TDP Mahanadu: జగన్ ఇలాకా కడప జిల్లాలో పసుపు దళం పార్టీ పండుగ చేసుకోనుండటం హాట్ టాపిక్‌గా మారింది. కడపలో టీడీపీ మహానాడు మూడు రోజుల రోజుల పాటు నిర్వహించడానికి నిర్ణయించింది. 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న తొలి మహానాడుకు కడప వేదిక అవ్వడంతో జిల్లా తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా మహానాడు నిర్వహించేందుకు ప్లాన్ చేయడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లకు రంగం సిద్దమవుతోంది..
జగన్ ఇలాకాలో పసుపు పండగ నిర్వహించేందుకు ఏర్పాట్లు
తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈసారి మహానాడును ప్రత్యేకంగా ప్లాన్ చేసింది టీడీపీ అధిష్టానం.ఈసారి మహానాడు విశేషం ఏంటంటే టీడీపీ చరిత్రలో ఎన్నడూ నిర్వహించని చోట మహానాడు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మహానాడుకు కడప జిల్లాను ఎంచుకుంది టీడీపీ. ఇప్పుటికే ఏర్పాట్లను మొదలుపెట్టేసింది కూడా. వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత ఇలాకాలో పసుపు పండగను ఘనంగా నిర్వహించేందుకు యాక్షన్‌లోకి దిగింది. గతంలో ఎన్నడూ కడప జిల్లాలో మహానాడు నిర్వహించలేదు. కానీ ఏపీలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత …మాజీ ముఖ్యమంత్రి ఇలాకాలో మహానాడుని నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
పులివెందులలో మహానాడు నిర్వహిస్తారని ప్రచారం
ఏకంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో మహానాడు నిర్వహిస్తారనే ప్రచారం కూడా నడించింది. కానీ జిల్లా నాయకుల సూచనలతో కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈసారి మహానాడు టీడీపీకి అత్యంత ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు. పార్టీ ఏపీలో బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అదే విధంగా గెలిచిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న మహానాడు ఇదే కావడం విశేషం. ఒక వైపు అమరావతి పున:నిర్మాణ పనులు మొదలుపెట్టి, అభివృద్ధి పనులకు వరసగా శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. ఎటు చూసినా పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కూడా టీడీపీకి అంతా కలసి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దాంతో ఈసారి గతానికి భిన్నంగా గొప్పగా మహనాడు నిర్వహించాలని భావిస్తున్నారంట
పది లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా
ఈ మహానాడుకు పది లక్షల మంది దాక జనాలు వస్తారని అంచనా వేస్తున్నారు. నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా మహానాడు వేడుక నిర్వహించడానికి నిర్ణయించారంట. ఇవన్నీ ఓకే కానీ జగన్ జిల్లాలో మహానాడు నిర్వహించడం ద్వారా రాజకీయంగా గట్టి సంకేతాలు ఇవ్వాలనే ప్లాన్‌లో టీడీపీ ఉన్నట్లు కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆ జిల్లాలో పట్టభద్రల ఎమ్మెల్సీ స్ధానాన్ని గెలుచుకోవడం….తర్వాత జరిగి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు స్థానాలు గెలుచుకుని జగన్ సొంత జిల్లాలో సత్తాను చాటింది. ఇలాంటి తరుణంలో మహానాడు నిర్వహించడం ద్వారా రాయలసీమలో పార్టీని మరింత యాక్టివ్ అయ్యేలా చేయాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది.
Also Read: కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్.. 30 మంది మావోలు హతం
పులివెందులలో మహానాడు ఎందుకు నిర్వహించడంలేదు అంటే అన్ని ప్రాంతాల నుంచి జనాలు వచ్చేందుకు సువిశాలమైన ప్రాంగణం అక్కడ దొరకలేదు అని అంటున్నారు. కడప నుంచి సౌండ్ చేస్తే అది జిల్లా మొత్తమే కాదు ఏపీ అంతటా రీసౌండ్ ఇచ్చేలా చేయాలే కడపను ఎంచుకున్నారని అంటున్నారు. మరి కడపలో టీడీపీ మహానాడు ఏ రకమైన సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.