AP Govt: రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం సంస్కరణలు శ్రీకారం చుట్టింది. పాలనాపరమైన సంస్కరణలు, వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారులు (డి.డి.ఓ) కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు.
క్లస్టర్ విధానం రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేయడం ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు తీసుకువచ్చామని పవన్ కల్యాణ్ చెప్పారు. పల్లెల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంచాయతీలు, గ్రామీణాభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
నిధులు సమకూర్చడంలోను, పాలనాపరమైన సంస్కరణల్లోనూ కూటమి ప్రభుత్వం ఎంతో సానుకూల దృక్పథంతో ఉందని… పల్లెల అభివృద్ధిలో ఉద్యోగులు క్రియాశీలక బాధ్యత తీసుకోవాలన్నారు. నిధుల వినియోగం, పాలన సంస్కరణల అమలుపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. పల్లె పండగ 2.0 ద్వారా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళిక అందించాలని ఆదేశించారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి మెటీరియల్ కాంపోనెంట్ కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా రూ.665 కోట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.166 కోట్లు జత చేసింది. మొత్తంగా రూ.831 కోట్ల నిధులతో ఈ ఏడాది మార్చి 31 నాటికి ఉన్న పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే వెసులుబాటు కలుగుతుంది. రాష్ట్రంలో పంచాయతీ భవనాల నిర్మాణం, రికార్డులు కంప్యూటరీకరణ, సిబ్బంది, ప్రజా ప్రతినిధులకు శిక్షణ, ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ ద్వారా రూ.50 కోట్లు నిధులు విడుదల చేసింది.
Also Read: AP Politics: బాలకృష్ణపై జగన్ హాట్ కామెంట్స్.. సభలో తాగి మాట్లాడడమేంటి? స్పీకర్‌కు బుద్ధి లేదు
ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.33 కోట్లు జత చేస్తుంది. ఏపీలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికీ, గ్రామాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియచేశారు.