కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. కృష్ణాజలాలపై ప్రతిపక్ష నేతగా లేఖ రాయాలన్నారు. కృష్ణా జలాల్లో ఎవరు అన్యాయం చేశారో చర్చకు సిద్ధం అన్నారు. గోదావరి, కృష్ణా జలాలపై సభలో చర్చకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే BRS హయాంలోనే తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పెద్ద స్కామ్ అని ఫైరయ్యారు. కోటి మందికి పైగా దీనిని వ్యతిరేకిస్తున్నా.. ప్రభుత్వం ముందుకు వెళ్తే.. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే.. మెడికల్ కాలేజీలను తీసుకున్నవారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు.
ఐబొమ్మ రవి కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అత్యంత పటిష్టమైన క్యూబ్ నెట్‌వర్క్ శాటిలైట్ లింకును హ్యాక్ చేసి, సినిమాలను నేరుగా HD ఫార్మాట్‌లో రికార్డు చేసినట్లు రవి కస్టడీలో అంగీకరించాడు. ఈ పైరసీ నెట్‌వర్క్ అంతా హెచ్‌డీ హబ్ అనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సాగుతోందని అధికారులు గుర్తించారు.
కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో పరిశ్రమలకు కేటాయిస్తున్న భూముల్లో ల్యాండ్ సెటిల్‌మెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. రాజకీయ నాయకుల ల్యాండ్ సెటిల్‌మెంట్స్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. రాజకీయ జోక్యంపై చర్యలు తీసుకునేందుకు అధికారులు కూడా వెనకడుగు వేస్తున్నారన్నారు.
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు విజయవాడ ఎక్సైజ్ కోర్టు షాకిచ్చింది. ఏ2 జగన్మోహన్ రావు, ఏ18 జోగి రమేశ్, ఏ19 జోగి రాము బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. కొంతమంది నిందితులకు మాత్రమే బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 31 వరకు జోగి బ్రదర్స్‌కు రిమాండ్ పొడిగించింది.
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. గతంలో స్పీకర్‌గా, మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి.. పార్టీ మారడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి సిగ్గులేదని.. అన్ని పదవులు అనుభవించినా.. పోచారం పార్టీ ఎందుకు మారారో అర్థం కావడం లేదన్నారు.
అనకాపల్లి కెనరా బ్యాంక్‌లో దోపిడీకి ప్రయత్నించింది ఓ ముఠా. బ్యాంకులో ప్రవేశించిన ఏడుగురు అగంతకులు.. గన్‌లతో బెదిరించి దోపిడీకి ప్రయత్నించారు. బ్యాంకు సిబ్బంది అప్రమత్తమై అల్లారం ఆన్ చేయడంతో దొంగలు పరారయ్యారు. బ్యాంకు సిబ్బంది కంప్లైంట్‌తో.. బ్యాంకుకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్దేశపూర్వకంగానే దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యాలయాలపై ముట్టడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న అంశాల్లో దోషులుగా ఉన్న వారిని దర్యాప్తు సంస్థ కేసులు పెట్టడం జరిగిందని తెలిపారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా బురద జల్లుతుందని ఆయన విమర్శించారు.
నిర్మల్ జిల్లా లింగా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో గడ్ పాలే సుష్మ రాణి ఉత్కంఠభరిత విజయం సాధించారు. ప్రత్యర్థితో సమానంగా ఓట్లు రాగా, ఒక బ్యాంకు ఉద్యోగి వేసిన కీలకమైన బ్యాలెట్ ఓటుతో ఆమె ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందారు. తనపై నమ్మకముంచిన గ్రామస్తులకు రుణపడి ఉంటానని, గ్రామాభివృద్ధికి పాటుపడతానని ఆమె అన్నారు.
నంద్యాలలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మహానంది మండలానికి చెందిన వీరి వద్ద నుంచి రెండున్నర కేజీల గంజాయి, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ జావలి తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఎస్సై భాను ప్రకాష్ వద్ద ఉండాల్సిన తుపాకీ గత కొన్ని నెలలుగా కనిపించకుండా పోవడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయితే, ఎస్సై భాను ప్రకాష్ వద్ద ఉండాల్సిన రివాల్వర్ పోయిందన్న విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా దాచిపెట్టాడు.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన యువ క్రికెటర్ పేరాల అమన్ రావు ఐపీఎల్‌లో చోటు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన వేలంలో 21 ఏళ్ల ఈ యువ ఆణిముత్యాన్ని 30 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. పలువరు అమన్ రావుకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
నెల్లూరులో లావణ్య అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రియాంక హైస్కూల్లో మృతురాలు పదో తరగతి చదువుతుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత స్కూల్ నుంచి ఇంటికెళ్లిన లావణ్య.. ఉరి వేసుకుని చనిపోయింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని GGHకు తరలించారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కంఠం గ్రామం సర్పంచ్ పదవికి కాంగ్రెస్ బలపరిచిన పెంట ఇంద్రుడు, బీజేపీ బలపరిచిన ఆజిగిరి సాయినాధ్ పోటీ పడ్డారు. ఇద్దరికీ సమానంగా 711 ఓట్లు వచ్చాయి. దీంతో లక్కీ డ్రా తీయగా.. అజిగిరి సాయినాథ్ పేరు రావడంతో అతడిని విజేతగా ఎన్నికల అధికారి జాన్విలాన్ ప్రకటించారు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట్ మండలం జోగ్యతండా సర్పంచ్‌గా కేతావత్ కుమార్ నాయక్ విజయం సాధించారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కుమార్ నాయక్.. సర్పంచ్‌గా గెలుపొందారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
రాష్ట్రపతి భవన్‌లో పరమ్ వీర్ గ్యాలరీని ఏర్పాటు చేయటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఇందులోని చిత్రాలు దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులకు లభించిన హృదయపూర్వక నివాళిగా ఆయన పేర్కొన్నారు. వారి త్యాగాలకు సంబంధించిన కృతజ్ఞతా చిహ్నంగా దీనిని ఆయన అభివర్ణించారు.
అమెరికా తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీతో భారత హెచ్-1బీ దరఖాస్తుదారులకు కష్టకాలం ఎదురైంది. ఈ విధానం వల్ల వీసా కోసం దరఖాస్తుదారులు వచ్చే ఏడాది అక్టోబరు దాకా ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తింది. చాలామంది దరఖాస్తుదారుల వీసా అపాయింట్‌మెంట్లు 2026 అక్టోబరు నెలాఖరుకు వాయిదా పడినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి.
డిసెంబరు 19న సౌతాఫ్రికాతో ఐదో టీ20కి ఆతిథ్యమివ్వనున్న అహ్మదాబాద్ కూడా ఉత్తర భారతంలోనే ఉండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ మ్యాచ్‌పై కూడా పొగమంచు ప్రభావం ఉంటుందా? అని కలవరపడుతున్నారు. అయితే, మ్యాచ్ జరిగే రోజున అహ్మదాబాద్‌లో పొగమంచు అధికంగా ఉండదని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
ది రాజాసాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ వేళ వందల మంది అభిమానులు సెల్ఫీ కోసం ఎగబడటంతో నటి నిధి అగర్వాల్ అసౌకర్యానికి గురైన సంగతి తెలిసిందే. ఓ మాల్‌లో నిర్వహించిన వేడుక పూర్తయ్యాక బయటకు వస్తుండగా.. ఆమెపై కొందరు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మన శంకరవరప్రసాద్ గారు జనవరి 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. మరో 25 రోజుల్లో ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా విడుదలైన షూటింగ్ మేకింగ్ వీడియో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. వెంకటేశ్ అతిథి పాత్రలో మెరవనుండగా.. నయనతార, కేథరిన్ కీలక పాత్రలు పోషించారు.