ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు నియోజకవర్గంలో ఆ పార్టీ బోణి కొట్టలేదు. వరుస ఓటములతో నియోజకవర్గంలో వైసీపీకి నాయకత్వలేమి స్పష్టంగా కనిపిస్తుంది. పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికలో టీడీపీ ఏడు సార్లు విజయం సాధించగా కాంగ్రెస్ నాలుగు సార్లు విజయం సాధించింది. అక్కడ ఇంత వరకువైసీపీ జెండా ఎగురవేయలేదు. ప్రతిఎన్నికల్లో అభ్యర్థులను మార్చి మార్చి ప్రయోగించినా వైసిపి పార్టీ విజయం సాధించలేకపోయింది.
నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు పోటీ చేసిన వైసిపి ప్రతిసారి కొత్తవారితో ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకుంది. ఎన్నికల సమయంలో వచ్చిన కొత్త నేతకు స్థానిక క్యాడర్‌ను సమన్వయం చేసుకోవడం, నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకునేందుకే సమయం సరిపోయేది. అందుకే నియోజకవర్గంలో ఒక్కసారి కూడా వైసిపి విజయం సాధించలేకపోయిందని చెప్పవచ్చు. మరోవైపు పర్చూరు నియోజకవర్గంలో గెలుపును డిసైడ్ చేసే కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజి వర్గ ఓటర్లను తమ వైపుకు తిప్పుకోవడంలో వైసిపి విఫలమవుతుంది.
ప్రధానంగా నియోజకవర్గంలో బలమైన నేతగా ముద్రపడ్డ టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును ఎదుర్కోవడం వైసీపీకి తలకు మించిన భారంగా తయారైంది. 2014 ఎన్నికల నుంచి మొన్నటి ఎన్నికల దాకా హ్యాట్రిక్ విజయాలతో పర్చూరులో తిరుగులేని నేతగా ఎదిగారు ఏలూరు సాంబశివరావు. 2014 ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన ఏలూరు సాంబశివరావు ఆ తరువాత సొంత ఇమేజ్ ను పెంచుకుంటూ వచ్చారు. 2019 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ పార్టీ హవా నడిచినా నియోజకవర్గంలో ఏలూరు సాంబశివరావు గెలుపును అడ్డుకోలేకపోయింది.
Also Read: రాజకీయాలకు అనిల్ గుడ్ బై.. కారణం ఇదేనా..?
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలో సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పై సాంబశివరావు గెలుపొంది తన ప్రత్యేకత చాటుకున్నారు. 2024 ఎన్నికల్లో మూడోసారి కూటమి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన సాంబశివరావుపై పోటీకి వైసీపీ రకరకాల ప్రయోగాలు చేసింది. దగ్గుబాటిని తప్పించి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను పర్చురు ఇన్చార్జ్‌గా నియమిస్తే చివరి నిముషంలో ఆయన చేతులెత్తేశారు. ఆఖరికి వైసీపీ అభ్యర్థిగా ఎన్నారై యడం బాలాజీ బరిలోకి దిగి ఏలూరు సాంబశివరావు చేతిల 24 వేల ఓట్ల తేడాలో ఓటమి మూటగట్టుకున్నారు.
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన యడం బాలాజీ ఓటమి అనంతరం పత్తా లేకుండా పోయారు నియోజకవర్గంలో వరుస ఓటమిలతో కుదిలైన పార్టీని గాడిలో పెట్టి నడిపించాల్సిన బాలాజీ ఓటమి అనంతరం నియోజకవర్గానికి దూరంగా ఉండడాన్ని పార్టీ క్యాడర్ తప్పుపడుతోంది. ఓడిపోయాక కనీసం పర్చూరు పక్కకు కూడా రావడంలేదని వైసిపి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం యడం బాలాజీ అమెరికాలో తన సొంత వ్యాపారాల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో చీరాల వచ్చిన బాలాజీ తాను పోటీ చేసిన పర్చూరులో పార్టీ పరిస్థితి ఎలా ఉందని కనీసం ఆరా కూడా తీయలేదంట.
దాంతో పర్చూరు నియోజకవర్గ వైసీపీ క్యాడర్ యడం బాలాజీపై ఆగ్రహంతో రగిలిపోతుందంట. ఆయనతో పాటు గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో హడావుడి చేసిన స్థానిక నేతలు సైతం సైలెంట్ అవడంతో పార్టీ క్యాడర్‌కి తమ సమస్యలు చెప్పుకోవడానికి పెద్దదిక్కు లేకుండా పోయాడు. దీంతో అసలు నియోజకవర్గానికి యడం బాలాజీ వస్తారా? లేదా? క్లారిటీ ఇవ్వండి.. ఆయన రాకపోతే కొత్త ఇన్చార్జిని నియమించాలని వైసీపీ హై కమాండ్‌ను కోరుతున్నారు పర్చూరు కార్యకర్తలు. అటు అసెంబ్లీని బాయ్‌కాట్ చేసిన ప్రతిపక్ష నేత కోసం జగన్ మంకుపట్టు పడుతూ తన కష్టాలు తను పడుతుంటే.. వీళ్ల గోడు పట్టించుకునే తీరికుంటుందా?.. పీత కష్టాలు పీతవి అంటారు.. ఇదేనేమో?