KCR Jagan Meeting: నాటి జల బంధం.. ఇప్పుడు జలజగడానికి తెరతీసిందా ?… మాజీ సీఎంల భేటీ..నేడు తెలంగాణలో నీటి వాటాలపై నిప్పులు కురిపిస్తోందా… ఇప్పటి ప్రజా భవన్..అప్పటి ప్రగతి భవన్‌లో కేసీఆర్, జగన్‌లు..నీటి వాటాలు, కేటాయింపులపై జరిపిన ఏకాంత చర్చలు..తెలంగాణకు పెను శాపంగా మారాయా..? అసలు ఆ రోజు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాలపై అప్పటి ముఖ్యమంత్రులు ఏం చర్చలు జరిపారు..? ఆ తర్వాత అప్పటి మంత్రి రోజాతో చేపల పులుసు తిని..కేసీఆర్ ఏ హామీ ఇచ్చారు..? జగన్, రోజాలతో కేసీఆర్ జరిపిన చర్చలు.. తెలంగాణకు లాభాన్ని చేకూర్చాయా..? నష్టాన్ని మిగిల్చాయా..?
జల వివాదంపై 6 గంటల సమావేశం
2019 జూన్ 28న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మధ్య ప్రగతి భవన్‌లో ఆరు గంటలకు పైగా సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఇరు రాష్ట్రాల మధ్య నదీజలాల సమర్థ వినియోగం, ముఖ్యంగా గోదావరి నది నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లించడంపై ప్రధానంగా చర్చించారు. ఈ చర్చల్లో ఇరు ముఖ్యమంత్రులు ఇచ్చి పుచ్చుకోవడం విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. కృష్ణా నదిలో నీటి లభ్యత అనిశ్చితంగా ఉండటంతో, గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లించడం ద్వారా ఇరు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరతను తీర్చాలని చర్చల్లో నిర్ణయమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని రైతులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు.
ఏపీకి కేసీఆర్ స్నేహహస్తం
అంతేకాకుండా ఏపీతో మంచి సంబంధాలు నెలకొల్పుతామని సీఎం కేసీఆర్.. ఏపీకి స్నేహహస్తం అందించారు. గోదావరి నది నుంచి ఏటా 3,500 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని… తెలంగాణ రాష్ట్రం గరిష్టంగా 700 నుంచి 800 టీఎంసీలను మాత్రమే వాడుకోగలదని అన్నారు కేసీఆర్. మిగతా నీరంతా ఏపీ వాడుకునే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చారు. ప్రకాశం బ్యారేజి ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించవచ్చని సూచించారు. దీంతో రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చని.. అప్పటి సమావేశం సమయంలో జగన్‌కు.. కేసీఆర్ వివరించారు. అంతేకాకుండా గోదావరి, కృష్ణా నదుల్లో నీటి లభ్యతపై జగన్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు.
జగన్‌కు పెద్దన్నగా సహకారం
2019 ఆగస్టు 12న.. అప్పటి ఏపీ మంత్రి రోజా ఇంట్లో చేపల పులుసు ఆతిధ్యం స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో.. కేసీఆర్.. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు ఏపీ సీఎం జగన్‌కు పెద్దన్నగా సహకారం అందిస్తానని అన్నారు. గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని, ఆ నీటిని వాడుకుంటే బంగారు పంటలు పండుతాయన్నారు. రాయలసీమ ఆర్థికంగా ఎదగాలన్నా, రతనాల సీమగా మారాలన్నా గోదావరి జలాలు రావాల్సిన అవసరముందన్నారు.
కేసీఆర్ చేసిన మాటలు తెలంగాణకు శాపం
2014లో చంద్రబాబు, 2019లో అప్పటి సీఎం జగన్‌తో మీటింగ్ సమయంలో బేసిన్లు లేవు.. బేషజాలు లేవంటూ ..కేసీఆర్ చేసిన మాటలు.. తెలంగాణకు శాపంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాడు జగన్‌ను ప్రగతి భవన్‌కు పిలుచుకుని.. నీటి కేటాయింపులపై చర్చలు జరిపి..అన్నదమ్ములుగా ఉందామని స్నేహహస్తం అందించి.. రాష్ట్రాన్ని ద్రోహం చేశారని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. గోదావరిలోని మిగులు నీటిని కృష్ణా నదిలోకి తరలిస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలే..బనకచర్ల ప్రాజెక్టు పుట్టుకకు కారణమయ్యాయన్న చర్చ మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు మొదలుపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును గతంలో 2016లో చంద్రబాబు, కేసీఆర్ మాట్లాడుకున్న అంశాల ప్రాతిపదికనే ముందుకు తీసుకెళ్లారని కేసీఆర్..మాటలు బట్టి అర్థమవుతోంది. గోదావరి జలాలను పెన్నా ప్రాంతానికి తరలించడానికి ఆమోదించి, ప్రాజెక్టును ప్రారంభించడానికి అవకాశం కల్పించి, ప్రోత్సహించిందే కేసీఆర్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో చంద్రబాబుతో చర్చల సందర్భంగా కేసీఆర్.. 400 టీఎంసీల తరలింపునకు ప్రతిపాదన ఇచ్చారని సమాచారం.
బోర్డుకు ప్రాజెక్టులు ఇస్తామన్న కేసీఆర్
ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ద్వారా అదనపు నీటిని తరలిస్తుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కేసీఆర్ గతంలోనే బోర్డుకు ప్రాజెక్టులు ఇస్తామని ఒప్పుకున్నారని తెలుస్తోంది. దీంతో పాటు..రాష్ట్రం ఏర్పడ్డాక బేసిన్ పారామీటర్, బేసిన్ వెంట నివసిస్తున్న జనాభా ఆధారంగా ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811టీఎంసీల్లో 555 టీఎంసీలను తెలంగాణకు కోరాల్సి ఉండగా.. కేవలం 299 టీఎంసీలు చాలని కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. 2021 దాకా ఈ ఒప్పందం కొనసాగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
గోదావరిలో 3 వేల టీఎంసీల మిగులు జలాలు..
అయితే తాము మాత్రం.. తెలంగాణకు న్యాయమైన వాటా సాధించేందుకు పోరాడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గోదావరి జలాల్లో 3 వేల టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని చంద్రబాబు నమ్మితే.. 968 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు సంపూర్ణ అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కృష్ణా జలాల్లో 500 టీఎంసీలు, గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణ వాడుకునేందుకు అనుమతులు ఇచ్చాక.. ఏపీ వాడుకున్నా తమకేమీ అభ్యంతరం లేదంటోంది. మొత్తానికి కేసీఆర్ మాట్లాడిన మాటలు చూస్తుంటే..బనకచర్ల పుట్టుకుకు ఆయనే కారణమని స్పష్టంగా తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు కలిసినడుద్దాం.. రాయలసీమ రతనాల సీమ కావాలని స్నేహహస్తం చాచి.. ఇప్పుడేమో.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదచల్లుతున్నారని ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. చలిమంటల కంటే రెండు పార్టీల మధ్య నీటి సెగలు మరింత హాటెక్కిస్తున్నాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పిదాలను తుపాకీ గుళ్లలా పేలుస్తూ కాంగ్రెస్ విరుచుకుపడుతుంటే.. రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్ ప్రభుత్వం పొరుగు రాష్ట్రానికి తాకట్టు పెడుతోందని గులాబీ దళం రణభేరి మోగిస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీలో రెండు పార్టీల మధ్య జలజగడం మరింత రంజుగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నీళ్ల రాజకీయం నిప్పులు చిమ్ముతోంది. కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్రానికి దక్కాల్సిన చుక్క చుక్క నీటిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. రాష్ట్రానికి నువ్వు ద్రోహం చేశావంటే.. లేదు నువ్వే అన్యాయం చేశావు అంటూ సాగుతున్న ఈ ఆరోపణల పర్వం ఇప్పుడు అసెంబ్లీని అగ్నిగుండంగా మార్చబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. విభజన సమయంలో కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన సగం వాటాను వదిలేసి, కేవలం 299 TMCలకు కేసీఆర్ ఎందుకు అంగీకరించారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. వేల కోట్లు కుమ్మరించిన కాళేశ్వరం కుంగిపోవడం, పాలమూరు-రంగారెడ్డిని పదేళ్లు కాలయాపన చేయడం ద్వారా దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో బీఆర్ఎస్ తప్పులను ఎండగట్టేందుకు రేవంత్ సర్కార్ సర్వం సిద్ధం చేసుకుంది.
చంద్రబాబుకు గురుదక్షిణగా ధారాదత్తం
ప్రభుత్వ ఆరోపణలను తిప్పికొడుతూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు నేతృత్వంలో గులాబీ శ్రేణులు యుద్ధానికి దిగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణగా తెలంగాణ నీటిని ధారాదత్తం చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ముఖ్యంగా బనకచర్ల ద్వారా ఏపీకి 200 TMCల నీటిని తరలించేందుకు ప్రభుత్వం రహస్య ఒప్పందం చేసుకుందని బీఆర్ఎస్ అగ్రనేతలు మండిపడుతున్నారు. కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణను KRMBకు అప్పగించడం ద్వారా రాష్ట్ర సార్వభౌమాధికారాన్ని కేంద్రం చేతుల్లో పెట్టారని, ఇది ముమ్మాటికీ తెలంగాణ ద్రోహమేనని బీఆర్ఎస్ నినదిస్తోంది. బనకచర్ల ప్రాజెక్టుకు గతంలోనే కేసీఆర్ అనుమతి ఇచ్చారని కాంగ్రెస్ అంటుంటే.. లేదు, రేవంత్ రెడ్డి ఢిల్లీ మీటింగ్‌లో అంగీకరించినందుకే కేంద్రం అనుమతి ఇచ్చిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
విభజన సమయంలో జరిగిన 66:34 నిష్పత్తి ఒప్పందం ఇప్పుడు రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. తెలంగాణకు 50 శాతం వాటా సాధించడంలో ఎవరు విఫలమయ్యారనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. గత కొద్ది రోజులుగా బయట మీడియా సమావేశాల్లో సాగుతున్న ఈ యుద్ధం, శాసనసభలో ప్రత్యక్ష పోరుకు దారితీయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఓవైపు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఓవైపు పాత రికార్డులు, జీవోలతో సభను హోరెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో గుబులు.. పంచాయతీ ఎన్నికల్లో ఏం జరిగింది?
తెలంగాణ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జల యుద్ధం ఓ లెవల్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గత పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను రేవంత్ ప్రభుత్వం ఎండగట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటుంటే..రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ తాకట్టు పెడుతోందని ఎదురుదాడి చేసేందుకు గులాబీ దళం..ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో నీళ్లు- నిజాలు అనే నినాదంతో అసెంబ్లీలో సాగనున్న వాటర్ వార్‌లో ఎవరు పైచేయి సాధిస్తారు..? తెలంగాణకు ఎవరి హయాంలో ద్రోహం జరిగింది..? అనేది తెలియనుంది.
Story By Kishan, Bigtv