Singanamala Politics: సెంటిమెంట్ సెగ్మెంట్‌గా పేరున్న అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గాన్ని టీడీపీ పట్టించుకోవడం మానేసిందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే బండారు శ్రావణి రాజకీయ అనుభవ రాహిత్యంతో అందరికీ దూరమవుతున్నారన్న ఆరోపణలతో అక్కడ టీడీపీ హైకమాండ్ ఇద్దరు అబ్జర్వర్లను నియమించింది. ఇప్పుడు వారి మధ్యే విభేదాలు తలెత్తి.. వర్గాలు వీధులకెక్కి బాహాబాహీకి దిగుతున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోక పోవడానికి కారణం ఏంటన్న ఆందోళన తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. అసలు శింగనమల సెగ్మెంట్‌పై టీడీపీ లెక్కలేంటి?
శింగనమలలో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది.. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తోంది.. గత 30 ఏళ్లుగా అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతూ వస్తుండటం విశేషం .. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా శైలజనాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ నుంచి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించి మంత్రిగా కూడా పనిచేశారు.. ఆ తర్వాత టిడిపి నుంచి శమంతకమణి కుమార్తె యామిని బాల రాష్ట్ర విభజన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి సెంటిమెంట్ కాపాడారు
2024 ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచిన బండారు శ్రావణి
ఆ తర్వాత 2019 లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో ఆమె టికెట్ కూడా సాధించుకోలేకపోయారు.. టిడిపి నుంచి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఒకసారి ఓడిపోయిన బండారు శ్రావణి 2024 ఎన్నికల్లో మంచి మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు… ఎన్నికల ముందు వరకు ఆమెకు అన్ని కలిసి వచ్చాయి.. 2019 ఎన్నికల్లో ఓడిపోవడం ఆ తర్వాత నారా లోకేష్ సమక్షంలో కీలక నాయకులు అంతా కలిసి పని చేస్తామని హామీ ఇవ్వడం, ఆమె గెలవడం చకచక జరిగిపోయాయి.. గెలవడం వరకు ఓకే కానీ గెలిచిన తర్వాత ఆ పార్టీలో విభేదాలు పెరిగిపోవడం తెలుగుతమ్ముళ్లను ఆందోళనకు గురిచేస్తోందంట.
ముంటిమడుగు కేశవరెడ్డి, నరసనాయుడులతో 2 మెన్ కమిటీ
శింగనమలలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే శ్రావణి వర్సెస్ ఇతర టీడీపీ నాయకులు మధ్య ఆధిపత్య పోరు షరామామూలుగా తయారయింది.. ఎమ్మెల్యే శ్రావణి వర్గం ఒక వైపు టీడీపీ హైకమాండ్ శింగనమలలో పార్టీ మధ్య సమన్వయానికి నియమించిన టూ మెన్ కమిటీ సభ్యులైన ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మెన్ ముంటిమడుగు కేశవరెడ్డి , టిడిపి సీనియర్ నేత ఆలం నరసనాయుడు వర్గాలు మరోవైపు విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు
టీడీపీ మండల కన్వీనర్ల నియామకం సందర్భంగా ఘర్షణ
తాజాగా శింగనమలలో టీడీపీ మండల కన్వీనర్ల నియామకం ఘర్షణకు దారి తీసింది.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి వ్యవహారతీరుతో సొంత పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి, టూమెన్ కమిటీ కి చెందిన అనుచరుల మధ్య తీవ్ర విభేదాలు పెరిగిపోయి.. ఇటీవల నడిరోడ్డుపై కొట్టుకునే వరకు వెళ్లాయి.. మండల కన్వీనర్ల అంశంలో ఇరువర్గాలు పంతాలకు పోయాయి. మండల కన్వీనర్ల పదవులు తమకంటే, తమకే కావాలని ఎమ్మెల్యే, టూమెన్ కమిటీ వర్గాలకు చెందిన నాయకులు పట్టుబట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన నాయకులు ఒకరిపై మరొకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు
శ్రావణిపై తీవ్రస్థాయిలో అవినీతి అరోపణలు
ఎమ్మెల్యే బండారు శ్రావణిపై సొంత పార్టీ సీనియర్ నాయకులు తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ అనుభవ రాహిత్యంతో ఆమె కార్యకర్తల్ని అసలు పట్టించుకోలేదని మండిపడుతున్నారు. హైదరాబాద్‌లో వ్యక్తిగత విలాసాలకే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కానీ ఆ విమర్శల్ని ఆమె కొట్టి పారేస్తున్నారు. శింగనమల ఎమ్మెల్యే అయిన తాను చెప్పినట్టే.. పదవుల్లో పంపకాల్లో తన వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. కానీ ఆమె చెప్పిన వాళ్లకు పదవులు ఇవ్వకుండా అడ్డుకోవడం ద్వారా, తమ పట్టు నిలుపుకోవాలని శ్రావణి వ్యతిరేక వర్గీయులు పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో టీడీపీలో వర్గపోరు తీవ్రస్థాయికి చేరినట్లు తాజా రభస చెప్పకనే చెబుతోంది..
శింగనమలలో బజారున పడుతున్న టీడీపీ పరువు
కేవలం ఇది ఒకటే అనుకుంటే ఏదోలే అనుకోవచ్చు.. కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి శింగనమల టిడిపి పార్టీ బజారున పడుతూనే ఉంది.. నియోజకవర్గంలో కీలక మండల కమిటీలు ఎన్నిక కోసం జరిగిన ప్రతి మీటింగ్ లోను బాహవాహికి దిగుతూనే ఉన్నారు.. నిన్నటి వరకు ఈ గొడవలు శింగనమల కు మాత్రమే పరిమితం అయి ఉండేవి. తాజాగా గార్లదిన్నె, బుక్కరాయసముద్రం మండల కమిటీ ఎన్నికలను అనంతపురంలోని ఓ గెస్ట్ హౌస్ లో నిర్వహించేందుకు ప్రయత్నించగా అక్కడ కూడా భారీ ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొనడం పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది.
2 మెన్ కమిటీని డోంట్ కేర్ అంటున్న ఎమ్మెల్యే శ్రావణి
తరచుగా నియోజకవర్గంలో తెలుగుదేశం వర్గాల మధ్య ఇలా ఘర్షణలు జరుగుతుండడంతో ఆ ఘర్షణలు ఆపాలని పార్టీ అధిష్టానం టూమెన్ కమిటీనీ నియమించింది.. కానీ ఎమ్మెల్యే శ్రావణి మాత్రం అధిష్టానం నిర్ణయాన్ని పట్టించుకోకుండా తానే సర్వస్వం అన్నట్లు వ్యవహరిస్తుండటం వివాదాలకు కాణమవుతోందని అంటున్నారు. మరి ఆ కుర్ర ఎమ్మెల్యేని టీడీపీ హైకమాండ్ ఎలా గాడిలో పెడుతుందో? మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్న అధిష్టానం శింగనమల సెంటిమెంట్‌ను ఎలా నిలబెట్టుకుంటుందో చూడాలి.
Story By KLN, Bigtv