BIG Shock To YS Jagan: మొన్నటి వరకు ఏకపక్షంగా రాజకీయం సాగిన కడప గడ్డపై ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. ఎక్కడైతే ఉనికి కోల్పోయిందో అక్కడే తిరిగి సత్తా చాటి అదే జోరును కొనసాగించుకోవాలనే పట్టుదలతో టిడిపి హ్యాహాలు రచిస్తుంటే.. తమ అడ్డాలో టిడిపిని ఎలా ఎదుర్కోవడానికి వైసీపీ ప్రతి వ్యూహాలకు పదును పెడుతోంది.. అదే ఇప్పుడు రెండు పార్టీల మధ్య రాజకీయ వేడి రగిలిస్తోంది.. ఇంతకీ వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత గడ్డ కడపలో ఏం జరుగుతోంది?
వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంటూ వచ్చిన కడప
కడప అంటేనే వైయస్ ఫ్యామిలీ కంచుకోట.. నాడు వైయస్ నేడు జగన్… పార్టీ వేరైనా హవా మాత్రం ఆ కుటుంబానిదే .. 1999 వరకు సత్తా చాటిన టిడిపి ఆ తర్వాత ఉనికి కోసం పోరాడే స్థాయికి చేరింది. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న టీడీపీ వైఎస్ ఫ్యామిలీ కంచుకోటను బీటలు వారేలా చేసింది. ఉమ్మడి కడప జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడంటే మూడు స్థానాలకు పరిమితమైన వైసిపి తమ ఆయువు పట్టు కడప అసెంబ్లీ సెగ్మెంట్‌ను సైతం దక్కించుకోలేక పోవడాన్ని జీర్ణించుకోలేకపోతోందట..
కడప ఎమ్యెల్యేగా గెలిచిన రెడ్డప్పగారి మాధవీరెడ్డి
కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో పాలకపక్షంగా వైసీపీనే ఉంది. అయినా కడప అసెంబ్లీ సెగ్మెంట్లో టిడిపి నుంచి రెడ్డెప్పగారి మాధవీరెడ్డి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి కడపలో వైసీపీకి కౌంట్ డౌన్ మొదలయిందట. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కడప కార్పొరేషన్ పైనే దృష్టి సారించి ఏడుగురు కార్పోరేటర్లను తమ వైపు తిప్పుకొని పొలిటికల్ గేమ్ మొదలు పెట్టారు ఎమ్మెల్యే మాధవీ రెడ్డి. కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశం కుర్చీతో మొదలైన గేమ్ మేయర్ సీటుకే ఎసరు తెచ్చే పరిస్థితి కల్పించారు.
కడప కార్పొరేషన్లో వైసీపీ అవినీతిపై మాధవీరెడ్డి దృష్టి
కార్పోరేషన్ కుర్చీతో మొదలైన వివాదంతో మేయర్ సీటు చుట్టూ కడప రాజకీయం తిరుగుతోందట. 2019లో వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి కడప కార్పొరేషన్ లో జరిగిన అవినీతిపై దృష్టి సారించారు ఎమ్మెల్యే మాధవీ రెడ్డి. మేయర్ పదవిలో ఉన్న వ్యక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ కుటుంబం అభివృద్ధికి పని చేయకూడదు అనే మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించి మేయర్ సురేష్‌బాబు తన సతీమణి, కుమారుడు పేరిట చేపట్టిన రోడ్డు నిర్మాణం పనులపై ఎమ్మెల్యే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి మేయర్‌కు నోటీసులు ఇవ్వడం ఆ తర్వాత ఆయనపై అనర్హత వేటు కడప రాజకీయాల్లో దూమారం రేపింది.
హైకోర్టు స్లే తెచ్చుకొని మేయర్‌గా కొనసాగుతున్న సురేష్‌బాబు
తదనంతరం సురేష్ బాబు హైకోర్టు స్టే తెచ్చుకొని మళ్ళీ మేయర్ గా కొనసాగడంతో టిడిపి , వైసిపి మధ్య వివాదం మరింత రాజుకుంది.. అప్పటి నుంచే మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే ఎవరికి వారుగా పోటా పోటీగా నగరంలో అభివృద్ధి పనుల శంఖుస్థాపనలు చేపడుతుండటం ఆసక్తికరంగా మారింది. పదేళ్ళుగా మేయర్ పదవిలో ఉన్న సురేష్ బాబు ఏం అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే కూటమి ప్రభుత్వం కడప అభివృద్ధి కోసం ఎంత నిధులు కేటాయించిందని వైసిపి ప్రశ్నిస్తోంది..
కడప కార్పొరేషన్లో పాగా వేయడానికి ఎమ్మెల్యే వ్యూహాలు
కార్పొరేషన్ పాలక వర్గం పదవీకాలం మరో ఏడాది లో ముగుస్తుంది. తొందరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయని అందుకే ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులతో రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 1999 తర్వాత కడప అసెంబ్లీ లో సత్తా చాటిన టిడిపి మరోసారి కడప అసెంబ్లీ పై పట్టు కోసం వ్యూహ రచన చేస్తోంది. ఎమ్మెల్యే మాధవీరెడ్డి తన భర్త రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డితో కలిసి కడప కార్పొరేషన్లో పాగా వేయడానికి పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా మేయర్ సీటు పై కన్నేశారట. దశాబ్ద కాలంగా కార్పొరేషన్‌ను ఏలిన వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందంటున్నారు. వైసిపిపై ఉన్న అసంతృప్తి ని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారట ఎమ్మెల్యే మాధవి రెడ్డి. మరి దశాబ్దాల తర్వాత కడప అసెంబ్లీ స్థానాన్ని చేజార్చుకున్న వైఎస్ ఫ్యామిలీ.. కడప కార్పొరేషన్లో పట్టు నిలబెట్టుకుంటుందో? లేదో? చూడాలి.
Story By Vamshi Krishna, Bigtv