భీమవరం వెళ్లిపోతాను మళ్ళీ పేకాట ఆడుకుంటాను ఇదేదో సినిమాలో డైలాగ్ అనుకుంటే పొరపాటే.. నిజజీవితంలోనూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పేకాట ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం పట్టేలా డైలాగు ఉందంటున్నారు భీమవరం వాసులు.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఐదు లక్షల బ్యాంక్ పేకాట జరిగిన ఏకైక చోటు భీమవరం అంటున్నారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భీమవరం డిఎస్పి పై విచారణ చేయాలంటూ ఆదేశించడంతో మళ్లీ తెరపైకి వచ్చిన భీమవరం పేకాట క్లబ్బులు.. అసలు భీమవరంలో ఏం జరిగింది? భీమవరం వాసులు ఏమనుకుంటున్నారు? రాజకీయ నేతల వికృత క్రీడలో పోలీసు బలై పోతున్నారా? భీమవరంలో పేకాట శిబిరాన్ని పోలీసులే అరికట్టలేకపోతున్నారంటే అసలు నిర్వాహకులు ఎవరు ? పేకాటలో ఎవరి వాటా ఎంత ?
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రశాంతతకు పెట్టిన పేరు. ఆర్థికంగా బలమైన వ్యక్తులు ఉన్న నియోజకవర్గం కూడా భీమవరం కావటం తో రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరిగినా దానికి భీమవరంతో ఎంతో కొంత లింక్ ఉంటుంది.. ఆక్వా కల్చర్లు వస్తున్న కోట్లాది రూపాయల డబ్బును కొంతమంది జాగ్రత్త చేసుకుంటే మరి కొంతమంది రాజకీయాల్లో పెట్టుబడిగా పెడుతుంటారు.. ఇక భీమవరం విలాసాలకు పెట్టింది పేరు కొత్త కారు కొత్త బైక్ కొత్త టెక్నాలజీ ఏది వచ్చిన అది ముందు భీమవరం ని టచ్ చేయాల్సిందే.. అటువంటి భీమవరం పేరు రాష్ట్రవ్యాప్తంగా పేకాటరాయుళ్ల నోళ్లల్లో గత రెండు నెలల కిందటి వరకు నానిపోయింది.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఐదు లక్షల బ్యాంక్ భీమవరంలో నిర్వహిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది.. పేకాట రాయులను పికప్ అండ్ డ్రాపింగ్, పేకాట జరిగే చోట సకల సౌకర్యాలతో శిబిరాలు నిర్వహిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో తెలియదు గానీ రెండు నెలల క్రింద ఒక్కసారిగా పేకాటక క్లబ్బులన్నీ మూతపడ్డాయి.. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో భీమవరం పేకాట పై ప్రచారం జరగడంతో పోలీసు అధికారులు చేసేదేమీ లేక కటిన చర్యలు తీసుకున్నారని అందరూ అనుకున్నారు.. అయితే ఇప్పుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం విడుదల చేసిన పత్రిక ప్రకటనతో కథ మల్లి మొదటికొచ్చిందట
అయితే ఈ కథలో రాజకీయ నేతల ప్రస్తావన లేకుండా భీమవరం డిఎస్పి పాత్ర పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయనపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలంటూ డిజిపి కి పవన్ కళ్యాణ్ చెప్పడం సంచలనంగా మారింది. పేకాట అడ్డుకున్నందుకు పోలీసులు బలవుతున్నారా ? లేదా నిజంగానే పేకాట శిబిరాలకు డీఎస్పీ స్థాయి అధికారి వెన్నుదన్నుగా ఉంటే ఇప్పటివరకు ఎందుకు కామ్ గా ఉన్నారనే ప్రశ్నలు వస్తున్నాయట. వాటాల్లో వచ్చిన తేడాలతో రాజకీయ నేతల మధ్య మాట మాట పెరిగి పంతం పట్టిన ఒక వర్గం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారనే ప్రచారం జరుగుతుందట. భీమవరంలో జరుగుతున్న పూర్తి సమాచారం ఇవ్వకుండానే సగం కథను మాత్రమే పవన్ దృష్టికి తీసుకువెళ్లారనే సందేశాలు వ్యక్తమవుతున్నాయట. అందులో డీఎస్పీ స్థాయి అధికారులు బలిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ మాట్లాడుకుంటున్నారట.
రెండు నెలల క్రింద వరకు భీమవరం తో పాటు ప్రక్కనున్న నియోజకవర్గాల్లో కోట్ల రూపాయల పేకాట జూదం జరిగినప్పుడు, ప్రజా ప్రతినిధులు నెలవారి లక్షల రూపాయలు మామూళ్ళు తీసుకున్నప్పుడు సామాన్యుల బతుకులు చితకు పోతున్నాయని మీడియా కోడై కూసినా ఎవరూ పట్టించుకోలేదనే వాదనలు ఉన్నాయట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందనతో ఒక్కసారిగా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గత ఏడాది ఆగస్టు నెలలో భీమవరం సబ్ డివిజన్ అధికారిగా బాధ్యతలు తీసుకున్నారు డి ఎస్ పి ఆర్ వి జయ సూర్య.. అంతకుముందు భీమవరం టూ టౌన్ సిఐగా పనిచేసిన అనుభవం జయ సూర్యకు ఉంది.. భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రాజకీయ నేతలు, ఆర్థికంగా బలమైన నాయకులతో డిఎస్పి జయ సూర్యకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. భీమవరం ప్రాంతంలో పేకాట ఉధృతంగా జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న పోలీసు అధికారులు ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు.. డ్రోన్లు ఎగరేసి చిన్న చిన్న తోటల్లో పేకాట ఆడే సామాన్యులను పరుగులు పెట్టించి అరెస్టులు చేసిన పోలీసులు విశాలమైన కారులో వచ్చి లక్షలాది రూపాయలు పందాలు కాసే వారి వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వచ్చాయి.. భీమవరం సబ్ డివిజన్ పరిధిలో పేకాట కేసులు పరిశీలిస్తే సామాన్యులు అతి సామాన్యులపై మాత్రమే కేసులు ఉన్నాయనే ఆరోపణలున్నాయట. లక్షలాది రూపాయలు పందాలు కాసి పేకాట ఆడేవారీ పై కేసు కాదు కదా వారి పేరు కూడా పోలీస్స్టేషన్లో ఉండదని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు భీమవరం వాసులు.
దీనంతటికీ కారణం ఎవరు వాటా వారికి అందుతుండడంతోనే బహిరంగంగా పేకాట జరుగుతున్న పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి.. రాజకీయ నేతలకు నెలవారి మామూళ్ళు లక్షల రూపాయలలో వెళ్లడం, ఆ వాటాల్లో పోలీసులు భాగస్వాములు అయ్యారు అంటూ ప్రచారం జోరుగా నడుస్తోందట. అయితే గత రెండు నెలలుగా పేకాట క్లబ్ లు నిలిచిపోవడంతో ప్రతినెలా వెళ్లే లక్షల రూపాయల మామూళ్ళు ఆగిపోవడంతో రాజకీయ నేతలు రగిలిపోయారట. పశ్చిమగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య అంతర్గత కుమ్ములాట పేకాట వ్యవహారం ఈ స్థాయిలో బయటికి రావడానికి కారణమనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయట. భీమవరం డీఎస్పీ జయ సూర్య ఒక ప్రజా ప్రతినిధితో సన్నిహితంగా ఉంటున్నారని…ఆ ప్రజా ప్రతినిధి చెప్పినట్లుగానే డీఎస్పీ నడుచుకుంటూ రెండు నెలలుగా భీమవరంలో క్లబ్లలో పేకాటకు అవకాశం ఇవ్వలేదని, దానివల్ల నెలవారి వచ్చే ఆదాయం కోల్పోయామని మరో ప్రజా ప్రతినిధి అంతర్గతంగా మదనపడ్డారనే ప్రచారం జోరు అందుకుంది. నెలవారి మామూలు ఆగిపోవడంతో డి.ఎస్.పి. జయ సూర్య పై వరుస ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.. ప్రజా ప్రతినిధుల సహకారం లేకుండా పోలీసులు పేకాట క్లబ్లను, పేకాటలను ఏ విధంగా సహకరిస్తారంటూ పలువురు చెవులు కోరుకుంటున్నారట.
భీమవరం డిఎస్పీ జయ సూర్య ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో పనిచేసి సెటిల్మెంట్లకు కూడా అవకాశం ఇచ్చారనే ఆరోపణలను కూడా ఎదుర్కొంటున్నారు. ఆర్ధిక సెటిల్‌మెంట్ల వ్యవహారాల్లోను డీఎస్పీ జయ సూర్య కూడా తల దూర్చారనీ టాక్ నడుస్తుందట. ఏది ఏమైనా ప్రజాప్రతినిధుల సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఇస్తే చివరకు బలి అయ్యేది అధికారులేనని మరోసారి డిఎస్పి జయ సూర్య నిజమయిందంటున్నారు పోలీసు అన్నలు.
Story by Vamshi, Big Tv