Waqf Supreme Court| సుప్రీంకోర్టులో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లపై విచారణ బుధవారం (ఏప్రిల్ 16) ప్రారంభమైంది. ఈ కేసులో తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 2 గంటలకు కొనసాగించనున్నట్లు కోర్టు ప్రకటించింది. అయితే, వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇవ్వాలని కోరిన పిటిషనర్ల అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, మిగిలిన ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. పిటిషనర్లు ప్రస్తావించిన అంశాలకు వారు సమాధానం ఇవ్వాలని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.
కేంద్రం కేవియెట్ పిటిషన్ దాఖలు చేయడంతో.. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విని కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా వక్ఫ్ అంశంపై కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు.
ఆయన వక్ఫ్ చట్ట సవరణపై మాట్లాడుతూ.. ‘‘దశాబ్దాలుగా ముస్లింలు తమ మతపరమైన కార్యక్రమాల కోసం వాడుతున్న వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. వాస్తవానికి అలాంటి ఆస్తులను రిజిస్టర్ చేయడం సులభం కాదు. అయినా కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం జరిగింది. అయితే, నిజంగా ముస్లింలు ధార్మిక కార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్న ఆస్తులూ ఉన్నాయి. హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా. అలాగే పార్లమెంట్‌కు చట్టాలు రూపొందించే అధికారం కూడా ఉంది కదా. పార్లమెంట్ హిందువుల కోసం కూడా చట్టాలు చేస్తోంది. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని చెబుతున్నారు. చారిత్రక లేదా పురావస్తు విలువ కలిగిన ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించడానికి అవకాశం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు విఘాతం కలిగించే విధంగా ఉందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. వక్ఫ్ అనేది పూర్తిగా ఇస్లాం మతానికి అంకితమైన వ్యవస్థ అని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ఈ చట్టాన్ని రూపొందించే ముందు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) ద్వారా అన్ని వర్గాలతో సమగ్రంగా చర్చలు నిర్వహించామని చెప్పారు. వక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినదని, హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వమే నిర్వహిస్తోందని ఆయన అన్నారు.
Also Read: ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఎయిర్ హోస్టెస్.. రేప్ చేసిన ఆస్పత్రి సిబ్బంది
ఈ వాదనలు విన్న అనంతరం, సుప్రీంకోర్టు కేంద్రం తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది: ‘‘చరిత్రను మీరు మార్చలేరు. ఇది ముస్లింలకు సంబంధించిన అంశం. వక్ఫ్ బోర్డులో హిందువులు ఎలా ఉంటారు. హిందూ సంస్థల ట్రస్ట్ లలో మేనేజ్‌మెంట్ బోర్డ్‌లలో ముస్లింలకు స్థానం కలిగిస్తారా? అలా చేయడం కుదురుతుందా? దీనిపై మీ సమాధానం ఏంటి? ’’ అని కోర్టు ప్రశ్నించింది. అనంతరం విచారణను కి గురువారానికి వాయిదా వేసింది.
ఈ విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు కొన్ని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వక్ఫ్‌గా గుర్తించిన ఆస్తులను డినోటిఫై చేయరాదు, అది వక్ఫ్ బై యూజర్ అయినా, వక్ఫ్ బై డీడ్ అయినా సరే.
వక్ఫ్ భూమి లేదా ప్రభుత్వ భూమి అన్న విషయం పై కలెక్టర్ విచారణ జరుపుతున్నప్పుడు వక్ఫ్ సవరణ చట్టంలోని నిబంధనలను వర్తించబడవు. వక్ఫ్ బోర్డు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లలో ఎక్స్ అఫీషియో సభ్యులను తప్ప, మిగతా సభ్యులంతా తప్పనిసరిగా ముస్లింలే కావాలి అని పేర్కొన్నారు.