BigTV English

Sunita Williams: ఎందుకింత ఆలస్యం! సునీతా రిటర్న్‌పై రాజకీయం

Sunita Williams: ఎందుకింత ఆలస్యం! సునీతా రిటర్న్‌పై రాజకీయం

Sunita Williams: ఎనిమిది రోజుల కోసం వెళ్లి, దాదాపు 300 రోజులు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు సునీత విలియమ్స్‌. అయితే ఆమెను ఇంతకాలం అంతరిక్షంలోనే ఉంచడానికి కారణం.. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ రాజకీయాలే అంటూ ఇటీవల ట్రంప్ సంచలన కామెంట్ చేసారు. ఇక, తగుతునమ్మా అని.. ఆ కామెంట్లను ఎలన్ మస్క్ సమర్థించారు. అయితే, మస్క్ తీరుపై మాజీ ఆస్ట్రోనాట్ మోగెన్సెన్ తీవ్రంగా మండిపాడ్డారు. అబద్దాలు చెప్పొదంటూ హెచ్చరించారు. వెంటనే, మోగెన్సెన్ మస్క్‌ కూడా కౌంటర్ ఇచ్చారు. ఏకంగా ఈడియట్ అంటూ తిట్టారు కూడా..! అసలెందుకు ఇంత రచ్చ జరిగింది..? ఇంతకీ, స్పేస్‌లో చిక్కుకున్న సునీత‌ను వెనక్కి తీసుకురావడానికి ఇంత ఆలస్యం ఎందుకయ్యింది..?


సునీతా రిటర్న్‌పై రాజకీయంగా ట్రంప్ కామెంట్లు

ప్లాన్ చేసింది ఎనిమిది రోజులే కానీ… ఇప్పుడు, దాదాపు 300 రోజులు అంతరిక్షంలో చిక్కుకుపోవాల్సి వచ్చింది సునీతా విలియమ్స్‌. సాంకేతిక సమస్యల మధ్య భూమికి తిరిగి రావాల్సిన స్టార్‌లైనర్ మొరాయిస్తుందంటూ… పరిష్కారం కోసం నాసా నెలల తరబడి ప్రయత్నాలు చేసింది. చివరికి, మొండిగా నమ్మిన బోయింగ్‌ను కాదని.. మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ నుండి రెస్య్కూ ఫ్లేట్‌ని పంపిస్తామని నాడు బైడెన్ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అప్పుడనీ.. ఇప్పుడనీ.. గతేడాది జూన్ నుండీ ఇప్పటి వరకూ సాగదీసి, లాగదీసి.. రాబోయే మార్చి నెలలో భూమికి తిరిగి వస్తారని ఇటీవలే ప్రకటించారు.


బైడెన్ రాజకీయ కారణాల వల్ల అంతరిక్షంలోనే వదిలిపెట్టారన్న మస్క్

అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ జాప్యంపై రాజకీయంగా కామెంట్లు చేశారు. దీనికి మస్క్ వంత పాడారు. అయితే, అక్కడే ఈ వివాదం మొదలయ్యింది. నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను అంతరిక్షం నుండి తిరిగి తీసుకురాడానికి రెడీగా ఉన్న స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్.. ఈ విషయంపై తాజాగా, డానిష్ వ్యోమగామి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మాజీ కమాండర్ అయిన ఆండ్రియాస్ ‘ఆండీ’ మోగెన్సెన్‌తో.. సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి దిగారు. సునీతా, విల్మోర్‌లను జో బైడెన్ తన రాజకీయ కారణాల వల్ల అంతరిక్షంలోనే వదిలిపెట్టారని మస్క్ సమర్థించడాన్ని మోగెన్సెన్ విమర్శించారు.

మాజీ ఆస్ట్రోనాట్ మోగెన్సెన్ ఎక్స్‌లో మస్క్‌పై కామెంట్

దాదాపు 300 రోజులుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉన్న సునీతా విలయమ్స్, బిల్మోర్‌లను మాజీ ప్రెసిడెంట్ బైడెన్ “రాజకీయ కారణాల వల్ల” వదిలివేసారని స్పేస్‌ఎక్స్ సీఈఓ ఆరోపించిన ఫాక్స్ న్యూస్‌ను ఉద్దేశిస్తూ.. 48 ఏళ్ల మోగెన్సెన్ ఒక క్లిప్‌ను షేర్ చేశారు. అందులో..” ప్రధాన స్రవంతి మీడియాలో నిజాయితీ లేదని ఫిర్యాదు చేసే వ్యక్తి నుండి.. ఎంత అబద్దం వచ్చింది” అని మోగెన్సెన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కామెంట్ చేశారు.

మోగెన్సెన్‌ను ఉద్దేశించి “ఇడియట్” అని ప్రస్తావించిన మస్క్

దీనితో, మోగెన్సెన్‌ను ఉద్దేశించి, “ఇడియట్” అని ప్రస్తావించిన మస్క్.. తనపై వచ్చిన అబద్దం కామెంట్‌ను ఖండించారు. “నువ్వు పూర్తిగా పిచ్చోడివి అయ్యావనీ.. ఇద్దరు వ్యోమోగాముల్ని స్పేస్‌ఎక్స్ చాలా నెలల క్రితమే తిరిగి తీసుకుస్తుందని, బైడెన్‌కు నేరుగా చెప్పినా.. దాన్ని బైడెన్ నిరాకరించారనీ… కేవలం, రాజకీయ కారణాల వల్ల వాళ్లు తిరిగి రావడాన్ని ఆలస్యం చేసారనీ..” అని మస్క్ ఘాటుగా స్పందించారు.

రెస్క్యూ మిషన్‌ను నువ్వే ఆలస్యం చేశావని మస్క్‌పై ఆరోపణ

అయితే, 48 ఏళ్ల ఈ వ్యోమగామి.. మస్క్ చేసిన తీవ్రమైన కామెంట్లకు ప్రతిస్పందిస్తూ.. సునీతా విలియమ్స్, విల్మోర్ రెస్క్యూ మిషన్‌ను నువ్వే ఆలస్యం చేశావని మస్క్‌పై ఆరోపణ చేశారు. “ఎలన్.. నేను మిమ్మల్ని, ముఖ్యంగా స్పేస్‌ఎక్స్, టెస్లాలో మీరు సాధించిన వాటినీ చాలా కాలంగా మెచ్చుకున్నాను. కానీ, బుచ్, సునిలు.. క్రూ-9లో తిరిగి వస్తున్నారని మీకు కూడా తెలుసు. గత సెప్టెంబర్ నుండి దీన్ని ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు కూడా, మీరు వాళ్లని తిరిగి తీసుకురావడానికి రెస్క్యూ షిప్‌ను పంపడం లేదు.. అయితే, గత సెప్టెంబర్ నుండి ISSలో ఉన్న డ్రాగన్ క్యాప్సూల్‌‌లోనే వాళ్లు తిరిగి రావాల్సి వస్తుంది” అని మోగెన్సెన్ సున్నితంగా ఆరోపణ చేశారు.

ISSలోని డ్రాగన్ క్యాప్సూల్‌‌లోనే వాళ్లు తిరిగి రావాల్సి వస్తుంది

అయితే, దీనిపై మస్క్ మళ్లీ రెస్పాండ్ అవ్వలేదు. ఇక, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి అయిన మోగెన్సెన్.. 2023 మిషన్ సమయంలో స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌లోనే రెండుసార్లు ISSకి వెళ్లారు. కాబట్టి, మోగెన్సెన్‌, మస్క్‌లు ఇద్దరు సుపరిచితులే కానీ.. మస్క్ రాజకీయ కోణం నుండి చేసిన వాదనలను మాత్రం మోగెన్సెన్ సమర్థించలేదు. చివరికి, మస్క్ పంపుతానన్న స్పేస్ ఎక్స్ షిప్‌ను కూడా పంపకపోతుండటం వల్ల తీవ్రంగా స్పందించారు.

ఇలాంటి ఆరోపణ గతంలోనే చేసిన ట్రంప్

అయితే, ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో… ఎలన్ మస్క్‌ను ఉద్దేశిస్తూ.. వ్యోమగాములను ఎప్పుడు తిరిగి తీసుకువస్తారని ప్రెసిడెంట్ ట్రంప్ అడుగుతారు. దీనికి స్పేస్‌ఎక్స్ సీఈఓ మస్క్ బదులిస్తూ… “వారిని తిరిగి తీసుకురావడానికి దాదాపు నాలుగు వారాలు పడుతుందని” చెబుతారు. అయితే, దానికి బైడెన్‌ను నిందించడంతోనే వాగ్వాదం చోటుచేసుకుంది. నిజానికి, ట్రంప్ ఇలాంటి ఆరోపణ గతంలోనే చేశారు. ఇటీవల, ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో మాట్లాడుతూ, వాళ్లను “వీలైనంత త్వరగా” ఇంటికి తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్‌కు బాధ్యత వహించానని చెప్పారు. “బైడెన్ ప్రభుత్వం వారిని చాలా కాలం అక్కడే ఉంచడం చాలా భయంకరంగా ఉంది” అని కూడా ట్రంప్ అన్నారు. ఇక, తాజాగా మస్క్ కూడా దానికి వంత పాడటంతో వివాదం రాజుకుంది.

గతేడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్‌లో ISSకు వెళ్లిన సునీత

నిజానికి, భారతీయ సంతతికి చెందిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు గత సంవత్సరం జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్‌లో ISSకు వెళ్లారు. బోయింగ్ తయారుచేసిన స్టార్‌లైనర్‌‌ అంతరిక్ష నౌకను పరీక్షించి, ధృవీకరించడానికి ఎనిమిది రోజుల కోసం ప్లాన్ చేసిన మిషన్ అది. కానీ, స్టార్‌లైనర్‌లో థ్రస్టర్ సమస్యల కారణంగా… స్టార్‌లైనర్ వ్యోమగాములు లేకుండనే తిరిగి భూమి పైకి వస్తుందని నాసా వెల్లడించింది. ఇక, వారిని తిరిగి తెచ్చే బాధ్యతను మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కు అప్పగించారు.

మార్చి 19న భూమికి తిరిగి వస్తారని తాజా ప్రకటన

తర్వాత, సునీతా విలియమ్స్, విల్మోర్‌లు.. స్పేస్‌ఎక్స్ క్రూ-9 మిషన్ అంతరిక్ష నౌకలో తిరిగి వస్తారని నాసా ప్రకటించింది. ఇది గత సంవత్సరం సెప్టెంబర్‌లో వెళ్లాల్సి ఉంది. ఫిబ్రవరిలో తిరిగి రావాలని ప్రారంభంలో షెడ్యూల్ చేశారు. కానీ, అది కూడా క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు, వాళ్లు మార్చి 19న భూమికి తిరిగి వస్తారని ప్రకటించారు. అది కూడా కచ్ఛితంగా జరుగుతుందా లేదా అనే సందేహాలు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ అంశానికి రాజకీయ రంగు పులమడం ఆసక్తిని రేపుతోంది.

జూన్ 5న ప్రారంభమైన టెస్ట్ ఫ్లైట్ స్టార్‌లైనర్‌

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్.. ఆమెతో పాటు, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌లు జూన్ 5న ప్రారంభమైన టెస్ట్ ఫ్లైట్ స్టార్‌లైనర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణం అయ్యారు. అయితే, స్టార్‌లైనర్‌‌లో హీలియం లీక్‌లు, థ్రస్టర్ వైఫల్యాలు వంటి అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఇలాంటి, ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ, స్టార్‌లైనర్ వ్యోమగాముల భద్రతకు భరోసా ఇస్తుందని నాసా అధికారులు హామీ ఇచ్చారు. కానీ, పరిస్థితులు తారుమారయ్యాయి.

బోయింగ్ తయారు చేసిన స్టార్‌లైనర్ స్పేస్ షిప్‌

బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్టార్‌లైనర్ స్పేస్ షిప్‌లో ఉన్న ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నప్పటికీ… తిరిగి వచ్చే సమయానికి సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. మిషన్ వ్యవధి దాటేసి వారాల సమయం అవుతోంది. ప్రారంభంలో పది రోజులు మాత్రమే ఉండేలా ప్రణాళిక చేసింది నాసా. కానీ, మిషన్‌లో సాంకేతిక సవాళ్లున్నాయనీ రోజులు తరబడి తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేస్తూ వచ్చింది.

స్పేస్ ఎక్స్ అభివృద్ది చేసిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్..

ఇక, అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను ఎలాగైనా భూమిపైకి తీసుకురావాలని నాసా విశ్వ ప్రయత్నాలు చేసింది. ప్రతీసారి ఏదో ఒక ఆటంకం ఏర్పడి, పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కాగా, గత బైడెన్ ప్రభుత్వం తర్వాత..ఇటీవలే అమెరికా అధ్యక్షుడిగా గద్దెనెక్కిన ట్రంప్ కూడా ఈ బాధ్యతను స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌కు అప్పగించారు. కాగా, వ్యోమగాముల రాకలో ఒక క్లారిటీ వచ్చినట్లయ్యింది.

మార్చి 19వ తేదీన వ్యోమగాములతో తిరిగి భూమి పైకి

స్పేస్ ఎక్స్ అభివృద్ది చేసిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ మార్చి 12వ తేదీన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్తుంది. మార్చి 19వ తేదీన వ్యోమగాములతో తిరిగి భూమిని చేరుతుందని ప్రకటించారు. ఇక, 8 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ మార్చి 19న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు భూమ్మీద కాలుమోపనున్నారు.

సునీతా విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపై పెద్ద ఎత్తున చర్చ

అయితే, గత నవంబర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో సునీతా విలియమ్స్ ఎప్పుడూ లేనంత సన్నగా కనిపించారు. వెయిట్ లాస్ అడ్వర్టైజ్‌మెంట్‌లో చూపించినట్లు ‘అప్పుడు అలా, ఇప్పుడు ఇలా’ అన్నవిధంగా సునీతా విలియమ్స్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ ఫోటోలో సునీతా విలియమ్స్ బరువు తగ్గినట్లుగా, నీరసంగా ఉన్నట్లు, బుగ్గలు లోపలికి వెళ్లినట్లుగా కనిపించారు.

నాసా వైఫల్యమే కారణమంటూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు

కాగా ఈ ఫోటో ఇంటర్నెట్‌లో అందర్నీ ఆందోళనకు గురి చేసింది. ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లనే ఆమె బలహీనంగా కనిపిస్తున్నారని అమెరికాకు చెందిన సియాటిల్ నివాసి, శ్యాసకోశ సంబంధిత వ్యాధుల నిపుణులు డాక్టర్ వినయ్ గుప్తా కామెంట్ చేశారు. దీంతో సునీతా విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపై పెద్ద ఎత్తున చర్చ రాజుకుంది. అంతరిక్ష కేంద్రంలో ఎక్కువ రోజులపాటు ఉండటం వల్ల సునీత విలియమ్స్‌ ఆరోగ్యం క్షీణిస్తుందని, దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వైఫల్యమే కారణమంటూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వినిపించాయి.

ISSలో తాము సేఫ్‌గా ఉన్నట్లు ఇద్దరు వ్యోమోగాములు వెల్లడి

అయితే, పలు సందర్భాల్లో ISSలో తాము సేఫ్‌గా ఉన్నట్లు ఇద్దరు వ్యోమోగాములు వెల్లడించారు. ఈ సుదీర్ఘ సమయంలో… సునీతా విలియమ్స్ అత్యధిక సమయం స్పేస్‌వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు కూడా నెలకొల్పారు. ఆమె 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్షంలో నడిచారు. వ్యోమనౌకలో సాంకేతిక సమస్య వచ్చినప్పుడు దాంట్లో నుంచి బయటకొచ్చి కొన్ని రిపేర్లు కూడా చేశారు. 6.5 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది.

పెగ్గీ విట్సన్ పేరిట 60.21 గంటలున్న స్పేస్‌వాక్‌ రికార్డు బద్దలు

ఇది సునీత తొమ్మిదో స్పేస్ వాక్ కాగా.. విల్‌మోర్‌కు ఐదోది. మొత్తం 62.6 గంటల పాటు ఈ విన్యాసంలో సునీత పాల్గొన్నారు. దీంతో గతంలో నాసా వ్యోమగామి పెగ్గీ విట్సన్ పేరిట 60.21 గంటల పాటున్న స్పేస్‌వాక్‌ రికార్డును సునీత అధిగమించారు. రిపేరింగ్ టైమ్‌లో ISS నుంచి బయకొచ్చి, రేడియో ఫ్రీక్వెన్సీ గ్రూప్ యాంటినా వ్యవస్థ సహా ప్రైమరీ ఆబ్జెక్టివ్‌లను పూర్తిచేశారు. అక్కడి ఉపరితలంపై నమూనాలను ల్యాబ్ విశ్లేషణ కోసం సేకరించారు.

అంతరిక్షంలో ఎక్కువకాలం ఉంటే తగ్గే ఎముకల సాంద్రత

ఏది ఏమైనప్పటికీ.. ఆరు నెలల కంటే వ్యోమగాములు అంతరిక్షంలో ఎక్కువకాలం ఉంటే వారి ఎముకల సాంద్రత తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే, ఇన్ని రోజుల తర్వాత తిరిగి భూమి పైకి వస్తున్నప్పటికీ.. వచ్చాక తలెత్తే సమస్యలపై ఇటీవల తీవ్ర చర్చ జరిగింది. దాన్ని ఊహించుకుంటేనే భయమేస్తోందిని కూడా వ్యోమోగాములు అన్నారు. గ్రావిటీలో చాలా ఇబ్బంది ఉంటుందనీ… వీళ్లు 8 నెలలుగా గాలిలో తేలిన వీళ్లు.. భూమిపైకి రాగానే కూర్చోలేరు.. పడుకోలేరు.. నిలబడలేరు.. నడవలేరని అంటున్నారు. ఒక పిన్నీసుని కూడా ఎత్తడానికి చాలా ఒత్తిడి ఉంటుందనీ.. అదేదో డంబెల్ మోసినట్లు ఉంటుందని చెబుతున్నారు.

రక్తనాళాలు, గుండె పనితీరులో కూడా ఇబ్బంది

ఇప్పటి వరకూ తేలుతూనే గడిపారు కాబట్టీ గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి వస్తే ఎన్నో సమస్యలు ఎదురవుతాయనీ.. భూమిపై పరిస్థితులకు సర్దుకుపోవడానికి చాలా టైమ్ పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా శరీరమంతా ఏదో భారంగా అనిపిస్తుంది. రక్తనాళాలు, గుండె పనితీరులో కూడా ఇబ్బంది ఉంటుందనీ.. ఒక్కోసారి, గుండె ఆగిపోయే పరిస్థితి వస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లు కొత్తగా నడకను నేర్చుకోవాల్సి ఉంటుందనీ.. చాలా పనుల్లో చిన్నపిల్లల్లా నేర్చుకోవాలని చెబుతున్నారు. ఇక, వీళ్లద్దరూ భూమికి చేరుకున్న తర్వాత… పరిణామాలు ఎలా ఉంటాయన్నది చూడాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×