BigTV English

Tariff War: టారిఫ్ వల్ల భారీ దిగుమతులు.! మనకు వచ్చే లాభమేంటీ..? ఎదుర్కునే సవాళ్లేంటీ..?

Tariff War: టారిఫ్ వల్ల భారీ దిగుమతులు.! మనకు వచ్చే లాభమేంటీ..? ఎదుర్కునే సవాళ్లేంటీ..?

Tariff War: ప్రపంచమంతా ట్రంప్ పెట్టిన టారిఫ్ పొగలో ఊపిరాడకుండా ఉంటే.. భారత్ మాత్రం లాభాల పంటను కోసుకోవాలని చూస్తుంది. అవును, అమెరికా-చైనాల మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధంలో భారత్‌ లాభపడే అవకాశం ఉంది. అలాగని, సమస్యలు లేవా అంటే లేకపోలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్ మార్కెట్లలో ఒకటైన భారతదేశంపై ఇప్పుడు అమెరికా, చైనాల కళ్లు పడ్డాయి. చైనాతో అమెరికా చేస్తున్న ట్రేడ్ వార్‌లో ఇండియా ఎగుమతులు అమెరికాకు ఎలా పెరుగుతాయో… చైనా నుండి భారత్‌కు దిగుమతులు కూడా అలాగే పెరిగే అవకాశం ఉంది. అయితే, ఇది భారత్ మేక్ ఇన్ ఇండియాను దెబ్బతీస్తుందనే సందేహాలు ఉన్నాయి. ఇంతకీ, ఈ ట్రేడ్ వార్‌లో భారత్ స్థానం ఎలా ఉండనుంది…? భారత్‌కు వచ్చే లాభమేంటీ..? భారత్ ఎదుర్కునే సవాళ్లేంటీ…?


చైనా, అమెరికాల మధ్య పరస్పర ప్రతీకార సుంకాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బ ప్రపంచంపై భారీ ఎఫెక్ట్ చూపిస్తోంది. ట్రంప్ టారీఫ్ వార్ అంతర్జాతీయ మార్కెట్‌ను అల్లకల్లోలం చేస్తోంది. పరిస్థితులన్నీ తల్లకిందులౌతుంటే… బడా కంపెనీలు సైతం బెంబేలేత్తిపోతున్నాయి. ముఖ్యంగా, ప్రత్యర్థి దేశాలుగా ఉన్న చైనా-అమెరికాల మధ్య పరస్పర ప్రతీకార సుంకాలు ప్రపంచాన్ని మాంద్యం వైపు నడిపిస్తాయనే ఆందోళనలు పెరిగాయి. ఆర్థిక వేత్తలు, విధాన నిర్ణేతలు అయోమయంలో పడ్డారు. ఈ పరిణామం ఎటు దారితీస్తుందో అనే భయంతో ఉన్నారు. ఈ భయాన్ని మరింత పెద్దది చేస్తూ… చైనాపై ట్రంప్ సుంకాలను పెంచుకుంటూ పోతున్నారు.


ప్రస్తుతం చైనాపై 245% సుంకాలు పెంచిన అమెరికా

ఇటీవల 145 శాతం సుంకం విధించిన అమెరికా, ప్రస్తుతం దాన్ని 245 శాతానికి పెంచింది. అయితే, చైనా కూడా ప్రతికారం తీర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. అమెరికాపై ఇప్పటికే 125 శాతం టారిఫ్ విధించింది. ఇప్పుడు, ఈ రెండు దేశాల మధ్య రగులుతున్న టారిఫ్ వార్‌తో గ్లోబల్ సప్లై చైన్‌లో భారీ మార్పులు రాబోతున్నాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో భారత్ వాణిజ్య వ్యూహాలు కూడా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా, భారత్ నుండి అమెరికాకు ఎగుమతులు పెరగడంతో పాటు.. చైనా నుండి భారతదేశానికి దిగుమతులు కూడా అధికమవుతాయనే అభిప్రాయాలు ఉన్నాయి.

“చైనా ప్లస్ వన్” వ్యూహంలో కీలక ప్లేయర్‌గా భారత్

గ్లోబల్ సప్లై ఛైన్‌లో భారతదేశం గత దశాబ్దంలో భారీ పురోగతిని సాధించింది. “చైనా ప్లస్ వన్” వ్యూహంలో కీలక ప్లేయర్‌గా ఎదుగుతోంది. అమెరికా-చైనా టారిఫ్ వార్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కోవిడ్-19 సంక్షోభం తర్వాత… సరఫరా గొలుసుల్లో వస్తున్న మార్పులతో భారత్‌ ఇప్పుడు ఆ రెండు దేశాలను ఆకర్షిస్తోంది. రాబోయే రోజుల్లో తయారీ, సరఫరా కేంద్రంగా భారత్‌ ఉండబోతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ… అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ స్థానం బలంగా ఉంది. ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, టెక్స్‌టైల్స్, ఆటో భాగాలు, రసాయనాల రంగాలలో గ్లోబల్ సప్లై ఛైన్‌లలో భారత్ చేరుతోంది. 2023-24లో, భారతదేశం నుండి వస్తువుల ఎగుమతులు $437.1 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

2025 మార్చిలో $2 బిలియన్స్ ఐఫోన్‌లు భారత్ నుండి ఎగుమతి

ఇందులో అమెరికా $77.5 బిలియన్లు, యూఏఈ $31.6 బిలియన్లతో ప్రధాన మార్కెట్‌లుగా ఉన్నాయి. ఇక, ఆపిల్, సామ్‌సంగ్, టెస్లా వంటి గ్లోబల్ కంపెనీలు భారత్‌లో తయారీని పెంచుతున్నాయి. 2025 మార్చిలో ఆపిల్ సంస్థ $2 బిలియన్ విలువైన ఐఫోన్‌లను భారత్ నుండి ఎగుమతి చేసింది. అలాగే, భారత్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 2014-15లో $48 బిలియన్ల నుండి 2023-24లో $101 బిలియన్లకు పెరిగింది. ఇది గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ సరఫరాలో భారత్‌కు పెరుగుతున్న బలాన్ని సూచిస్తుంది.

23-24 లో ఐటీ సేవల ఎగుమతులు 200$ బిలియన్స్

ఇప్పుడు సేవల రంగంలోనూ భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఐటీ, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ రంగాలల్లో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఉంది. 2023-24లో ఐటీ సేవల ఎగుమతులు $200 బిలియన్‌ను దాటాయి. ఇవి ప్రధానంగా అమెరికా, యూరప్ మార్కెట్‌లలో అధికంగా ఉంది. అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అధునాతన సాంకేతిక రంగాలలో భారత్ గ్లోబల్ కంపెనీలకు ముఖ్యమైన బ్యాకెండ్ సపోర్ట్ అందిస్తోంది.

జనరిక్ ఔషధాల గ్లోబల్ సరఫరాలో 20% భారత్ వాటా

మరోవైపు, భారతదేశానికి “ప్రపంచ ఫార్మసీ”గా పేరుంది. జనరిక్ ఔషధాల గ్లోబల్ సరఫరాలో 20% వాటా భారతదేశానిదే. 2023-24లో ఔషధ ఎగుమతులు $27.9 బిలియన్లు చేరుకోగా… ఇందులో, అమెరికా ప్రధాన మార్కెట్‌గా ఉంది. అలాగే, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్‌లో భారత్ దేశీయ ఉత్పత్తిని పెంచుతోంది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి PLI స్కీమ్ ద్వారా భారత్ వాణిజ్యాన్ని పెంచుకుంటోంది.

ప్రపంచంలో రెండవ అతిపెద్ద టెక్స్‌టైల్స్ ఎగుమతిదారు భారత్

ఇక, భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద టెక్స్‌టైల్ ఎగుమతిదారుగా ఉంది. అమెరికా-చైనా టారిఫ్ వార్ కారణంగా… బంగ్లాదేశ్, వియత్నాంతో పోలిస్తే భారత్ గార్మెంట్ ఎగుమతులు పోటీని పెంచుతున్నాయి. అలాగే, భారత్ ఆటో భాగాల ఎగుమతుల్లోనూ పురోగతి కనిపిస్తోంది. 2023-24లో $20.8 బిలియన్లకు చేరుకోగా… ఇవి యూరప్, అమెరికా మార్కెట్‌లకు సరఫరా అయ్యాయి. దీంతో పాటు ఎలక్ట్రిక్ వాహన భాగాల తయారీలోనూ భారత్ తన ఉనికిని పెంచుకుంటోంది.

భారత్‌లో ఉన్న విస్తారమైన మార్కెట్, కార్మిక శక్తి

ఇంజనీరింగ్ వస్తువులు… ముఖ్యంగా యంత్రాలు, లోహ ఉత్పత్తులు, గ్లోబల్ సప్లై ఛైన్‌లో భారత్ వాటాను పెంచుతున్నాయి. భారత్‌లో ఉన్న విస్తారమైన మార్కెట్, కార్మిక శక్తి కూడా ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తోంది. భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద వినియోగ మార్కెట్, 500 మిలియన్లకు పైగా కార్మిక శక్తితో బలంగా ఉంది. యువత, తక్కువ ఖర్చుతో వచ్చే కార్మికులు తయారీ రంగంలో భారత్‌‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుతున్నారు.

యూఏఈ, ఆస్ట్రేలియా, యూకేలతో ఉచిత వాణిజ్య ఒప్పందాలు

ఇంత బలమైన భారత్ ఇప్పుడు, అమెరికా-చైనా టారిఫ్ వార్‌తో మరింత ప్రయోజనం పొందనుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రస్తుతం, అమెరికా చైనా వస్తువులపై 245% టారిఫ్‌లు విధించడం వల్ల భారత ఎగుమతులు అమెరికా మార్కెట్‌లో పోటీపడుతున్నాయి. మరోవైపు, గ్లోబల్ కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ వైపు చూస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఆటో భాగాలలో భారత్ తయారీ కేంద్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఇప్పటికే భారత్… యూఏఈ, ఆస్ట్రేలియా, యూకేలతో ఉచిత వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. యూరోపియన్ యూనియన్‌తో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇవి భారత్‌కు గ్లోబల్ మార్కెట్ యాక్సెస్‌ను మెరుగుపరుస్తాయనే అభిప్రాయం ఉంది. దీంతో పాటు, ఆసియా-పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా భారత్ ఆసియా మార్కెట్‌లలో తన స్థానాన్ని బలోపేతం చేస్తోంది.

Also read: నెక్ట్స్ ఏంటి? హీటెక్కిన విశాఖ మున్సిపల్ పాలిటిక్స్..

చైనా డంపింగ్‌తో భారత మార్కెట్‌లో చైనా ఉత్పత్తులు

ఇప్పుడు, అమెరికా, చైనాపై వేసిన సుంకాల భారం వల్ల ‘చైనా ప్లస్ వన్’ వ్యూహంతో భారత్‌ వైపు చూస్తుంది. చైనా డంపింగ్‌తో తమ ఉత్పత్తులను భారత మార్కెట్‌లో సాధారణ మార్కెట్ విలువ కంటే తక్కువ ధరలకు విక్రయించే అవకాశం ఉంది. దీనివల్ల స్థానిక పరిశ్రమలకు నష్టం వాటిల్లుతుంది. ఇది “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. అలాగే, ఉద్యోగ నష్టాలకు దారితీస్తుంది. చైనా భారత్‌లో ఎలక్ట్రానిక్స్, స్టీల్, రసాయనాలు, సోలార్ ప్యానెళ్లు, ఔషధ భాగాలు వంటి ఉత్పత్తులను డంప్ చేస్తోంది.

భారత్‌లో సుమారు 2 లక్షల ఉద్యోగాలు నష్టం

ఇక, చైనా ఉత్పత్తులు తక్కువ ధరకు రావడం వల్ల భారత స్థానిక తయారీదారులు పోటీపడలేకపోతారు. ఇటీవల, సోలార్ ప్యానెల్‌లలో చైనా డంపింగ్ వల్ల భారత్‌లో సుమారు 2 లక్షల ఉద్యోగాలు నష్టపోయాయి. అలాగే, సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు.. చైనా తక్కువ ధరల ఉత్పత్తుల వల్ల మార్కెట్ వాటాను కోల్పోతున్నాయి. ఇక, ఇది ఇప్పటికే ఉన్న వాణిజ్య లోటును మరింత పెంచే అవకాశం కూడా ఉంది. 2023-24లో భారత్‌తో చైనా వాణిజ్య లోటు $85.1 బిలియన్ డాలర్లుగా ఉంది. 2024-25లో ఇది $99.2 బిలియన్లకు పెరిగింది. ఈ లోటు మేక్ ఇన్ ఇండియా రంగాలలో స్థానిక సామర్థ్యాన్ని పెంచుకోడానికి కూడా అడ్డంకిగా మారింది. అందుకే, ఇప్పుడు.. చైనా నుండి దిగుమతులపై సుంకాలు విధించడం వల్ల చైనా వస్తువులను మరింత ఖరీదుగా మార్చాలని భారత్ భావిస్తోంది.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×