BigTV English

India Vs pakistan: కాళ్లబేరానికి వచ్చిన పాక్ బుద్ధి మారలే! మేమే గెలిచామంటూ ఈ ప్రసంగాలేందుకంటే?

India Vs pakistan: కాళ్లబేరానికి వచ్చిన పాక్ బుద్ధి మారలే! మేమే గెలిచామంటూ ఈ ప్రసంగాలేందుకంటే?

India Vs pakistan: ఒక పక్క చావుదప్పి కన్ను లొట్టబోయినంత పరిస్థితి. అమెరికాతో మాట్లాడి భారత్ తో కాళ్లబేరానికి వచ్చిన దుస్థితి. అయినా సరే మేమే గెలిచాం అంటున్నాడు పాక్ ప్రధాని. ఇక యుద్ధానికి ముందు ప్రణాళికల్లేవ్ ప్రార్ధనలు తప్ప అన్న ఆర్మీ చీఫ్. వీరికి తోడు అబద్ధాలు ప్రచారం చేసే పాక్ DG .. వీరికి తోడు క్రికెటర్ అఫ్రిదీ విజయోత్సవ ర్యాలీ. ఏంటీ కామెంట్లు, హంగామా ఆర్బాటం.. మేమే గెలిచామంటూ ఈ ప్రదర్శనలేంటి? ప్రసంగాలేంటి? ఇదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్.


దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధాం ప్రధాని షరీఫ్

ఇదీ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. నిర్వాకం. భారత్ తో జరిగిన యుద్ధంలో తాము విజయం సాధించామని ప్రకటించేశారు. తమ దేశం కోసం, తమ పౌరులను రక్షించుకోడానికి తాము ఏం చేయడానికైనా సిద్ధమేనని.. సిగ్గు లేకుండా ప్రకటించేసుకున్నారు. ఇంతకీ తమ పౌరులను రక్షించుకోడానికి పాక్ ప్రధాని ఏం చేశాడని చూస్తే.. భారత్ కర్ణీ హిల్స్ దగ్గర్లో బ్రహ్మోస్ దాడి చేసిన వెంటనే.. అమెరికాను సంప్రదించడం. ఎలాగైనా సరే మీరు మా దేశాన్ని కాపాడాలని వేడుకోవడం. వారు కూడా క్రాస్ చెక్ చేసి.. ఏ మాత్రం ఆలస్యమైనా.. పాక్ అనేది ప్రపంచ చిత్రపటంలోనే ఉండదని భావించి భారత్ తో మంతనాలు చేయడమే పాక్ తమ దేశం కోసం పౌరుల కోసం ఏమైనా చేస్తుందనుకోవాలా? అర్ధం కావడం లేదెవరికీ.


అణు భయం కొద్ధీ నేషనల్ కమాండ్ మీటింగ్..

తమ దేశానికి అణుముప్పు కలుగుతుందన్న భయం కొద్దీ.. నేషనల్ కమాండ్ మీటింగ్ పెట్టింది పాక్. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ద్వారా.. అమెరికాను రంగంలోకి దించి శాంతి చర్చలు సాగించాలని చూసింది. ఇది కూడా ఒక విజయమేనా? అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక పాక్ డీజీ ఐఎస్ పీఆర్ జనరల్ షరీఫ్ అయితే నెక్స్ట్ లెవల్. ఇస్లాం వ్యక్తిగత సైనికుల విశ్వాసం మాత్రమే కాదు.. తమ సైనిక శిక్షణలో కూడా ఒక భాగమేనని బాంబు పేల్చారు.

పాక్ డీజీ ఒక అణు ఉగ్రవాది కొడుకు

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. దీని తర్వాత భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని చేసిన ఆపరేషన్ కి బున్యానమ్ మార్సూస్ అని పేరు పెట్టారు పాకిస్థానీయులు. ఈ విషయమై ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు పాక్ డీజీ ఈ విధంగా సమాధానం చెప్పారు. ఇందులో ప్రపంచం ఆశ్చర్య పోవాల్సిన అవసరమే లేదు. కారణం పాక్ డీజీ ఐఎస్పీఆర్ షరీఫ్ ఒక ఉగ్రవాది కొడుకు. ఈయన తండ్రి సుల్తాన్ బషీరుద్దీన్ ఒక అణు ఉగ్రవాది. ఈ దిశగా లాడెన్ని కూడా కలిశాడు. ఇస్లామిక్ తీవ్రవాదానికి అణ్వాయుధశక్తిని జోడించాలన్న తీవ్ర తాపత్రయం కనబరిచిన వ్యక్తి. ఆనాడే ఐఎస్ఐ దర్యాప్తు చేయడం, ఒకడుగు ముందే పాక్ డీజీ తండ్రి తన పదవిని కోల్పోవడం జరిగాయి. అలాంటి అణు ఉగ్రవాది కొడుకు ప్రస్తుతం పాక్ డైరెక్టర్ జనరల్ ఫర్ పబ్లిక్ రిలేషన్స్. ఇది పాక్ ఆర్మీ ర్యాంకుల్లోనే అత్యున్నతమైన ర్యాంకుల్లో ఒకటి. ఇక్కడే పాకిస్థాన్ సైన్యానికి కి ఇస్లామిక్ తీవ్రవాదానికి.. ఉన్న జన్యుపరమైన సంబంధం తెలిసిపోతోంది.

ప్రణాళికలు లేవు-ప్రార్థనలు మాత్రమే-పాక్ ఆర్మీ చీఫ్

ఇక ఆర్మీ చీఫ్ అసీం మునీర్ సంగతి సరే సరి. మన దగ్గర ఎలాంటి యుద్ధ ప్రణాళికలు లేవు.. కేవలం ప్రార్దనలు తప్ప అని చేతులెత్తడం తప్ప ఆయన చేసిందేమీ లేదు. అయితే భారత్ బ్రహ్మోస్ దాడులకు జడుసుకుని.. అర్జంటుగా అమెరికాతో మాట్లాడమని పురమాయించిన క్రెడిట్ మాత్రం అసీం మునీర్ కి దక్కాల్సిందేనంటారు అంతర్జాతీయ నిపుణులు. అసీం మునీర్ కి సంబంధించిన మరో లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఆపరేషన్ సిందూర్ లో గాయపడ్డ పాక్ సైనికులను ఆయన కలుస్తున్నారు. LOC ఆర్టిలరీ కాల్పులతో పాటు, పాక్ వైమానిక స్థావరాలపై భారత్ చేసిన దాడుల్లో మరణించిన పాక్ సైనికుల సంఖ్య పెద్ద ఎత్తున ఉంది. ఈ పేర్లేవీ ఆయన వెల్లడించడం లేదు.

మనమే గెలిచాం అంటూ అఫ్రదీ ర్యాలీ

పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ సంగతి సరే సరి. ఇతడైతే పాకిస్థాన్ జిందాబాద్.. ఈ యుద్ధంలో మనమే గెలిచామంటూ కరాచీలో భారీ ర్యాలీ తీయడం చూసి క్రికెట్ ప్రపంచం సైతం నివ్వెర పోయింది. పాకిస్థాన్ సైనిక సత్తా ఇప్పుడు తెలిసిందంటూ ఇతడు బీరాలు పలకడం విడ్డూరంగా మారింది. ఈ యుద్ధానికీ తనకూ ఎలాంటి సంబంధం లేకున్నా సరే అఫ్రిదీ అనవసరంగా నోరు పారేసుకుని ట్రోల్స్ కి గురవుతున్నాడు. భారత దేశమే ముందుగా తమపై దాడి చేసినట్టు చెప్పుకొచ్చాడు అఫ్రిదీ. ఇప్పుడు మోడీకి అర్ధమైందంటూ నోటికొచ్చినట్టు కామెంట్లు చేశాడు.

ఒకటీ రెండు కాదు.. పాకిస్థాన్ ఈ యుద్ధం ద్వారా ఎన్నేసి కుటిల ప్రయత్నాలు చేసిందో చెప్పలేం. ఇంటా బయటా ప్రపంచ వ్యాప్తంగా తన పరువు పోగొట్టుకుంటూనే వస్తోంది. ఏ రకంగా చూసినా ఈ దేశానికంటూ ఒక పరువు- ప్రతిష్ట లేదన్న స్వయం ప్రకటనలు చేస్తోంది. తన సొంత పార్లమెంటు నుంచి మొదలు పెడితే ఐక్యరాజ్య సమితి వరకూ పాక్ కి ప్రతిష్ఠా భంగం నానాటికీ తీసికట్టుగానే వచ్చింది. వీటన్నిటినీ కప్పి పుచుకోడానికి కొత్త అవతారమెత్తింది పాపిష్టి పాక్. ఇందుకు ఉగ్రవాదమూ ఇందులో భాగమేనంటోన్న పాక్మనం యుద్ధం ఎందుకు ఓడిపోయాం. ఈ యుద్ధం వల్ల సాధించిందేంటి? సాధించాల్సిందేంటి? మన లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయ్.. సరిద్దికోవల్సినవేంటి? సరిద్దిద్దుకోలేక పోతున్నవేంటి? ఇవీ యుద్ధానంతరం ఏదైనా ఒక దేశం, దాని సైన్యం చేసుకోవల్సిన పోస్ట్ మార్టం. కానీ పాక్ మాత్రం తన ప్రధాని నుంచి అఫ్రిదీ లాంటి క్రికెటర్ల వరకూ ఒకటే మాట. మేం గెలిచాం. విజయమంటే మాదే.

పాక్ చీఫ్ టెక్నిషియస్ ఔరంగజేబ్ మృతి

ఇటీవలి భారత్ దాడుల్లో మరణించిన సైనికుల్లో.. పాక్ వైమానిక దళ చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్ సైతం ఉన్నారు. అయితే వైమానిక దళ సిబ్బందిని కోల్పోయామని పాక్ ధృవీకరించడం ఇదే తొలి సారి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన కొన్ని విమానాలు భారత్ కూల్చిందని చెప్పడానికిదో నిదర్శనం.
మే 8, 9 తేదీల్లో.. పాక్ మన భూభాగంలోని 36 వైమానిక ప్రాంతాల్లోకి చొరబడ్డానికి ప్రతయ్నించింది. ఈ సందర్భంగా భారత్ ఒక F16 తో పాటు రెండు JF 17 యుద్ధ విమానాలు కూల్చేసినట్టు తెలుస్తోంది. భారత సైన్యం చేసిన దాడుల్లో 11 మంది సైనికులు, 40 మంది పౌరులు చనిపోయినట్టు చెబుతోంది పాక్. ఈ సంఘర్షణకు పాకిస్థాన్.. మార్కా- ఏ- హక్ అంటే సత్య యుద్ధం అని పిలుస్తోంది. తమ డీజీ ద్వారా తొలి నుంచీ అన్నీ అసత్యాలే చెప్పిస్తూ వస్తోన్న పాక్.. సత్యం పేరిట ఒక పేరు పెట్టడమొక వింత.

నానక్ పుట్టిన ప్రాంతంపై భారత్ దాడులంటూ అసత్య ప్రచారం

పాక్ తొలి నుంచీ ఈ మతపరమైన కోణాన్ని జోడిస్తూనే వస్తోంది. దాడులు జరగటానికి మూడు రోజుల ముందు పాక్ ఆర్మీ చీఫ్ కూడా ఇదే వాదాన్ని వినిపించారు. పహెల్గాం దాడి సైతం మతం దృష్టికోణంలోనే సాగించింది. అంతేనా మన గురుద్వారాలు, ప్రార్ధనాలయాలుపై గురి పెట్టడమే కాదు.. తమ భూభాగంలోని నంకానా సాహిబ్ గురుద్వారాను సైతం ఈ మత యుద్ధంలోకి లాగింది పాక్. ఈ ప్రసిద్ధ సిక్కు మందిరానికో విశిష్టమైన చరిత్ర ఉంది. సిక్కు మత గురువు నానక్ పుట్టింది ఇక్కడే. సిక్కులు ఎంతో పవిత్రమైన ఈ గురుద్వారాను భారత్ పేల్చి వేసిందంటూ.. అబద్ధపు వార్తలను నెట్టింట వైరల్ చేసింది. దీంతో మన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో.. ఫ్యాక్ట్ చెక్ చేసి ఈ వార్త అబద్ధమని తేల్చింది.

మేమే గెలిచాం.. పాక్ ఫెక్ ప్రచారంలోనే లేటుస్ట్ వర్షెన్

ఇలాక్కూడా దిగజారాలా? అంటూ పాక్ ని ప్రపంచమంతా కలసి నిలదీసింది. ఇంత జరుగుతుంటే తగుదునమ్మా అంటూ ఇప్పుడు మేమే గెలిచామంటూ చేస్తున్న ఈ ప్రచారం పాక్ ఫేక్ ప్రచారంలోనే లేటెస్ట్ వర్షన్ గా తెలుస్తోంది. అసలు వాస్తవం ఏంటని చూస్తే ఈ యుద్ధం ద్వారా పాకిస్థాన్ దారుణంగా నష్టపోయింది. దాని స్టాక్ మార్కెట్ పడిపోవడం వల్ల జరిగిన నష్టమే 80 వేల కోట్లు. ఇక దాని ఉగ్రస్థావరాలు.. మాములు సైనిక స్థావరాలకు జరిగిన నష్టానికి సంబంధించి చూస్తే భారీ ఎత్తున ఉంటుంది. ఈ విషయం క్లియర్ కట్ గా భారత సైన్యం విడుదల చేసిన బిఫోర్- ఆఫ్టర్ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. ఇక హతమైన ఉగ్రవాదుల విలువ ఏ పాటిదో వారి ఆర్మీ అధికారులకే ఎరుక. ఉగ్రవాదుల శవపేటికలకు పాక్ జాతీయ జెండా కప్పి మరీ.. అంత్యక్రియలు నిర్వహించింది వారే కాబట్టి.

యుద్ధాన్ని ఆపిన క్రెడిట్ కొల్లగొట్టిన మన బ్రహ్మోస్

భారత్ మాత్రం ఈ దాడుల ద్వారా గొప్ప విజయాలను అందుకుంది. మనకు పాక్ ద్వారా జర్క్ ఇద్దామనుకున్న అమెరికాను సైతం ఠారెత్తించాం. వారి ఎఫ్- 16 విమానాలను ఢీ కొట్టి ఉలిక్కి పడేలా చేశాం. మనం కొన్న రాఫెల్స్ మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టగలిగాం. అంతే కాదు.. మన భారత సైనిక శక్తి, దాని ఆయుధ సామాగ్రి విలువ ఏపాటిదో ఈ నాలుగు రోజుల యుద్ధంలో తెలియ వచ్చింది. మన బ్రహ్మోస్ అయితే ఈ యుద్ధాన్నే ఆపేసినంత క్రెడిట్ సొంతం చేసుకుంది. మన ఆయుధ మార్కెట్ పరిధిని అమాంతం పెంచేసింది.

మాసైన్యం మతం వేరుకావంటూ పాక్ నిస్సిగ్గు ప్రకటనలు

కానీ పాక్ మాత్రం తన ఊహల్లో తానుంది. తన మతం ముసుగులో సాగించే ఉగ్రవాదాన్ని అది నిస్సిగ్గుగా కవర్ చేసుకుంటోంది. మా సైన్యం, మతం వేరు కావంటూనే.. ఉగ్రవాదం కూడా ఇందులో ఒక భాగమేనని ఈ ప్రపంచానికి మరో మారు తేల్చి చెప్పింది. మొన్నటి వరకూ ఉగ్రవాదానికి తమకూ సంబంధం లేదని చెబుతూ వచ్చిన పాకిస్థాన్.. ఈ ఆపరేషన్ ద్వారా ఎన్నో తప్పటడుగులు వేసింది. తాము టార్గెట్ చేసింది పాక్ పౌరులు, సైనికులు కానే కాదు. మీ ఉగ్రవాదులు, వారి శిబిరాలపై మాత్రమేనని భారత్ స్పష్టం చేసినా.. వెంటనే రియాక్టయ్యి అడ్డంగా బుక్ అయ్యింది. సైన్యం ఉగ్రవాదం వేరు వేరు కాదని ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు సైన్యం మతం వేరు కాదంటూ ఇంకో క్లారిటీ ఇచ్చింది.

ఇలా నిస్సిగ్గుగా.. నిరభ్యంతరంగా.. పాక్ మత చెలగాటం ఆడుతూనే వస్తోంది. భారత్ పై తమ పగ తీరేది కాదని.. తెలియ చేస్తూనే ఉంది. వారు చేయనివి చేసినట్టు చెప్పుకోవడం మాత్రమే కాదు.. మన విజయాన్ని కూడా ఒక పరాజయంగా మలుస్తూ.. గెలుపంటే మాదనేంటూ కాలరెగరేస్తోంది. చూశారుగా ఇదీ పాక్ పరిస్థితి. ఉన్న శక్తి యుక్తులు అంతంత మాత్రం. వాటి ద్వారా తెలివిగా వ్యవహరించాల్సింది పోయి అతి తెలివి ప్రదర్శనలు. దీంతో తమ పరువు పోగొట్టుకోవడం మాత్రమే కాకుండా యూఎస్, చైనాల పరువు సైతం సింధూజలాల్లో కలిపేస్తోంది పాక్. దీంతో పాకిస్థాన్ ని నమ్మితే నట్టేట మునగటమే అన్న మాటెక్కడ బయట పడుతుందో అని.. ఇదిగో ఇలా సొంత డబ్బా కొట్టుకుంటూ.. కవర్ చేయాల్సి వస్తోందంటున్నారు నిపుణులు. ఏం చేద్దాం.. పాక్ కదా.. అదంతే అన్న కామెంట్లు సెటైర్లూ పేలుతున్నాయ్.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×