Rahul Gandhi: కాంగ్రెస్ ఇప్పుడు కష్టకాలంలో ఉంది. ఇది ఎవరైనా ఊహించగలిగేదే. ఏం చేసినా గెలవలేకపోతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ తడబడుతోంది. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న హస్తం పార్టీ ఎందుకు వెనుకబడుతోంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాన్ని గత కొన్ని రోజుల నుంచి సీరియస్‌గా వెతుకుతోంది హైకమాండ్. వరుస మీటింగ్‌లు, అభిప్రాయసేకరణ.. రోజూ ఇదే జరుగుతోంది. ఇందులో రాహుల్ గాంధీ ఒక స్ట్రాటజీ వర్కవుట్ చేశారు. మూడు గుర్రాల కథ చెప్పారు. గుజరాత్ నుంచే గెలుపు యాత్ర షురూ చేద్దామంటున్నారు. ఇంతకీ ఏమిటా స్ట్రాటజీ? వర్కవుట్ అవుతుందా?
గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలన్న డిమాండ్లు
రైట్ చూశారుగా.. రాహుల్ గాంధీ డైలాగ్స్.. కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల సమయంలో ఏం జరుగుతుందో నిజం ఒప్పుకున్నారు. రేసు గుర్రాలను బరాత్ కు, పెళ్లి ఊరేగింపు గుర్రాలను రేసుకు పంపుతున్నామని. అందుకే ఓడిపోతున్నామంటున్నారు. నిజానికి ఇది రాహుల్ గాంధీ మాట కాదు. కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన మీటింగ్ లో పాల్గొన్నప్పుడు వాళ్లు చెప్పిందే. రియలైజ్ అవ్వాలి. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలన్నది వారి మాట. నిజానికి గతేడాది సేమ్ రేస్ గుర్రం డైలాగ్ రాహుల్ గాంధీ నోటి నుంచి వచ్చింది. ఈ మధ్యలో మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు జరిగాయి. అక్కడ మరి రేసు గుర్రాలకు టిక్కెట్లు ఇవ్వలేదా? ఓడిపోయారెందుకు? ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి.
ఎలా గెలవాలన్న విషయాలపై సీరియస్ మీటింగ్స్
అయితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఈ వరుస ఓటముల నుంచి ఎలా గట్టెక్కాలన్న విషయాలపై సీరియస్‌గా మీటింగ్‌లు పెడుతున్నారు. అహ్మదాబాద్‌లో ఏఐసీసీ సమవేశంలో ఎలా ముందుకెళ్లాలో ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారు. ఇక పార్టీలో రేసు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని, ట్రెండింగ్‌లో ఉన్న వారికే ఫండింగ్ అంటున్నారు. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది. అయితే వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి కథ మార్చాలని, మధ్యలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటే వ్యూహాలు రెడీ చేస్తున్నారు రాహుల్ గాంధీ. మరి అవన్నీ వర్కవుట్ అవుతాయా?
డీసీసీల దగ్గర్నుంచే మ్యాటర్ షురూ
దేశ రాష్ట్రాల రాజకీయాల గురించి ఎన్ని మాట్లాడుకున్నా.. ఎంత చేసినా.. ఎన్ని స్పీచులు ఇచ్చినా.. ఎవరెవరినో విమర్శించినా.. చివరకు బూత్ లెవెల్ లో పది మందిని ప్రభావితం చేసి, తీసుకెళ్లి ఓట్లు వేయించే వాళ్లే అవసరం. ఇప్పుడు వారినే నమ్ముకోవాలని కాంగ్రెస్ అనుకుంటోంది. బూత్ లెవెల్ నుంచి బీజేపీ ఫాలో అవుతున్న వ్యూహాలను అందిపుచ్చుకోవడంలో కాంగ్రెస్ బాగా వెనుకబడింది. ఇన్నాళ్లకు రియలైజ్ అయిందంటున్నారు. అందుకే డీసీసీల దగ్గర్నుంచే మ్యాటర్ షురూ కావాలంటున్నారు. టిక్కెట్ల కోసం పార్టీలో ప్రొడక్టివ్ కాంపిటీషన్ ఉండాలి గానీ.. నష్టపరిచేలా పోటీ ఉండకూడదంటున్నారు. అంతే కాదు.. కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు ఎలా వస్తాయో కూడా రాహుల్ గాంధీ నిజం చెప్పి ఇన్నాళ్లూ జరుగుతున్న తప్పును కార్యకర్తల దృష్టికి తీసుకొచ్చారు. అంతా ఖుల్లం ఖుల్లా.
గట్టెక్కడం సులువే అంటూ శ్రేణుల్లో రాహూల్ జోష్
నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టిక్కెట్ ఎవరికి వస్తుందో డీసీసీలకు కూడా తెలియదని, ఏదో ఉరుము ఉరిమినట్లుగా ఆకాశం నుంచి ఊడిపడుతుందంటూ నిజం ఒప్పుకున్నారు. ఇదే కాదు.. ఏప్రిల్ 16న గుజరాత్ లో జరిగిన మీటింగ్ లో రాహుల్ మరో సంకల్పం తీసుకున్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ను దేశంలో ఓడించాలంటే.. అది గుజరాత్ నుంచే మొదలవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రస్థానమే గుజరాత్ నుంచి మొదలైందని, గాంధీ, పటేల్ పుట్టిన గడ్డ నుంచే రీస్టార్ట్ అవ్వాలని గుర్తు చేశారు. గుజరాత్ లో డీమోరలైజ్ అయ్యామని, కానీ కలబడుదాం.. నిలబడుదాం. గెలుద్దాం.. గట్టెక్కడం సులువే అంటూ శ్రేణుల్లో జోష్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
డీసీసీలను జిల్లా కేంద్రం నుంచే నడిపిద్దామని, అహ్మదాబాద్ నుంచి కాదన్నారు. పవర్ ఇవ్వాలి, బాధ్యతలు ఇవ్వాలి. స్వేచ్ఛ ఇవ్వాలంటూ మాట్లాడడంతో కాంగ్రెస్ కు గుజరాత్ లో మంచి రోజులు వచ్చినట్లేనా అన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లో ఈ పరిస్థితి ఒక్క గుజరాత్ లోనే ఇలా లేదు. చాలా రాష్ట్రాల్లో సేమ్ సీన్. అన్ని రాష్ట్రాల్లో ఉత్సాహం పెరుగుతుందా? రాహుల్ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా? అంటే మారాల్సింది చాలా ఉందన్న వాదన తెరపైకి వస్తోంది.
ఆపరేషన్ కాంగ్రెస్
కాంగ్రెస్‌ను మూడు గుర్రాల కథ విడిచిపెట్టడం లేదు. అసలైన టైమ్ వచ్చే సరికి రేసు గుర్రాలు వెనక్కి.. పెళ్లి ఊరేగింపు గుర్రాలు ముందుకొస్తున్నాయి. ఇక కుంటి గుర్రాల సంగతి చెప్పక్కర్లేదు. మరి దేశవ్యాప్తంగా చేతి రాత మారుతుందా? దశ తిరుగుతుందా? తెలంగాణలో సక్సెస్ ఎలా అయ్యారు.. మిగితా చోట్ల బోల్తా కొట్టారెందుకు? గుజరాత్ లో ఎందుకు గెలవాలనుకుంటున్నారు?
1995 నుంచి గుజరాత్‌లో బీజేపీ గెలుపు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 1995 నుంచి 2022 వరకు వరుసగా 7 సార్లు గెలిచింది. కాంగ్రెస్ ఎప్పుడూ బోల్తా కొడుతూనే ఉంది. నిజానికి సుదీర్ఘకాలం ఏదైనా ఒకే పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ పుంజుకోకపోవడంతో అక్కడ మ్యాటర్ మరోలా ఉంది. ఇప్పుడు 2027లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో గెలుపే లక్ష్యంగా రాహుల్ గాంధీ భారీ స్ట్రాటజీతో ఉన్నారు.
సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం
మొన్నటికి మొన్న ఏఐసీసీ సమావేశాలు అక్కడే పెట్టారు. తాజాగా సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని కూడా గుజరాత్ నుంచే షురూ చేశారు. దీనికి లెక్క ఉంది. ఎందుకంటే గుజరాత్ లో 30 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ఆ లెక్కలన్నీ ఇప్పుడు మార్చాలనుకుంటున్నారు. అందుకే ఆపరేషన్ గుజరాత్ నడుస్తోంది.
కాంగ్రెస్‌లో ఇంటర్నల్‌గా చాలా ఇష్యూస్
గుజరాత్ సరే.. మరి మిగితా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే.. పరిస్థితి ఏమంత బాగా లేదు. చాలా రాష్ట్రాల్లో ఆల్టర్నేట్‌గా కూడా లేకుండా పోయింది. పార్టీకోసం పని చేసిన వారికి సరైన గుర్తింపు దక్కకపోవడం, కష్టపడి పని చేస్తే స్వేచ్ఛ ఇవ్వకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయన్నది కాంగ్రెస్ పార్టీలోనే ఇంటర్నల్ గా జరుగుతున్న చర్చ. అంతేకాదు.. దేశంలో ఎఫెక్టివ్ లీడర్స్, గెలుపోటములను డిసైడ్ చేసే లీడర్ షిప్ ను కూడా హస్తం పార్టీ దూరం చేసుకుంది. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య వెళ్లిపోయారు. రాజస్థాన్ లో సచిన్ పైలట్ కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. సీనియర్లు అంటూ పవర్ ఉన్న వారిని పక్కన పెడుతూ వచ్చారన్న వాదన ఉంది.
జనంలో బలంగా ఉన్న వారిని నమ్ముకోవడం బెటర్
రాహుల్ గాంధీ చెప్పినట్లు రేసు గుర్రాలను రేసుకే పంపాలి. జనంలో ఇన్ ఫ్లూయెన్స్ ఉన్నోళ్లకే టిక్కెట్ ఇవ్వాలి. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారని ఇస్తే కుదరదు.. మార్పు కావాలి అన్న నినాదాలు కార్యకర్తల నుంచి వస్తున్నాయి. నిజానికి కొత్త నాయకత్వాన్ని బీజేపీ ఎంకరేజ్ చేస్తూ వస్తోంది. కొత్త ముఖాలతో బరిలో దిగుతోంది. అవసరమనుకుంటే పక్క పార్టీల్లో బలమైన నేతలు ఉంటే వారిని కూడా ఆకర్షించి పగ్గాలు అప్పగిస్తున్నారు. ఇదే కాంగ్రెస్ చేయలేకపోతోంది. కుంటి గుర్రాలనే నమ్ముకుంటోందా అన్న చర్చ అయితే జరుగుతోంది.
తెలంగాణలో రేవంత్‌కు పగ్గాలు ఇచ్చి సక్సెస్
నిజానికి ఒక్క తెలంగాణలోనే కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం సక్సెస్ అయింది. ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించారు. పగ్గాలు ఇచ్చి స్వేచ్ఛ ఇచ్చారు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అంటూ చేసిన ప్రచారం సక్సెస్ అయింది. బలమైన నాయకుడి చేతిలో పార్టీ పగ్గాలు పెడితే ఎలాంటి ఫలితం వస్తుందో తెలంగాణలో ప్రూవ్ అయింది. ఇప్పుడు అలాంటి స్ట్రాటజీనే మిగితా రాష్ట్రాల్లో అమలు చేయాలనుకుంటోంది.
బూత్ లెవల్ జిల్లాస్థాయి నేతలకే బాధ్యతలు
కర్ణాటకలో డీకే శివకుమార్ అంతా తానై చేస్తే.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో సిద్ధరామయ్యకు సీఎం పగ్గాలు దక్కాయి. కష్టపడి పని చేసేది ఒకరైతే.. అవకాశం మరొకరికి ఇస్తున్న పరిస్థితి.. అందుకే ఈ సమస్యలు. ఎవరు పని చేస్తే వారికే ప్రయారిటీ.. ఇవ్వడం కీలకం అంటున్నారు. సో మార్పు కోసం బూత్ లెవెల్ జిల్లాస్థాయి నేతలనే కాంగ్రెస్ నమ్ముకుంటోంది. గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్లి సంస్థాగతంగా బలోపేతం అవ్వాలనుకుంటోంది. అందుకోసం లేటెస్ట్ గా సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టింది.
కాంగ్రెస్‌లో కొత్త సంకల్పం, శక్తిని నింపేలా కార్యక్రమం
ఇది సంస్థాగతంగా పార్టీని బలోపేత కార్యక్రమం. పార్టీలో కొత్త నాయకత్వాన్ని, ఉత్సాహాన్ని పెంచడం, గ్రాస్ రూట్ లెవెల్ లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, కొత్త కార్యకర్తలను చేర్చుకోవడం, వారికి ట్రైనింగ్ ఇవ్వడం, పార్టీ లక్ష్యాల కోసం వారిని రెడీ చేయడం ఇందులో కీలకంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కొత్త సంకల్పం, శక్తిని నింపేలా కార్యక్రమం తీసుకున్నారు. సంఘటన్ సృజన్ అభియాన్ అని కార్యక్రమం మొదలైందిగానీ.. విచిత్రమేంటంటే ఇది కాంగ్రెస్ లోనే చాలా మందికి ఇంకా తెలియదు. ప్రచారం ఎక్కువగా చేయలేదు. ఇక అందరిలోకి వెళ్లేదెప్పుడు?
Also Read: టారిఫ్ వల్ల భారీ దిగుమతులు.! మనకు వచ్చే లాభమేంటీ..? ఎదుర్కునే సవాళ్లేంటీ..?
యూత్, మిడిల్ క్లాస్ ఓటర్లను ఆకర్షించడంలో విఫలం
బీజేపీ అజెండాపై స్టాండ్ ఉంది. క్లారిటీ ఉంది. అటు కాంగ్రెస్ లౌకిక, సామాజిక న్యాయంపై ఫోకస్ పెట్టినప్పటికీ, ఇది యువత అలాగే మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించడంలో విఫలమవుతోంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ స్టెప్ తీసుకోవాలి. డీసీసీలకు ఎక్కువ అధికారాలు ఇచ్చే ప్రణాళిక స్పీడప్ చేయాలి. సోషల్ మీడియాను మరింత బలోపేతం చేసుకోవాల్సి ఉంది. అమలైన హామీలను సోషల్ మీడియా ద్వారా జనంలోకి తీసుకెళ్లాలి.
అంతర్గత విభేదాలను తగ్గించుకోవడం ముఖ్యం
ప్రాంతీయ పార్టీలతో సమన్వయం పెంచుకోవాల్సి ఉంది. యువత, మహిళలను ఆకర్షించేందుకు నిర్దిష్ట విధానాలను ప్రకటించాలి. ఫైనల్ గా అంతర్గత విభేదాలను తగ్గించి, సీనియర్లు, యువనాయకుల మధ్య సమన్వయం పెంచాలి. రేసు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలి. బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించాలి. ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ ఫస్ట్ పాత విధానాలకు స్వస్తి పలకాలి.