Rampachodavaram: రంపచోడవరం లో ఇటీవల అధికార పార్టీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్సీలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలతో నియోజకవర్గంలోని రాజకీయం వేడెక్కింది…. సుమారు సంవత్సరంన్నర పాటు నిశ్శబ్దంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ఒక్కసారిగా ఎమ్మెల్యే మిరియాల శిరిషపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్ హత్య కేసులో ఇరుక్కుని పొలిటికల్‌గా సైలెంట్ అయిన అంతబాబు తిరిగి రాజవార్తల్లో నిలవడం పై రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారా? అసలు ఆయన రాజకీయం వ్యూహం ఏంటి?
తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్యచేసి అతని ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చారని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై తీవ్ర ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కేసుపై పునర్విచారణ ప్రారంభించింది. ఆ క్రమంలో విచారణ జరిపి 250 రోజుల్లో నివేదికసమర్పించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారారు. కోర్టు ఆదేశాలతో డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు విచారణ జరుగుతుండడంతో… తన చుట్టూ ఉచ్చులు బిగిస్తున్నాయన్న భయంతోనో? లేదా…రాజకీయంగా యాక్టివ్ అవ్వాలనుకున్నారో ఏమో కానీ వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు.
కేసులో ఇరుక్కున్న ఏడాదిన్నర తర్వాత ఆయన రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మరియాల శిరీషపై చేసిన ఆరోపణలు రాజకీయంగా సంచలనంగా మారాయి. ఎమ్మెల్యేను అనంతబాబు టార్గెట్ చేయడం వెనక రాజకీయ వ్యూహాం ఉందనే చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్‌గా ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబు ….ఒక్కసారిగా రంపచోడవరం రాజకీయాలపై ఫోకస్ చేశారనే టాక్ వినిస్తుంది. తనకు రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్యే భర్తను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్సీ అనంత బాబు ఆరోపణలు గుప్పిస్తున్నారు..
అనంత బాబు లెవనెత్తిన అంశాలతో రంపచోడవరం పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ఓ వైపు తనపై నమోదైన కేసు విచారణ జరుగుతుండడం… మరోవైపు రాజకీయంగా సైలెంట్‌గా ఉంటే ఇబ్బందులు తప్పువు అని గ్రహించే అనంతబాబు ఎమ్మెల్యేను టార్గెట్ చేశారనే చర్చ స్ధానికంగా నడుస్తోంది. రాజకీయంగా యాక్టివ్ అయితే ఒకవేళ నమోదైన కేసులో పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకుంటే… వైసీపీ అధిష్టానం సహాయ,సహకారాలు అందిస్తుందని ఆయన భావిస్తున్నారంట. అలాగే నియోజకవర్గంలో తన కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకే అనంత బాబు… ఎమ్మెల్యే పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రంపచోడవరం నియోజకవర్గ ప్రజల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాటల యుద్ధం చర్చనీయాంశంగా మారుతుంది. వైసీపీ కార్యకర్తలు టిడిపి కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఎమ్మెల్యే, ఆమె భర్త కలిసి అక్రమార్జన చేస్తున్నారని…అందుకు ఆధారాలున్నాయని ఎమ్మెల్సీ ఆరోపిస్తున్నారు. పక్కా ఆధారాలు దొరకడంతోనే అనంతబాబు రియాక్ట్ అయ్యారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. అయితే ఊహించని విధంగా స్పందించిన శిరీష తనపై, తన భర్త పై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ప్రతిదాడికి దిగడంతో ఎమ్మెల్సీ అనంత బాబు అవాక్కయ్యారనే చర్చ కూడా నడుస్తుందట.
రంపచోడవరం నియోజకవర్గంలో తన పేరును ఒక బ్రాండ్ గా చేసుకుని అనంత బాబు సుమారు పది సంవత్సరాలపాటు ఏకచత్రాధిపత్యంగా అక్కడ వ్యవహారాలు నడిపించారనేది స్ధానికంగా ఉన్న మాట. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో తన మాటే వేదంగా అధికారులను, వ్యవస్ధలను నడిపించారంట. ఎమ్మెల్సీగా గెలుపొందిన కొద్ది రోజులకే అనంత బాబు 2022 మే నెలలో తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా సుమారు 220 రోజులు జైల్లో గడిపారు.
తర్వాత అనంతబాబు హరతులతో కూడిన బెయిల్ పై విడుదలయ్యారు. అప్పట్లో ప్రతిపక్షంగా వ్యవహరించిన తెలుగుదేశం, జనసేన పార్టీలు దళిత డ్రైవర్ను హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలతో హోరెత్తించాయి. అది వైసీపీని కొంత డ్యామేజ్ చేసిందన్న చర్చ కూడా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు రీఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి.. ఆధారాలను సేకరించే పనిలో ఉంది. దీంతో అనంత బాబు చుట్టూ ఉచ్చు మళ్ళీ బిగుస్తోంది. ఆ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేను టార్గెట్ చేసి వార్తల్లో నిలవడం ద్వారా కార్యకర్తలు, పార్టీ నుండి జారకుండా ఉండేందుకు ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్యేగా గెలిచిన శిరీష టార్గెట్ చేసి నియోజకవర్గంలో ప్రజల చూపు తనపై తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటున్నారు. కానీ ఎమ్మెల్సీ ఊహించని విధంగా ఎమ్మెల్యే కౌంటర్ ఇవ్వడంతో ఒకరిపై ఒకరు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసుకునే వరకు విషయం వెళ్ళడం రాజకీయం ఆసక్తికరంగా మారింది.
నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం వెనక రాజకీయం ఏంటనే చర్చ నడుస్తుందట. కేవలం ఎమ్మెల్సీ అనంతబాబు రాజకీయ ఎత్తుగడైనా…నిజంగా ఎమ్మెల్యే శిరీష, ఆమె భర్త ఆ స్థాయిలో అవినీతి చేస్తున్నారా అనేది హాట్ టాపికగా మారింది. ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద ఆధారాలు ఉంటే ఎందుకు చూపడం లేదని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. మొత్తానికి డ్రైవర్ హత్య కేసులో తిరిగి అరెస్ట్ అవుతానన్న భయంతోనే అనంతబాబు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Story By Ajay, Big Tv