Vijay Sai Reddy Rajya Sabha Seat: వైసీపీకి రిజైన్ చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే ఆ విరామానికి బ్రేక్ వేసి పొలిటికల్‌గా రీఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారంట. విజయసాయిరెడ్డిని బీజేపీలోకి తీసుకుని, ఆయన ఖాళీ చేసిన రాజ్యసభ పదవిని తిరిగి కట్టబెట్టాలని బీజేపీ పెద్దలు ఫిక్స్ అయ్యారంటున్నారు. ఆయన్ని తిరిగి రాజ్యసభకు పంపి వైసీపీలోని ముఖ్య నేతలను బీజేపీలోకి తేచ్చుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే అందుకు టీడీపీ, జనసేనల నుంచి అభ్యంతరాలు వస్తుండటంతో వారిని ఒప్పించాలని కమలం పెద్దలు ఆలోచిస్తున్నారట. మరి టీడీపీ కోటాలో సాయిరెడ్డిని ఎంపీని చేస్తే తెలుగు తమ్ముళ్ల మనోభావాల పరిస్థితి ఏంటి?
భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడ్డారన్న విమర్శలు
వైసిపి ప్రారంభ నుండి పార్టీలో నెంబర్ టూ గా వ్యవహరించిన విజయసాయి రెడ్డి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా సీఎం తర్వాత సీఎం లాగా వ్యవహరించారు.. విశాఖ సహా ఉత్తరాంధ్రలో భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడ్డారన్న విమర్శలు మూట గట్టుకున్నారు … ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ విజయసాయిరెడ్డి గీసిన గీత దాటడానికి వీలు లేదని అప్పట్లో ఆర్డర్ కూడా పాస్ చేశారంట … ప్రభుత్వానికి సంబంధించి ఉత్తరాంధ్రలో ఏ పని కావాలన్నా, సీఎం జగన్ ను ఎమ్మెల్యేలు కలవాలన్న, నియోజవర్గ సమస్యలను జగన్ తో చెప్పాలన్నా కూడా విజయసాయిరెడ్డి అనుమతి ఉండాల్సిందే అన్నట్లు నడిచింది వ్యవహారం…
ఓటమి తర్వాత సాయిరెడ్డికి మళ్లీ ఉత్తరాంధ్ర బాధ్యతలు
ఓటమి తర్వాత సాయిరెడ్డికి జగన్ మళ్లీ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. విజయసాయి భూకబ్జాలు, అవినీతి ఆరోపణల మీద, ఆయన కూతురుకి సంబంధించి భీమిలి సమీపంలోని సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాల విషయంలోనూ కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది… చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే విజయ్ సాయి రెడ్డి మళ్లీ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా వైసీపీ నుండి రాజకీయాలు చేయడానికి సిద్ధపడితే కూటమి ప్రభుత్వం ఎంతవరకు విజయ్ సాయి రెడ్డి ఆటలు సాగనిస్తుందా అన్న చర్చ జరిగింది.. అదీ కాక అప్పట్లో ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌గా ఉన్నప్పుడే ఎండోమెంట్ ఉద్యోగిని శాంతితో విజయసాయిరెడ్డికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి .. అది తెలిసి కూడా జగన్ ఆయన్ని తిరిగి అక్కడకే పంపడంపై పెద్ద చర్చే జరిగింది.
అధికారంలో ఉన్నప్పుడు సాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గించిన జగన్
వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు విజయసాయిరెడ్డికి జగన్ ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న ఆయన్ని తప్పించి వైవీ సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. సాయిరెడ్డి స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ 2గా ఫోకస్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఓటమి తర్వాత ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు నిర్వర్తించడానికి ఇష్టపడని విజయసాయి అటు రాజ్యసభ సభ్యత్వానికి, ఇటు వైసీపీకి రాజీనామా చేసి పొలిటికల్ రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఇక వ్యవసాయం చేసుకుంటానంటూ బయటకు వచ్చిన ఆయన జగన్ కోటరీని, సజ్జలను టార్గెట్ చేస్తూ పరోక్ష విమర్శలు గుప్పించారు. పాత కేసులు తవ్వితీస్తారన్న భయంతోనే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారంటారు
రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
ఇప్పుడు ఏపీలో విజయసాయి రిజైన్ చేసిన రాజ్యసభ స్థానం ఉపఎన్నికకి సీఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 22న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై మే 9న ఆ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఆ స్థానం ఎలాగూ కూటమి పార్టీలకే దక్కనుండటంతో.. రాజ్యసభలో ఏ పార్టీ నుంచి ఎవరు అడుగుపెడతారో అన్న చర్చ మొదలైంది. ఆ రాజ్యసభ సీటు పొత్తుల్లో భాగంగా బీజేపీకే దక్కుతుందన్న ప్రచారంతో తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ ఉప ఎన్నిక టెన్షన్ పట్టుకుందంట.
మళ్లీ రాజకీయ ప్రకటనలు చేస్తున్న విజయసాయిరెడ్డి
విజయసాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసిన తరువాత తాను ఏ పార్టీలోనూ చేరని, తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, వ్యవసాయం చేకుంటానని ప్రకటించారు. అయితే..ఇటీవల కాలంలో ఆయన మళ్లీ రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. ఆయన బీజేపీలో చేరతారని, మళ్లీ రాజ్యసభకు ఎన్నికవుతారని ప్రచారం సాగుతోంది. ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ కోటాలో రాజ్యసభకు వెళతారని ప్రచారం సాగుతోంది. ఆయన బిజెపిలో చేరితే.. మళ్లీ రాజ్యసభ ఇస్తామని కాషాయ పార్టీ పెద్దలు చెప్పారని.. ఇప్పుడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడడంతో..ఆయనే బీజేపీ అభ్యర్థి అవుతారన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అయితే దానిపై ఇంత వరకు ఎలాంటి క్లారిటీ రావడం లేదు.
చంద్రబాబు నిర్ణయంపై టీడీపీ శ్రేణుల్లో ఆసక్తి
అయితే విజయసాయి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లాలంటే టీడీపీ, జనసేన ఆమోదం తప్పనిసరి. రాష్ట్రంలో బీజేపీకి కేవలం ఎనిమిది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల ఓట్లతోనే ఆయన రాజ్యసభకు వెళ్లగలరు. సాయిరెడ్డి విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పవన్‌కళ్యాణ్‌తో సంప్రదించకుండా తీసుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో..అన్న ఆసక్తి టిడిపి వర్గాలతోపాటు, రాజకీయవర్గాల్లోనూ నెలకొంది. గతంలో విజయసాయిరెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు మంత్రి లోకేష్‌లపై తీవ్ర విమర్శల గుప్పించారు.
కూటమి నేతలందరిపై నోరు పారేసుకున్న విజయసాయి
టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియా, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు భువనేశ్వరి, జనసేనాని ఇలా అందరిపై సాయిరెడ్డి నోరుపారేసుకున్నారు. అయితే రిటైర్‌మెంట్ ప్రకటన సమయంలో జగన్ ఆదేశాలతో సజ్జల రాసిచ్చిన స్క్రిప్ట్‌లు చదివానని వెళ్లడించి కలకలం రేపారు. ఏదేమైనా టిడిపి వర్గాలు ఆయనను వర్గ శత్రువుగా చూస్తుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉపఎన్నిక జరగనున్న ఒక్క రాజ్యసభ సీటు పొత్తుల్లో బీజేపీకి దక్కి.. ఢిల్లీ పెద్దలు విజయసాయిరెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటిస్తే.. టీడీపీ ఎలా స్పందిస్తుంది..? అధినేత చంద్రబాబు ఏం చేస్తారు..? తమ బద్ద శత్రువుని తమ ఎమ్మెల్యేల ద్వారా రాజ్యసభకు పంపాలా..? ఇదెక్కడి ఖర్మరా బాబూ..అని పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
Also Read: టైటానిక్ మునిగిపోతుందని మోర్గాన్‌కు ముందే తెలుసా..?
ఢిల్లీ బీజేపీ పెద్దలతో చంద్రబాబు భేటీ
ఒక వేళ నిజంగా విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపించాల్సి వస్తే మాత్రం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవ్వడం ఖాయం. కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలనున్నారు. ఆ భేటీలో విజయసాయిరెడ్డి వ్యవహారం తేలుతుందంటున్నారు. వాస్తవానికి మూడు నెలల క్రితమే విజయసాయిరెడ్డి కాషాయ కండువా కప్పుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో చంద్రబాబు అంగీకరించకపోవడంతో అది వాయిదా పడిందంట. అయితే ఈ సారి ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది.
ఢిల్లీ పెద్దల వత్తిడి తెస్తే అంగీకరించక తప్పదా?
ఒక వేళ కాషాయ పెద్దలు విజయసాయిరెడ్డిని చేర్చుకోవాలని, రాజ్యసభకు పంపాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తే మాత్రం ఆయన ఒప్పుకోక తప్పదంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయకు అది తప్ప వేరే మార్గమేమీ లేదంటున్నారు. అయితే సాయిరెడ్డిని టీడీపీ కోటాలో రాజ్యసభకు పంపితే పార్టీ శ్రేణులకు అధిష్టానం వివరణ ఇచ్చుకుని సముదాయించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఈ సారికి చక్రం తిప్పి విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంట్రీకి బ్రేకులు వేసినా.. బీజేపీ పెద్దలు ఆయన్ని తర్వాతైన రాజ్యసభకు పంపడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి చూడాలి సాయిరెడ్డి భవితవ్యం ఎలా ఉండబోతుందో?