Pawan Kalyan: ఎలక్షన్స్‌లో లిమిటెడ్ సీట్లలో పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు సాధించిన జనసేనాని పవన్ రానున్న ఎన్నికల్లో బలం పెంచుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. విశాఖ ఏజెన్సీలో వైసీపీకి బలమైన పట్టున్న సెగ్మెంట్లపై ఫోకస్ పెడుతూ జనసేన పునాదులు పటిష్టం చేసుకునే పనిలో పడ్డారంటున్నారు. మన్యం ప్రజల అభివృద్ది మంత్రం పఠిస్తున్న డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా, సొంత శాఖ నుంచి నిధులు ఇవ్వ లేకపోయినా, కేంద్ర ప్రభుత్వ నిధులను తెచ్చి గిరి పుత్రులకు రోడ్లు. తాగునీరు అందించడానికి ప్రయత్నం చేస్తుండటం అందులో భాగమే అంటున్నారు. రాష్ట్ర నలుమూలల్లో ఉన్న గిరిజన తండాల్లో నెలకు ఒక్కసారైనా పర్యటించి గిరిజనుల అభివృద్ధికి నేనున్నానని హామీలు ఇస్తుండటం వెనుక పార్టీ బలోపేతమే ఆయన వ్యహంగా కనిపిస్తోంది.
కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్న డిప్యూటీ సీఎం
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు . రాజకీయ నాయకుడిగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, ఆ మెగా ఫ్యామిలీ హీరో ఎక్కడా మెహర్బానీ ప్రదర్శించడం లేదు. ఫోకస్ అంతా తన శాఖల పనితీరుపై పెడుతూనే.. అడవులు, కొండలు, గుట్టలు, గిరిజన తండాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
2019 ఎన్నికల ముందు అన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు
2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ టీడీపీతో విభేదించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా తాము అధికారంలోకి వస్తే మీ కష్టాలను తీరుస్తామని హామీలు కూడా ఇచ్చారు. టీడీపీ, జనసేన 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం, జగన్ వేవ్ కలిసి రావడంతో జనసేన ఘోరంగా ఓడిపోయింది. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. దాంతో అంతా పవన్ కళ్యాణ్ పని అయిపోయింది అనుకున్నా ఎక్కడ తగ్గకుండా.. ఓడిపోయిన నెలరోజుల్లోనే మళ్లీ జనాల్లోకి వచ్చి జనసేన నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగారు.
రిమోట్ ఏరియాల్లో డిప్యూటీ సీఎం అధికార పర్యటనలు
2024 ఎన్నికలకు ముందు టిడిపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎంతో పాటు అనేక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ వరకు అంతా బానే ఉన్నా.. ఇంకా ఎన్నికలకు దాదాపుగా నాలుగు సంవత్సరాల కాలం ఉండగానే పవన్ కళ్యాణ్ ఫోకస్ ఇప్పుడు మారుమూల ప్రాంతాలపై పడింది. ఎలాంటి అధికారం లేనప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఒక ప్లేస్‌కి వెళ్ళాలి అంటే ఎన్నో వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తో పాటు అనేక శాఖలకు మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఎక్కడికి వెళ్లినా అధికార యంత్రాంగం మొత్తం తోడు ఉండటంతో.. ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన రిమోట్ ఏరియాలను సెలెక్ట్ చేసుకుని అధికార పర్యటనలు కొనసాగిస్తున్నారు.
కొత్త రోడ్లు ఏర్పాటు చేయించి తండాల మధ్య కనెక్టివిటీ పెంచారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ అంతా గిరిజన గ్రామాలు, కొండలు గుట్టల ఏరియాల్లో నివసిస్తున్న వారిపైనే ఎక్కువగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటనలు చేస్తున్నారు. వర్షాలను సైతం లెక్కచేయకుండా పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడమే కాకుండా ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న డోలీ మోతలు లేకుండా చేశారు. సరైన రోడ్లు లేక ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నఏజెన్సీ ప్రాంతాల్లో చాలా రోడ్లకు మరమ్మత్తులు చేయించడంతో పాటు కొత్త రోడ్లు ఏర్పాటు చేయించి తండాల మధ్య కనెక్టివిటీ పెంచారు.
తండాల్లో రోడ్ల నిర్మాణంపై హామీ ఇవ్వని జనసేనాని
తండాల్లో రోడ్లు నిర్మింపచేస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికల సమయంలో ఎక్కడా హామీ ఇవ్వలేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు అలాంటి వాగ్దానాలు చేయలేదు. అయితే డిప్యూటీ అటవీ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్‌కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి రోడ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలాగా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులకు తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులను కలిపి దాదాపుగా 1005 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాల్లోని రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు… ఇప్పటికే టెండర్లు పూర్తి కావడంతో ..అడవి తల్లి బాట పేరుతో ఏజెన్సీలోని గ్రామాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం జరగనున్నాయి. కీలకమైన అటవీశాఖ, పంచాయతీరాజ్ శాఖ రెండు తన దగ్గరే ఉండడంతో రోడ్ల నిర్మానానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు చేపడుతున్నారు.
2029 ఎన్నికల్లో ఇప్పటి నుంచే కసరత్తు
పవన్ కళ్యాణ్ ఫోకస్ అంతా ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ఏజెన్సీ ప్రాంతాలపై పెడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల మీద పవన్ కళ్యాణ్ దృష్టి సారించడంతో 2029 ఎన్నికలకు ఇప్పటి నుండే కసరత్తు ప్రారంభించారనే చర్చ కొనసాగుతోంది. 2019, 2024 ఎన్నికల్లో అల్లూరి జిల్లాలోని పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాలు, అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అల్లూరు జిల్లాలో ఉన్న ఏజెన్సీ నియోజకవర్గాలైన పాడేరు, అరకు అసెంబ్లీ, అరకు పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోలేకపోవడంతో టిడిపి, జనసేనల్లో ఒకింత అసంతృప్తి కనిపిస్తుంది.
గిరిజన ప్రాంతాల్లో వైసీపీని మట్టి కరిపించడమే వ్యూహం
దాంతో ఇప్పటి నుండే ఏజెన్సీ నియోజకవర్గాలపై దృష్టి పెడితే 2029 ఎన్నికల్లో కచ్చితంగా గెలవచ్చు అని జనసేనాని భావిస్తున్నారంట. పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్‌తో పాటు డిప్యూటీ సీఎంగా గిరిజన నియోజకవర్గాల్లో ఎక్కువగా పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండటం వెనుక.. రానున్న ఎన్నికల్లో వైసీపీని మట్టి కరిపించడమే వ్యూహంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ముందు నుంచి ఈ నియోజకవర్గాలపై దృష్టి పెట్టి జనసేన పునాదులు బలోపేతం చేసుకునే పనిలో పడ్డారంట. దీనికి తోడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందించే ఎన్నో నిధులను ఏజెన్సీ ప్రాంతాలకు ఉపయోగిస్తూ .. ఇతర కార్యక్రమాలకు డైవర్ట్ కాకుండా చేయడంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్ల నుంచి పోటీ చేయడమే పవన్ వ్యూహం
2024 ఎన్నికల్లో అరకు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన బిజెపి ఓటమి మూటగట్టుకుంది. 2029 ఎన్నికల్లో బిజెపి అక్కడ నుంచి పోటీ చేసి గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. ఏపీలో జనసేనతో పాటు బిజెపి బలోపేతం బాధ్యతలు కూడా తన భుజాలపై మోస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన నుండి అరకు, పాడేరు ఎమ్మెల్యేలతో పాటు బిజెపి అరకు ఎంపీ సీటు గెలిచేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రతి నెల పవన్ కళ్యాణ్ గిరిజన నియోజకవర్గాల్లో పర్యటిస్తానని ప్రకటించడం వెనుక ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్ల నుంచి పోటీ చేయడమే పవన్ వ్యూహం అంటున్నారు.
ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడానిక్ స్కెచ్
రాష్ట్రంలో 15 ఏళ్లు జనసేన టిడిపి కూటమి ప్రభుత్వం ఉంటుందని పవన్ కళ్యాణ్ పదేపదే ప్రకటిస్తున్నారు. ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడానికి ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారంట. పంచాయతీరాజ్, అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలతో కిందిస్థాయి వర్గాలతో పాటు చదువుకున్న వర్గాలను ప్రజలను తరచూ కలిసే అవకాశం ఉంటుంది. అదే జనసేన పార్టీ ఎదుగుదలకి ఉపయోగపడుతుందని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కొంచెం సమయం దొరికినా ఆలోచించకుండా ఏజెన్సీ ఏరియాలో వాలిపోతున్నారట. మరి పవన్ ఆలోచన విధానానికి ఏజెన్సీ నియోజకవర్గాల్లోని ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతారో? కూటమిలో ఉన్న నాయకులు పవన్ ఏ స్థాయిలో సహకరిస్తారో చూడాలి.