BigTV English

Sambhal Chandausi: మొన్న శివాలయం.. ఇప్పుడు సొరంగ బావి.. సంభలో ఏం జరుగుతోంది..?

Sambhal Chandausi: మొన్న శివాలయం.. ఇప్పుడు సొరంగ బావి.. సంభలో ఏం జరుగుతోంది..?

Sambhal Chandausi: సంభల్‌లో వరుసగా పురాతన కట్టడాలు బయటపడుతున్నాయి. ఇటీవల, సంభల్ మసీదు వివాదంలో చెలరేగిన అల్లర్ల తర్వాత సంభల్‌ చర్చనీయాంశమయ్యింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సంభల్ సంచలనాలకు వేదికయ్యింది. నగరవ్యాప్తంగా జరుగుతున్న పలు తనిఖీల్లో పాత కాలంనాటి విశేషాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. మొన్న శివాలయం.. ఇవాళ 1857 సిపాయిల తిరుగుబాటులో వాడుకున్న సొరంగ బావి.. ఇలా ఇంకెన్ని రహస్యాలను సంభల్ దాచుకుందో అనే ఆసక్తి పెరిగింది.


విగ్రహాలు, శివలింగాలు, బావులు, సొరంగాలు

ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభల్ సంచలనాలకు వేదికయ్యింది. ఇటీవల, సంభల్ మసీదు వివాదంతో మొదలైన అలజడితో ఆ ప్రాంతంలో పురాతన కట్టడాల వ్యవహారం ఆసక్తిని రేపింది. గత కొన్ని రోజులుగా అధికారులు చేస్తున్న వేర్వేరు తనీఖీల్లో పాత కాలం నాటి దేవాలయాలు, బావులు బయటపడుతున్నాయి. మైనారిటీ వర్గాలు నివశిస్తున్న ప్రాంతంలోనే ఈ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సంభల్ భూమిని తవ్వుతుంటే.. మట్టిలో విగ్రహాలు, శివలింగాలు, బావులు, సొరంగాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడిదే అంశం దేశవ్యాప్తంగా అతిపెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల, ఓ పురాతన ఆలయం బయటపడింది. ఆలయంలో హనుమాన్ విగ్రహం కనిపించింది.


సంభల్‌లో హిందూ సాంస్కృతి ఆనవాళ్లపై చర్చ

ఆ విగ్రహం కిందనే శివలింగం బయటపడింది. ఎదురుగా నందివిగ్రహాలు కూడా ఉన్నాయి. డిసెంబర్ 14న ఆలయం వెలుగులోకి రాగానే మరుసటి రోజునుంచి పురాతన శివాలయాన్ని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. ఈ ఆలయాన్ని పునరుజ్జీవనం చేసి.. పూజలు, హోమాలు నిర్వహించారు. దీని తర్వాత, మరో చోట ఆరవై ఏళ్లకు ముందు నాటి సొరంగం మార్గం… ఓ మెట్ల బావి కూడా కనిపించాయి. ఈ పరిణామాల మధ్య, మరోసారి సంభల్‌లో హిందూ సాంస్కృతి ఆనవాళ్లపై చర్చ రాజుకుంది.

బ్రిటీష్ రాజ్‌కి వ్యతిరేకంగా 1857 తిరుగుబాటు సమయంలో..

తాజాగా, వెలుగు చూసిన ఓ సొరంగ మార్గం… బ్రిటీష్ రాజ్‌కి వ్యతిరేకంగా 1857 తిరుగుబాటు సమయంలో ఉద్యమ కారులు తప్పించుకోడానికి వాడిన సొరంగంగా భావిస్తున్నారు. అలాగే, 150 సంవత్సరాల నాటిదని నమ్ముతున్న ఒక మెట్ల బావి కూడా ఇదే ప్రాంతంలో కనపించింది. సంభాల్‌లోని చందౌసిలోని లక్ష్మణ్ గంజ్ ప్రాంతంలో ఆక్రమణలపై చేస్తున్న డ్రైవ్‌లో ఇవి కనిపించాయి. అయితే, అక్కడ కనపించిన మెట్ల బావి పేరు రాణీకి బావ్డీ‌గా చెబుతున్నారు. ఇది, బాంకే బిహారీ ఆలయానికి సమీపంలో ఉంది. శిథిలావస్థకు చేరుకున్న ఈ నిర్మాణం.. ఈ ప్రాంతంలోని చారిత్రక ప్రదేశాలను వెలికితీసే ప్రయత్నంలో భాగంగానే కనిపెట్టినట్లు తెలుస్తోంది.

బిలారి రాజు తాతయ్య హయాంలో మెట్ల బావి నిర్మాణం

బిలారి రాజు తాతయ్య హయాంలో మెట్ల బావి నిర్మించబడిందని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా, ఈ నిర్మాణంలో మొత్తం మూడు స్థాయిలు ఉన్నాయి. వీటిలో రెండు, పాలరాయితో తయారు చేసిన కొన్ని అంతస్తులు కాగా.. పైనున్న రూఫ్ భాగం, బావి, నాలుగు గదులు ఇటుకలతో నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మెట్ల బావికి సమీపంలో ఉన్న బాంకే బిహారీ దేవాలయానికి చుట్టు పక్కల కూడా పురావస్తు శాఖ అధికారులు దృష్టి సారించారు. ఈ ఆలయాన్ని పునరుద్ధరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

మెట్ల బావి రెవెన్యూ రికార్డుల్లో చెరువుగా నమోదు

ఇక, 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న మెట్ల బావి రెవెన్యూ రికార్డుల్లో చెరువుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం, దీనికి ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. మరో వైపు, ఈ స్థలం చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తామని ఇప్పటికే అధికారులు నోటీసు జారీ చేశారు. డిసెంబర్ 22న భారత పురావస్తు శాఖ బృందం.. కొత్తగా కనుగొన్నఈ ప్రదేశంతో పాటు ఈ ప్రాంతంలోని మరో ఐదు పుణ్యక్షేత్రాలు, 19 బావులను కూడా సర్వే చేసింది. దాదాపు 10 గంటల పాటు 24 ప్రాంతాల్లో తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది. సంభాల్‌లోని చారిత్రక వారసత్వ కట్టడాలను సంరక్షించడంలో పురావస్తు శాఖ తనిఖీల ఆధారంగా, తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

తవ్వకాల్లో బయటపడిన సుమారు 210 చ.మీ. స్థలం

చందౌసి నగర్ పాలికా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేతృత్వంలో జరిగిన ఈ తవ్వకాల్లో ఇప్పటి వరకు సుమారు 210 చదరపు మీటర్ల స్థలం బయటపడింది. మిగిలిన ప్రాంతాలను వెలికితీయడానికి, ఇప్పటికే కనిపించిన పురాతన నిర్మాణాలను పునరుద్ధరించడానికి అధికారులు చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఈ తనిఖీల వ్యవహారం స్థానిక జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాలతో చేపట్టారు. లక్ష్మణ్ గంజ్‌లో సహస్‌పూర్ రాజకుటుంబం ఉండేదని, అక్కడ ఒక మెట్ల బావి కూడా ఉందని… సనాతన్ సేవక్ సంఘ్ రాష్ట్ర పబ్లిసిటీ చీఫ్ కౌశల్ కిషోర్… సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్-డీఎం రాజేంద్ర పెన్సియాకు లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ స్థలాన్ని తవ్వి, సుందరీకరించాలని సనాతన్ సేవక్ సంఘ్, మేజిస్ట్రేట్‌ను కోరారు. దీంతో, లక్ష్మణ్ గంజ్‌లోని స్థలంలో తవ్వకాలు చేపట్టాలని డీఎం ఆదేశించారు.

కార్తికేశ్వర్ మహాదేవ్ ఆలయంలో కార్బన్ డేటింగ్

దీనికి ముందు, డిసెంబర్ 20న, భారత పురావస్తు శాఖ, సంభాల్‌లోని కార్తికేశ్వర్ మహాదేవ్ ఆలయంలో కార్బన్ డేటింగ్ నిర్వహించింది. 46 సంవత్సరాలుగా మూసివేసి ఉంచిన తర్వాత, డిసెంబర్ 13న తిరిగి తెరిచారు. స్థానిక కథనాల ప్రకారం, ఇక్కడి హిందువులు పలు కారణాల వల్ల ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయారనీ… తర్వాత, అక్కడ ముస్లీంల నివాసాలు ఏర్పడ్డాయనీ.. ఈ పరిణామాల నేపధ్యంలో, 1978 నుండి ఈ ఆలయం మూసివేసినట్లు తెలుస్తోంది. కాగా, అధికారులు కార్బన్ డేటింగ్ నిర్వహించిన తర్వాత, తిరిగి ఆలయాన్ని తెరిచారు. అయితే, ఈ ఆలయం కూడా అనుకోని విధంగా బయటపడినట్లు తెలుస్తోంది.

1978 నుండి ఈ ఆలయం మూసివేసినట్లు సమాచారం

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదు హింసాకాండ జరిగినప్పటి నుంచి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల దుండగులపై సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ సమయంలో పలు ఏరియాల్లో తిరిగి తనిఖీ చేసిన అధికారులు అక్రమ కరెంట్ కనెక్షన్లను గమనించారు. విద్యుత్తు చోరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత, పోలీసుల భద్రత మధ్య.. అక్రమ విద్యుత్తు కనెక్షన్లను అరికట్టేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ పురాతన ఆలయాన్ని కనుగొన్నారు. ఆలయంలో శివుడు, హనుమంతుని విగ్రహాలు ఉన్నాయి.

ఐదు పుణ్యక్షేత్రాలు, 19 పాత బావుల పరిశీలిన

పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న తాజా సర్చ్ ఆపరేషన్లలో.. ఈ ప్రాంతంలోని భద్రక్ ఆశ్రమం, స్వర్గ్‌దీప్, చక్రపాణి పేర్లతో ఉన్న ఐదు పుణ్యక్షేత్రాలు, 19 పాత బావులను కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకూ కొనుగొన్న ఆలయాలు, మెట్లబావి, సొరంగ మార్గాలు ప్లాన్డ్‌గా కనుక్కున్నవి కాదనీ.. ఆక్రమణలపై జరుగుతున్న డ్రైవ్‌లో భాగంగానే కనిపించాయని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ఆలయం వివాదాస్పద షాహీ జామా మసీదు నుంచి సుమారుగా వంద మీటర్ల దూరంలో ఉంది. నవంబర్ 24న కోర్టు ఆదేశాలతో మసీదు సర్వేకి వెళ్లిన సమయంలో అల్లర్లు మొదలయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. దీంతో సంభల్ దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ పరిణామం తర్వాత నుంచి ఆ ప్రాంతంలో ఆక్రమణలపై యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఈ సందర్భంగానే పురాతన కట్టడాలు వెలుగులోకి వస్తున్నాయి.

24వ అవతారమైన కల్కి సంభల్‌లో అవతరిస్తారనే భావన

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ఒక చిన్న పట్టణం. అయితే, ఈ ప్రాంతం చారిత్రకంగానూ ప్రఖ్యాతి చెందిన నగరం. ఆధ్యాత్మిక, పురాతన విశ్వాసాలతో నిండిన నగరం. ఇక్కడ మత విశ్వాసాలు కూడా అధికంగా కనిపిస్తాయి. మసీదులు, దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఇప్పటికీ కొన్ని స్మారక కట్టడాలు వందల సంవత్సరాల పాతవి, శతాబ్దాలుగా అవి అలాగే ఉండిపోయాయి. నారాయణుడు 24వ అవతారమైన కల్కి సంభాల్ లో అవతరిస్తారని శ్రీమద్ భగవత పురాణంలోని 12వ ఖండంలోని రెండవ అధ్యాయంలో ఉందని వేదపండితులు చెబుతుంటారు. కలియుగంలో దుష్టుల నాశనానికి ఈ అవతారం ఉండబోతోందని అందులో రాసినట్లు చెబుతారు.

సంభల్‌‌లో 68 తీర్థయాత్రలు, 19 బావులు, 36 పురాలు, 52 సత్రాలు

సంభాల్‌‌లో 68 తీర్థయాత్రలు, 19 బావులు, 36 పురాలు, 52 సత్రాలు ఉండేవని అంటారు. అయితే, అలాంటి ఆనవాళ్లు సంభాల్ నగరంలో ఇప్పటికీ ఉన్నాయి. మరోవైపు, సంభాల్‌లో నిర్మించిన మొట్టమొదటి బాబ్రీ మసీదు.. ఈ చిన్న నగరంలో మొఘలుల శాశ్వత ప్రభావం ఎలా ఉందో చెప్పడానికి నిజమైన నిదర్శనంగా ఉంది. బాబ్రీ మసీదు అని కూడా పిలుచుకునే.. జామా మసీదు సంభాల్‌లోని పురాతన స్మారక కట్టడాలలో ఒకటి. ప్రస్తుతం ఇది వారసత్వ ప్రదేశం. ఈ మసీదు 1528లో బాబర్ చక్రవర్తి ఆదేశాల మేరకు నిర్మించబడింది. అయితే, చరిత్ర మొత్తం తవ్వి చూస్తే… ఈ నగరంలో మొఘలులకు ముందున్న సంస్కృతి చాలా బయటపడుతుందని అనడంలో సందేహం లేదు.

1947 నుంచి అక్కడ హింసాత్మక ఘటనలు

నిజానికి, ఇటీవల కాలంలో సంభల్ ప్రాంతం మరింత సున్నింతంగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా, అయోధ్యలో రామాలయం తెరుచుకున్న తర్వాత, దేశవ్యాప్తంగా ఉన్న వివాదాస్పద ఆలయాలన్ని చర్చకు వచ్చాయి. అయితే, ఆ క్రమంలోనే జామా మసీదు వివాదం అల్లర్లకు దారి తీసింది. ఇక, ప్రస్తుతం సంభల్‌లో బయటపడిన కార్తీక్ మహాదేవ్ ఆలయం శిధిలావస్థకు చేరడానికి కూడా గతంలో జరిగిన అల్లర్లే కారణమని స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ అనేక సార్లు సంభాల్‌లో అల్లర్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి.

2007-2011 మధ్య 66 మత ఘర్షణల్లో 121 మంది మృతి

1947 నుంచి అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయ్. 1974లో 184 మంది సజీన దహనమయ్యారు. తర్వాత జరిగిన ఘటనలో దాదాపు 209మంది చనిపోయారు. ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం 2012-17 మధ్య రాష్ట్రంలో 815 మత ఘర్షణలు జరగ్గా… అందులో 192 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 2007-2011 మధ్య 66 మత ఘర్షణల్లో 121 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో ప్రకటించారు.

రాజకీయంగా, సామాజికంగా ప్రజల మధ్య విభజన

అయోధ్యలో రామ జన్మభూమి వివాదం పరిష్కారమైనప్పటి నుంచి దేశంలో ప్రార్ధనా స్థలాల వివాదాలు అధికమయ్యాయి. ప్రార్ధనా స్థలాల పరిరక్షణ చట్టం 1991 అమల్లో ఉన్నప్పటికీ.. మసీదు-దేవాలయాల వివాదాలు పెరిగి పెరిగి పెద్ద ఘర్షణగా మారుతున్నాయి. ఈ పరిస్థితి ఎలాంటి తీవ్రమైన పరిణామాలకు దారి తీసిందంటే.. ఇప్పుడు సంభల్‌లోకి కొత్తవారు ఎవరు వెళ్లాలన్నా.. అధికారులు అనుమతి తీసుకోవాల్సిందే. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఎన్నికల ముగిసిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లో చలరేగిన జామా మసీదు వివాదం మొదలు కావడం.. రాజకీయంగానే కాక, సామాజికంగానూ ప్రజల మధ్య విభజనకు దారి తీసింది.

వారణాసిలో కాశీ విశ్వనాథ్-జ్ఞాన్‌వాపి ఆలయ మసీదు

ఇప్పటికే వారణాసిలో, కాశీ విశ్వనాథ్-జ్ఞాన్‌వాపి ఆలయ మసీదు వివాదం పరిష్కారం కోసం ఎంతో కాలంగా కోర్టులో పోరాటం జరుగుతోంది. మరోవైపు, మధురలోని కృష్ణ జన్మ భూమి, షాహీ ఈద్గా మసీదు వివాదంపై కూడా కోర్టు కేసు నడుస్తోంది. ఈ తరుణంలో… సంభల్‌లో ఉన్న షాహీ జామా మసీదు వ్యవహారం కూడా తెరపైకి రావడం ఆందోళనకు కారణం అయ్యింది. ఇప్పుడు, ఇదే ప్రాంతంలో పురాతన ఆలయాలు బయటపడటం దేనికి దారితీస్తుందో అనే సందేహాలు మొదలయ్యాయి.

ప్రార్థనా స్థలాల చట్టం-1991

సెప్టెంబరు 1991లో భారతదేశంలో ‘ప్రార్థనా స్థలాల చట్టం-1991’ రూపుదిద్దుకుంది. ఈ చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15న ఉన్న ప్రార్థనా స్థలాలు ఏవైనా వాటి స్థితి అలాగే ఉంటుంది. అయితే, కేవలం అయోధ్యలోని వివాదాస్పద నిర్మాణం అంశంలో మాత్రం ఈ చట్టం వర్తించదని పేర్కొన్నారు. ఎందుకంటే అప్పటికి అయోధ్య కేసు కోర్టు పరిధిలో ఉంది. అయితే, దేశంలో ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న మందిర్-మసీదు వివాదాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది సుప్రీంకోర్టు.

1947 ఆగస్టు 15న ఉన్న ప్రార్థనా స్థలాలు యధాస్థితి

మతపరమైన స్వభావాన్ని వివాదాస్పదం చేసే కేసుల్లో మతపరమైన నిర్మాణాలు లేదా సర్వేలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయవద్దని దేశంలోని దిగువ కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రార్ధనా స్థలాల చట్టం 1991కు ఉన్న రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ విచారణ పూర్తయ్యేవరకు మతపరమైన నిర్మాణాలు, స్వభావానికి సంబంధించి కొత్త వాజ్యాలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు దిగువ కోర్టులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దిగువ కోర్టులు ఇష్టారాజ్యంగా ఆదేశాలు జారీ చేయవద్దని కోరింది.

షాహీ జామా మసీదు, వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు..

అయితే, ప్రార్ధనా స్థలాల చట్టం రాజ్యాంగ బద్ధత కేసులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరగా సుప్రీంకోర్టు నాలుగు వారాల గడువిచ్చింది. దేశంలో ప్రస్తుతం యూపీలోని సంభాల్‌లో ఉన్న షాహీ జామా మసీదు, వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు, మధురలోని షాహీ ఈద్గా మసీదు, రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా, ఢిల్లీలోని జామా మసీదు వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో సంభల్‌లో ఒక్కో రహస్యం బయటపడుతుంటే దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ రాజుకుంది.

అధికారుల తనిఖీలు ఆ ప్రాంత నివాసుల్లో ఆందోళన

ప్రస్తుతం, సంభల్‌లో పురాతన కట్టడాలు బయటపడుతున్న ప్రాంతంలో ఆక్రమణ దారులు కొందరు స్వచ్ఛందంగా తమ ఇళ్లను తామే కూల్చేసుకుంటున్న పరిస్థితి ఉంది. వీళ్లంతా దాదాపు ముస్లీం కమ్యూనిటీకి చెందిన వారే. దొంగ కరెంటు, అక్రమంగా కట్టిన నిర్మాణాల పేరుతో అధికారుల తనిఖీలు ఆ ప్రాంత నివాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు, హిందూ సంఘాలు తమ సంస్కృతిని రక్షించుకోడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాయో అనే భయం కూడా ఉంది.

యూపీలోని చరిత్ర తవ్వి తీసే పనిలో పడినట్లు స్పష్టం

అసలు, సంభాల్ నుండి వారణాసి వరకు విస్తరించిన ఈ ఆలయాల పునఃస్థాపన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ చేపట్టిన భారీ ఆపరేషన్‌ అనే అభిప్రాయం కూడా లేకపోలేదు. ఇటీవల, సీఎం యోగీ మాటలు వింటే.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పురాతన ఆలయాలను తిరిగి మనుగడలోకి తెస్తామని అన్నారు. ఇందులో భాగంగానే, ప్రస్తుతం, యూపీలోని చరిత్ర తవ్వి తీసే పనిలో పడినట్లు స్పష్టం అవుతుంది.

డిసెంబర్ 23న కొత్తగా వెలికి తీసిన ఆలయ గోడలపై భక్తులు ‘ఓం నమః శివాయ’, ‘హర్ హర మహాదేవ’ నినాదాలను రాశారు. ఆలయ ప్రాంగణం అంతా శుద్ధి చేశారు. మరోవైపు, భద్రతను పెంచుతూ.. అధికారులు CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే, భక్తులంతా ఆలయంలో పూజలు మొదలుపెట్టారు. ఇలా, సంభల్‌కు ఉన్న గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్రను వెలికితీస్తున్న తరుణంలో.. రాబోయే రోజుల్లో అక్కడ మతపరమైన అశాంతికి కారణమవుతుందేమో అనే ఆందోళన కూడా లేకపోలేదు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×