఎమోషనల్ డ్రామా ప్లే చేయడం.. ఒక వ్యూహంగా అంచనా.

ఇదంతా అగ్రదేశం సాయం కోసం?

అందుకే ఆర్మీ చీఫ్ మునీర్.. కావాలని భారత దేశం మీద పౌర యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉందంటూ దృష్టిమరలించే యత్నం చేశారు. ఇదే అదనుగా భావించిన ఉగ్రవాదులు కశ్మీర్ కేంద్రంగా పహెల్గాం లో దాడులు చేసి అగ్గి రాజేశారు. ఇంత భయానక వాతావరణంలోనూ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా సంస్థతో పెద్ద ఎత్తున ఒప్పందం చేసుకుని.. ఏకంగా పాకిస్థాన్ భూభాగాన్నే బేరం పెట్టి.. ఆ దిశగా వారి సాయం పొందేలాంటి ఎత్తుగడ వేసినట్టున్నారు. ఇన్నేసి సమస్యలతో పోరాడ్డానికి ఒక వేళ తమ శక్తి సరిపోక పోతే.. అగ్రదేశం అమెరికా సాయం తీసుకోవచ్చన్న స్కెచ్ ఇందులో దాగి ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అందుకే ట్రంప్ పాకిస్థాన్ లో అణు లీకేజీ జరిగిందని తెలియగానే ఉలిక్కిపడి.. కాల్పుల ఒప్పందానికి రావల్సిందిగా భారత్ ను కోరినట్టుగా భావిస్తున్నారు.

అసీం మునీర్ కి అరుదైన ఫీల్డ్ మార్షల్ హోదా

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పాకిస్థాన్ తన ఆర్మీ చీఫ్‌ జనరల్ అసీం మునీర్ కి అరుదైన ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించింది. ఈ ఫైవ్ స్టార్ ర్యాంగ్ పాకిస్థాన్ లోనే అత్యన్నతమైనది. గతంలో ఇది ఒక్కసారి మాత్రమే లభించింది. దీన్ని బట్టీ చూస్తుంటే ఒక ఓడిన సైన్యాధ్యక్షుడికి ఇలాంటి ర్యాంక్ ఇవ్వడమేంటన్నది ఒక ప్రశ్న కాగా.. అసలు పాకిస్థాన్ ప్రధానికన్నా యాక్టివ్ పార్ట్ తీసుకుని.. ముందుండి నడిపిస్తోంది మునీరేనని తెలుస్తోంది.

యూఎస్ సాయంతో మునీర్ ప్రభుత్వ ఏర్పాటు?

ఒక రకంగా చూస్తే మునీర్ పాకిస్థాన్ షాడో పీఎంగా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకటి ఉగ్రవాదులను రెచ్చగొట్టడం. రెండు ఆపరేషన్ సిందూర్ లో కావాలనే చేతులెత్తేయడం. మూడు అత్యవసరంగా నేషనల్ కమాండ్ మీటింగ్ పెట్టించి.. అణు ముప్పును అమెరికాకు తెలియ చెప్పడం. వీటన్నిటి మధ్య మెయిన్ ట్విస్ట్ ఏంటంటే.. పాకిస్థాన్ ను అమెరికాకు రియల్ ఎస్టేట్ బేరం పెట్టడం. తర్వాత అమెరికా సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మునీర్ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. వీటన్నిటిని బట్టీ చూస్తుంటే అది ప్రత్యర్ధి దేశమైనా.. పాక్ భవిష్యత్తు తలుచుకోవాలంటేనే భయమేసే పరిస్థితి కనిపిస్తోంది.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×