Paritala Sriram vs Kethireddy: సోషల్ మీడియాలో గుడ్ మార్మింగ్ ధర్మవరం అంటూ పాపులర్ అయిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తాజా చేసిన సంచలన వ్యాఖ్యల వెనుక అంత్యర్యమేంటి? గత ఎన్నికల్లో ఓటమి పాలైన కేతిరెడ్డి ఎప్పుడో ఒకసారి మాట్లాడినా టపాసులా ఎందుకు పేలుతున్నారు? ఈ నేత వార్నింగ్ లు టపాకాయలు భారీ సౌండ్‌తో పేలుతాయా లేక తుస్సుమంటాయా?
2024 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం వార్తల్లోకెక్కింది
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇటు రాజకీయంగా అటు సిల్క్ సిటీగా రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకమైన నియోజకవర్గంగా ధర్మవరానికి పేరుంది. అక్కడ నుంచి అనేకమంది ఎమ్మెల్యేలు గెలిచి, ఓడారు. కొంతమంది మంత్రులు కూడా అయ్యారు. కానీ ఎప్పుడూ లేనంతగా 2024 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం వార్తల్లోకెక్కింది.
గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సోషల్ మీడియాలో హాడావుడి
గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సోషల్ మీడియాలో హాడావుడి చేస్తూ రాష్ట్రమంతటా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పాపులర్ అయ్యారు. ఎంతలా అంటే గుడ్ మార్నింగ్ అంటే చాలు కేతిరెడ్డి గుర్తువచ్చేలా పాపులర్ అయ్యారు. ఆ క్రమంలో 2024 ఎన్నికల్లో ధర్మవరం స్థానం నుంచి పక్కాగా వైసిపి గెలుస్తుందని అందరూ భావించారు. కానీ కేతిరెడ్డి సీన్ రివర్స్ అయ్యింది. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డి ఎంత పాపులర్ అయ్యారో దానిపైన కూడా అన్ని విమర్శలు సోషల్ మీడియా వేదికగా వచ్చాయి. ఖాళీగా ఉన్న భూముల ఆక్రమణ కోసమే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం అంటూ విమర్శలు చేసారు ప్రత్యర్థి పార్టీ నాయకులు.
సత్య కుమార్ యాదవ్ చేతిలో ఓటమి పాలైన కేతిరెడ్డి
గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ చేతిలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటమిపాలయ్యారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై 3,734 ఓట్ల మెజారిటీతో సత్యకుమార్ యాదవ్ గెలుపొందారు. ఇక సీన్ కట్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చింది. సత్య కుమార్ మంత్రి కూడా అయ్యారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మరోసారి తనదైన శైలిలో ఇచ్చిన వార్నింగ్ సంచలనం రేపుతోంది “అధికారంలో ఉన్నామంటూ ఎగిరిపడితే తీవ్ర పరిణామాలు తప్పవు” అంటూ స్పష్టంగా హెచ్చరిస్తున్నారు.
మూడేళ్ల తర్వాత తానేంటో చూపిస్తానంటున్న కేతిరెడ్డి
మూడు సంవత్సరాల తర్వాత “కేతిరెడ్డి 3.0” రూపంలో తన అసలు శక్తిని చూపిస్తానని అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆయన మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ఆయన మాటల్లో ఉన్న ధీమా, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై సూచనలు ఉన్నాయనే భావన పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.కేతిరెడ్డి తన వ్యాఖ్యల్లో “గుడ్ మార్నింగ్ ధర్మవరం” అనే కార్యక్రమంపై చేసిన విమర్శలను కూడా ప్రస్తావించారు. తాను ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ముందుకు వస్తే కబ్జాల కోసమే చేస్తున్నారని విమర్శలు వచ్చాయని, కానీ ఇప్పటివరకు ఎక్కడా తాను కబ్జా చేశానని ఎవరూ చూపించలేదని స్పష్టం చేశారు.
రాజకీయ ప్రత్యర్ధులకు కేతిరెడ్డి స్పష్టమైన హెచ్చరికలు
తాను చేసే ప్రతి కార్యక్రమం ప్రజల కోసం మాత్రమేనని, తనపై వేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరణతో చేస్తున్నారని కేతిరెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన “మంచితనంతో వచ్చే భక్తి కంటే భయంతో వచ్చేది ఎక్కువ కాలం ఉంటుంది” అని చేసిన వ్యాఖ్యలు నియోజవర్గంలో మార్మోగుతున్నాయి. ఈ మాటల ద్వారా కేతిరెడ్డి రాజకీయ ప్రత్యర్థులకు స్పష్టమైన హెచ్చరికనే ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలోనే తన ప్రభావాన్ని మరోసారి చాటుతానని ఆయన చెప్పడం, MLA కావాలనుకోవడం అందుకోసమే” అని వ్యాఖ్యానించడం ద్వారా 2029 ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది.
నేతలు ఇప్పటికైన ఈ వ్యాఖ్యలపై స్పందిస్తారో లేదో వేచి చూడాలి
కేతిరెడ్డి ధర్మవరం రాజకీయాల్లో మళ్లీ చురుకైన పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నారనే సంకేతాలు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నాయి. అయితే ధర్మవరంలో ఈ వ్యాఖ్యల పట్ల ఇంతవరకు అధికార పార్టీ నాయకులు ఎవరు స్పందించలేదు. కేతిరెడ్డి కామెంట్స్ లో లైట్ గా తీసుకున్నారా లేక పలాన నాయకుడు అని పేరు పెట్టి అనలేదు కాబట్టి మనకెందుకు లే అని ఊరుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ధర్మవరంలో ఇద్దరు బలమైన నేతలు ఉన్నారు. ఒకరు మంత్రి సత్య కుమార్ కాగా మరొకరు ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్..ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలే కావడంతో ఇంతవరకు ఈ వ్యాఖ్యలపై వారు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి ఇరువురు నేతలు ఇప్పటికైన ఈ వ్యాఖ్యలపై స్పందిస్తారో లేదో వేచి చూడాలి.
Story By Apparao, Bigtv Live