Vanga Geetha: పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయిందట. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ నేతలు స్పందించడకపోవడం చర్చనీయంశంగా మారిందట. ఎన్నికల తర్వాత నేతలంతా వైసీపీ అంటే తమకు పట్టనట్లు వ్యవహారిస్తున్నారనే విమర్శలు వైసీపీ క్యాడర్ నుంచి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులో ఎన్నికల ముందు వరకు పిఠాపురాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధిష్టానం ఇప్పుడేం చేయబోతోంది?
పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో తాను మీ ఆడపడుచునని అంటూ ప్రచారం చేసిన వైసీపీ పార్టీకి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత గొంతు ఇప్పుడు వినిపించడం మానేసింది. ఆమె ఎన్నికల సమయంలో జనసేనానిని ఓడిస్తానంటూ చూపించిన స్పీడ్ ఇప్పుడు ఏమైందనే ప్రశ్నలు వస్తున్నాయట. మెగా ఫ్యామిలీతో అనుబంధం ఆమెను కట్టిపడేస్తోందా ? ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు వంగా గీత మన ఆడపడుచు ఆమెను ఏమీ అనకండి అని కార్యకర్తలకు చెప్పడం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే…
వంగా గీత ప్రవర్తనను చూస్తుంటే ఆ విషయమే నిజం ఏమో అని అనిపిస్తుందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ నడుస్తుందట. పిఠాపురం నియోజకవర్గంలో బలమైన ప్రతిపక్షంగా ఉండాల్సిన వైసీపీ ఆమె మౌనంతో బలహీనపడుతోందనే చర్చ జోరుగా వినిపిస్తుందట. దాంతో పిఠాపురంలో వైసిపి క్యాడర్ ఉందా అన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి…2024 ఎన్నికల అనంతరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కీలక నేతలతో జనసేనలోకి చేరిపోయారు. ఈ మధ్యకాలంలో బహిరంగగానే పెండం దొరబాబు జరగబోయే స్థానిక ఎన్నికల సమయానికి వైసీపీని కాళీ చేస్తానంటూ శపధం చేసారు. ఆ క్రమంలో అసలు పిఠాపురం వైసీపీలో ఏం జరుగుతోందనేది ఆ పార్టీ వారికే అంతుపట్టడం లేదంట.
ఎన్నికల తర్వాత రోజు పిఠాపురం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఒకపక్క కుల దూషణలు, పలు అంశాలపై మత్స్యకారులు చేస్తున్న ఆందోళనలు, అసెంబ్లీ సెగ్మెంట్‌లో జరుగుతున్న ఇష్యూలపై వంగా గీత ఎందుకు స్పందించడం లేదనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తుందట. జగన్ పిలుపునిచ్చిన కార్యక్రమాలకే వంగా గీత బయటకు వచ్చి స్వరం వినిపిస్తున్నారు తప్ప, మిగిలి సమయాల్లో ఆ మాజీ ఎంపీ గొంతు ఎందుకు మూగబోతోందనేది నేతల మధ్య నడుస్తున్న చర్చ. ప్రతి విషయం వార్తల్లోకి వచ్చి జరిగిన తప్పులను స్వయంగా పవన్ కళ్యాణ్ తెలుసుకుంటూ వాటికి దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ మాత్రం ఎందుకు ప్రశ్నించడం లేదనే చర్చ నడుస్తోంది. ఇసుక అక్రమ రవాణాను పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వర్మ అడ్డుకున్నారు తప్ప వంగా గీత మాత్రం సైలెంట్ మోడ్ లో ఉంటూ ఏం జరిగిన చూస్తూ ఉండిపోతుండటం చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ నుండి కాకినాడలో జరిగే కార్యక్రమాలకు హాజరై కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడుతున్న వంగా గీత పిఠాపురంలో మాత్రం అంతంత మాత్రంగానే వ్యవహరిస్తున్నారట. జనసేన, టీడీపీ పార్టీల మధ్య జరిగే గొడవలను వేడుకలా చుస్తునారు తప్ప, వైసీపీ పరంగా ఎటువంటి కార్యచరణ లేకపోవడంతో కేడర్‌లో నైరాశ్యం నెలకొందట. కూటమి ప్రభుత్వం విధానాలను విమర్శిస్తూ చేస్తున్న ప్రకటనలు, సోషల్ మీడియాలో పోస్ట్ లకే పరిమితం అవుతున్నారు తప్ప … క్షేత్రస్ధాయిలో ఎటువంటి కార్యక్రమాలు చేయడంలేదనేది నేతల విమర్శ. ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీ పదవులను కార్యకర్తలు అలంకారప్రాయంగా తీసుకున్నారు తప్ప బాధ్యతాయుతంగా పార్టీ కార్యక్రమాలకి రావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల అనంతరం వైసీపీ పార్టీ నుండి అధిక సంఖ్యలో గెలిచిన సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్లు చైర్మన్లు కొంతమంది అప్పుడప్పుడు కనిపిస్తున్నారే తప్ప మిగిలిన వారు పార్టీ కార్యాలయం వైపు కూడా రావడం లేదట.అందుకు కారణం వంగా గీత ప్రవర్తననే అని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.
అన్ని పార్టీల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో పిఠాపురం రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతుంది.. ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైందంటూ పలువురు సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట . పిఠాపురం వైసిపి ఇన్ చార్జ్ మాజీ ఎంపీ వంగా గీత పని తీరుపై సొంత పార్టీ వర్గాల్లోనే తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుందట. ఆమె చుట్టూ ఉన్న కోటరీ వ్యక్తులు చెప్పినట్టుగానే ఆమె వ్యవహరిస్తున్నారని…గ్రౌండ్ లెవెల్ లో ఉన్న క్యాడర్ నుంచి వస్తున్న సమస్యలపై వేగంగా స్పందించట్లేదంటూ నేతల పెదవి విరిస్తున్నారట. ప్రతిపక్షంలో ఉండి పోరాడాల్సిన వంగా గీత పెద్దగా ఎఫెక్ట్ చూపలేకపోతున్నారన్న బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంగా గీత ఇదే ధోరణిలో ముందుకు సాగితే నిజంగానే పిఠాపురంలో వైసిపి ఖాళీ అయ్యే ప్రమాదం ఉందనే చర్చ నడుస్తుందట.
ఎన్నికల అనంతరం స్థానిక సమస్యలపై పోరాటాల్లో క్యాడర్ కి మద్దతు ఇవ్వడంలో వంగా గీత వెనుకబడ్డారని, వైసీపీలోని ఒక వర్గం బాహాటంగానే మాట్లాడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో చురుకుగా లేరని ఇది అధికార పక్షానికి మేలు చేకూరుస్తుందని వారు అంటున్నారట. గతంలో వంగా గీత ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది. వైసీపీలోనూ కాకినాడ ఎంపీగా పనిచేశారు. అయితే ఇప్పుడు ప్రతిపక్షనేతగా వంగా గీత వ్యవహార శైలితో ఆమె భవిష్యత్తు కార్యచరణ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయట. ప్రతిపక్షంగా పోరాడాల్సిన పలు అంశాలను విస్మరిస్తూ … కేవలం పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన కార్యక్రమాలను మాత్రమే వంగా గీత నిర్వహిస్తున్నారని…పిఠాపురం నియోజకవర్గంలో ప్రతినిత్యం ఏదో ఒక రగడ జరుగుతున్న స్వపక్షంలో విపక్షాల్లా జనసేన,టిడిపి మాత్రమే వాటిని చర్చిస్తున్నారు తప్ప…వంగా ఎందుకు స్పందించట్లేదంటూ రాజకీయ విశ్లేషకులు సైతం ముక్కున వేలు వేసుకుంటున్నారట.
మొత్తానికి వంగా గీత మౌనం వెనక రీజన్ ఏంటి అనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింద. వంగా గీత పార్టీ మారే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా….లేదంటే మరి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? కుల సమీకరణాలు అడ్డు వస్తున్నాయా? వంటి ప్రశ్నలు వైసిపి కేడర్ ను నిత్యం వేధిస్తున్నాయట. పిఠాపురంలో వైసీపీ నాయకత్వం తీరుతో కిందిస్థాయిలోని క్యాడర్ గందరగోళంలో పడి ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయిందట.
Story By Ramireddy, Big Tv