సరస్వతి పవర్ ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ పేరు ఇంతకుముందు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఈ పేరు చుట్టూనే తిరుగుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో ఈ సంస్థ షేర్లు, భూములు, పలు అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ సంస్థకు చెందిన భూములపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. దీంతో సరస్వతి సంస్థ భూముల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
కొన్ని రోజులుగా సరస్వతి పవర్ సంస్థకు చెందిన 1515 ఎకరాల భూముల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండ భూములు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఇప్పుడు సరస్వతి భూములపై ఫోకస్ పెట్టారు. సరస్వతి పవర్ భూముల్లో అటవీ భూములు ఏమేరకు ఉన్నాయి? జల వనరులు ఉన్నాయా? ఉంటే పర్యావరణ అనుమతులు ఏ విధంగా పొందారు అనే దానిపై ఉప ముఖ్యమంత్రి పవన్ ఆరా తీస్తున్నారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో అటవీ భూములు ఉన్నాయని ప్రచారం జరగడంతో.. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్.. ఆ భూములపై నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులను, పల్నాడు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆ సంస్థకు చెందిన ల్యాండ్స్ లో ప్రభుత్వ భూములు, జల వనరులు ఏ మేరకు ఉన్నాయో తెలియజేయాలని.. అలాగే అటవీ భూములు ఏ మేరకు ఉన్నాయో సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అధికారులకు స్పష్టం చేశారు.
Also Read: టీటీడీ కొత్త టీమ్ ఏం చేయబోతుందంటే..?
సరస్వతి భూముల్లో వాగులు, వంకలు, కొండలు ఉన్నాయని తేలడంతో .. ఆ సంస్థకు పర్యావరణ అనుమతులను ఏ విధంగా పొందారో తెలుసుకోవాలని పీసీబీకి ఉప ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆ క్రమంలో తాజాగా మాచవరం మండలం వేమవరం గ్రామంలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టు భూములను పవన్ కళ్యాణ్ సందర్శించారు. భూముల సేకరణపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ భూసేకరణపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తున్నామని, ఈ అంశాన్ని కేబినెట్‌లో లేవనెత్తుతామని పవన్ కల్యాణ్ పర్యటన అనంతరం ప్రకటించారు
ఏపీ పాలిటిక్స్‌లో జనసేన మొదటి నుంచి వైసీపీనే టార్గెట్ చేస్తుంది. జగన్‌ను గద్దె దించడమే లక్ష్యమని కూటమి ఏర్పడానికి ముందే పవన్ ప్రకటించారు. అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతీకార రాజకీయాలకు తావు లేదని పవన్ వెల్లడించారు. అలా నాలుగైదు నెలలు పవన్ మౌనంగానే ఉన్నారు. నిజానికి అధికారంలోకి వచ్చిన మొదట్లోనే వైసీపీ మీద పవన్ ఎటాక్ స్టార్ట్ చేస్తారు అని అంతా అనుకున్నారు.అయితే పవన్ ఆ దిశగా దూకుడు ప్రదర్శించలేదు
ఆ క్రమంలో జగన్ ఇంటి ఆస్తుల పంచాయతీ రచ్చకెక్కింది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి సరస్వతి పవర్ ప్రాజెక్ట్ మీద పడింది. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి రైతుల నుంచి కారు చౌకగా భూములు తీసుకున్నారని ఆరోపణలు రావడంతో ఉప ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళడం రాజకీయంగా సంచలనం రేపింది. జగన్ సీఎం అయ్యాక 30 ఏళ్ల లీజుని 50 ఏళ్లకు పొడిగించుకున్నారని, ఆ భూములలో అటవీ భూములు ఉన్నాయని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ అంటే భూములివ్వరని పవర్ ప్రాజెక్ట్ పేరుతో భూములు బలవంతంగా తీసుకున్నారని, చెప్పిన ప్రకారం పరిశ్రమ ఏర్పాటు ఏర్పాటు చేయకపోవడంతో ఆ భూములు ఎందుకు వెనక్కి తీసుకోకూడదని ప్రశ్నించారు
మొత్తం మీద చూస్తే పవన్ తనదైన స్టైల్లో జగన్‌ని కార్నర్ చేస్తున్నట్లే కనిపిస్తున్నారు. అది అన్నా చెల్లెళ్ల ఆస్తి కాదని రైతులు పరిశ్రమల కోసం ఇచ్చిన భూమి అని ఆయన చెప్పడం బట్టి చూస్తూంటే ఈ భూముల విషయంలో కూటమి ప్రభుత్వం, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నారని అర్ధం అవుతోంది. ఈ ఎపిసోడ్‌తో జగన్ కుటుంబ వివాదాలను బజారున వేసుకుని కూటమి సర్కారుకి అస్త్రం అందించారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి సరస్వతి భూముల విషయంలో కూటమి ప్రభుత్వం ఏ డెసిషన్ తీసుకుంటుందో చూడాలి.